రగిలిన సమైక్య సెగ
Published Sun, Oct 6 2013 1:27 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
గుంటూరు, న్యూస్‌లైన్ :విభజన నిర్ణయంపై గుంటూరు జిల్లా జనం గొల్లుమంది. రోడ్లుపైకొచ్చి నిరసన తెలిపింది. ఆందోళనలతో అట్టుడికించింది. ఇదేం న్యాయమంటూ నిగ్గదీసి అడుగుతోంది. నినాదాలతో హోరెత్తించింది. తమ భూములు ఎడారిగా మార్చేస్తారా అంటూ నిలదీస్తోంది. తమ పిల్లల భవిష్యత్తేమిటని ఆగ్రహంతో ఊగిపోతోంది. నోరైనా మెదపని నేతల ఇళ్లను ముట్టడించింది. ఫ్లెక్సీలు తగులబెట్టి తమ గుండె మంటలు దింపుకునే యత్నం చేసింది. వైఎస్సార్‌సీపీ ఇచ్చిన పిలుపునకు స్పందించింది. 72 గంటల బంద్‌లో రెండో రోజైన శనివారం సైతం జనజీవనాన్ని స్తంభింపజేసింది.తెలంగాణకు అనుకూలంగా రూపొందించిన నోట్‌కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో రెండో రోజు బంద్ విజయవంతమైంది.
అదే విధంగా ఏపీఎన్జీవోలు ఇచ్చిన 48గంటల బంద్ పిలుపుపైనా ఆ వర్గాలు బంద్‌కు సహకరించాయి. మంత్రి పదవికి రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మంత్రి కన్నా నివాసాన్ని ముట్టడించారు. గుంటూరు నగరంలో కేంద్ర, రాష్ట్ర ’ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ప్రైవేటు హాస్పిటల్స్, పెట్రోలు బంకులు, సిని మా థియేటర్లు, చివరకు ఏటీఎం కేంద్రాలు మూతపడ్డాయి. రవాణావ్యవస్థ స్తంభించిపోయింది. మాచ ర్ల, దుర్గి, రెంటచింతల, కారంపూడి మండలాల్లో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకోలు నిర్వహించారు. బాపట్ల పట్టణం లో రాస్తారోకో చేపట్టారు. తెనాలిలో జీజీహెచ్ సిబ్బంది అత్యవసర సేవలు నిలిపివేసి ఆందోళన చేశారు. ఇండస్ట్రియల్ ఎస్టేట్ కార్మికులు ర్యాలీ నిర్వహించారు.
రేపల్లె, వినుకొండలో పాసింజర్ రైళ్లను సమైక్య వాదులు నిలిపి రైల్‌రోకో నిర్వహించారు. బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త, సీఈసీ సభ్యుడు కోన రఘుపతి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నాలుగో రోజైన శనివారం కొనసాగింది. మంగళగిరిలో కృష్ణా, గుంటూరు జిల్లాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) ఆధ్వర్యంలో బంద్ జరిగింది. చిలకలూరిపేటలో పార్టీ జిల్లా కన్వీనర్ మర్రిరాజశేఖర్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి దుకాణాలు మూయించారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రోడ్డుపై ద్విచక్రవాహనాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు.
పార్టీ కేంద్రపాలక మండలిసభ్యులు, గురజాల నియోజకవర్గ సమన్వయకర్త జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో దాచేపల్లి, నడికుడి గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు. పొన్నూరులో పార్టీ సమన్వయకర్త రావి వెంకటరమణ, వేమూరు నియోజకవర్గంలోని వేమూరు, భట్టిప్రోలు, చుండూరు మండలంలో పార్టీ సమన్వయకర్త మేరుగ నాగార్జున , వినుకొండలో పార్టీ సమన్వయకర్త నన్నపనేని సుధ, నరసరావుపేటలో పార్టీ సమన్వయకర్త డాక్టరు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తెనాలిలో గుదిబండి చినవెంకటరెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. గుంటూరు నగరంలో నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, తూర్పు సమన్వయకర్తలు షేక్‌షౌకత్, నసీర్ ఆధ్వర్యంలో బంద్, నిరసన కార్యక్రమాలు జరిగాయి.
బాపయ్య మృతికి సంతాపాలు..
సమైక్యాంధ్ర కోసం ప్రాణాలు తీసుకున్న రెవెన్యూ ఉద్యోగి అచ్యుతాన బాపయ్య శవయాత్రను ఏపీ ఎన్జీవోలు గుంటూరు నగరంలో భారీగా నిర్వహించారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు. సమైక్యాంధ్ర జెండాలతో మృతదేహం వద్ద నివాళి అర్పించారు.
Advertisement