మోదీ సర్కారుపై తగ్గిన అంచనాలు
నరేంద్ర మోదీ ఏడాది పాలనపై రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ నివేదిక
ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలు ఒక మోస్తరు స్థాయికి తగ్గాయని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. గత ప్రభుత్వం నుంచి సంక్రమించిన సమస్యల వల్ల డిమాండ్‌ను మెరుగుపర్చలేకపోవడమే కేంద్రంపై అసంతృప్తికి కారణమని పేర్కొంది. మోదీ ప్రభుత్వం రాగానే ఎకానమీ అత్యంత వేగంగా కోలుకుంటుందని, భారీ సంస్కరణలు ఉంటాయని అంచనాలు నెలకొన్నాయి.
అయితే, ఈ రెండు విషయాల్లోనూ ప్రభుత్వం కొంత నిరాశపర్చినట్లు క్రిసిల్ చీఫ్ ఎకానమిస్ట్ ధర్మకీర్తి జోషి తెలిపారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైన సందర్భంగా క్రిసిల్ మోడిఫైడ్ ఎక్స్‌పెక్టేషన్స్ పేరిట నివేదికను విడుదల చేసింది. ఎన్‌ఎస్‌ఈలోని సీఎన్‌ఎక్స్ 500 సూచీలో 411 కంపెనీల ఫలితాలను ఈ నివేదికలో విశ్లేషించారు. రాబోయే రోజుల్లో స్థూలదేశీయోత్పత్తి 7.9 శాతం వృద్ధి సాధించగలదని, ద్రవ్యోల్బణం 5.8 శాతానికి దిగిరాగలదని క్రిసిల్ అంచనా వేసింది.
ప్రస్తుత ప్రభుత్వానికి అధిక ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం మొదలైనవి వారసత్వంగా వచ్చాయని, దీని వల్ల పరిమితస్థాయి పనితీరు మాత్రమే కనపర్చగలుగుతోందని జోషి వివరించారు. మరోవైపు, ఏడాది పాలనలో స్థూల ఆర్థిక పరిస్థితులు, వృద్ధి- ద్రవ్యోల్బణ అంచనాలు మెరుగుపడ్డాయని, కరెంటు ఖాతా లోటు అదుపులోకి వచ్చిందని జోషి చెప్పారు. నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను కూడా ప్రభుత్వం వేగవంతం చేసిందని, వ్యాపారాల నిర్వహణకు అనుకూలంగా నిబంధనలు సడలించడం తదితర చర్యలు తీసుకుందని ఆయన తెలిపారు.
తక్షణ రికవరీ కష్టసాధ్యమే..
సానుకూల పరిస్థితులు కొంత మేర ఉన్నా.. ఎకానమీ వేగంగా టర్న్‌ఎరౌండ్ కావడం కష్టసాధ్యమేనని జోషి చెప్పారు. ద్రవ్య, ఆర్థికపరమైన పరిమితులు కారణంగా ప్రభుత్వం స్వల్పకాలికంగా డిమాండ్‌కు ఊతమివ్వలేకపోవచ్చన్నారు. డిమాండ్ లేకపోవడం వల్లే ప్రైవేట్ పెట్టుబడులు అంతగా రావడం లేదని జోషి వివరించారు. ఫలితంగా రికవరీ మందకొడిగా ఉంటోందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో విని యోగం క్రమంగా పెరుగుతున్న కొద్దీ డిమాండ్ కూడా మెరుగుపడగలదని పేర్కొన్నారు. అయితే, పెట్టుబడులు పెట్టేలా ప్రైవేట్ కంపెనీలను పురిగొల్పేంతగా ఇది ఉండకపోవచ్చని జోషి తెలిపారు.