Dr. Reddys
-
'స్పుత్నిక్ వి' వ్యాక్సిన్ : డా.రెడ్డీస్ భారీ డీల్
సాక్షి, ముంబై: రష్యా కరోనా వ్యాక్సిన్ కు సంబంధించిన దేశీయ ఫార్మా దిగ్గజం డా.రెడ్డీస్ భారీ ఒప్పందాన్ని సొంతం చేసుకుంది. స్పుత్నిక్-వి వ్యాక్సిన్ పంపిణీ, క్లినికల్ ట్రయల్స్ కోసం రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ (ఆర్డీఎఫ్)తో భారీ డీల్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం పదికోట్ల (100 మిలియన్ల ) మోతాదుల కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయనుంది. ట్రయల్స్ విజయవంతమైతే నవంబర్ నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొస్తామని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ సీఈవో కిరిల్ దిమిత్రేవ్ వెల్లడించారు. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ అడెనోవైరల్ వెక్టర్ ప్లాట్‌ఫాంపై ఆధారపడి ఉంటుందన్నారు. దశాబ్దాలుగా 250 కి పైగా క్లినికల్ అధ్యయనాలలో పరీక్షించబడిందని,ఇందులో దీర్ఘకాలిక ప్రతికూలతలు లేకుండా సురక్షితంగా తేలిందన్నారు. అలాగే ఈ టీకా తయారీ మరో నాలుగు భారతీయ తయారీదారులతో చర్చలు జరుపుతున్నామన్నారు. ఒకటి, రెండు దశల ప్రయోగాల్లో సానుకూల ఫలితాల నేపథ్యంలో మూడు దశ ట్రయల్స్ నిర్వహించనున్నామని రెడ్డీస్ సీఈవో జీవీ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత్ సహా రష్యా వ్యాక్సిన్‌పై పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘స్పుత్నిక్ వి’కి మూడో దశ పరీక్షలకు భారత్‌లో రెడ్డీస్ ఒప్పందం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్, తయారీకి పుణేకు చెందిన సీరం సంస్థ ఒప్పందాన్ని చేసుకుని ప్రయోగాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. (కరోనా: డా.రెడ్డీస్ కొత్త ఔషధం) -
రెడ్డీస్‌కు జర్మనీ రెగ్యులేటర్ షాక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌కు జర్మనీ ఔషధ నియంత్రణ సంస్థ షాక్ ఇచ్చింది. హైదరాబాద్ సమీపంలోని బాచుపల్లి వద్ద ఉన్న ఫార్ములేషన్స్ తయారీ యూనిట్–2కు జీఎంపీ ధ్రువీకరణను పునరుద్ధరించలేదు. ఈ మేరకు జర్మనీలోని రెడ్డీస్ అనుబంధ కంపెనీ అయిన బెటాఫార్మ్కు సమాచారం ఇచ్చింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో యూనిట్–2 నుంచి యూరోపియన్ యూనియన్‌కు ఔషధ ఎగుమతులు చేయడానికి రెడ్డీస్‌కు వీలు లేకుండా పోయింది. ఇటీవలే ఈ ప్లాంటును జర్మనీ నియంత్రణ సంస్థ తనిఖీ చేపట్టింది. తదుపరి తనిఖీ పూర్తి అయి ఉత్తమ తయారీ విధానాలు (జీఎంపీ) అవలంబిస్తోందంటూ గ్రీన్ సిగ్నల్ వచ్చే వరకు కంపెనీ వేచి చూడాల్సిందే. -
రేపు జాబ్ మేళా
కర్నూలు సిటీ: డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ రి గ్రో ప్రాజెక్టు ఆధ్వర్యంలో సోమవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఏరియా హెడ్ ఇబ్రహీం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 28 సంవత్సరాల వయస్సు ఉండి, డిగ్రీ, ఇంటర్ పాస్/ఫెయిల్ అయిన వారు అర్హులు. ఐసీఐసీఐ, కోటక్ బ్యాంకులో సెల్స్ ఆఫీసర్‌గా పని చేయుటకు ఆసక్తి ఉన్న నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ మేళా భూపాల్ కాంప్లెక్స్‌లోని 4వ అంతస్తులో నిర్వహిస్తారని చెప్పారు. నేడు .. నగరంలోని ఆక్సా హోటల్ మేనేజ్మెంట్ సంస్థ ఆదివారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి నాజ్నిక్ తెలిపారు. హైదరాబాద్, తిరుపతి, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేందుకు పదోతరగతి, ఆ పై చదువులు చదివిన వారు మేళాకు హాజరుకావాలని కోరారు. పార్క్ రోడ్డులో ఉన్న ఆక్సా కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి జాబ్ మేళా జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు 8519868994, 9030486715 నంబర్లను సంప్రదించాలన్నారు. -
పల్లెకు సెల్యూట్
డాక్టర్ రెడ్డీస్ చిప్ సర్వీస్ ఒక కాలం ఉండేది. డాక్టర్లు ఇంటికొచ్చేవారు! ఒక కాలం ఉండేది. డాక్టర్ చెయ్యిపట్టి చూసేవారు! ఒక కాలం ఉండేది. డాక్టరే మందులు మింగించి వెళ్లేవారు! ఒక కాలం ఉండేది. డాక్టర్ మరోసారి పరామర్శకు వచ్చేవారు! ఇప్పుడు మళ్లీ ఆ కాలం వస్తోంది!! ‘డాక్టర్ రెడ్డీస్’... పల్లెల్ని వెతుక్కుంటూ వెళ్తోంది. పల్లె ఇంటికి ఫ్యామిలీ డాక్టర్ అవుతోంది. పల్లె ప్రతిభకు పదును పెడుతోంది. పల్లె కొలువుకు తోరణాలు కడుతోంది. మీరు ‘లిప్’ సర్వీస్ గురించి విని ఉంటారు. కానీ ఇది ‘చిప్’ సర్వీస్. సోల్జర్షిప్ సర్వీస్! పల్లెపల్లెకూ సైన్యంలా వెళుతుంది. ప్రతి పల్లెకూ సెల్యూట్ కొడుతుంది. శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్. సమావేశంలో జిల్లాస్థాయి అధికారులందరూ ఉన్నారు. కలెక్టర్ ఒకే ఒక్క విషయం మీద తీవ్రంగా దృష్టి పెట్టారు. కొద్ది నెలలుగా ప్రతి సమావేశంలోనూ ఆయన ఒకటే మాట అంటున్నారు. ‘‘ఒక ప్రైవేట్ సంస్థ సమర్థంగా చేసి చూపిస్తోన్న పనిని ఇంత పెద్ద ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు చేయలేకపోతోంది?’’ అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. అధికారులకు కొంచెం ఇబ్బందిగానే ఉంది ఆ పరిస్థితి. కలెక్టర్ ప్రస్తావించిన ఆ ప్రైవేటు సంస్థ.. ‘డాక్టర్ రెడ్డీస్’. గ్రామాలలో గర్భిణుల చెంతకు డాక్టర్ రెడ్డీస్ సంస్థ దత్తత తీసుకున్న గ్రామల్లోని గర్భిణీ స్త్రీల వివరాల నివేదిక ట్రైమిస్టర్ల వారీగా జిల్లా కేంద్రానికి అందుతోంది. అక్కడి గర్భిణులకు మంచి వైద్యం, మందులు అందుతున్నాయి. అబార్షన్లు గణనీయంగా తగ్గాయి. పిల్లలు ఆరోగ్యంగా పుడుతున్నారు. పురిటిలో బిడ్డలు పోవడం వంటి బాధాకర పరిస్థితుల నుంచి కుగ్రామాలు బయటపడ్డాయి. శారీరక బలహీనత వల్ల అంటురోగాల బారిన పడుతున్న కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈ వైద్యసేవలన్నీ క్షేత్రస్థాయిలో సమర్థంగా జరగడంతోపాటు వాటి రిపోర్టు ఎప్పటికప్పుడు జిల్లా కేంద్రానికి అందుతోంది. ఆ సంస్థ దత్తత తీసుకున్న గ్రామాల పరిస్థితి ఇలా ఉంటే, ఆ సంస్థ దత్తత తీసుకోని గ్రామాలు మాత్రం ప్రభుత్వ అలసత్వానికి ప్రతీకల్లా యంత్రాంగాన్ని మౌనంగా ప్రశ్నిస్తున్నాయి. అక్కడి పరిస్థితుల మెరుగుదలకు ఏం చేయాలనేదే ఆ కలెక్టర్ ఆవేదన. పాఠశాలలకూ... వైద్య బృందాలు నల్గొండ జిల్లా త్రిపురారం మండలంలోని పనుగోత తండాలో కూడా గణనీయమైన అభివృద్ధి కనిపిస్తోంది. గత ఏడాది మే నెల పదవ తేదీన డాక్టర్ రెడ్డీస్ ‘కమ్యూనిటీ హెల్త్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్’ (చిప్) వైద్యుల బృందం ఆ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించింది. ఒకటో తరగతిలో స్నేహ అనే ఐదేళ్ల అమ్మాయి స్కాల్ప్ ఇన్ఫెక్షన్తో బాధపడుతోంది. వైద్య బృందంలోని నర్సులు స్నేహకు మందులివ్వడంతోపాటు ఇంటికి వెళ్లి జుట్టు తీయించి, వ్యక్తిగత పరిశుభ్రత పట్ల పెద్దవాళ్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఆ ఇంటికి వెళ్లి స్నేహ కోలుకునే వరకు ఆమె ఆరోగ్యాన్ని పర్యవేక్షించింది డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ ఆధ్వర్యంలోని చిప్ బృందం. ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ’లో భాగంగా ఈ సంస్థ విద్యా వైద్యసేవల్ని అందిస్తోంది. ఆలోచనకు ఆద్యులు డాక్టర్ అంజిరెడ్డి ‘‘సిఎస్ఆర్కి చట్టం రూపం ఇటీవలే వచ్చింది. కానీ డాక్టర్ రెడ్డీస్ సంస్థను స్థాపించిన డాక్టర్ అంజిరెడ్డి తొలినాళ్ల నుంచే గివింగ్ బ్యాక్ టు సొసైటీ అనే నినాదాన్ని అమలు చేశారు’’ అని డాక్టర్ రెడ్డీస్ సంస్థ ప్రతినిధి డాక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ‘‘డాక్టర్ రెడ్డీస్ యూనిట్ ఉన్న ప్రతిచోటా ఇలాంటి సర్వీస్ ఇస్తూనే ఉన్నాం. మొదట్లో విద్య, స్కిల్‌డెవలప్‌మెంట్ మా ప్రధాన లక్ష్యాలుగా ఉండేవి. అలా ఇప్పటికి 59 పాఠశాలలను దత్తత తీసుకుని మంచినీటి కోసం ఆర్వో ప్లాంట్లు పెట్టించాం. 500మందికి పైగా మెరిట్ విద్యార్థులకు పై చదువుల కోసం ఏటా ఉపకార వేతనం ఇస్తున్నాం. వాళ్లు చదువులో నైపుణ్యాన్ని కొనసాగిస్తేనే తరువాత ఏడాది ఉపకార వేతనం అందుతుందన్నమాట. స్కిల్‌డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో స్టూడెంట్స్ పని చేసుకుంటూ చదువుకునే సౌలభ్యం ఉంది. ముందుగా ఉద్యోగంలో చేరి వృత్తి నైపుణ్యాలను పెంచుకుంటారు, అదే సమయంలో వారికోసం ప్రత్యేకంగా రూపొందిన కరికులమ్‌తో డిగ్రీ పూర్తి చేస్తారు. ఇందుకోసం గీతం యూనివర్శిటీతో టై అప్ అయ్యాం. అయితే ప్రస్తుత చైర్మన్ సతీశ్‌రెడ్డి వైద్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. మా యూనిట్లు ఉన్న చోట్ల స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఆరోగ్య సేవలు అత్యవసరం అని ఆయన భావించారు. అప్పటి నుంచి ఆరోగ్య సేవలను చాలా విస్తృతంగా అందిస్తున్నాం’’ అని డాక్టర్ నారాయణరెడ్డి వివరించారు. మూడు జిల్లాలు... మారుమూల గ్రామాలు శ్రీకాకుళం, విజయనగరం, నల్గొండ జిల్లాల్లో డాక్టర్ రెడ్డీస్ ‘చిప్’ నడుస్తోంది. ఒక్క శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోనే 29 గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఈ గ్రామాల్లో చాలా వరకు రోజువారీ పనులతో జీవనం సాగించే వాళ్లే. ఇంట్లో ఒకరికి అనారోగ్యం వస్తే ఆ వ్యక్తి పనికి పోలేడు. అతడిని వైద్యానికి ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే కనీసంగా పాతిక కిలోమీటర్లు ప్రయాణించాలి. మరొకరు తోడు వెళ్లాలి. ఆ రోజుకు ఇద్దరికీ కూలి డబ్బు రాకపోవడంతోపాటు దారి ఖర్చులు, మందుల ఖర్చులు కలిపి ఐదువందలకు పైగా ఖర్చు. అంత డబ్బు చేతిలో లేకపోవడంతో హాస్పిటల్‌కు వెళ్లకుండా ఏదో ఆకు పసర్లతో రోజులు గడుపుతూ వ్యాధిని ముదరబెట్టుకుంటుంటారు. అనారోగ్యం, ఆర్థిక సమస్యలతోనే కాలం వెళ్లదీస్తుంటారు. గర్భిణులది ఇంకో రకమైన సమస్య. వెళ్లలేని వాళ్ల ఇళ్లకే... డాక్టర్లు! ‘‘పోషకాహారలోపం వల్ల గర్భం నిలవకపోవడం సర్వసాధారణంగా ఉండేది. మళ్లీ త్వరగా గర్భం రావడంతో ఆ మహిళలు రక్తహీనతతో పాలిపోయి కనిపించేవారు. గర్భం నిలిచినా పిల్లలు బలహీనంగా పుట్టడం, ఇమ్యూనిటీ లేక నెలలు నిండకనే చనిపోవడం వంటివి ఎక్కువగా ఉండేవి. ఇదంతా అవగాహనకు వచ్చిన తర్వాత మేము సిఎస్‌ఆర్‌లో వైద్య సేవలను విస్తృతంగా అందించాలనుకున్నాం’’ అని చెప్పారు డాక్టర్ నారాయణరెడ్డి. ‘‘ఇప్పుడు గర్భిణీ స్త్రీలకు, మా ‘ఫిక్స్డ్ డే హెల్త్ సర్వీసెస్ సెంటర్’కు రాలేని వృద్ధులకు ఇంటి దగ్గరే వైద్యం, మందులు ఇస్తున్నాం. మా సేవా కార్యక్రమాలకు కార్యనిర్వాహక సహకారం నైస్ సంస్థ అందిస్తోంది. ఉద్యోగుల శ్రేయస్సుతోపాటు కమ్యూనిటీ ప్రోగ్రెస్ కోసం కూడా పని చేయాలనేవారు మా సంస్థ వ్యవస్థాపకులు అంజిరెడ్డి. ఆయన చూపించిన దారిలో నడుస్తూ వారి ఆశయాలను ఆచరణలో పెట్టడం సంతోషంగా ఉంది’’ అన్నారాయన. ప్రభుత్వం నిష్క్రియాశీలంగా ఉన్నప్పుడు సమాజహితం కోసం శ్రమించే వారు స్పందించి ప్రభుత్వ యంత్రాంగంలో చురుకు పుట్టిస్తారు. అందుకు డాక్టర్ రెడ్డీస్ వంటి సంస్థల సేవలే నిదర్శనం. ‘ఆరోగ్యశ్రీ’తోనూ అనుసంధానం మేము నిర్వహించే క్లినిక్కులను ఎఫ్‌డిహెచ్‌ఎస్ (ఫిక్స్డ్ డే హెల్త్ సర్వీసెస్) అంటాం. మూడు జిల్లాలకు గాను 145 గ్రామాల్లో 196 క్లినిక్కులున్నాయి. ఆరు మొబైల్ యూనిట్లు పని చేస్తున్నాయి. ప్రతి క్లినిక్కుని రెండు వారాలకోసారి సందర్శిస్తాయవి. వాటి ద్వారా ఇప్పటి వరకు రెండు లక్షల పద్నాలుగు వేల మందికి వైద్యసేవలందించాం. 9, 445 మందికి దీర్ఘకాలిక అనారోగ్యాలకు వారింటి వద్దనే వైద్యం అందించాం. మా పరిధిలో చేయలేని పన్నెండు వందల కేసులను పెద్దాసుపత్రులకు పంపించి ఆరోగ్యశ్రీ వంటి స్కీములతో జత కలిపాం. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వ వైద్యులు ఆసుపత్రికి వచ్చిన వారికి వైద్యం అందిస్తారు. మా చిప్ బృందాలు రోగులను గుర్తించి, వారిని ఆసుపత్రులకు చేరుస్తున్నాయి. మేము దత్తత తీసుకున్న గ్రామాల పరిసరాల్లో ఆరోగ్యం అందని కేసుల గురించి పత్రికల్లో చదివినప్పుడు మా చైర్మన్ వెంటనే స్పందిస్తుంటారు. ఆలాంటి కేసులను మా చిప్ బృందాలు టేకప్ చేస్తుంటాయి. - డాక్టర్ వి. నారాయణ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ హెడ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, హైదరాబాద్ ‘చిప్’ బృందం ఇలా పని చేస్తుంది! ఫీల్డ్ సూపర్వైజర్.. గ్రామాల్లో అల్పాదాయ వర్గాల వాడల్లోని ఇంటింటికీ తిరిగి పేర్లు నమోదు చేస్తారు. పేషెంట్ హెల్త్ రికార్డు కూడా ఫీల్డు సూపర్వైజర్లే మెయింటెయిన్ చేస్తారు. డాక్టర్, నర్సులు, హెల్త్ అసిస్టెంట్లతో కూడిన బృందం రెండు వారాలకోసారి గ్రామాల్లో పర్యటిస్తుంది. గర్భధారణ నిర్ధారణ పరీక్షలు, అల్ట్రాసౌండ్, కడుపులో బిడ్డ గుండె పనితీరును పర్యవేక్షించడం, ఇతర సాధారణ రక్త పరీక్షలు, హైబీపీ, మూత్ర పరీక్షలు... వంటివన్నీ ఇప్పుడు గ్రామాల్లోనే. సంబంధిత పరికరాలన్నీ మొబైల్ వ్యాన్‌లో తీసుకెళ్తారు. డయాబెటిస్, హైబీపీ, సాధారణ జ్వరాలు, శ్వాసకోశ సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులు, రక్తహీనతతో వచ్చే అనుబంధ సమస్యలు, మూత్రకోశ సంబంధ ఇన్ఫెక్షన్లు, ఈఎన్టి సమస్యలు, ఎముకలు- కీళ్ల వ్యాధులు, నొప్పులకు వైద్యం చేసి ఉచితంగా మందులిస్తారు. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఆస్ట్రాజెన్కాతో డాక్టర్ రెడ్డీస్ న్యాయపోరాటం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమెరికా కోర్టులో ఆస్ట్రాజెన్కాతో న్యాయపరమైన పోరాటానికి దిగింది. నెక్సియం జెనరిక్ వెర్షన్‌ను డాక్టర్ రెడ్డీస్ ఊదారంగులో విక్రయించడాన్ని వ్యతిరేకిస్తూ ఆస్ట్రాజెన్‌కా అమెరికా కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై డాక్టర్ రెడ్డీస్ కూడా న్యూజెర్సీ జిల్లా కోర్టును ఆశ్రయించినట్లు విశ్వసనీయ సమాచారం. వరుస వివాదాలతో షేరు ధర తగ్గడంతో ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచడానికి ప్రమోటర్లు బహిరంగ మార్కెట్లో షేర్లను కొనుగోలు చేస్తున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. తాజాగా ప్రమోటర్ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ హోల్డింగ్స్ లిమిటెడ్ మరో 21,450 షేర్లను కొనుగోలు చేసింది. దీంతో హోల్డింగ్స్ లిమిటెడ్ వాటా 23.37 శాతం నుంచి 23.39 శాతానికి పెరిగింది. -
డాక్టర్ రెడ్డీస్ చేతికి ఫాండాపారినక్స్ హక్కులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫాండాపారినక్స్ సోడియం జెనరిక్ డ్రగ్‌పై ప్రపంచవ్యాప్తంగా మేధోసంపత్తి హక్కులను డాక్టర్ రెడ్డీస్ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియాకి చెందిన ఆల్కెమియా నుంచి ఈ హక్కులను రూ. 115 కోట్లకు ( 17.5 మిలియన్ డాలర్లు) కొనుగోలు చేసినట్లు డాక్టర్ రెడ్డీస్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. నరాల్లో రక్తం గడ్డకట్టకుండా ఉండటానికి వినియోగించే ఆరిక్సట్రాక్ ఔషధానికి ఫాండాఫారినక్స్ జెనరిక్ రూపం. సెప్టెంబర్ నెలలో జరిగిన ఈ ఒప్పందానికి నవంబర్ 10న జరిగిన ఆల్కెమియా వాటాదారులు సమావేశంలో ఆమోదం తెలిపినట్లు కంపెనీ ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ ఒప్పందం జూలై, 2015 నుంచి అమల్లోకి వచ్చింది. -
డాక్టర్ రెడ్డీస్‌కు వార్నింగ్..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలోనే రెండో అతిపెద్ద ఔషద తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్‌కి శుక్రవారం ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఏకంగా మూడు తయారీ కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాలు సరిగ్గా లేవని హెచ్చరిస్తూ అమెరికాలోని మందుల నియంత్రణాధికార సంస్థ... యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ ఎఫ్‌డీఏ) డాక్టర్ రెడ్డీస్‌కి లేఖ రాసింది. ఈ మేరకు వార్నింగ్ లెటర్ వచ్చినట్లు డాక్టర్ రెడ్డీస్ సంస్థ కూడా ధ్రువీకరించింది. ఈ మూడింట్లో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఏపీఐ యూనిట్, విశాఖపట్నంలోని దువ్వాడలో ఉన్న అంకాలజీ ఫార్ములేషన్ యూనిట్‌తో పాటు, తెలంగాణలోని మిర్యాలగూడలో ఉన్న ఏపీఐ యూనిట్ ఉన్నాయి. చిత్రమేంటంటే శ్రీకాకుళం యూనిట్‌లోని లోపాలను యూఎస్ఎఫ్డీఏ ఎత్తి చూపించి దాదాపు ఏడాది గడుస్తోంది. ఇంతవరకూ వాటిని సరిచేయటమో, దానిపై మరో నిర్ణయమో తీసుకోకుండానే సంస్థ నెట్టుకురావటం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికితోడు ఇప్పుడు కొత్తగా మరో రెండు యూనిట్లకు ఏకంగా వార్నింగ్ నోటీసులే వచ్చాయి. ఈ హెచ్చరిక లేఖలకు కంపెనీ 15 రోజుల్లోగా తగు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ సమాధానానికి యూఎస్ఎఫ్డీఏ సంతృప్తి చెందితే సరి. లేని పక్షంలో ఈ యూనిట్లలో జరిగే ఉత్పత్తిని ఎగుమతి చేయకుండా నిషేధం విధిస్తూ యూఎస్ఎఫ్డీఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే కంపెనీ ప్రతిష్టతో పాటు ఆదాయంపై కూడా గణనీయమైన ప్రభావం పడుతుంది. ప్రస్తుతం డాక్టర్ రెడ్డీస్‌కు వస్తున్న ఆదాయంలో 10 నుంచి 12 శాతం ఈ యూనిట్ల నుంచే వస్తున్నట్లు తెలుస్తోంది. గడచిన ఏడాది డాక్టర్ రెడ్డీస్ ఆదాయం రూ.10,000 కోట్ల మార్కును అధిగమించగా... ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలానికి ఆదాయం రూ.5,423 కోట్లుగా ఉంది. ఆదాయంపై ప్రభావం లేదు.. కాగా ప్రస్తుతం జారీ చేసిన హెచ్చరిక లేఖ వల్ల కంపెనీ ఆదాయంపై ఎటువంటి ప్రభావం పడదని డాక్టర్ రెడ్డీస్ స్పష్టం చేసింది. వీటికి సమాధానమివ్వడానికి 15 రోజుల సమయం ఉందని, ఈ లోగా ఎఫ్‌డీఏ లేవనెత్తిన అభ్యంతరాలపై పూర్తిస్థాయిలో సమాధానం ఇస్తామని డాక్టర్ రెడ్డీస్ సీఈవో జి.వి.ప్రసాద్ తెలిపారు. తాము సమాధానం ఇచ్చిన తర్వాత యూఎస్ ఎఫ్‌డీఏ మూడు యూనిట్లనూ పరిశీలించి క్లీన్చిట్ ఇస్తుందని భావిస్తున్నట్లు కంపెనీ సీఎఫ్‌వో సౌమెన్ చక్రవర్తి పేర్కొన్నారు. ఇన్వెస్టర్లలో ఆందోళన... ఏకంగా మూడు యూనిట్లలోని నాణ్యతా ప్రమాణాలను హెచ్చరిస్తూ యూఎస్ఎఫ్డీఏ లేఖ రాయడంపై ఇన్వెస్టర్లు ఆందోళనకు గురయ్యారు. నవంబర్, 2014లోనే శ్రీకాకుళం యూని ట్లో పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలపై యూఎస్ఎఫ్డీఏ 483 కింద అభ్యంతరాలు లేవనెత్తింది. ఆ తర్వాత యూఎస్ఎఫ్డీఏ జనవరి, 2015లో మిర్యాలగూడ, ఫిబ్రవరిలో దువ్వాడ యూని ట్లను సందర్శించింది. ఏడాది క్రితమే శ్రీకాకుళం యూనిట్లలో లేవనెత్తిన అబ్జర్వేషన్స్‌కు కంపెనీ తగురీతిలో సమాధానపరచకపోవటం... తాజాగా మరో రెండు యూనిట్లకు కూడా హెచ్చరికలు రావడంతో ఈ ఆందోళన మరింత తీవ్రమయ్యింది. దీంతో శుక్రవారం స్టాక్ ఎక్స్ఛేంజీల్లో డాక్టర్ రెడ్డీస్ షేర్లను ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున విక్రయించారు. కొనుగోళ్ల మద్దతు దొరక్కపోవటంతో షేరు ఒక్కరోజులోనే 15 శాతానికి పైగా నష్టపోయింది. షేరు ధర రూ. 623 నష్టపోయి (15 శాతం) రూ.3,629 వద్ద ముగిసింది. ఈ నష్టంతో ఈ కంపెనీ షేర్ హోల్డర్ల సంపద ఒక్కరోజులోనే దాదాపు రూ.10వేల కోట్ల మేర హరించుకుపోయింది. ఈ వ్యవహారంపై కంపెనీ ఎంత త్వరగా స్పందిస్తుందో, తక్షణం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో... వాటిపైనే కంపెనీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ఏంజెల్ బ్రోకింగ్ ఫార్మా ఎనలిస్ట్ సరబ్జిత్ కౌర్ చెప్పారు. -
కేశ సంరక్షణ రంగంలోకి డాక్టర్ రెడ్డీస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ కేశ సంరక్షణ విభాగంలోకి ప్రవేశించింది. రాలుతున్న జుట్టును అరికట్టే ‘మిన్‌టాప్ ప్రో’ ప్రోక్యాపిల్’ హెయిర్ థెరిపీని మార్కెట్లోకి విడుదల చేసింది. 75ఎంఎల్ మిన్‌టాప్ ప్రో బాటిల్ ధరను రూ. 995గా నిర్ణయించింది. ఇది ఇలా ఉండగా అమెరికా మార్కెట్ నుంచి అమ్లోడైపిన్ బెస్లేట్, అటర్వాస్టాటిన్ కాల్షియం ట్యాబ్లెట్లకు సంబంధించిన 55,000 బాటిల్స్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. -
స్టార్టప్స్‌లకు డాక్టర్ రెడ్డీస్ చేయూత!
- కొత్త ఆలోచనలకు కార్యరూపం మివ్వడంలో అండగా ఉంటాం - డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ కో-చైర్మన్, సీఈఓ జీవీ ప్రసాద్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డాక్టర్ రెడ్డీస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సెన్సైస్ (డీఆర్ఐఎల్ఎస్- డ్రిల్స్) కార్పొరేట్ పరిశోధనలతో పాటుగా స్టార్టప్ కంపెనీలకూ చేయూతనందించనుంది. ఔషధ, వైద్య రంగంలో వినూత్న ఆలోచనలు, ఉత్పత్తులతో ముందుకొచ్చే స్టార్టప్స్‌కు కార్పొరేట్ స్థాయిలో ప్రోత్సాహం అందించడంతో పాటుగా వారి ఆలోచనలు కార్యరూపం దాల్చడానికి సరైన దిశానిర్దేశం చేస్తామని డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ కో-చైర్మన్, సీఈఓ జీవీ ప్రసాద్ చెప్పారు. వైద్యం- విద్యా, పర్యావరణ పరిశ్రమ వృద్ధి అనే అంశంపై శనివారమిక్కడ ‘డ్రిల్స్ సినర్జీ 2015’ కార్యక్రమం జరిగింది. ఆయన మాట్లాడుతూ... స్టార్టప్స్ కంపెనీల ఆర్థిక చేయూత నిమిత్తం రెడ్డీస్‌తో పాటు ఇతర కంపెనీల నుంచి నిధులను సమీకరించడంపై దృష్టిపెట్టామన్నారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో 2004లో ప్రారంభమైన డ్రిల్స్‌కు మౌలిక వసతుల అభివృద్ధి నిమిత్తంరెడ్డీస్ తొలుత రూ.28 కోట్లు.. ఆ తర్వాత 7 ఏళ్లలో మరో రూ.30 కోట్లు అందించిందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రూ.10 కోట్లు గ్రాంటు రూపంలో లభించాయని ప్రసాద్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ చైర్మన్ సతీష్ రెడ్డి పాల్గొన్నారు. జనరిక్ మందులను కాపీ చేయొద్దు: సన్ ఫార్మా ఇతర దేశాల్లోని జనరిక్ మందులను ఇక్కడ కాపీ చేయడం కాకుండా.. కొత్త ఔషదాలను తయారు చేయడంపై దేశీ ఔషద కంపెనీలు పరిశోధనలు చేయాలని సన్ ఫార్మా వ్యవస్థాపకుడు, ఎండీ దిలీప్ సంఘ్వీ సూచించారు. ఇందుకోసం విద్యా స్థాయిలోనే పరిశోధనల నాణ్యత, నైపుణ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ‘కేసీఆర్ ప్లాటినం స్పూన్‌తో పుట్టాడు’ ఎవరైనా అష్టైశ్వర్యాలతో పుడితే.. ‘వాడికేంటిరా.. గోల్డెన్ స్పూన్‌తో పుట్టాడు’ అంటారు. ఈ నానుడిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అన్వయిస్తే... ‘‘కేసీఆర్ ప్లాటినం స్పూన్‌తో పుట్టాడని’’ అనుకోవాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. విద్యా, వైద్యం, సాంకేతిక.. ఇలా ప్రతి రంగంలోనూ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిన హైదరాబాద్.. తెలంగాణలో ఉండటమే ఇందుకు కారణమని చెప్పారు. డాక్టర్ రెడ్డీస్ సినర్జీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
డాక్టర్ రెడ్డీస్‌కు ఉమాంగ్ గుడ్‌బై
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌కు... ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఉమాంగ్ వోరా గుడ్ బై చెప్పారు. ఇప్పటి వరకు ఆయన ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉత్తర అమెరికా జనరిక్స్ విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు. గతంలో కంపెనీ సీఎఫ్‌వోగా కూడా పనిచేశారు. 13 ఏళ్ళుగా డాక్టర్ రెడ్డీస్‌లో పనిచేసిన వోరా... కంపెనీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. సిప్లాలో కీలక పదవిలో చేరుతున్నట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇక ఆయన రాజీనామాతో కీలక హోదాల్లో డాక్టర్ రెడ్డీస్ పలు మార్పులను చేసింది. వోరా స్థానంలో అలోక్ సోనిగ్ను నియమించింది. ఇప్పటి వరకు ఆయన ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఇండియా జనరిక్స్ హెడ్‌గా ఉన్నారు. కంపెనీ మేనేజ్మెంట్ కౌన్సిల్లోనూ ఆయన సభ్యుడిగా పనిచేస్తున్నారు. 2012లో డాక్టర్ రెడ్డీస్‌లో చేరారు. అంతకు ముందు వరకు ఆయన 2007 నుంచి బ్రిస్టల్ మేయర్స్ స్క్విబ్(బీఎంఎస్) ఇండియా చీఫ్‌గా విధులు నిర్వర్తించారు. బీఎంఎస్‌లో ఉన్న సమయంలో యూఎస్ మార్కెట్లోనూ పనిచేశారు. ఎమర్జింగ్ మార్కెట్స్ బిజినెస్‌ను పర్యవేక్షిస్తున్న ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎం.వి.రమణకు ఇండియా, ఎమర్జింగ్ దేశాల బ్రాండెడ్ మార్కెట్స్ హెడ్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. -
అమ్జెన్ డ్రగ్స్‌తో డాక్టర్ రెడ్డీస్ జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమెరికా బయోటెక్నాలజీ సంస్థ అమ్జెన్తో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా అమ్జెన్కు చెందిన 3 రకాల ఔషధాలను డాక్టర్ రెడ్డీస్ ఇండియాలో విక్రయిస్తుంది. కాన్సర్, గుండె సంబంధిత చికిత్సల్లో వినియోగించే అమ్జెన్కు చెందిన కైప్రోలిస్, బ్లిన్సైటో, రేప్తా ఔషధాలు వీటిలో ఉన్నాయి. -
డాక్టర్ రెడ్డీస్ నుంచి అల్జీమర్ ట్యాబెట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ అల్జీమర్ తరహా వ్యాధుల చికిత్సకు వినియోగించే మెమంటైన్ హైడ్రోక్లోరైడ్ జెనరిక్ వెర్షన్‌ను అమెరికా మార్కెట్లోకి విడుదల చేసింది. 5ఎంజీ, 10 ఎంజీ ట్యాబ్లెట్లను విక్రయించడానికి యూఎస్ఎఫ్డీఏ నుంచి అనుమతి లభించిందని, అమెరికాలో ఈ ట్యాబ్లెట్ల మార్కెట్ పరిమాణం ఏడాదికి రూ. 8,800 కోట్లుగా ఉన్నట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. -
16% తగ్గిన డాక్టర్ రెడ్డీస్ లాభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రానికి చెందిన ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ మార్చితో ముగిసిన త్రైమాసిక నికరలాభం 16% క్షీణించింది. 2012-13 చివరి త్రైమాసికంలో రూ. 571 కోట్లుగా ఉన్న నికరలాభం ఇప్పుడు రూ. 482 కోట్లకు పడిపోయింది. అభివృద్ధి, పరిశోధన రంగానికి కేటాయింపులు పెంచడమే లాభాలు తగ్గడానికి కారణంగా డాక్టర్ రెడ్డీస్ చైర్మన్ కె.సతీష్ రెడ్డి తెలిపారు. ఆర్థిక ఫలితాలు వెల్లడించడానికి మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతేడాదితో పోలిస్తే ఈ త్రైమాసికంలో ఆర్ అండ్ డీ కేటాయింపులు రూ. 233 కోట్ల నుంచి రూ. 398 కోట్లకు పెంచడంతో ఆ మేరకు లాభాలు తగ్గాయన్నారు. సమీక్షా కాలంలో ఆదాయం 4% పెరిగి రూ. 3,340 కోట్ల నుంచి రూ. 3,481 కోట్లకు పెరిగింది. ఏడాది మొత్తం మీద చూస్తే డాక్టర్ రెడ్డీస్ నికరలాభం రూ. 1,678 కోట్ల నుంచి రూ. 2,151 కోట్లకు పెరగ్గా, ఆదాయం రూ. 11,626 కోట్ల నుంచి రూ.13,217 కోట్లకు వృద్ధి చెందింది. గడచిన ఏడాది ఆర్అండ్డీ కేటాయింపులను ఆదాయంలో 6.6 శాతం (రూ.757 కోట్లు) నుంచి 9.4 శాతానికి (రూ.1,240 కోట్లు) పెంచామని, ఈ మొత్తాన్ని ఈ ఏడాది 11 శాతం వరకు పెంచనున్నట్లు సతీష్ తెలిపారు. అంతర్జాతీయంగా ముఖ్యంగా ఉక్రెయిన్, సీఎస్ఐ దేశాల్లో తలెత్తిన రాజకీయ సంక్షోభాలు వ్యాపారంపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయని, కానీ ఈ ఏడాది ప్రారంభం నుంచి మంచి సంకేతాలు ఉండటంతో వ్యాపారంలో వృద్ధి బాగుంటుందన్న ఆశాభావాన్ని సతీష్ వ్యక్తం చేశారు. ఈ త్రైమాసికంలో కొత్తగా మూడు ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. రూ. 5 ముఖ విలువ కలిగిన షేరుకు రూ.18 డివిడెండ్‌ను ప్రకటించింది. రాయితీల తర్వాతే పెట్టుబడులు ఈ ఏడాది విస్తరణ కోసం రూ. 1,500 కోట్లు వ్యయం చేయనున్నట్లు డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. రాష్ట్ర విభజన పూర్తయ్యి, కొత్త ప్రభుత్వాలు ఏర్పడి రాయితీలు ప్రకటించిన తర్వాత ఏ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేది నిర్ణయిస్తామని సతీష్ తెలిపారు. గతేడాది వ్యాపార విస్తరణ కోసం రూ.1,020 కోట్లు వ్యయం చేసింది. చైర్మన్‌గా సతీష్ రెడ్డి డాక్టర్ రెడ్డీస్ యాజమాన్యంలో కీలక మార్పులు జరిగాయి. డాక్టర్ రెడ్డీస్ వ్యవస్థాపకుడు డాక్టర్ అంజిరెడ్డి కుమారుడు సతీష్ రెడ్డిని చైర్మన్‌గా నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు సతీష్ రెడ్డి కంపెనీలో వైస్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహించేవారు. అలాగే ఇప్పటి వరకు చైర్మన్‌గా ఉన్న అంజిరెడ్డి అల్లుడు జి.వి.ప్రసాద్ ఇక నుంచి సీఈవో, వైస్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా బాధ్యతలను నిర్వహించనున్నారు. ఈ మార్పులపై సతీష్ స్పందిస్తూ ఇవి కేవలం కంపెనీ నిర్వహణ సౌలభ్యం కోసమేనన్నారు. కంపెనీ నిర్వహించే సామాజిక సేవలు, ఫార్మా రంగ అసోసియేషన్లతో తాను కలిసి పనిచేయాల్సి ఉండటంతో రోజువారీ కార్యకలాపాలను ప్రసాద్‌కు అప్పచెప్పినట్లు సతీష్ తెలిపారు. -
డాక్టర్ రెడ్డీస్‌పై పేటెంటు ఉల్లంఘన కేసు
హైదరాబాద్: ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్‌పై పేటెంటు ఉల్లంఘన కేసు నమోదైంది. పేటెం టున్న ఔషధమైన వాసెపాకు జనరిక్ వెర్షన్‌ను తీసుకొచ్చే పనిలో రెడ్డీస్ నిమగ్నమైందంటూ డబ్లిన్‌కు చెందిన అమరిన్ ఫార్మా అమెరికా కోర్టును ఆశ్రయించింది. రెడ్డీస్ ఏఎన్‌డీఏ 16 కౌంట్లలో వాసెపా ఔషధాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. రెడ్డీస్, అనుబంధ కంపెనీ, ఇతర విభాగాలుగానీ ఈ ఔషధం తయారీ, వాడకం, విక్రయం, అమ్మజూపడం, కొనుగోలును శాశ్వతంగా నిషేధించాలని కోర్టుకు విన్నవించింది. హ్యాచ్-వాక్స్మన్ యాక్టు కింద అమరిన్ ఫార్మా ఈ దావా వేసింది. శరీరంలో ఒక రకమైన కొవ్వును (ట్రైగ్లిసెరైడ్స్) తగ్గించేందుకు ఈ ఔష దం దోహదం చేస్తుంది. వాసెపా ఔషధం పేటెం ట్లు చాలామటుకు 2030లో ముగియనున్నాయి.