న్యూఢిల్లీ: మహిళలకు ఉద్యోగ ప్రదేశాల్లో పీరియడ్ లీవ్స్(నెలసరి సెలవులు) ఇవ్వడం తప్పనిసరిగా చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ చేపట్టింది. నెలసరి సెలవులకు సంబంధించిన విధానాలను రూపొందించాలని కేంద్రం, రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
మహిళలకు పీరియడ్ సెలవులు తప్పనిసరి చేయడం వాళ్ల వారికి ఉద్యోగ అవకాశాలు దూరం చేసే ప్రమాదం ఉందని. ఈ విధానం ఇది వారికి వ్యతిరేకంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అంతేగాక ఇది కోర్టులు తేల్చాల్సిన విషయం కాదని, ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు పిటిషన్‌ను కొట్టివేసింది.
‘మహిళలకు నెలసరి సెలవులు మంచి నిర్ణయమే. కానీ నెలసరి సెలవులను తప్పనిసరి చేయడం వల్ల మహిళలు ఉద్యోగ అవకాశాలకు దూరం కావొచ్చు. కొన్నిసార్లు మనం చేసే మంచి ప్రయత్నాలు వారికి ప్రతికూలంగా మారవచ్చు.’ అని డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు.
ఈ సమస్య అనేక విధానపరమైన అంశాలతో ముడిపడి ఉందని, కోర్టు జోక్యం చేసుకోవల్సినది కాదని కోర్టు అభిప్రాయపడింది. పిటిషనర్ తన అభ్యర్థనను కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ దృష్టికి తీసుకెళ్లాలని తెలిపింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం విస్తృత చర్చలు జరిపి ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించే అంశంపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
‘ఈ పిటిషన్‌ను మహిళా, శిశు సంక్షేమ శాఖలోని కార్యదర్శి, అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వద్దకు తీసుకెళ్లేందుకు కోర్టు అనుమతిస్తుంది. విధాన స్థాయిలో ఈ విషయాన్ని పరిశీలించి, అన్ని సంప్రదింపులు జరిపిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని కార్యదర్శిని అభ్యర్థిస్తున్నాం.’ అని పేర్కొంది. అంతేగాక ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు తమ తీర్పు అడ్డు రాదని కోర్టు స్పష్టం చేసింది.
చివరగా ఇది వాస్తవానికి ప్రభుత్వ విధానపరమైన అంశమని, ఈ నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని చెబుతూ.. ఈ పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది.
కాగా గత ఫిబ్రవరిలోనూ మహిళా విద్యార్ధినిలకు, ఉద్యోగులకు నెలసరి సెలవులు ఇవ్వాలని కోరుతూ ఓ పిటిషన్ దాఖలవ్వగా.. దీనిపై కూడా విచారణ జరిపేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ప్రభుత్వమే ఈ నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది.
ఇక ప్రస్తుతం బిహార్, కేరళ రాష్ట్రాలు మాత్రమే నెలసరి సెలవులు ఇస్తున్నాయి. బిహార్‌లో మహిళా ఉద్యోగులకు రెండు రోజుల సెలవుల విధానం ఉండగా, కేరళలో మహిళా విద్యార్థులకు మూడు రోజుల సెలవులు ఇస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment