పేపర్ లీకేజీ పేరిట మళ్లీ పరీక్ష పెట్టాలన్న పిటిషన్‌పై సుప్రీం వ్యాఖ్య
సాక్షి, న్యూఢిల్లీ: పేపర్ లీకేజీ, పరీక్ష నిర్వహణలో లోపాలు పేరిట మళ్లీ నీట్–యూజీ పరీక్ష నిర్వహిస్తే ఈ పరీక్షకున్న గౌరవం దెబ్బతింటుందని సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం వ్యాఖ్యానించింది. పేపర్ లీకేజీ ఆరోపణలు వెల్లువెత్తడంతో మీ స్పందన తెలపాలని కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ)లను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లాతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ఆదేశించింది.
వైద్యవిద్య ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్–యూజీ 2024 పరీక్ష పేపర్ లీక్ అయిందని, పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయని విపక్షాలు ఆరోపించడంతోపాటు పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో ఈ పిటిషన్‌ను కోర్టు మంగళవారం విచారించింది.
మళ్లీ అడిగితే పిటిషన్‌ను కొట్టేస్తాం
ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర కోర్సుల అడ్మిషన్లను నిలిపేయాలంటూ చేసిన పిటిషనర్ల తరఫున న్యాయవాది మ్యాథ్యూస్ జె.నెడుమ్‌పారా చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ‘‘ ఎగ్జామ్ పేపర్లు లీక్ అయ్యాయి. ముందే ప్రశ్నపత్రం సంపాదించి పరీక్షలో అత్యధిక మార్కులు తెచ్చుకున్నారు. లక్ష సీట్లు ఉంటే 23 లక్షల మంది పరీక్ష రాశారు. అత్యంత కఠినమైన ఈ పరీక్షలో ఏకంగా 67 మంది విద్యార్థులు 720 మార్కులకుగాను సరిగ్గా 720 మార్కులు సాధించారు.
ఢిల్లీలోని భారతీయ విద్యాభవన్ మెహతా విద్యాలయలో ప్రశ్నలకు సమాధానాలు వెతికే ముఠాతో ఇద్దరు ఎంబీబీఎస్ విద్యార్థులుసహా నలుగురిని ఇప్పటికే అరెస్ట్‌చేశారు’’ అని లాయర్ వాదించారు. ‘‘కౌన్సిలింగ్‌ను ఆపేది లేదు. అడ్మిషన్ల ప్రక్రియ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుంది. ఆపాలని మీరు ఇలాగే వాదనలు కొనసాగిస్తే మీ పిటిషన్‌ను కొట్టేస్తాం’ అని లాయర్‌ను ధర్మాసనం హెచ్చరించింది. ‘‘ మళ్లీ ఎగ్జామ్ నిర్వహించడమంటే ఆ పరీక్ష పవిత్రతను భంగపరచడమే.
ఆరోపణలపై మాకు సరైన సమాధానాలు కావాలి’ అని కోర్టు వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వం, ఎన్‌టీఏలతోపాటు పరీక్షకేంద్రంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలున్న బిహార్ ప్రభుత్వానికీ కోర్టు నోటీసులు పంపించింది. శివాంగి మిశ్రా, మరో 9 మంది ఎంబీబీఎస్ ఆశావహులు పెట్టుకున్న పిటిషన్ పెండింగ్‌లో ఉండటంతో దీనిపై స్పందన తెలపాలని ఎన్‌టీఏను కోర్టు ఆదేశించింది. కోర్టు వేసవికాల సెలవులు ముగిసే జూలై 8వ తేదీన ఈ కేసు తదుపరి విచారణ చేపడతామని కోర్టు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment