
ప్రధాని సభకు రాష్ట్రవ్యాప్తంగా జన సమీకరణ
ప్రధానంగా డ్వాక్రా మహిళలు, ‘ఉపాధి’ కూలీలపై ఒత్తిడి
తప్పనిసరిగా రావాల్సిందేనని ఆదేశం
తరలింపునకు వేలాది ఆర్టీసీ, ప్రైవేట్, స్కూల్ బస్సులు
ఒక్క గుంటూరు జిల్లా నుంచే 1,241 బస్సులు
విద్యార్థులను సైతం తరలించాలని ప్రభుత్వ పెద్దల సూచన.. డ్వాక్రా, సచివాలయ సిబ్బందికి బాధ్యతలు
బస్సులు లేక ఊరూరా ప్రయాణికుల ఇక్కట్లు
సాక్షి నెట్‌వర్క్: అమరావతి రాజధాని పునఃప్రారంభ కార్యక్రమానికి ప్రభుత్వ పెద్దల టార్గెట్ మేరకు జన సమీకరణ చేసేందుకు అధికార యంత్రాంగం శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. ప్రతి జిల్లా నుంచి.. ప్రతి నియోజకవర్గం నుంచి ఆర్టీసీ, ప్రైవేట్, స్కూల్ బస్సుల్లో జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వచ్చి తీరాల్సిందేనని, లేదంటే నష్టపోతారంటూ భయపెట్టి.. డ్రాక్రా మహిళలు, ఉపాధి కూలీలపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఆ చివర ఉన్న అనంతపురం మొదలు.. ఈ చివర ఉన్న శ్రీకాకుళం వరకు టీడీపీ నేతలు, అధికారులకు టార్గెట్ నిర్దేశించారు.
ప్రధాని మోదీ పాల్గొనే సభకు 5 లక్షలకు మించి జనం ఉండేలా చూడాలని ప్రభుత్వ పెద్దలు దిశా నిర్దేశం చేశారు. జన సమీకరణలో ఎవరికీ మినహాయింపు లేదని తెగేసి చెప్పడంతో ఉన్నతాధికారులు, కూటమి నేతలు నేరుగా రంగంలోకి దిగి ఎక్కడికక్కడ జన సమీకరణకు ఏర్పాట్లు చేశారు. భారీగా వాహనాలు సమకూర్చాల్సి రావడంతో కొన్ని చోట్ల ప్రభుత్వ సిబ్బందిపై ఈ భారం పడుతోంది. వాహనాల ఖర్చును తహసీల్దార్లు, డీఆర్డీఏ పీడీలు ఇతర సిబ్బందిపై రుద్దారు. జన సమీకరణ బాధ్యత డ్వాక్రా సంఘాల లీడర్లపై మోపారు.
వారికయ్యే భోజనం, బస్సుల డీజిల్ ఖర్చులు కూడా అధికారులే చూసుకోవాలని కొన్ని చోట్ల ఆదేశించడంతో వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అమరావతికి వెళ్లే వాహనాలకు అనుమతులు లేవంటూ ఇబ్బంది పెట్టొద్దని రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో స్కూలు, కాలేజీల బస్సులను జన సమీకరణ కోసం కేటాయించారు. యజమానులతో మాట్లాడి ప్రైవేటు వాహనాలను కూడా సభకు పంపించాలని ఒత్తిడి తెచ్చారు.
రాజధాని సమీప జిల్లాల నుంచి విద్యార్థులను కూడా తరలించాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశించడంతో అధికారులు ఆ ప్రాంతాల్లోని కాలేజీల యాజమాన్యాలతో మాట్లాడారు. మొత్తంగా వేలాది ఆర్టీసీ బస్సులను జన సమీకరణకు కేటాయించడంతో రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శుక్రవారం కూడా ప్రజలకు ఈ ఇబ్బందులు తప్పవు. ఒక్క గుంటూరు జిల్లా నుంచే 1,241 బస్సులు కేటాయించారు.