డాక్టర్ రెడ్డీస్‌కు వార్నింగ్..! | Dr Reddy's Lab Shares Crash on US Regulator's Warning Letter | Sakshi
Sakshi News home page

డాక్టర్ రెడ్డీస్‌కు వార్నింగ్..!

Published Sat, Nov 7 2015 1:50 AM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM

డాక్టర్ రెడ్డీస్‌కు వార్నింగ్..! - Sakshi

డాక్టర్ రెడ్డీస్‌కు వార్నింగ్..!

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలోనే రెండో అతిపెద్ద ఔషద తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్‌కి శుక్రవారం ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఏకంగా మూడు తయారీ కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాలు సరిగ్గా లేవని హెచ్చరిస్తూ అమెరికాలోని మందుల నియంత్రణాధికార సంస్థ... యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ ఎఫ్‌డీఏ) డాక్టర్ రెడ్డీస్‌కి లేఖ రాసింది. ఈ మేరకు వార్నింగ్ లెటర్ వచ్చినట్లు డాక్టర్ రెడ్డీస్ సంస్థ కూడా ధ్రువీకరించింది. ఈ మూడింట్లో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఏపీఐ యూనిట్, విశాఖపట్నంలోని దువ్వాడలో ఉన్న అంకాలజీ ఫార్ములేషన్ యూనిట్‌తో పాటు, తెలంగాణలోని మిర్యాలగూడలో ఉన్న ఏపీఐ యూనిట్ ఉన్నాయి.

చిత్రమేంటంటే శ్రీకాకుళం యూనిట్‌లోని లోపాలను యూఎస్‌ఎఫ్‌డీఏ ఎత్తి చూపించి దాదాపు ఏడాది గడుస్తోంది. ఇంతవరకూ వాటిని సరిచేయటమో, దానిపై మరో నిర్ణయమో తీసుకోకుండానే సంస్థ నెట్టుకురావటం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికితోడు ఇప్పుడు కొత్తగా మరో రెండు యూనిట్లకు ఏకంగా వార్నింగ్ నోటీసులే వచ్చాయి. ఈ హెచ్చరిక లేఖలకు కంపెనీ 15 రోజుల్లోగా తగు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

ఈ సమాధానానికి యూఎస్‌ఎఫ్‌డీఏ సంతృప్తి చెందితే సరి. లేని పక్షంలో ఈ యూనిట్లలో జరిగే ఉత్పత్తిని ఎగుమతి చేయకుండా నిషేధం విధిస్తూ యూఎస్‌ఎఫ్‌డీఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే కంపెనీ ప్రతిష్టతో పాటు ఆదాయంపై కూడా గణనీయమైన ప్రభావం పడుతుంది. ప్రస్తుతం డాక్టర్ రెడ్డీస్‌కు వస్తున్న ఆదాయంలో 10 నుంచి 12 శాతం ఈ యూనిట్ల నుంచే వస్తున్నట్లు తెలుస్తోంది. గడచిన ఏడాది డాక్టర్ రెడ్డీస్ ఆదాయం రూ.10,000 కోట్ల మార్కును అధిగమించగా... ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలానికి ఆదాయం రూ.5,423 కోట్లుగా ఉంది.
 
ఆదాయంపై ప్రభావం లేదు..
కాగా ప్రస్తుతం జారీ చేసిన హెచ్చరిక లేఖ వల్ల కంపెనీ ఆదాయంపై ఎటువంటి ప్రభావం పడదని డాక్టర్ రెడ్డీస్ స్పష్టం చేసింది. వీటికి సమాధానమివ్వడానికి 15 రోజుల సమయం ఉందని, ఈ లోగా ఎఫ్‌డీఏ లేవనెత్తిన అభ్యంతరాలపై పూర్తిస్థాయిలో సమాధానం ఇస్తామని డాక్టర్ రెడ్డీస్ సీఈవో జి.వి.ప్రసాద్ తెలిపారు. తాము సమాధానం ఇచ్చిన తర్వాత యూఎస్ ఎఫ్‌డీఏ మూడు యూనిట్లనూ పరిశీలించి క్లీన్‌చిట్ ఇస్తుందని భావిస్తున్నట్లు కంపెనీ సీఎఫ్‌వో సౌమెన్ చక్రవర్తి పేర్కొన్నారు.
 
ఇన్వెస్టర్లలో ఆందోళన...
ఏకంగా మూడు యూనిట్లలోని నాణ్యతా ప్రమాణాలను హెచ్చరిస్తూ యూఎస్‌ఎఫ్‌డీఏ లేఖ రాయడంపై ఇన్వెస్టర్లు ఆందోళనకు గురయ్యారు. నవంబర్, 2014లోనే శ్రీకాకుళం యూని ట్‌లో పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలపై యూఎస్‌ఎఫ్‌డీఏ 483 కింద అభ్యంతరాలు లేవనెత్తింది. ఆ తర్వాత యూఎస్‌ఎఫ్‌డీఏ జనవరి, 2015లో మిర్యాలగూడ, ఫిబ్రవరిలో దువ్వాడ యూని ట్లను సందర్శించింది.

ఏడాది క్రితమే శ్రీకాకుళం యూనిట్లలో లేవనెత్తిన అబ్జర్వేషన్స్‌కు కంపెనీ తగురీతిలో సమాధానపరచకపోవటం... తాజాగా మరో రెండు యూనిట్లకు కూడా హెచ్చరికలు రావడంతో ఈ ఆందోళన మరింత తీవ్రమయ్యింది. దీంతో శుక్రవారం స్టాక్ ఎక్స్ఛేంజీల్లో డాక్టర్ రెడ్డీస్ షేర్లను ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున విక్రయించారు. కొనుగోళ్ల మద్దతు దొరక్కపోవటంతో షేరు ఒక్కరోజులోనే 15 శాతానికి పైగా నష్టపోయింది.

షేరు ధర రూ. 623 నష్టపోయి (15 శాతం) రూ.3,629 వద్ద ముగిసింది. ఈ నష్టంతో ఈ కంపెనీ షేర్ హోల్డర్ల సంపద ఒక్కరోజులోనే దాదాపు రూ.10వేల కోట్ల మేర హరించుకుపోయింది. ఈ వ్యవహారంపై కంపెనీ ఎంత త్వరగా స్పందిస్తుందో, తక్షణం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో... వాటిపైనే కంపెనీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ఏంజెల్ బ్రోకింగ్ ఫార్మా ఎనలిస్ట్ సరబ్జిత్ కౌర్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement