
ఢిల్లీ: జాతీయ భద్రతా సలహా బోర్డును కేంద్ర ప్రభుత్వం పునర్‌వ్యవస్థీకరించింది. జాతీయ భద్రతా సలహా బోర్డు ఛైర్మన్‌గా ‘రా’ మాజీ చీఫ్ అలోక్ జోషిని నియమించింది. ఏడుగురు సభ్యులతో జాతీయ భద్రతా సలహా బోర్డు పునర్‌వ్యవస్థీకరించింది. సభ్యులుగా మాజీ ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, ఆర్మీ అధికారులను నియమించింది. కాగా, ప్రధాని నివాసంలో బుధవారం.. భద్రతా వ్యవహారాల క్యాబినెట్ భేటీ నిర్వహించారు.
ఈ సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, జయశంకర్, నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఉగ్రవాదులపై కఠిన చర్యలకు ఇప్పటికే భద్రత బలగాలకు ప్రధాని మోదీ సంపూర్ణ స్వేచ్ఛనిచ్చిన సంగతి తెలిసిందే. సీసీఎస్ అనంతరం సీసీపీఏ, సీసీఈఏ సమావేశాలు నిర్వహించారు. చివర్‌లో క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. భద్రత వ్యవహారాలను సీసీఎస్ చర్చించింది. రాజకీయ పరిస్థితులను సీసీపీఏ చర్చించింది. ఆర్థిక అంశాలపై సీసీఈఏ పలు నిర్ణయాలు తీసుకుంది.
సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌పై భారత్ మరిన్ని ఆంక్షలు విధించనుంది. ఫార్మా ఎగుమతులను నిలిపివేసే అవకాశం, భారత గగనతలంలోకి పాకిస్తాన్ విమానాల నిషేధం.. అరేబియా సముద్రంలో పోర్టుల కార్యకలాపాలపై ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఆంక్షలతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టే వ్యూహంలో భారత్ ఉంది. ఇవాళ 3 గంటలకు సీసీఎస్, సీసీపీఏ, సీసీఈఏ, కేంద్ర కేబినెట్ నిర్ణయాలను ప్రెస్‌మీట్‌లో వెల్లడించనున్నారు.