
ప్రజాభిప్రాయం ప్రకారమే ఉద్యోగుల ‘విభజన’
పంపిణీ మార్గదర్శకాలపై వినతులకు కమల్‌నాథన్ ఆహ్వానం
సలహాలు, సూచనల తర్వాతే తుది మార్గదర్శకాలు ఖరారు
జిల్లాల ప్రాతిపదికగా ఉద్యోగుల పంపిణీ
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాల రూపకల్పన కమిటీ, ఉద్యోగుల పంపిణీ కమిటీల చైర్మన్ కమల్‌నాథన్... ఈ మొత్తం ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయడానికి కసరత్తు చేస్తున్నారు. సచివాలయంలోని సి-బ్లాక్‌లో తనకు కేటాయించిన కార్యాలయంలో ఆయన ఈ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. ఉద్యోగుల పంపిణీకి మార్గదర్శకాలే కీలకం. ఆ మేరకే ఉద్యోగులను కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పంపిణీ చేయనుంది. ఈ మార్గదర్శకాల రూపకల్పనలో భాగంగా కమల్‌నాథన్ ఇప్పటికే రెండ్రోజుల పాటు ఇరు ప్రాంతాలకు చెందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమై, వారి అభిప్రాయాలను తీసుకున్న విషయం తెలిసిందే.
అలాగే ఆయా సంఘాల నుంచి నోట్‌లను తీసుకున్నారు. ఇంకా ఎవరైనా, ఏ ప్రాంతానికి చెందిన ఉద్యోగ సంఘాలైనా, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ఉద్యోగులు కానీ తమ సమస్యలపై వినతిపత్రాలు సమర్పించడానికి కమల్‌నాథన్ అనుమతించారు. ఉద్యోగుల పంపిణీకి సంబంధించి ముసాయిదా మార్గదర్శకాలకు వారం రోజుల్లోగా ఒక రూపం ఇచ్చేందుకు ఆయన కృషి చేస్తున్నారు. మరోసారి మార్గదర్శకాల కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం, అలాగే కేంద్రం అభిప్రాయాలను తీసుకోనున్నారు. తొలుత ముసాయిదా మార్గదర్శకాలను ప్రజల ముందు ఉంచి... వారి సలహాలు, సూచనలు స్వీకరించడానికి తగిన గడువు ఇవ్వాలని భావిస్తున్నారు. ఉద్యోగ సంఘాలతో పాటు ఇతర వర్గాల నుంచి వచ్చే సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకున్న తరువాతనే తుది మార్గదర్శకాలను ఖరారు చేయనున్నారు.
అయితే రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో ఉద్యోగుల పంపిణీ ఏ ప్రాతిపదికన చేయాలనే విషయాన్ని ఎక్కడా పేర్కొనలేదు. దీంతో గతంలో రాష్ట్రాల విభజనలో పాటించినట్లే ఇప్పుడు కూడా జిల్లాల ప్రాతిపదికన ఉద్యోగుల పంపిణీ చేయాలనే ఆలోచనలో కమల్‌నాథన్ ఉన్నట్లు తెలిసింది. ఉద్యోగుల పంపిణీలో కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం అనుసరించనున్న కీలకాంశాలు ఈ విధంగా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రానికి ప్రొవిజినల్ ఉద్యోగుల కేటాయింపును జూన్ 2వ తేదీ కన్నా ముందుగానే కేంద్రం పూర్తి చేస్తుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉద్యోగుల కేటాయింపును ఆప్షన్లను పరిగణనలోకి తీసుకుంటూ జూన్ 2 తర్వాత కేంద్రం చేస్తుంది.
స్థానిక, జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టుల్లోని ఉద్యోగులు ఏ రాష్ట్రంలో పనిచేస్తున్న వారు ఆ రాష్ట్రంలోనే ఉంటారు.
ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రస్థాయి కేడర్‌లోని అధికారులు జోనల్, జిల్లా, డివిజినల్, మున్సిపల్, మండలస్థాయిలో పనిచేస్తున్న వారిని రాష్ట్రంలో ఎక్కడికైనా బదిలీ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. రాష్ట్ర సలహా కమిటీ సిఫార్సుల మేరకు ఇరు రాష్ట్రాలకు రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులను కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. ఈ విషయంలో ఇరు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ అధికారం కేంద్రానికి ఉంది.