భార్యను హత్య చేసి.. భర్త ఆత్మహత్య.. కారణం ఇదే.. | Husband Commits Suicide After Killing His Wife In Srikakulam District | Sakshi
Sakshi News home page

భార్యను హత్య చేసి.. భర్త ఆత్మహత్య.. కారణం ఇదే..

Published Mon, Nov 14 2022 7:59 PM | Last Updated on Wed, Nov 16 2022 8:06 PM

Husband Commits Suicide After Killing His Wife In Srikakulam District - Sakshi

దాసరి ఉమ( ఫైల్‌)

సంతబొమ్మాళి(శ్రీకాకుళం జిల్లా): అరవై ఏళ్ల జీవితం.. ముప్పై ఏళ్ల దాంపత్యం.. ఇద్దరు కుమార్తెలకు పెళ్లి చేసి పంపిన అనుభవం.. మద్యం సీసా ముందు ఇవన్నీ బలాదూర్‌ అయిపోయాయి. మందు మత్తులో తన భార్యను హత్య చేసిన ఓ వృద్ధుడు.. తాను కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన మండలంలోని నౌపడ పంచాయతీ జగన్నాథపురం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు..

జగన్నాథపురం గ్రామానికి చెందిన దాసరి సింహాద్రి (60), ఉమ (50)లకు 30 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ధర్మారావు ఉన్నా రు. కుమార్తెలకు వివాహమై అత్తారింటికి వెళ్లిపోగా, కుమారుడు తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో జేసీబీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. దంపతులిద్దరూ ఊరిలోనే కూలి పనులు చేసుకుంటూ బతుకున్నారు. సింహాద్రికి తాగుడు అలవాటు ఉంది. దీని వల్ల భార్యాభర్తలిద్దరి మధ్య తరచూ తగువులు జరుగుతుండేవి. ఈ క్రమంలో శనివారం రాత్రి తాగి ఇంటికి వచ్చిన సింహాద్రి భార్యతో గొడవ పడ్డాడు. తర్వాత భార్య ఉమ నిద్రపోయారు. అయితే మద్యం మత్తులో ఉన్న సింహాద్రి కూరగాయలు కోసే కత్తితో ఉమ గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం మత్తు దిగడంతో భయపడి పక్కనే వంటపాకలో ఉన్న దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆదివారం ఉదయం 6 గంటలకు కుళాయి నీరు వచ్చినా ఆ ఇంటి నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో వీధిలో మహిళలు ఉమను పిలిచేందుకు వెళ్లారు. ఇంటిలోపల చూస్తే సింహాద్రి ఉరికి వేలాడుతూ కనిపించాడు. దీంతో ఒక్కసారిగా భయపడిపోయిన మహిళలు స్థానికులకు, సర్పంచ్‌ భర్త పి. రవికుమార్‌ రెడ్డికి తెలియజేయటంతో ఆయన పో లీస్‌ స్టేషన్‌కు సమాచారం అందజేశారు. ఈ సమాచారంతో టెక్కలి సీఐ చంద్రమౌళి, నౌపడ ఎస్‌ఐ మహమ్మద్‌ అలీ, తహసీల్దార్‌ చలమయ్యలు సంఘటన స్థలానికి చేరుకొని వేలిముద్రలు సేకరించారు. గొంతు కోసిన కత్తిని, పరిసరాలను పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రమౌళి తెలిపారు.
చదవండి: ఇదేందయ్యా ఇదీ.. ఈ ట్విస్ట్‌ మామూలుగా లేదుగా!.. సినిమా స్టైల్లో..  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement