పార్టీలన్నీ కలసి ‘సమైక్య రాజకీయ జేఏసీ’గా ఆవిర్భావం
Published Fri, Aug 9 2013 2:18 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
సాక్షి, గుంటూరు : సమైక్యాంధ్ర ఉద్యమ వేడి రాజుకుంది. రాష్ట్ర పరిరక్షణే ధ్యేయంగా ఐక్య ఉద్యమానికి పూనుకున్నారు. రాజకీయ పార్టీలు, సామాజిక వర్గాలు, వ్యాపార, వాణిజ్య సంఘాలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, చిరువ్యాపారులు, కాంట్రాక్టర్లు, కార్మికులు, కూలీలు, లాయర్లు, వైద్యులు, వృద్ధులు, విద్యార్థులు ఇలా అంతా సమైక్యాంధ్ర సాధనకు పోరుబాటన సాగుతున్నారు. భారీ ర్యాలీలు, మానవహారాలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనాలతో సమైక్య నినాదాన్ని జిల్లా అంతటా మార్మోగిస్తున్నారు. యూపీఏ అధినేత్రి సోనియగాంధీ నాయకత్వాన కాంగ్రెస్ తీసుకున్న తెలంగాణ విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సర్వత్రా కదం తొక్కుతున్నారు. సమైక్యాంధ్రను పరిరక్షించుకునే పోరాటంలో అలుపెరగక శ్రమిస్తున్నారు. ఇక నుంచి జిల్లాలో జరిగే సమైక్యాంధ్ర ఉద్యమంలో రాజకీయ పార్టీలు తమ జెండాల్ని, అజెండాల్ని పక్కనబెట్టి ఒకే గొడుగు కింద పనిచేయాలని నిర్ణయించారు. అంతా ‘సమైక్యాంధ్ర రాజకీయ జేఏసీ’ వేదికగా ఉద్యమించాలని నిర్ణయించారు. రాజకీయ జేఏసీ జిల్లా కన్వీనర్ ఆతుకూరి ఆంజనేయులు నేతృత్వాన గురువారం గుంటూరులో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఆర్టీసీ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన
సమైక్య ఉద్యమంలో భాగంగా గురువారం గుంటూరులో ఏఈఎల్‌సీ ఆధ్వర్యాన క్రైస్తవులు, పాస్టర్లు స్థానిక లాడ్జి సెంటర్ నుంచి హిందూ కళాశాల వరకు భారీ ర్యాలీ చేశారు. నరసరావుపేట మల్లమ్మ సెంటర్‌లో ముస్లింలు మానవహారం నిర్వహించారు. గుంటూరు, నరసరావుపేట, సత్తెనపల్లి, చిలకలూరిపేట, మాచర్ల, బాపట్లలో ఆర్టీసీ డిపోల ఎదుట నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు.
విద్యార్థుల రక్తదానం...
తెనాలిలో సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా ప్రియదర్శిని కళాశాల విద్యార్థులు రక్తదానం చేశారు. సత్తెనపల్లిలో కృష్ణవేణి, ఎస్‌వీ ఆర్ డిగ్రీ కళాశాల, అన్నం గురవమ్మ కృష్ణమూర్తి డిగ్రీ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహిం చారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ ఎదుట గుంటూరు - మాచర్ల ప్రధాన రహదారిపై మానవహారంగా ఏర్పడి సోనియా, కేసీఆర్‌లకు వ్యతిరేకంగా నినదిస్తూ కబడ్డీ ఆడి తమ నిరసన తెలియజేశారు. రక్షా యూత్ ఆధ్వర్యంలో సత్తెనపల్లి తాలూకా సెంటర్‌లో ఆర్జీఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. చిలకలూరిపేటలో మున్సిపల్ ఉద్యోగుల రెండోరోజు దీక్ష శిబిరాన్ని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ ప్రారంభించారు. అక్కడే జీపులు, కార్ల ర్యాలీ జరిగింది. వినుకొండలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు మూడోరోజుకు చేరుకున్నాయి. వేమూరులో వ్యవసాయశాఖ ఉద్యోగులు విధులు బహిష్కరించి, ఆందోళన చేశారు. బాపట్లలో సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా ఖాజీపాలెంలో బంద్ జరిగింది. బాపట్ల ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పాతబస్టాండ్ సెంటర్‌లో కళాజాత కార్యక్రమంలో వినూత్నంగా నిరసన తెలియజేస్తూ ర్యాలీ చేశారు.
ప్రైవేటు సంస్థలు, సంఘాల ఆధ్వర్యంలో...
సమైక్యాంధ్ర రాజకీయ జేఏసీ కన్వీనర్ ఆతుకూరి ఆంజనేయులుతో పాటు వైఎస్సార్ సీపీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, రాతంశెట్టి రామాంజనేయులు, క్రోసూరి వెంకట్, కసుకుర్తి హనుమంతరావు, పోలూరి వెంకటరెడ్డి, ఫ్రొఫెసర్ ఎన్. శామ్యూల్ తదితర నేతలు గుంటూరులో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్ని మూసివేయించారు. ప్రైవేటు ఎలక్ట్రిక్ సౌండ్స్ అసోసియేషన్, ఫొటోగ్రాఫర్స్ సంఘం, ది గుంటూరు జిల్లా ఇంజినీరింగ్ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ తదితర సంఘాల నేతృత్వంలో భారీగా నిరసన కార్యక్రమా లు జరిగాయి. తాడికొండలో రైతు సమాఖ్య, లాంలో చలపతి కళాశాల విద్యార్థులు, అమరావతిలో విద్యార్థి జేఏసీ రాస్తారోకోలు చేశారు. నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మిక యూనియన్‌లు కార్పొరేషన్ ఎదుట ధర్నా, డప్పు వాయిద్యాలతో నృత్య ప్రదర్శన, కాంట్రాక్టర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వంటావార్పు జరిగింది. రంజాన్ పండుగ సందర్భంగా జిల్లాలో శుక్ర,శనివారాల్లో శాంతి యుతంగా నిరసన తెలిపే కార్యక్రమాల్ని మాత్రమే నిర్వహించాలని సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్. శామ్యూల్ పిలుపునిచ్చారు.
Advertisement
Advertisement