హెడ్‌సెట్ విసురుతున్న కోమటిరెడ్డి (ఇన్‌సెట్‌లో గాయపడ్డ స్వామిగౌడ్)
సాక్షి, హైదరాబాద్ : బడ్జెట్ సమావేశాల తొలిరోజు తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర ఘటనలు చోటుచేసుకున్నాయి. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే క్రమంలో విపక్ష కాంగ్రెస్ సభ్యుల్లో కొందరు దురుసుగా ప్రవర్తించినట్లు తెలిసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన హెడ్‌సెట్‌ను విసిరికొట్టినట్లు సమాచారం. అదేసమయంలో మండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి స్వల్ప గాయమైందని, వెంటనే ఆయనను సరోజనినీ దేవి కంటి ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించినట్లు వార్తలు వెలువడ్డాయి. కోమటిరెడ్డి హెడ్ సెట్ విసిరేసిన దృశ్యాలు అసెంబ్లీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
నన్ను కూడా కొట్టారు : సభలోపల చోటుచేసుకున్న పరిణామాలను కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీడియాకు వివరించారు. గవర్నర్ ప్రసంగంలో రైతు సమస్యల గురించి మాట మాత్రమైనా స్పందించకపోవడంపై తాము ఆందోళన చేశామని, అయితే, కొంత ఆవేశానికి గురైనమాట వాస్తవమేనని ఒప్పుకున్నారు. ‘‘విపక్ష సభ్యులుగా మా నిరసన తెలియజెప్పడానికి స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్లాం. కానీ మార్షల్స్ మాకు అడ్డుతగిలారు. గలాటాలో మార్షల్స్ నన్ను కూడా తన్నారు. నా కాలికి గాయమైంది. ఎక్స్‌రే కూడా తీయించుకున్నాను. అయినా, మమ్మల్ని పోడియం వద్దకు వెళ్లకుండా అడ్డుకునే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారు? పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ ఎంపీలు ప్రతిరోజూ స్పీకర్ పోడియం దగ్గరికి వెళుతున్నారుకదా, మరి ఇక్కడ మాత్రం నిర్బంధాలు ఎందుకు?’ అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్‌పై సీరియస్ యాక్షన్? : గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగిలితే తీవ్ర పరిణామాలు తప్పవని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకే హెచ్చరించారు. అయినాసరే కాంగ్రెస్ ముందు చెప్పినట్లే సభలో ఆందోళన చేసింది. బడ్జెట్ ప్రతులను చించి, గవర్నర్‌పైకి విసిరేసింది. కోమటిరెడ్డి హెడ్‌సెట్ విసరేయడంతో మండలి చైర్మన్‌కు గాయమైంది. జరిగిన వ్యవహారాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నదని, కాంగ్రెస్ సభ్యులపై సీరియస్ యాక్షన్ తీసుకుంటారని వార్తలు వినవస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Comments
Please login to add a commentAdd a comment