16% తగ్గిన డాక్టర్ రెడ్డీస్ లాభం | Dr Reddy's Q4 profit up 25 percent, lags estimates | Sakshi
Sakshi News home page

16% తగ్గిన డాక్టర్ రెడ్డీస్ లాభం

Published Wed, May 14 2014 12:02 AM | Last Updated on Sat, Sep 2 2017 7:19 AM

16% తగ్గిన డాక్టర్ రెడ్డీస్ లాభం

16% తగ్గిన డాక్టర్ రెడ్డీస్ లాభం

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రానికి చెందిన ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ మార్చితో ముగిసిన త్రైమాసిక నికరలాభం 16% క్షీణించింది.  2012-13 చివరి త్రైమాసికంలో రూ. 571 కోట్లుగా ఉన్న నికరలాభం ఇప్పుడు రూ. 482 కోట్లకు పడిపోయింది. అభివృద్ధి, పరిశోధన రంగానికి కేటాయింపులు పెంచడమే లాభాలు తగ్గడానికి కారణంగా డాక్టర్ రెడ్డీస్ చైర్మన్ కె.సతీష్ రెడ్డి తెలిపారు. ఆర్థిక ఫలితాలు వెల్లడించడానికి మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  గతేడాదితో పోలిస్తే ఈ త్రైమాసికంలో ఆర్ అండ్ డీ కేటాయింపులు రూ. 233 కోట్ల నుంచి రూ. 398 కోట్లకు పెంచడంతో ఆ మేరకు లాభాలు తగ్గాయన్నారు.

 సమీక్షా కాలంలో ఆదాయం 4% పెరిగి రూ. 3,340 కోట్ల నుంచి రూ. 3,481 కోట్లకు పెరిగింది. ఏడాది మొత్తం మీద చూస్తే డాక్టర్ రెడ్డీస్ నికరలాభం రూ. 1,678 కోట్ల నుంచి రూ. 2,151 కోట్లకు పెరగ్గా, ఆదాయం రూ. 11,626 కోట్ల నుంచి రూ.13,217 కోట్లకు వృద్ధి చెందింది. గడచిన ఏడాది ఆర్‌అండ్‌డీ కేటాయింపులను ఆదాయంలో 6.6 శాతం (రూ.757 కోట్లు) నుంచి 9.4 శాతానికి (రూ.1,240 కోట్లు) పెంచామని, ఈ మొత్తాన్ని ఈ ఏడాది 11 శాతం వరకు పెంచనున్నట్లు సతీష్ తెలిపారు.

అంతర్జాతీయంగా ముఖ్యంగా ఉక్రెయిన్, సీఎస్‌ఐ దేశాల్లో తలెత్తిన రాజకీయ సంక్షోభాలు వ్యాపారంపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయని, కానీ ఈ ఏడాది ప్రారంభం నుంచి మంచి సంకేతాలు ఉండటంతో వ్యాపారంలో వృద్ధి బాగుంటుందన్న ఆశాభావాన్ని సతీష్ వ్యక్తం చేశారు. ఈ త్రైమాసికంలో కొత్తగా మూడు ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. రూ. 5 ముఖ విలువ కలిగిన షేరుకు రూ.18 డివిడెండ్‌ను ప్రకటించింది.

 రాయితీల తర్వాతే పెట్టుబడులు
 ఈ ఏడాది విస్తరణ కోసం రూ. 1,500 కోట్లు వ్యయం చేయనున్నట్లు డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. రాష్ట్ర విభజన పూర్తయ్యి, కొత్త ప్రభుత్వాలు ఏర్పడి రాయితీలు ప్రకటించిన తర్వాత ఏ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేది నిర్ణయిస్తామని సతీష్ తెలిపారు. గతేడాది వ్యాపార విస్తరణ కోసం రూ.1,020 కోట్లు వ్యయం చేసింది.

 చైర్మన్‌గా సతీష్ రెడ్డి
 డాక్టర్ రెడ్డీస్ యాజమాన్యంలో కీలక మార్పులు జరిగాయి. డాక్టర్ రెడ్డీస్ వ్యవస్థాపకుడు డాక్టర్ అంజిరెడ్డి కుమారుడు సతీష్ రెడ్డిని చైర్మన్‌గా నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు సతీష్ రెడ్డి కంపెనీలో వైస్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహించేవారు. అలాగే ఇప్పటి వరకు చైర్మన్‌గా ఉన్న అంజిరెడ్డి అల్లుడు జి.వి.ప్రసాద్ ఇక నుంచి సీఈవో, వైస్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా బాధ్యతలను నిర్వహించనున్నారు. ఈ మార్పులపై సతీష్ స్పందిస్తూ ఇవి కేవలం కంపెనీ నిర్వహణ సౌలభ్యం కోసమేనన్నారు. కంపెనీ నిర్వహించే సామాజిక సేవలు, ఫార్మా రంగ అసోసియేషన్లతో తాను కలిసి పనిచేయాల్సి ఉండటంతో రోజువారీ కార్యకలాపాలను ప్రసాద్‌కు అప్పచెప్పినట్లు సతీష్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement