కొత్త నోటిఫికేషన్లు ఇప్పట్లో లేనట్లే
Published Sat, Aug 10 2013 2:40 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం స్పోర్ట్స్, న్యూస్‌లైన్: వేలాది కొలువులు.. వరుసగా నోటిఫికేషన్లు.. చకచకా ఖాళీల భర్తీ ప్రక్రియ.. సర్కా రు చర్యలతో నిరుద్యోగుల్లో తొణికిసలాడిన ఉత్సాహం ప్రస్తుత పరిణామాలతో ఉడిగిపోయింది. రాష్ట్ర విభజన ప్రకటన.. దానికి నిరసనగా సీమాంధ్ర ప్రాంతంలో వెల్లువెత్తుతున్న నిరసనలు, రాష్ట్ర సచివాలయంలోనూ ఉద్యోగుల నిరసనలతో ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోలేకపోతున్న పరిస్థితుల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సంది గ్ధంలో పడింది. ఇప్పటికే కొన్ని నోటిఫికేషన్లు వెలువడి దరఖాస్తు ప్రక్రియ కూడా పూర్తి కాగా.. మరికొన్ని నోటిఫికేషన్లు త్వరలో వెలువడాల్సి ఉంది.
వేలాది ఉద్యోగాలు భర్తీ కానుండటంతో కోటి ఆశలతో వేలాది రూపాయలు వెచ్చించి కోచింగ్ కేంద్రాల్లో చేరిన నిరుద్యోగులను ఈ పరిణామా లు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఏపీపీఎస్సీ, డీఎస్సీ, పోలీస్, ఇంకా పలు శాఖల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న, దానికి సిద్ధంగా ఉన్న జిల్లాకు చెందిన అభ్యర్థులు అందుకోసం హైదరాబాద్‌తోపాటు రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం, కృష్ణా జిల్లా అవనిగడ్డ తదితర ప్రాంతాలకు వెళ్లి వేలాది రూపాయల ఫీజులు కట్టి కోచింగ్ తీసుకుంటున్నారు. 2677 వరకు పంచాయతీ కార్యదర్శి పోస్టులతోపాటు ఏపీపీఎస్సీ గ్రూప్-1, గ్రూప్-2, ఎస్సై, కానిస్టేబుల్, జూని యర్ లెక్చరర్స్ పోస్టుల నియామక పరీక్షలతోపాటు డీఎస్సీకి సిద్ధమయ్యేందుకు రెండు నెలల క్రితమే జిల్లా నుంచి సుమారు మూడువేల మంది నిరుద్యోగులు రాష్ట్రంలోని పలు పట్టణాల్లో ఉన్న ప్రముఖ కోచింగ్ సెం టర్లకు వెళ్లారు. మరికొన్ని వేలమంది శ్రీకాకుళంలోనే శిక్షణ పొందుతున్నారు.
మంచి తరుణమని భావించారు...కానీ.!
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారీగా నోటిఫికేషన్లు వెలువడుతాయని అంతా భావించారు. ఇప్పట్లో ఉద్యోగం సాధించకుంటే వయోపరిమితి దాటిపోయే వారైతే కొండంత ఆశతో భారమైనా ఖర్చులకు వెనుకాడకుండా పోటీ పరీక్షలకు శిక్షణ పొందేందుకు దూరాభారం వెళ్లారు. ఉద్యోగస్థాయిని బట్టి కోచింగ్ ఫీజులు 15 నుంచి 30 వేల రూపాయల వరకు చెల్లించారు. ఇక శిక్షణ పొందే ప్రాంతాల్లో రెండు మూడు నెలలపాటు ఉండాల్సి రావడంతో వసతి, భోజన ఖర్చులకు మరికొన్ని వేలు ఖర్చవుతాయి. ఉద్యోగం వస్తే జీవితంలో స్థిరపడవచ్చన్న ఆశతో వీటన్నింటినీ భరించినా.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వీరి ఆశలను కూల్చేసింది.
రాష్ట్ర విభజన, సమైక్యాంద్ర ఉద్యమాల నేపథ్యంలో ఇప్పటికే కొనసాగుతున్న నియామకాలతోపాటు కొత్తగా వెలువడాల్సిన నోటిఫికేషన్ల పరిస్థితి డోలాయమానంలో పడింది. ఏపీపీఎస్సీ ప్రకటన కూడా నిరుద్యోగుల్లో ఆందోళన పెంచింది. విభజన నేపథ్యంలో నియామకాల ప్రక్రియపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చేవరకు కొత్తగా ఎలాంటి నోటిఫికేషన్లనూ విడుదల చేయబోమని ఆ సంస్థ తేల్చిచెప్పింది. ఇప్పట్లో దీనిపై స్పష్టత ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. దీంతో డీలాపడిన ఉద్యోగార్థులు ఇంకా శిక్షణల పేరుతో అక్కడే ఉంటే తడిసిమోపెడు అవుతుందన్న ఉద్దేశంతో ఇంటిముఖం పడుతున్నారు. జిల్లా కేంద్రంలో ఉంటున్న వారు మాత్రం మిణుకుమిణుకుమంటున్న ఆశతో శిక్షణను కొనసాగిస్తున్నారు.
Advertisement
Advertisement