
రాష్ట్ర విభజనపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
త్వరగా స్పందించేలా కేంద్రాన్ని ఆదేశించే అవకాశం!
న్యూఢి ల్లీ: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఉండవల్లి అరుణ్‌కుమార్, రాయపాటి సాంబశివరావు, మాజీ సీఎం కిరణ్ సహా వివిధ పార్టీల నేతలు రఘురామకృష్ణంరాజు, అడుసుమిల్లి జయప్రకాశ్ తదితరులు వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో సోమవారం విచారణకు రానుంది. ఈ కేసులో ప్రతివాదులైన కేంద్ర ప్రభుత్వ శాఖలకు ఇప్పటికే సుప్రీం నోటీసులు జారీ చేసింది. కానీ, సమాధానం చెప్పేందుకు కాలపరిమితి విధించలేదు.
దీంతో విచారణ ఆలస్యమవుతుందంటూ పిటిషనర్లు.. సుప్రీంను ఆశ్రయించారు. ఈ విజ్ఞప్తికి స్పందిం చిన చీఫ్ జస్టిస్.. మే తొలివారంలో విచారిస్తామన్నారు.ఈ క్రమంలో జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు, జస్టిస్ ఇక్బాల్, జస్టిస్ ఎస్‌ఏ బాడ్డేలతో కూడిన ధర్మాసనం సోమవారం దీనిపై విచారణ చేపట్టనుంది. కాగా, కేసులో పలు రాజ్యాంగ పరమైన అంశాలుండడంతో రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించే అవకాశముంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం త్వరితంగా సమాధానమిచ్చేలా ఆదేశించే అవకాశమూ ఉంది.