quality standards
-
నాణ్యతా నిబంధనల పరిధిలోకి మరిన్ని ఉత్పత్తులు
న్యూఢిల్లీ: దేశీయంగా మరిన్ని ఉత్పత్తులకు నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరి చేయనున్నట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. 2047 నాటికి భారత్ సంపన్న దేశంగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో దీనిపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు ఆయన చెప్పారు. భారతీయ ప్రమాణాల బ్యూరో (బీఐఎస్) 77వ వ్యవస్థాపక దినోత్సవంలో వర్చువల్‌గా పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ (క్యూసీవో) ద్వారా తప్పనిసరిగా పాటించాల్సిన నాణ్యతా ప్రమాణాల పరిధిలోకి మరిన్ని ఉత్పత్తులను తేవడం వల్ల వినియోగదారులకు ఆయా ఉత్పత్తులు, సర్వీసుల లభ్యత మెరుగుపడిందని మంత్రి చెప్పారు. ఇప్పటివరకు 672 ఉత్పత్తులతో 156 క్యూసీవోలు జారీ అయ్యాయని, రాబోయే రోజుల్లో 2,000–2,500 ఉత్పత్తులు క్యూసీవోల పరిధిలోకి చేరతాయని ఆయన పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వం .. బంగారు ఆభరణాల హాల్‌మార్కింగ్, ఆట»ొమ్మలకు నాణ్యతా ప్రమాణాలను నిర్దేశించడం మొదలైన చర్యలు తీసుకుందని మంత్రి చెప్పారు. భారత్ ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు, సంపన్న దేశంగా ఎదిగేందుకు ఉత్పత్తులు, సరీ్వసులపరంగా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు తోడ్పడగలవని ఆయన చెప్పారు. ఆ దిశగా నాణ్యతా ప్రమాణాలకు బీఐఎస్ ప్రచారకర్తగా మారాలని సూచించారు. సాధ్యమైనంత వరకు అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా బీఐఎస్ దేశీయంగా నాణ్యతా ప్రమాణాలను రూపొందించాలని గోయల్ చెప్పారు. లిఫ్టులు, ఎయిర్ ఫిల్టర్లు, వైద్య పరికరాలు మొదలైన ఉత్పత్తుల విషయంలో భారత్ ప్రపంచ స్థాయి ప్రమాణాలను నిర్దేశించడానికి అవకాశం ఉందని ఆయన తెలిపారు. -
పాదరక్షలకు నాణ్యతా ప్రమాణాలు
న్యూఢిల్లీ: పాదరక్షలకు నూతన నాణ్యతా ప్రమాణాలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. 24 పాదరక్షల ఉత్పత్తులకు సంబంధించి నిర్ధేశిత ప్రమాణాలను పెద్ద, మధ్యస్థాయి కంపెనీలు, దిగుమతిదారులు తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది. చైనా తదితర దేశాల నుంచి చౌకగా దేశంలోకి దిగుమతి అవుతున్న నాసిరకం పాదరక్షల ఉత్పత్తులకు కళ్లెం వేసేందుకు కేంద్ర సర్కారు నూతన నిబంధనలను తీసుకొచి్చంది. ఇక చిన్న స్థాయి ఫుట్‌వేర్ తయారీ సంస్థలకు కొంత సమయాన్ని ఇచి్చంది. ఇవి నూతన నాణ్యత ప్రమాణాలను 2024 జనవరి 1 నుంచి అనుసరించాల్సి ఉంటుంది. సూక్ష్మ సంస్థలు 2024 జూలై 1 నుంచి అమలు చేయాల్సి ఉంటుందని భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ తెలిపారు. గడువును మరింత పొడిగించే అవకాశం లేదని స్పష్టం చేశారు. నూతన నాణ్యత నియంత్రణ ప్రమాణాలు దేశీయంగా నాణ్యమైన పాదరక్షల తయారీకి వీలు కలి్పంచడంతోపాటు, నాణ్యత లేమి ఉత్పత్తుల దిగుమతులకు చెక్ పెడతాయని చెప్పారు. నిజానికి ఈ నూతన నాణ్యతా ప్రమాణాలను కేంద్ర సర్కారు 2020 అక్టోబర్‌లోనే నోటిఫై చేయడం గమనార్హం. కరోనా కారణంగా ఏర్పడిన అవరోధాల నేపథ్యంలో మూడు పర్యాయాలుగా గడువు పొడిగిస్తూ వచ్చారు. జాబితాలో ఉన్నవి.. తోలు, పీవీసీ, రబ్బర్‌లో ఎలాంటి మెటీరియల్ వినియోగించాలి? సోల్స్, హీల్స్ కోసం ఏవి వినియోగించాలనేది ప్రమాణాల్లో పేర్కొన్నారు. రబ్బర్ గమ్ బూట్స్, పీవీసీ శాండల్స్, రబ్బర్ హవాయి చెప్పల్స్, స్లిప్పర్స్, మౌల్డెడ్ ప్లాస్టిక్ ఫుట్‌వేర్, స్కావెంజింగ్ పనుల కోసం వినియోగించే పాదరక్షలు, క్రీడా పాదరక్షలు, డెర్బీ బూట్లు, అల్లర్ల నిరోధక బూట్లు, మౌల్డెడ్ సాలిడ్ రబ్బర్ సోల్స్, హీల్స్ ఈ జాబితాలో ఉన్నాయి. మొత్తం 54 పాదరక్షల ఉత్పత్తుల్లో నాణ్యత ప్రమాణాల పరిధిలోకి 27 ఉత్పత్తులు, మెటీరియల్‌ను తీసుకొచ్చారు. -
కల్తీ చేస్తే జైలు‘పాలు’.. ఏపీలో కీలక చట్టం.. త్వరలో అమలు
సాక్షి, అమరావతి: పాల సేకరణ, విక్రయాల సందర్భంగా కల్తీలు, మోసాలకు పాల్పడితే డెయిరీల నిర్వాహకులు, సంబంధిత వ్యాపారులు ఇకపై కటకటాల ఊచలు లెక్క పెట్టాల్సిందే. ఈ తరహా మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు దేశంలో మరెక్కడా లేనివిధంగా పాల సేకరణ (రైతు రక్షణ), నాణ్యమైన పాల వినియోగ చట్టం–2023ను రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అమలులోకి తీసుకురాబోతోంది. ఇటీవలే అసెంబ్లీ ఆమోదం పొందిన ఈ చట్టం అమలుకు సంబంధించి ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) రూపకల్పన కోసం పశు సంవర్థక శాఖ కసరత్తు చేస్తోంది. గతంలోనూ చట్టాలున్నా.. గతంలో తూనికలు, కొలతలు శాఖ, మునిసిపాలిటీల ఆధ్వర్యంలోని ప్రజారోగ్య విభాగాలు మాత్రమే పాల విక్రయాల్లో జరిగే లోపాలపై అడపాదడపా దృష్టి సారించేవి. ఆ రెండు విభాగాలకూ ఇతర పనులు సైతం ఉండటంతో పాల విక్రయాలపై పెద్దగా దృష్టి సారించేవి కాదు. దీనివల్ల యథేచ్ఛగా అక్రమాలు సాగిపోయేవి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం పశు సంవర్థక శాఖ అధికారులను సైతం రంగంలోకి దించింది. పాల సేకరణ సందర్భంగా మిల్క్ అనలైజర్స్, వేయింగ్ మెషిన్స్ను డెయిరీల నిర్వాహకులు అనుకూలంగా మార్చుకుని అక్రమాలకు పాల్పడుతుండటంతో తూనికలు, కొలతల చట్టం ప్రకారం వాటిని తనిఖీ చేసే అధికారాలను 2021 నవంబర్ నుంచి ప్రభుత్వం పశు వైద్యులకు అప్పగించింది. దీంతో రంగంలోకి దిగిన పశు వైద్య బృందాలు ఏడాదిన్నర కాలంలో 3,704 దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశాయి. 151 ఉల్లంఘనలపై జరిమానాలు విధించడం ద్వారా అక్రమాలకు కొంతమేర అడ్డుకట్ట వేయగలిగారు. అయితే, మోసాలకు కారణమైన అనలైజర్స్, ఇతర పరికరాలను సీజ్ చేయడం, ఇందుకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం పశు సంవర్థక శాఖకు లేకుండాపోయింది. అక్రమాలకు చెక్ పెట్టేలా కొత్త చట్టం ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ తరహా మోసాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నియమ, నిబంధనలన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకు రావాలన్న సంకల్పంతో పాల సేకరణ (రైతు రక్షణ), నాణ్యమైన పాల వినియోగం చట్టం–2023ను తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం మిల్క్ అనలైజర్స్తో పాటు పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు (బీఎంసీయూ), ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్ల (ఏఎంసీయూ)పై పశు సంవర్థక శాఖ పర్యవేక్షణలోకి తీసుకొచ్చారు. ఇందుకోసం మిల్క్ ఇన్స్పెక్టర్లు, ఇతర అధికారులను పశు సంవర్థక శాఖ నియమిస్తుంది. మిల్క్ అనలైజర్స్ నిర్వహించే వ్యక్తులు కచ్చితంగా పశు సంవర్థక శాఖ నుంచి లైసెన్సులు తీసుకోవాల్సి ఉంటుంది. నాణ్యత ప్రమాణాలు పాటించని మిల్క్ అనలైజర్స్‌ను జప్తు చేస్తారు. పాల నాణ్యత పాటించకపోతే ఫుడ్ సేఫ్టీ, నాణ్యత ప్రమాణాల యాక్టు 2006 ప్రకారం చర్యలు తీసుకుంటారు. మోసాలకు పాల్పడితే జరిమానాలు, శిక్షలు ఇలా.. ♦ అనుమతి లేకుండా మిల్క్ అనలైజర్స్ కలిగిన వ్యక్తికి రూ.50 వేల వరకు జరిమానా, 6 నెలల జైలుశిక్ష విధిస్తారు. అనుమతి లేకుండా బీఎంసీయూలు, ఏఎంసీయూలు అనలైజర్స్ వాడితే రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు. రెండోసారి నేరానికి ఏడాదిపాటు కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. ♦ మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్, డెయిరీలు మిల్క్ అనలైజర్లను అనధికారికంగా, అనుమతి లేకుండా పొంది ఉంటే రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తారు. తదుపరి నేరానికి రెండేళ్ల కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. ♦ మిల్క్ అనలైజర్లను దుర్వినియోగపరిచే వారికి రూ.50 వేల వరకు జరిమానా, 6 నెలలకు తగ్గకుండా జైలుశిక్ష విధిస్తారు. నేర తీవ్రతను బట్టి ఐదేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంది. ♦ లైసెన్స్ లేకుండా పాలను సేకరిస్తే రూ.50 వేల వరకు జరిమానా విధిస్తారు. రెండోసారి నేరానికి రూ.లక్ష వరకు జరిమానా, 6 నెలల కారాగార శిక్ష లేదా రెండూ విధిస్తారు. ♦ లైసెన్సు లేకుండా మిల్క్ అనలైజర్ల సర్వీసింగ్ సెంటర్లు నిర్వహించే వారికి రూ.25 వేల జరిమానా విధిస్తారు. రెండోసారి నేరానికి పాల్పడితే రూ.50 వేల వరకు జరిమానా లేదా ఏడాది కారాగార శిక్ష విధిస్తారు. ఒక్కోసారి రెండూ విధించే అవకాశం ఉంది. ♦ పాడి రైతుకు నిర్దేశిత ధర చెల్లించకపోయినా.. ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ శాతాలను తక్కువగా చూపించి మోసానికి పాల్పడినా రూ.50 వేల వరకు జరిమానా విధిస్తారు. రెండోసారి నేరానికి రూ.లక్ష జరిమానా లేదా 6 నెలల కారాగార శిక్ష లేదా రెండూ విధిస్తారు. రైతులు, వినియోగదారుల రక్షణ కోసమే.. పాల సేకరణలో దళారులు, వ్యాపారులు పాల్పడే మోసాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన పాలను సరఫరా చేయడమే లక్ష్యంగా దేశంలో మరెక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం పాడి రైతులకు పూర్తి రక్షణ కల్పిస్తుంది. – సీదిరి అప్పలరాజు, పశు సంవర్థక శాఖ మంత్రి -
సర్వీసుల నాణ్యత తక్షణం మెరుగుపర్చండి
న్యూఢిల్లీ: టెలికం సేవల నాణ్యతను మెరుగుపర్చేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆపరేట్లను టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ ఆదేశించింది. అలాగే కాల్ అంతరాయాలు, అవుటేజ్ డేటాను రాష్ట్ర స్థాయిలో కూడా వెల్లడించాలని సూచించింది. ప్రస్తుతం లైసెన్స్ ఏరియా ప్రాతిపదికగా ఈ వివరాలను ఆపరేటర్లు ఇస్తున్నారు. టెల్కోలతో సమావేశం సందర్భంగా ట్రాయ్ చైర్మన్ పీడీ వాఘేలా ఈ విషయాలు తెలిపారు. అనధికారిక టెలీమార్కెటర్లు 10 అంకెల మొబైల్ నంబర్లతో పంపించే అవాంఛిత ప్రమోషనల్ కాల్స్, సందేశాలను గుర్తించేందుకు .. బ్లాక్ చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ సాధనాన్ని ఉపయోగించాలని టెల్కోలకు సూచించినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం వొడాఫోన్ ఐడియా ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్న ఈ సాధనం వచ్చే రెండు నెలల్లో మొత్తం పరిశ్రమ అమలు చేసే అవకాశం ఉంది. దీనితో అవాంఛిత ప్రమోషనల్ కాల్స్, మెసేజీల బెడద తగ్గుతుందని వాఘేలా చెప్పారు. రాబోయే రోజుల్లో నాణ్యతా ప్రమాణాల నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే చర్చాపత్రాన్ని విడుదల చేయనున్నట్లు వివరించారు. అలాగే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మొదలైనవి అనవసర హెడర్లు, మెసేజీ టెంప్లేట్లను తొలగించేలా చర్యలు తీసుకునేందుకు ఆయా రంగాల నియంత్రణ సంస్థలు, ప్రభుత్వ శాఖలు మొదలైన వాటిని కోరనున్నట్లు వాఘేలా చెప్పారు. -
యూఎస్బీ టైప్–సీ చార్జింగ్ పోర్ట్‌కు బీఐఎస్ ప్రమాణాలు
న్యూఢిల్లీ: యూఎస్బీ టైప్–సీ చార్జింగ్ పోర్ట్ నాణ్యత ప్రమాణాలను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ప్రకటించింది. మొబైల్స్‌కు, ధరించగలిగే ఎలక్ట్రానిక్స్ కోసం రెండు ఒకే తరహా (కామన్) ఛార్జింగ్ పోర్ట్‌లను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్న సంగతి తెలిసిందే. వినియోగదారుల ప్రయోజనాలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించేందుకు పరిశ్రమ వాటాదారులతో సంప్రదింపులు జరిపిన డిపార్ట్మెంట్ ఆఫ్ కంజ్యూమర్ అఫైర్స్ రెండు రకాల సాధారణ ఛార్జింగ్ పోర్ట్‌లను తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. వీటిలో మొబైల్స్, స్మార్ట్‌ఫోన్స్, టాబ్లెట్ పీసీల కోసం యూఎస్బీ టైప్–సీ ఛార్జర్ ఒకటి కాగా, మరొకటి వేరబుల్ ఎలక్ట్రానిక్ పరికరాల కోసం ఇతర సాధారణ ఛార్జర్ ఉన్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)–కాన్పూర్ స్మార్ట్ వాచెస్ వంటి ధరించగలిగే ఎలక్ట్రానిక్ పరికరాల కోసం సింగిల్ ఛార్జింగ్ పోర్ట్‌ను అధ్యయనం చేస్తోంది. ఐఐటీ కాన్పూర్ నుంచి నివేదిక వచ్చిన తర్వాత పరిశ్రమతో ఈ విషయమై ప్రభుత్వం చర్చించనుంది. -
2047 నాటికి సంపన్న దేశంగా భారత్,‘బ్రాండ్ ఇండియా’నే లక్క్ష్యంగా
న్యూఢిల్లీ: అత్యుత్తమ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తులు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని పరిశ్రమకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియుష్ గోయల్ సూచించారు. తద్వారా 2047 నాటికి భారత్ సంపన్న దేశంగా ఎదిగేలా ’బ్రాండ్ ఇండియా’ను నిర్మించడంలో తోడ్పడాలని పేర్కొన్నారు. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ)కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. నాణ్యతా ప్రమాణాలకు సంబంధించిన వివిధ నియంత్రణ సంస్థలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తేవడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు, మరింత మంది మహిళలు చార్టర్డ్ అకౌంటెన్సీ ప్రొఫెషన్‌ను ఎంచుకోవాలని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గోయల్ సూచించారు. అంతర్జాతీయ స్థాయి కంపెనీలతో పోటీపడేలా భారతీయ సీఏ సంస్థలను తీర్చిదిద్దేందుకు ఐసీఏఐ కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. -
ఢిల్లీకి మళ్లీ కాలుష్యం కాటు
సాక్షి, న్యూఢిల్లీ: వాయు కాలుష్యం దుప్పట్లో దేశ రాజధాని ఢిల్లీ ముసుగేసుకుంది. గాలిలో నాణ్యతా ప్రమాణాలు ప్రమాదకరమైన స్థితికి దిగజారి పోయాయి. గురువారం రాత్రికి రాత్రే వాయు కాలుష్య సూచి 50 పాయింట్లు పెరిగిపోయి 459కి చేరుకుంది. శుక్రవారం రికార్డు స్థాయిలో 599కి చేరుకోవడంతో ఢిల్లీలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకంలో ఏర్పడిన పర్యావరణ కాలుష్య నివారణ, నియంత్రణ మండలి (ఈపీసీఏ) వాయు కాలుష్య సూచీ అత్యంత తీవ్రమైన స్థితికి చేరుకుందని వెల్లడించింది. గత ఏడాది జనవరి తర్వాత గాలిలో నాణ్యతా ప్రమాణాలు ఈ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. పొరుగు రాష్ట్రాల్లో పంటల వ్యర్థాలను కాల్చడం, దీపావళి పండుగ సమయంలో బాణాసంచా పేలుళ్లు, పరిశ్రమలు, వాహన కాలుష్యాలతో రాజధాని ఒక గ్యాస్ చాంబర్‌లా మారిపోయింది. దీంతో ఢిల్లీ పీసీఏ, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పలు చర్యలు ప్రకటించారు. అందులో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి కూడా ఉంది. ఢిల్లీలో వాయు నాణ్యతను పర్యవేక్షించే 37 స్టేషన్లలో శుక్రవారం తెల్లవారుజాము సమయానికి ప్రమాదకరమైన సూచికలే కనిపించాయి. పొరుగు రాష్ట్రాలదే బాధ్యత: కేజ్రీవాల్ పంజాబ్, హరియాణాలో పంట వ్యర్థాల్ని ఇష్టారాజ్యంగా కాల్చడం వల్లే ఢిల్లీ గ్యాస్ చాంబర్‌లా మారిపోయిందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మండిపడ్డారు. కాలుష్యం తీవ్రతరం కావడంతో పాఠశాలల పిల్లలకు మాస్క్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాలుష్య నివారణకు చర్యలు తీసుకునేలా మా ఆరోగ్యం గురించి కూడా ఆలోచించండి అంకుల్ అంటూ హరియాణా సీఎంలు అమరీందర్ సింగ్, మనోహర్‌లాల్ ఖట్టర్‌లను ఉద్దేశించి పిల్లలంతా లేఖలు రాయాలని సూచించారు. ఢిల్లీ ప్రభుత్వం మొత్తంగా 50 లక్షల మాస్క్‌లను పంపిణీ చేస్తోంది. మాస్క్ లేకుండా బయటకు రావద్దని రాజధాని వాసులను సీఎం కోరారు. ఢిల్లీలో గాలి నాణ్యతా సూచీ (కాలుష్యం) పాయింట్లు ఎంత ఎక్కువగా ఉన్నాయో చెప్తూ జర్నలిస్ట్ విక్రమ్ చంద్ర ట్వీట్ చేసిన ఫొటో ఇది. -
నిబంధనలకు పాతర.. అవినీతి జాతర
సాక్షి, రేపల్లె (గుంటూరు) : నీకింత.. నాకంత.. అంటూ అభివృద్ధి పనుల మాటున ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పంచుకున్నారు. అడిగేది, అడ్డుకునేది ఎవరు అంటూ రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో అధికారులు, కాంట్రాక్టర్లు నాసిరకంగా పనులు పూర్తిచేసి నిధులు మిగుల్చుకున్నారు. ఆ తరువాత వాటాలేసుకుని ఆ నిధులను స్వాహా చేశారు. నిర్మించిన నెలల వ్యవధిలోనే రోడ్లు, డ్రెయిన్లు ధ్వంసం కావడంతో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. అవినీతి గుట్టును రట్టుచేశారు. పట్టణంలో గత ఏడాది ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు సుమారు రూ.22 కోట్లతో సీసీ రోడ్లు, డ్రెయిన్లు నిర్మించారు. నెలలు గడవకముందే రోడ్లు గుంతల మయంగా మారడం, డ్రెయిన్లు కుప్పకూలడంతో పట్టణ ప్రజలు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ అధికారులు విచారణలో అవినీతి గుట్టు రట్టుయింది. పనుల నాణ్యతను తనిఖీచేసి నిర్ధారించాల్సిన థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి అక్రమార్కులకు అండగా నిలిచారని నిగ్గుతేల్చారు.పనులు చేపట్టిన కాంట్రాక్టు సంస్థను ఉన్నతాధికారులు బ్లాక్ లిస్ట్‌లో, పెట్టి సంబంధిత మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులపై చర్యలకు సిఫారసు చేసినట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఎమ్మెల్యే అనగాని ఆధ్వర్యంలోనే.. రేపల్లె పట్టణంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో చేపట్టిన పనుల్లో నాణ్యత లేకపోవడం వెనుక స్థానిక ఎమ్మెల్యే అనగాని ఉన్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన అండతో పనులను చేపట్టిన కాంట్రాక్టు సంస్థ పనులను నాసిరకంగా పూర్తిచేసింది. నిర్మించి నెలలు కూడా గడవకముందే రోడ్లు గోతులమయంగా మారడం, డ్రెయిన్లు కుప్పకూలడం ఈ పనుల్లో అవి నీతిని పట్టిచూపుతున్నాయి. ఎమ్మెల్యే, కాంట్రాక్టర్, అధికారులు నిధులను పంచుకుని పనులు నాసిరకంగా చేయడం వల్లే రోడ్లు ధ్వంసం అయ్యాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే అనగాని పాత్ర ఉందన్నది బహిరంగ రహస్యమని పట్టణ ప్రజలు విర్శి స్తున్నారు. కల్వర్టుల్లో నిధుల స్వాహా నిజాంపట్నం మండలం అడవులదీవి – కొత్తపాలెం రహదారి 5 కిలో మీటర్లు, మంత్రిపాలెం – అడవులదీవి రహదారి 3 కిలోమీటర్ల మేర విస్తరించారు. ఈ పనులను రూ.10 కోట్లతో నిర్వహించారు. అడవులదీవి – కొత్తపాలెం రోడ్డు నిర్మాణంలో తూములలో 8 కల్వర్టులు, ఒక చోట శ్లాబ్ కల్వర్టు నిర్మించాల్సి ఉంది. అయితే శ్లాబ్ కల్వర్టు స్థానంలో తూములతో సరిపెట్టారు. మిగిలిన కల్వర్టుల నిర్మాణంలో నాణ్యతను గాలికి వదిలేశారు. రోడ్డు మధ్యలో కొత్త తూములు వేసి కల్వర్టులు నిర్మించాలన్నది నిబంధన. అయితే పాత తూములనే వినియోగించి కల్వర్టుల నిర్మాణం పూర్తిచేసి, నిధులు మిగుల్చుకుని పంచుకున్నారు. ఈ రోడ్ల విస్తరణ పనుల్లో స్థానిక ప్రజల వినతులను సైతం పట్టించుకోలేదు. అధికార వర్గాల్లో గుబులు 2014 ఎన్నికల అనంతరం టీడీపీ అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కాంట్రాక్టర్ల నుంచి భారీ స్థాయిలో కమీషన్లు దండుకుని అభివృద్ధి పనుల్లో తీవ్ర అవినీతికి తావిచ్చారు. అదేమని కాంట్రాక్టర్లను ప్రశ్నించే పరిస్థితి అధికారులకు లేకుండా వారిపై ఒత్తిడితెచ్చారు. ఐదేళ్లు పూర్తికావడంతో ఉన్నతాధికారులు విచారణ నిర్వహిస్తూ తమపై చర్యలకు సిఫారసులు చేస్తుంటే తనకు సంబంధం లేదన్నట్లుగా ఎమ్మెల్యే అనగాని వ్యవహరిస్తున్నాడని పలువురు అధికారులు వాపోతున్నారు. నిర్మాణంలోనే కూలిన శ్లాబ్ గూడవల్లి ఐటీఐ కళాశాల నూతన భవన నిర్మాణ సమయంలో కుప్పకూలిన శ్లాబ్ చెరుకుపల్లి–నగరం, నగరం–రేపల్లె అభివృద్ధి పనుల్లోనూ అవినీతి పొంగిపొర్లింది. ఈ రోడ్లు కూడా నిర్మించిన నెలల వ్యవధిలోనే గోతులమయంగా మారాయి. ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌కు బినామీగా వ్యవహరిస్తున్న మండల పరిషత్ ఉపాధ్యక్షుడు కాంట్రాక్టర్ అవతారమెత్తి ఈ రోడ్ల నిర్మాణ పనులు దక్కించుకుని నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారు. గూడవల్లి ఐటీఐ కళాశాల నూతన భవన నిర్మాణ పనులను దక్కించుకున్న మండల పరిషత్ ఉపాధ్యక్షుడు శ్లాబ్ వేసిన గంటల వ్యవధిలో కూలిపోంది. దీనిని బట్టే నాణ్యతా ప్రమాణాలు ఏ స్థాయిలో పాటించారో అర్థంచేసుకోవచ్చు. -
ఇక ‘జైవిక్ భారత్’
సేంద్రియ (ఆర్గానిక్) వ్యవసాయోత్పత్తుల మార్కెట్‌ను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా క్రమబద్ధీకరించే ప్రక్రియకు తొలి అడుగు పడింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని భారతీయ ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ(ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ.) ఏడాది క్రితం ప్రకటించిన నిబంధనావళి ఈ నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. 2017 డిసెంబర్ 29న గజెట్లో ప్రకటితమైన ఈ నియమావళి.. ఈ ఏడాది జూలై నుంచి చట్టబద్ధంగా అమల్లోకి వచ్చింది. నిబంధనలు పాటించడంలో విఫలమైన సేంద్రియ ఉత్పత్తుల వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవడానికి చట్టం అవకాశం కల్పిస్తోంది. కఠినమైన సర్టిఫికేషన్ నిబంధనల కారణంగా సేంద్రియ ఉత్పత్తుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. సేంద్రియ వ్యవసాయం, సేంద్రియ ఉత్పత్తుల మార్కెటింగ్‌లో దీర్ఘకాలంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలోని రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతున్నాయి. సేంద్రియ మార్కెట్ వర్గాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న అంశాలపై ‘సాగుబడి’ ఫోకస్.. మన దేశంలో రైతులు అనాదిగా సేంద్రియ వ్యవసాయ పద్ధతులనే అనుసరిస్తున్నారు. హరిత విప్లవం పేరిట రసాయనిక వ్యవసాయాన్ని ప్రభుత్వం వ్యాప్తిలోకి తెచ్చిన తర్వాత.. ఇప్పటికీ చాలా మంది రైతులు సేంద్రియ వ్యవసాయ పద్ధతులనే అనుసరిస్తున్నారు. అయితే, వీరంతా అసంఘటితంగానే ఎవరికి వారు అనువంశిక సేంద్రియ సేద్యాన్ని ఒక జీవన విధానంగా, అవిచ్ఛిన్న వ్యవసాయక సంస్కృతిగా కొనసాగిస్తున్నారు. ఈ దశలో కొన్ని ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలు చిన్న, సన్నకారు రైతులతో ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేసి సేంద్రియ వ్యవసాయాన్ని చేయిస్తున్నాయి. సేంద్రియ వ్యవసాయ సర్టిఫికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి. రైతులే స్వచ్ఛందంగా తమకు తామే పరస్పరం తనిఖీలు చేసుకుంటూ.. సేంద్రియ సర్టిఫికేషన్ ఇచ్చుకునే వ్యవస్థను ‘పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టం (పీజీఎస్) ఆర్గానిక్ కౌన్సిల్’ పేరిట 2011లో ఏర్పాటు చేశాయి. ఇందులో ప్రభుత్వ ప్రమేయం లేదు. ఈ నేపథ్యంలో ఏటా 20–25% విస్తరిస్తున్న సేంద్రియ వ్యవసాయాన్ని క్రమబద్దీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుము బిగించింది. కేంద్ర వ్యవసాయ శాఖ ‘పి.జి.ఎస్. ఇండియా’ సంస్థను ఏర్పాటు చేసింది. దేశంలో హోల్‌సేల్/రిటైల్ మార్కెట్లో ప్యాక్ చేసి వ్యాపారులు అమ్మే సేంద్రియ వ్యవసాయోత్పత్తులకు విధిగా ప్యాకింగ్, లేబెలింగ్ నిబంధనలు వర్తింపజేయడానికి రంగం సిద్ధమైంది. పిజిఎస్ ఇండియా అనేది కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖకు చెందిన జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం(ఎన్.సి.ఓ.ఎఫ్.), ఘజియాబాద్‌కు అనుబంధంగా పనిచేస్తున్న సేంద్రియ ధ్రువీకరణ వ్యవస్థ. వార్షిక టర్నోవర్ రూ. 12 లక్షల కన్నా తక్కువగా ఉండే రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు లేబిలింగ్ నిబంధనల నుంచి మినహాయింపు ఉంది. అయితే, అంతకుమించి వ్యాపారం చేసే రైతు కంపెనీలకు ప్యాకింగ్, లేబిలింగ్ ఖర్చు కిలోకు రూ. 10ల మేరకు పెరుగుతుందని చెబుతున్నారు. దీంతో, సేంద్రియ ఉత్పత్తుల ధరలు ఆ మేరకు పెరిగే అవకాశం కనిపిస్తోంది. పీజీఎస్ ఆర్గానిక్ కౌన్సిల్ అస్తిత్వానికి ముప్పు! ప్రభుత్వ హయాంలో ‘పిజిఎస్ ఇండియా’ ఏర్పాటు కావడంతో.. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో చాలా ఏళ్లుగా నడుస్తున్న ‘పీజిఎస్ ఆర్గానిక్ కౌన్సిల్’కు అస్తిత్వ సమస్య ఏర్పడింది. సేంద్రియ ఉత్పత్తులపై జూలై 1 నుంచి ‘జైవిక్ భారత్’ లోగోను విధిగా ముద్రించాలని, సేంద్రియ నాణ్యతా ప్రమాణాలకు చట్టబద్ధంగా కట్టుబడి ఉండాలని ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్. ఎస్. ఎస్.ఎ.ఐ.) నిర్దేశించిన నేపథ్యంలో ‘పీజీఎస్ ఆర్గానిక్ కౌన్సిల్’ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనాదిగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్న చిన్న, సన్నకారు రైతులను కూడగట్టి కొన్ని స్వచ్ఛంద సంస్థలు ప్రారంభించిన నెట్వర్క్. డెక్కన్ డవలప్మెంట్ సొసైటీ(పస్తాపూర్, సంగారెడ్డి జిల్లా), టింబక్టు కలెక్టివ్(చెన్నేకొత్తపల్తి, అనంతపురం జిల్లా) వంటి సంస్థలు ‘పీజీఎస్ ఆర్గానిక్ కౌన్సిల్’ను ఏర్పాటు చేసి నిర్వహించడంలో కీలకపాత్రను పోషిస్తున్నాయి. ‘పీజీఎస్ ఇండియా’ను సమాంతర ప్రభుత్వ వ్యవస్థగా ఏర్పాటు చేసినప్పటికీ.. సేంద్రియ రైతుల హక్కులను పరిరక్షిస్తున్న ‘పీజిఎస్ ఆర్గానిక్ కౌన్సిల్’కున్న గుర్తింపు రద్దు చేయవద్దని డీడీఎస్ వంటి స్వచ్ఛంద సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి. అయితే, దీనిలో సభ్యులైన సేంద్రియ రైతులు కూడా ‘పిజిఎస్ ఇండియా’లో సభ్యులుగా చేరడం ద్వారా ఖర్చు లేకుండానే ప్రభుత్వ వ్యవస్థ పరిధిలోకి రావచ్చని ఎన్.సి.ఓ.ఎఫ్. చెబుతోంది. రూ. 12 లక్షల టర్నోవర్ వరకు మినహాయింపు! సేంద్రియ ఉత్పత్తులను దళారులు లేకుండా నేరుగా వినియోగదారులకు అమ్మే సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారులకు, రూ. 12 లక్షల కన్నా తక్కువ టర్నోవర్ ఉండే రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, రైతుల సహకార సంఘాలకు మాత్రం లేబిలింగ్ నిబంధనలు వర్తించవు. అయితే, వీరి వద్ద నుంచి కొని విక్రయించే రిటైల్ దుకాణదారులు, సూపర్ మార్కెట్ వ్యాపారులు(ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు) మాత్రం ఈ నియమావళిని విధిగా పాటించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు పాటించిన వ్యాపారుల లైసెన్సులు రద్దు చేయడానికి, శిక్ష విధించడానికి కూడా అవకాశాలున్నాయి. కాబట్టి, వీరి ఉత్పత్తులను రిటైల్ డీలర్ల నుంచి కొనుగోలు చేసే సేంద్రియ ఆహార వినియోగదారులపై భారం మరింత పడనుంది. సేంద్రియ ఆహారోత్పత్తులను దేశంలో అమ్మకానికి ‘పీజిఎస్ ఇండియా’ సర్టిఫికేషన్ పొందితే చాలు. స్థానిక వ్యవసాయ అధికారుల ద్వారా, రీజినల్ కౌన్సిళ్ల ద్వారా రైతులు పీజీఎస్ ఇండియా సర్టిఫికేషన్ పొందే వీలుంది. అయితే, విదేశాలకు ఎగుమతి అయ్యే సేంద్రియ ఆహారోత్పత్తులకు జాతీయ సేంద్రియ ఉత్పత్తి కార్యక్రమం (ఎన్.పి.ఓ.పి.) నిబంధనల ప్రకారం థర్డ్ పార్టీ సేంద్రియ ధ్రువీకరణ పత్రం పొందాల్సి ఉంటుంది. ఇప్పుడు దేశీయంగా అమ్మే సేంద్రియ ఉత్పత్తులకు కూడా కంపెనీలు ఎన్.పి.ఓ.పి. ధ్రువీకరణ పొందవచ్చు. ఎన్.పి.ఓ.పి. ధ్రువీకరణ వ్యవస్థ 2001 నుంచి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖకు అనుబంధంగా.. ‘అపెడా’ ఆధ్వర్యంలో పనిచేస్తున్నది. అయితే, ఈ సర్టిఫికేషన్ ప్రక్రియ క్లిష్టమైనది. అంతేకాక, అత్యంత ఖరీదైనది. సేంద్రియ ఆహారోత్పత్తులను వినియోగదారులకు నేరుగా అమ్మే చిన్న, సన్నకారు రైతులు లేదా ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్.పి.ఓ.లు) ఎటువంటి ధ్రువీకరణనూ విధిగా పొందాలన్న నిబంధనేదీ లేదు. ఎన్.పి.ఓ.పి./ పి.జి.ఎస్. ఇండియా సర్టిఫికేషన్ వ్యవస్థలు అందుబాటులోకి వచ్చి అనేక ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఐచ్ఛికంగానే ఉన్నాయి. అయితే, ‘జూలై నుంచి సేంద్రియ ఆహారోత్పత్తులను అమ్మే ఏ కంపెనీ అయినా ఇప్పుడు మేం ప్రకటించిన ప్రమాణాలను విధిగా పాటించకపోతే ప్రాసిక్యూట్ చేస్తాం’ అని ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ. హెచ్చరిస్తోంది. కొత్త నియమావళి ప్రకారం.. మన దేశంలోని దుకాణాల్లో/ షాపింగ్ మాల్స్‌లో అమ్మకానికి పెట్టే సేంద్రియ ఉత్పత్తులేవైనా సరే విధిగా అందుబాటులో ఉన్న రెండు ధ్రువీకరణ వ్యవస్థల్లో (ఎన్.పి.ఓ.పి./ పి.జి.ఎస్. ఇండియా) ఏదో ఒక దాని నుంచి ధ్రువీకరణ పొందాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా సేంద్రియ ఆహారోత్పత్తి, అమ్మకం, పంపిణీలతోపాటు విదేశాల నుంచి సేంద్రియ ఆహారోత్పత్తుల దిగుమతికి కూడా ఈ నియమావళి వర్తిస్తుంది. సేంద్రియ ఆహారోత్పత్తుల ప్యాకెట్లపై ఆయా ఉత్పత్తుల సేంద్రియ స్థితిగతులకు సంబంధించి పూర్తి వివరాలను పొందుపరచాలి. ఎన్.పి.ఓ.పి. ప్రకారం థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ లోగో లేదా పి.జి.ఎస్. ఇండియా ధ్రువీకరణ లోగోలలో ఏదో ఒకదానితో పాటుగా.. ‘జైవిక్ భారత్’ లోగోను కూడా తప్పనిసరిగా ముద్రించాలని సరికొత్త నిబంధనావళి నిర్దేశిస్తోంది. అయితే, వివిధ వర్గాల విజ్ఞప్తి మేరకు జైవిక్ భారత్ లోగోను సేంద్రియ ఉత్పత్తుల ప్యాకెట్‌పై నాన్–డిటాచబుల్ స్టిక్కర్ రూపంలో విధిగా ముద్రించాలన్న నిబంధనకు వచ్చే సెప్టెంబర్ 30 వరకు సడలింపు ఇచ్చినట్టు ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ. తాజాగా ప్రకటించింది. జైవిక్ భారత్ లోగోకు సంబంధించిన పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. టర్నోవర్ పరిమితి పెంచాలి! సేంద్రియ ఉత్పత్తుల మార్కెట్ క్రమబద్ధీ్దకరణకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సహజాహారం రైతు ఉత్పత్తిదారుల కంపెనీ తరఫున మేం స్వాగతిస్తున్నాం. చిన్న, సన్నకారు రైతులందరూ పీజీఎస్ ఇండియా సర్టిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేయాలి. రైతులు మరో 2, 3 ఏళ్ల పాటు గడువు అవసరం ఉంది. రైతు ఉత్పత్తిదారుల కంపెనీలకు రూ. 12 లక్షల టర్నోవర్ వరకు నిబంధనల నుంచి మినహాయింపు ఇస్తున్నారు. ఈ పరిమితిని రూ. కోట్లకు పెంచాలి. ఇప్పుడిప్పుడే వేళ్లూనుకుంటున్న రైతుల కంపెనీలకు ప్రభుత్వ తోడ్పాటు మరికొంత కాలం ప్రోత్సాహం అవసరం. తాజా నిబంధనల వల్ల ప్యాకింగ్ ఖర్చు కిలోకు రూ. 10 మేరకు పెరుగుతుంది. దీని వల్ల చిన్న రిటైలర్లు దెబ్బతింటారు. ఒకే ఊళ్లో ఒకటో, రెండో దుకాణాలు పెట్టుకొని సేంద్రియ ఉత్పత్తులను అమ్మే రిటైలర్లకు రూ. 50 లక్షల టర్నోవర్ వరకు మినహాయింపు ఇవ్వాలి. లేబుల్ ముద్రించే బాధ్యత కేవలం సేంద్రియ రైతులకే పరిమితం చేయకూడదు. రసాయనిక ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులు వాడే రైతుల ఉత్పత్తులపై కూడా ‘ఇవి రసాయనాలు వాడి పండించినవి’ అని లేబుల్ వేసేలా నిబంధనలు పెట్టాలి. అప్పుడు ప్రజల్లోనూ సేంద్రియ ఉత్పత్తులపై చైతన్యం ఇనుమడిస్తుంది. – డా. జీ వీ రామాంజనేయులు (90006 99702), సహజాహారం రైతు ఉత్పత్తిదారుల కంపెనీ, సికింద్రాబాద్ రైతుల హక్కును లాక్కోవద్దు! జీవవైవిధ్య సేంద్రియ వ్యవసాయాన్ని జీవన విధానంగా అనుసరిస్తున్న చిన్న, సన్నకారు రైతులే కలసి దేశవ్యాప్తంగా 21 స్వచ్ఛంద సంస్థల నేతృత్వంలో ‘పీజీఎస్ ఆర్గానిక్ కౌన్సిల్’ను పదేళ్ల క్రితం ఏర్పాటు చేసుకొని స్వతంత్రంగా నిర్వహించుకుంటున్నారు. 14 రాష్ట్రాల్లో కనీసం 10 వేల మంది రైతులు సేంద్రియ సర్టిఫికేషన్ సదుపాయం ఖర్చులేకుండా పొందారు. ఇప్పుడు ప్రభుత్వం ‘పీజీఎస్ ఇండియా’ను ఏర్పాటు చేసి సర్టిఫికేషన్ హక్కును లాగేసుకోవటం అన్యాయం. ప్రజాస్వామిక స్ఫూర్తికి విరుద్ధం. ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను పెట్టుకోవచ్చు. మేం ప్రమాణాలు పాటించకపోతే కేసులు పెట్టి జైలులో పెట్టండి. అంతే కానీ సేంద్రియ సర్టిఫికేషన్ ఇచ్చే హక్కును మాత్రం పీజీఎస్ ఆర్గానిక్ కౌన్సిల్ నుంచి లాగేసుకోవటం సమంజసం కాదు. రైతుల హక్కును కాలరాయాలనుకోవడం తగదు. – పీ వీ సతీష్, పీజీఎస్ ఆర్గానిక్ కౌన్సిల్ వ్యవస్థాపక సభ్యులు, డీడీఎస్, పస్తాపూర్ (వివరాలకు.. జయశ్రీ: 94402 66012) – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
‘మినరల్’ మోసం!
కొత్తగూడెంటౌన్: నీటిలో ఫ్లోరైడ్.. పరిశ్రమల వ్యర్థాలతో కాలుష్యం.. ఇలా ఏ నీరు తాగితే ఏమవుతుందోననే భయం.. దీంతో అంతా మినరల్ వాటర్ ప్లాంట్ల వైపు పరుగులు తీస్తున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న వ్యాపారులు కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అయినా పట్టించుకునే అధికారులు కరువయ్యారు. కొన్ని చోట్ల బోరు, కూళాయి నీటినే శుద్ధి చేసి మినరల్ వాటర్ పేరుతో విక్రయిస్తుండడంగమనార్హం. ఆ నీటిని తాగిన ప్రజలు వారికి తెలియకుండానే అనారోగ్యం పాలవుతున్నారు. జిల్లాలో సుమారు 300 పైగా మినరల్ వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. అయితే వీటిలో ఐఎస్ఐ అనుమతి ఉన్నవి చాలా తక్కువ. మినరల్ వాటర్ ప్లాంట్ నెలకొల్పాలంటే... మినరల్ వాటర్ ప్లాంట్ నెలకొల్పాలంటే ఏడాదికి కనీసం రూ.5 నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చవుతుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) నిబంధనలు పాటించడంతోపాటు ఐఎస్ఐ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి. ప్లాంట్‌లో ఫార్మాసిస్టులు, ఇతర వర్కర్లు ఉండాలి. వారికి ప్లాంట్ యజమానులే ఆరోగ్య పరీక్షలు చేయించాలి. నీటిలో మినరల్స్ ఎంత శాతం ఉన్నాయో ఫార్మాసిస్ట్ నిర్ధారణ చేయాలి. నీటిలో లవణాలు, ఖనిజాలు సరైన మోతాదులో ఉంటేనే విక్రయించాలి. అయితే జిల్లాలోని అనేక ప్లాంట్లలో ఫార్మాసిస్టులు లేరు. ప్లాంట్లలో పనిచేసే సిబ్బందికి ఆరునెలలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించాలి. వీరిలో ఎవరికైనా అంటువ్యాధులు ఉంటే నీరు పంపిణీ చేసే సమయంలో అవి ఇతరులకు వచ్చే అవకాశం ఉంది. అందుకే తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించడంతోపాటు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పోటాపోటీ వ్యాపారం... మినరల్ వాటర్‌కు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో గల్లీకి ఒక ప్లాంట్ ఏర్పాటు చేసి పోటాపోటీగా వ్యాపారాలు చేస్తున్నారు. ఇక నీటి సరఫరాలోనూ దోపిడీ కనిపిస్తోంది. ప్లాంట్‌కు వెళ్లి తీసుకుంటే 20 లీటర్ల క్యాన్‌కు రూ.5 వసూలు చేస్తున్నారు. అదే 20 లీటర్ల క్యాన్‌ను డోర్ డెలివరీ చేయాలంటే రూ.15 చెల్లించాలి. ఇక ఫస్ట్ ఫ్లోర్, సెకెండ్ ఫ్లోర్ అంటూ ఉంటే ఒక్కో ఫ్లోర్‌కు ఒక్కో ధర నిర్ణయిస్తూ... మొత్తంగా రూ.5 నుంచి రూ.25 వరకు తీసుకుంటున్నారు. ప్రస్తుతం వేసవికాలం కావడంతో కూల్ వాటర్ క్యాన్లకు కూడా గిరాకీ ఎక్కువగానే ఉంటోంది. ఒక్కో క్యాన్ రూ.45 వరకు విక్రయిస్తున్నారు. అయితే దీనికి నిర్ణీతమైన ధరలు లేకపోవడంతో ఒక్కో ప్లాంట్ వారు ఒక్కోరకంగా వసూలు చేస్తున్నారు. ఫిల్టర్లు మార్చకుండానే.. మినరల్ వాటర్ ప్లాంట్లలో ప్రతి 10 వేల లీటర్ల నీటికి ఒకసారి ఫిల్టర్లు మార్చాల్సి ఉంటుంది. అయితే నిర్వాహకులు నెలల తరబడి వీటిని మార్చకుండానే నీరు సరఫరా చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో బోరు నీరే నేరుగా వినియోగదారులకు సరఫరా అవుతోంది. ఫిల్టర్లు మార్చకపోవడంతో బ్యాక్టీరియా పెరగడం, నాచు వంటివి పేరుకుపోయి ఆ నీరు తాగిన వారు అనారోగ్యం పాలవుతున్నారు. ఈ ప్లాంట్లను పర్యవేక్షించాల్సిన ఫుడ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికారుల పర్యవేక్షణ ఉండాలి మినరల్ వాటర్ ప్లాంట్ల పేరుతో దోపిడీ కొనసాగుతోంది. మినరల్ వాటర్ కాకుండా కేవలం శుద్ధి చేసిన నీటిని విక్రయిస్తున్నారు. రూ.5 కు 20 లీటర్ల క్యాన్ ఇవ్వాల్సి ఉండగా రూ.15 నుంచి 30 వరకు వసూలు చేస్తున్నారు. కూల్ వాటర్ టిన్స్కు రూ.40 పైగా ఉంది. వాటర్ ప్లాంట్లు నాణ్యతా ప్రమాణాలు పాటించేలా అధికారుల పర్యవేక్షణ ఉండాలి.– వల్లాల భరత్, కొత్తగూడెం -
డాక్టర్ రెడ్డీస్‌కు వార్నింగ్..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలోనే రెండో అతిపెద్ద ఔషద తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్‌కి శుక్రవారం ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఏకంగా మూడు తయారీ కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాలు సరిగ్గా లేవని హెచ్చరిస్తూ అమెరికాలోని మందుల నియంత్రణాధికార సంస్థ... యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ ఎఫ్‌డీఏ) డాక్టర్ రెడ్డీస్‌కి లేఖ రాసింది. ఈ మేరకు వార్నింగ్ లెటర్ వచ్చినట్లు డాక్టర్ రెడ్డీస్ సంస్థ కూడా ధ్రువీకరించింది. ఈ మూడింట్లో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఏపీఐ యూనిట్, విశాఖపట్నంలోని దువ్వాడలో ఉన్న అంకాలజీ ఫార్ములేషన్ యూనిట్‌తో పాటు, తెలంగాణలోని మిర్యాలగూడలో ఉన్న ఏపీఐ యూనిట్ ఉన్నాయి. చిత్రమేంటంటే శ్రీకాకుళం యూనిట్‌లోని లోపాలను యూఎస్ఎఫ్డీఏ ఎత్తి చూపించి దాదాపు ఏడాది గడుస్తోంది. ఇంతవరకూ వాటిని సరిచేయటమో, దానిపై మరో నిర్ణయమో తీసుకోకుండానే సంస్థ నెట్టుకురావటం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికితోడు ఇప్పుడు కొత్తగా మరో రెండు యూనిట్లకు ఏకంగా వార్నింగ్ నోటీసులే వచ్చాయి. ఈ హెచ్చరిక లేఖలకు కంపెనీ 15 రోజుల్లోగా తగు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ సమాధానానికి యూఎస్ఎఫ్డీఏ సంతృప్తి చెందితే సరి. లేని పక్షంలో ఈ యూనిట్లలో జరిగే ఉత్పత్తిని ఎగుమతి చేయకుండా నిషేధం విధిస్తూ యూఎస్ఎఫ్డీఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే కంపెనీ ప్రతిష్టతో పాటు ఆదాయంపై కూడా గణనీయమైన ప్రభావం పడుతుంది. ప్రస్తుతం డాక్టర్ రెడ్డీస్‌కు వస్తున్న ఆదాయంలో 10 నుంచి 12 శాతం ఈ యూనిట్ల నుంచే వస్తున్నట్లు తెలుస్తోంది. గడచిన ఏడాది డాక్టర్ రెడ్డీస్ ఆదాయం రూ.10,000 కోట్ల మార్కును అధిగమించగా... ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలానికి ఆదాయం రూ.5,423 కోట్లుగా ఉంది. ఆదాయంపై ప్రభావం లేదు.. కాగా ప్రస్తుతం జారీ చేసిన హెచ్చరిక లేఖ వల్ల కంపెనీ ఆదాయంపై ఎటువంటి ప్రభావం పడదని డాక్టర్ రెడ్డీస్ స్పష్టం చేసింది. వీటికి సమాధానమివ్వడానికి 15 రోజుల సమయం ఉందని, ఈ లోగా ఎఫ్‌డీఏ లేవనెత్తిన అభ్యంతరాలపై పూర్తిస్థాయిలో సమాధానం ఇస్తామని డాక్టర్ రెడ్డీస్ సీఈవో జి.వి.ప్రసాద్ తెలిపారు. తాము సమాధానం ఇచ్చిన తర్వాత యూఎస్ ఎఫ్‌డీఏ మూడు యూనిట్లనూ పరిశీలించి క్లీన్చిట్ ఇస్తుందని భావిస్తున్నట్లు కంపెనీ సీఎఫ్‌వో సౌమెన్ చక్రవర్తి పేర్కొన్నారు. ఇన్వెస్టర్లలో ఆందోళన... ఏకంగా మూడు యూనిట్లలోని నాణ్యతా ప్రమాణాలను హెచ్చరిస్తూ యూఎస్ఎఫ్డీఏ లేఖ రాయడంపై ఇన్వెస్టర్లు ఆందోళనకు గురయ్యారు. నవంబర్, 2014లోనే శ్రీకాకుళం యూని ట్లో పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలపై యూఎస్ఎఫ్డీఏ 483 కింద అభ్యంతరాలు లేవనెత్తింది. ఆ తర్వాత యూఎస్ఎఫ్డీఏ జనవరి, 2015లో మిర్యాలగూడ, ఫిబ్రవరిలో దువ్వాడ యూని ట్లను సందర్శించింది. ఏడాది క్రితమే శ్రీకాకుళం యూనిట్లలో లేవనెత్తిన అబ్జర్వేషన్స్‌కు కంపెనీ తగురీతిలో సమాధానపరచకపోవటం... తాజాగా మరో రెండు యూనిట్లకు కూడా హెచ్చరికలు రావడంతో ఈ ఆందోళన మరింత తీవ్రమయ్యింది. దీంతో శుక్రవారం స్టాక్ ఎక్స్ఛేంజీల్లో డాక్టర్ రెడ్డీస్ షేర్లను ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున విక్రయించారు. కొనుగోళ్ల మద్దతు దొరక్కపోవటంతో షేరు ఒక్కరోజులోనే 15 శాతానికి పైగా నష్టపోయింది. షేరు ధర రూ. 623 నష్టపోయి (15 శాతం) రూ.3,629 వద్ద ముగిసింది. ఈ నష్టంతో ఈ కంపెనీ షేర్ హోల్డర్ల సంపద ఒక్కరోజులోనే దాదాపు రూ.10వేల కోట్ల మేర హరించుకుపోయింది. ఈ వ్యవహారంపై కంపెనీ ఎంత త్వరగా స్పందిస్తుందో, తక్షణం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో... వాటిపైనే కంపెనీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ఏంజెల్ బ్రోకింగ్ ఫార్మా ఎనలిస్ట్ సరబ్జిత్ కౌర్ చెప్పారు. -
నవ్వుతారు?
పది కలాల పాటు పదిలంగా ఉండాల్సిన రోడ్లు నెల రోజులకు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. నాణ్యతా ప్రమాణాలకు పాతరేసి జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులపై సంబంధిత అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో అనుమానాలకు తావిస్తోంది. - న్యాల్కల్ ప్రజా ధనం వృథా.. ప్రయాణికులకు వ్యథ * వేసిన నెల రోజులకే ధ్వంసమైన బీదర్-జహీరాబాద్ రహదారి * చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు న్యాల్కల్ మండలం మీదుగా వెళ్లే బీదర్-జహీరాబాద్ రోడ్డు ఖలీల్పూర్, మిర్జాపూర్(బీ), గంగ్వార్, హుస్సెళ్లి తదితర ప్రాంతాల్లో పాడైపోయింది. రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ప్రభుత్వం ఇటీవల పీర్(పిరియేడికల్ రినివల్స్) పథకం 5.5 కిలో మీటర్ల రోడ్డు నిర్మాణం కోసం రూ .1.88 కోట్లు మంజూరు చేసింది. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ ఇటీవల రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాడు. ఖలీల్పూర్, మిర్జాపూర్(బీ) తదితర ప్రాంతాల్లో పాడైన రోడ్డును జేసీబీ సహాయంతో తవ్వేసి కొత్తగా తారు రోడ్డు పనులు చేపడుతున్నారు. ఈ పనులు రెండు నెలలుగా కొనసాగుతున్నాయి. ఒక పక్క రోడ్డు పనులు కొనసాగుతుండా మరో పక్క నాణ్యతా ప్రమాణాలు లేక వేసి రోడ్డుపై తారు లేచిపోతుంది. ఖలీల్పూర్ గ్రామ శివారులో నిర్మించిన సుమారు అర కిలోమీటరు తారు రోడ్డు యథావిధిగా తయారైంది. రోడ్డు కిందకు కుంగిపోయి వేసిన తారు, కంకర తేలిపోతుంది. రోడ్డు పనులను పర్యవేక్షించాల్సిన అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా పనులు నిర్వహిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని వాహనచోదకులు, ప్రయాణికులు కోరుతున్నారు. -
నిబంధనలకు తిలోదకాలు
కల్వర్టు, డ్రైనేజీ పనుల్లో లోపించిన నాణ్యత ప్రమాణాలు చోద్యం చూస్తున్న మున్సిపల్ అధికారులు నర్సీపట్నం: మున్సిపాలిటీలో నిర్మాణ పనులు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయి. నిర్మాణ పనులు దక్కించుకున్న వారు కాకుండా అధికారపార్టీ కౌన్సిలర్లు బినామీ కాంట్రాక్టర్లుగా మారి నిర్మాణ పనులు చేపడుతున్నారు. దీంతో మున్సిపల్ అధికారులు పర్యవేక్షణను గాలికి వదిలేశారు. మున్సిపాలిటీలోని సుమారు రూ.1.5 లక్షలతో డ్రైనేజీ కర్బ్‌వాల్స్, కల్వర్టులు, రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వీటి నిర్మాణాలు ఎందుకు ఉపయోగపడని విధంగా చేస్తున్నారన్న విమర్శలు పట్టణ ప్రజలనుంచి వ్యక్తమవుతున్నాయి. పాటించని నిబంధనలు రోడ్డుకు ఇరుపువైలా వేసే కర్బ్వాల్స్ను అడుగు లోతున నిర్మించాల్సి ఉంది. అధికారపార్టీ కౌన్సిలర్లు ఈ నిబంధనలను పాటించడం లేదు. భూమిపై నుంచి నిర్మిస్తున్నారు. దీంతోపాటు చెత్త, చెదారాన్ని తొలగించేందుకు వీలులేకుండా కర్బ్‌వాల్స్ నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల నీరు ఎటూ వెళ్లడానికి వీలులేకుండా ఎక్కడిక్కడ నీరు నిలిచిపోతోంది. కల్వర్టుల నిర్మాణాలను రెండు అడుగు లోతులో కాంక్రీట్‌తో చేపట్టాల్సి ఉంది. ఈ నిబంధనలను వారు పట్టించుకోకుండా పైపైన కాంక్రీట్ వేసి మొక్కుబడిగా పనులు చేస్తున్నారు. నాసిరకం మెటీరియల్ వినియోగం గ్రావెల్ రోడ్డు నిర్మాణ పనులు అదేవిధంగా చేస్తున్నారు. గ్రావెల్‌కు బదులు కూల్చిన ఇళ్ల మెటీరియల్‌ను వినియోగిస్తున్నారు. 6వ వార్డు గవరవీధిలో రూ.5లక్షలతో చేపట్టిన కల్వర్టులు, కర్బవాల్స్ నిర్మాణ పనుల్లో అవే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పనుల్లో నాణ్యత ప్రమాణాలు, నిబంధనలు పాటించకపోవడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేసినా బినామీ కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తున్నా అధికార పార్టీ కౌన్సిలర్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ విషయాన్ని మున్సిపల్ డీఈ దక్షణామూర్తి దృష్టికి తీసుకువెళ్లినా స్పందించలేదని గవరవీధి వాసులు ఆరోపిస్తున్నారు. ఆరో వార్డు కాకుండా అన్ని వార్డుల్లో ఇదే విధంగా అభివృద్ధి పనులు చేస్తున్నారని, ఈ పనులను కాంట్రాక్టర్ జేబులు నింపుకోవడానికి తప్ప ప్రజలకు ఉపయోగ పడేవిధంగా లేవని వారు విమర్శిస్తున్నారు. ఈ పనుల విషయమై మున్సిపల్ డీఈ దక్షిణామూర్తిని కోరగా నిబంధనలు మేరకు నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించామన్నారు. కేత్రస్థాయి పరిశీలిన చేసి సక్రమంగా జరగని పనులకు బిల్లులు నిలిపివేస్తామని ఆయన వివరించారు. -
'కాలేజీలు నాణ్యతా ప్రమాణాలను తప్పక పాటించాలి'
హైదరాబాద్: కాలేజీలు నాణ్యతా ప్రమాణాలను తప్పక పాటించాలంటూ ఉన్నత విద్యాశాఖ కమిషనర్ శైలజారామయ్యర్ పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 220 కాలేజీలకు అనుమతులిచ్చామనీ, 25 కాలేజీలకు అనుమతి ఇవ్వలేదని చెప్పారు. 245 కాలేజీల నుంచి అఫిలియేషన్ కోసం దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. యూనివర్సిటీలో క్వాలిటీ సెల్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రమాణాలు పాటించని కాలేజీల్లో 40 శాతం సీట్లు తగ్గించామని శైలజారామయ్యర్ స్పష్టం చేశారు. -
నాణ్యత పేరుతో దోపిడీ!
- వరి ధాన్యానికి దక్కని ‘మద్దతు’ - క్వింటాలుకు సగటు ధర రూ.1,250 - తాండూరు మార్కెట్లో వ్యాపారుల మాయ! తాండూరు: సాధారణ రకం వరి ధాన్యాన్ని తీసుకొచ్చిన రైతుకు ప్రభుత్వ మద్దతు ధర లభించడం లేదు. నాణ్యతాప్రమాణాల పేరుతో అన్నదాతలను వ్యాపారులు దోపిడీ చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ‘మద్దతు’ లభించక పోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ కమిటీ అధికారుల ఊదాసీన వైఖరితో యార్డులో కొందరు కమీషన్ ఏజెంట్లు ఇష్టానుసారంగా పంటకు ధర నిర్ణయించడం వల్ల రైతాంగానికి మేలు జరగడం లేదు. ఈనెల మొదటి వారం నుంచి మార్కెట్ యార్డులో రబీ ధాన్యం కొనుగోళ్లు ఆరంభమయ్యాయి. తాండూరు నియోజకవర్గం పరిధిలోని యాలాల, బషీరాబాద్, తాండూరు,పెద్దేముల్ మండలాలతోపాటు సరిహద్దులోని మహబూబ్‌నగర్ జిల్లా నుంచి రైతులు వరి ధాన్యాన్ని విక్రయించేందుకు తాండూరు మార్కెట్‌కు తరలిస్తున్నారు. పట్టణంలోని పౌరసరఫరాల గోదాంలో డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినా డబ్బుల చెల్లింపులో జాప్యం జరుగుతుందనే కారణంతో చాలా మంది రైతులు మార్కెట్ యార్డుకే ధాన్యాన్ని తీసుకొస్తున్నారు. సాధారణ వరి ధాన్యానికి మద్దతు ధర రూ.1,360 చెల్లించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ ఇప్పటివరకు యార్డులో వివిధ గ్రామాల రైతుల నుంచి కమీషన్ ఏజెంట్లు సుమారు 13,463 క్వింటాళ్ల ధాన్యాన్ని కొన్నారు. క్వింటాలుకు గరిష్టంగా రూ.1,300, కనిష్టంగా రూ.1,200, సగటు ధర రూ.1,250 మాత్రమే పలికింది. ఈ మూడు ధరలను పరిశీలించినా కనీస మద్ధతు ధర రైతులకు లభించలేదని స్పష్టమవుతోంది. ఈ ధరల ప్రకారం రైతులు క్వింటాలుకు రూ.60 నుంచి రూ.160 వరకు నష్టపోయారు. నాణ్యతాప్రమాణాలు లేనందుకే మద్దతు ధర పలకడం లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. నాణ్యత పేరుతో రైతన్నల శ్రమ దోపిడీకి గురవుతున్నా అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలకు ఉపక్రమించకపోవడం గమనార్హం. -
‘హెరిటేజ్’లో నాణ్యత గాలికి
వనస్థలిపురం: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు చెందిన హెరిటేజ్ ఫ్రెష్ సూపర్ మార్కెట్లలో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, కాల పరిమితి ముగిసిన ఆహార పదార్థాలను వినియోగదారులకు అంటగడుతున్నారని బాలల హక్కుల పరిరక్షణ రాష్ట్ర కమిషన్ సభ్యులు అచ్యుతరావు ఆరోపించారు. సోమవారం ఆయన వనస్థలిపురంలోని హెరిటేజ్ ఫ్రెష్ సూపర్‌మార్కెట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదివారం తమ కుటుంబ సభ్యులు హెరిటేజ్ ఫ్రెష్ సూపర్ మార్కెట్ నుంచి కూల్‌డ్రింక్‌లు కొనుగోలు చేయగా అవి కాలపరిమితి ముగిసిట్లు గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలో తాను సోమవారం సూపర్ మార్కెట్‌ను సందర్శించగా, కాలపరిమితి దాటిపోయిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్నట్లు గుర్తించానన్నారు. దీనిపై సూపర్ మార్కెట్ సిబ్బందిని ప్రశ్నించగా వారు పొంతనలేని సమాధానం చెబుతున్నారని, ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
‘గ్రేడింగ్’ దగా!
తాండూరు: మార్కెట్ యార్డులో వ్యాపారులకు మక్కలు అమ్మితే నష్టపోతామనే ఉద్దేశంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయిస్తే ఇక్కడ కూడా వంచనకు గురైతే ఇక రైతులకెవరు దిక్కు. డీసీఎంఎస్ అధికారులు కొనుగోలు చేసిన మక్కలను మార్క్‌ఫెడ్ తిరస్కరిస్తోంది. కొనుగోలు చేసిన పంటలో నాణ్యతా ప్రమాణాలు సరిగా లేవనే కారణంతో సీడబ్ల్యూసీకి వెళ్లిన దిగుబడులను తిరస్కరిస్తున్నారు. బాణాపూర్, ఎల్మకన్నె, సంకిరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన రైతులు రాజు, డాక్యానాయక్, పాండురంగారెడ్డి, అమృతారెడ్డిల నుంచి ఈ నెల 8, 10, 14 తేదీల్లో 228.50 క్వింటాళ్ల మొక్కజొన్నలను కొనుగోలు చేసి సీడబ్ల్యూసీ తాండూరు కేంద్రం నుంచి అధికారులు లారీలో తరలించారు. ఆయా రైతులకు చెందిన మక్కలు నాణ్యతగా లేవని అక్కడి అధికారులు తిరస్కరించారు. దీంతో కొంత చిక్కు వచ్చింది. కొనుగోలు చేసి రసీదులు ఇచ్చిన తర్వాత నాణ్యతగా లేవని నిర్ధారించడంతో రైతులను ఆందోళనకు గురి చేసింది. ఈ ప్రభావంతో తాండూరులోని కొనుగోలు కేంద్రంలో మొక్కజొన్నల తూకాలు నిలిచిపోవడంతో కొనుగోళ్లకు బ్రేక్ పడింది. తాము కొనుగోలు చేసి గోదాంకు తరలిస్తే అక్కడికి వెళ్లిన తర్వాత నాణ్యతగా లేవని తిరస్కరిస్తే రైతులకు మేం ఏం సమాధానం చెప్పాలని స్థానిక డీసీఎంఎస్ సిబ్బంది చెబుతున్నారు. దీంతో సోమవారం వివిధ గ్రామాలకు చెందిన సుమారు 200 బస్తాల మక్కలు కొనుగోలు కేంద్రానికి వచ్చాయి. వీటిని కొనుగోలు చేసిన పంపించిన తర్వాత తిరస్కరిస్తున్నందున తూకాలు చేయలేమని డీసీఎంఎస్ గోదాం సిబ్బంది చెబుతున్నారు. సంబంధిత అధికారులు వచ్చి నాణ్యతా ప్రమాణాలు సరిగా ఉన్నాయని చెబితేనే తూకాలు వేస్తామని డీసీఎంఎస్ గోదాం ఇన్చార్జి ఎల్లయ్య స్పష్టం చేశారు. రూ.12.57 లక్షల విలువైన మక్కల సేకరణ అక్టోబర్ 15న తాండూరులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఆరంభమైంది. అదే నెల 28 నుంచి కొనుగోళ్లు మొదలయ్యాయి. ఈ నెల 15 వరకు 26 మంది రైతుల నుంచి ఏ, బీ, సీ గ్రేడ్లకు చెందిన రూ.12.57లక్షల విలువ చేసే దాదాపు 997.50 క్వింటాళ్ల మొక్కజొన్నలను రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఇందులో ఇప్పటి వరకు సుమారు రూ.3 లక్షల వరకు రైతులకు చెల్లించారు. మిగతా డబ్బులు చెల్లించాల్సి ఉంది. -
కొంప ముంచిన సర్కార్ విత్తనాలు!
ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపం కరువుకు తట్టుకోని కే-6 రకం ధరణి రకంతో ఎకరాకు పది బస్తాలు ఈ రకాన్నే పంపిణీ చేసుంటే ఇంత నష్టం జరిగేది కాదు పలమనేరు: ప్రభుత్వం ఈ దఫా రైతులకు పంపిణీ చేసిన సబ్సిడీ వేరుశెనగ విత్తన కాయలు నట్టేట ముం చేశాయి. కరువుకు తట్టుకోలేని, నాణ్యత లేని కే-6 విత్తనాలను పంపిణీ చేసింది. వర్షాభావ పరిస్థితులను ఈ రకం తట్టుకోలేక పంట పూర్తిగా దెబ్బతింది. ఇదే సీజన్లో ఆత్మ వారి సౌజన్యంతో ధరణి అనే రకాన్ని కొందరు రైతులకు పంపిణీ చేశారు. కే-6 రకం ఎకరా కు ఓ బస్తా దిగుబడిని ఇవ్వగా, ధరణి రకం పది బస్తా ల దిగుబడినిచ్చింది. ఇదే విత్తనాలను రైతులకు పంపిణీ చేసుంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో వేరుశెనగ రైతులు నష్టాలపాలయ్యారు. పలమనేరు వ్యవసాయశాఖ సబ్ డివిజ న్కు సంబంధించి ఖరీఫ్ సీజన్లో 16 వేల హెక్టార్లలో వేరుశెనగ సాగు చేయగా 11,540 హెక్టార్లలో ప్రభుత్వం అందజేసిన విత్తనాలనే వేశారు. మిగిలిన విస్తీర్ణంలో రైతులు వారి సొంత విత్తనాలనే వేసుకున్నారు. నాణ్యతా ప్రమాణాలు పట్టించుకోలేదు.. ఈ దఫా జిల్లాకు ఏపీ ఆయిల్ ఫెడ్ నుంచి కదిరి-6 అనే రకం విత్తనాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ప్రొద్దుటూరు, కర్నూలు జిల్లాల నుంచి వీటిని తెప్పించింది. మామూలుగా 100 గ్రాముల విత్తన కాయలను వొలిస్తే గింజలు 70 గ్రాముల బరువు వస్తేనే అవి నాణ్యంగా ఉన్నట్టు లెక్క. సీడ్ జర్మినేషన్ 70 శాతంగా ఉండాలని నిబంధనలున్నాయి. చిత్తూరులోని సీడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీలో మొలక శాతం, విత్తనాల నాణ్యతను పరీక్షిం చాల్సి ఉంది. ఈ దఫా ఇది జరగలేదు. ఈ ప్రాంతానికి కే-6 పనికిరాదు.. వర్షాభావానికి తట్టుకోని కే-6 ఈ ప్రాంతానికి సరిపోదు. గతంలోనూ ఈ సమస్య కారణంగానే ఈ రకాన్ని పంపిణీ చేయలేదు. తక్కువ ధరకే ఇవి దొరుకుతుండడంతో ప్రభుత్వం రెండేళ్లుగా వీటిని రైతులకు అంటగడుతోంది. గతేడాది సైతం ఈ రకం విత్తనాలు వేసిన రైతులకు సగం పంట కూడా చేతికందలేదు. ఫలితంగా ఈ దఫా ఎకరాకు బస్తా (40 కేజీలు) కూడా దిగుబడి రాలేదు. ధరణి రకంతో ఎకరాకు పది బస్తాలు.. కుప్పం ఆత్మ విభాగం తరఫున అక్కడి అధికారులు కొందరు రైతులకు ధరణి రకం వేరుశెనగ విత్తనాలను ప్రయోగాత్మకంగా పంపిణీ చేశారు. కుప్పం మండలంలోని పీబీ నత్తంలో శ్రీరాములు పొలంలో ప్రయోగాలను చేపట్టారు. కరువు పరిస్థితుల మధ్య ఎకరాకు పది బస్తాల దిగుబడి వచ్చింది. దీన్ని చూసి వ్యవసాయ శాఖ అధికారులు ఆశ్చర్యపోయారు. ఇదే రకాన్ని జిల్లాలోని అందరు రైతులకూ పంపిణీ చేసి ఉంటే ఇంత నష్టం వచ్చేది కాదని అధికారులే అభిప్రాయపడుతున్నారు. -
అవినీతి ఊడలు
ఖమ్మం జెడ్పీసెంటర్: పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల్లో అవినీతి రాజ్యమేలుతోంది. ఇంజనీరింగ్ విభాగంలో ప్రతి ఏటా కోట్లాది రూపాయల విలువైన పనులు జరుగుతుంటాయి. వీటిలో అత్యధికంగా నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని క్వాలిటీ కంట్రోల్ అధికారులు నిర్వహించిన తనిఖీలే స్పష్టం చేస్తున్నాయి. కాంట్రాక్టర్లు, కొందరు ఇంజనీరింగ్ అధికారులు కుమ్మక్కై అభివృద్ది పనుల్లో నాణ్యతకు గండి కొడుతున్నారని, దీనికితోడు రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో ఇంజనీరింగ్ అధికారులు కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది ఖమ్మం సబ్ డివిజన్ పరిధిలో రూ.12 కోట్ల వ్యయంతో 394 పనులు చేపట్టగా వాటిలో 83 పనుల్లో నాణ్యత లోపాలు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో సుమారు రూ.8 లక్షల అవినీతి జరిగిందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. గత ఆగస్టు నుంచి ఈ ఏడాది జూన్ వరకు మొత్తం రూ. 2.71 కోట్ల విలువైన 101 పనులను క్వాలిటీ కంట్రోల్ అధికారులు తనిఖీ చేయగా, 32 పనుల్లో నాణ్యత లోపాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో కాంట్రాక్టర్ల నుంచి రూ.2.42 లక్షలు రికవరీ చేయాలని అధికారులకు రిపోర్టు అందజేశారు. పంచాయతీ రాజ్ శాఖలో చేపట్టిన పలు అభివృద్ది పనుల్లో అత్యధికంగా సిమెంట్ రోడ్లు, తారురోడ్ల నుంచే రికవరీలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. పనుల్లో నాణ్యత పరిశీలనకై... పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టే పలు అభివృద్ది పనుల్లో నాణ్యత ప్రమాణాలను పరిశీలించేందుకు ప్రత్యేకంగా క్వాలిటీ కంట్రోల్ విభాగం పని చేస్తుంది. ఖమ్మం పీఆర్ సర్కిల్ పరిధిలో రెండు క్వాలిటీ కంట్రోల్ విభాగాలు ఉంటాయి. ఇందులో ఒకటి ఖమ్మం సబ్ డివిజన్, మరొకటి భద్రాచలం సబ్ డివిజన్లో ఉంటాయి. ఒక్కొక్క సబ్ డివిజన్లో పరిధిలో 23 మండలాలు ఉంటాయి. ఈ డివిజన్లో చేపట్టిన అభివృద్ది పనులను పరిశీలించేందుకు ఒక డీఈ, నలుగురు జేఈలు ఉంటారు. పరిశీలించే పనులు... పంచాయతీరాజ్ శాఖ చేపట్టే పనుల పోగ్రెస్ రిపోర్టు ఆధారంగా క్వాలిటీ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తారు. నెలకు సుమారు 35 పనులను వీరు తనిఖీ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మట్టిరోడ్లు, తారు, సిమెంట్ రోడ్లు, భవనాలు, కల్వర్టులు, వంతెనలు, డ్రెయిన్ పనులను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తారు. ఆయా అభివృద్ది పనులకు సంబంధించి నమూనాలను సేకరించి ప్రయోగశాలలో వాటి నాణ్యతను పరీక్షిస్తారు. నాబార్డు, ఏసీడీపీ, సీడీపీ, బీఆర్జీఎఫ్, ఎస్డీఎఫ్, ఆర్ఆర్ఎం నిధులతో చేపట్టే పనులను తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఎన్ఆర్ఈజీఎస్లో గ్రామ పంచాయతీ, ఆర్వీఎం భవనాలు, ప్రహరీల నిర్మాణాలను పరిశీలిస్తారు. రిపోర్టు ఇలా.. ఆయా అభివృద్ధి పనులను పరిశీలించిన క్వాలిటీ కంట్రోల్ అధికారులు నాణ్యతను పరిశీలన తరువాత లోపాలపై చేపట్టాల్సిన చర్యలను సంబందింత అధికారులకు సూచిస్తారు. సక్రమంగా పని చేయని కాంట్రాక్టర్ నుంచి సొమ్ము రికవ రీకి సంబంధిత ఈఈలకు నివేదిక అందజేస్తారు. పనులలో ఉపయోగించిన వస్తువుల నాణ్యత ఆధారంగా నాణ్యత లోపం విలువను కాంట్రాక్టర్ నుంచి రికవరీ చేస్తారు. 20 శాతం నాణ్యత లోపాలు ఉన్నట్లు గుర్తిస్తే సంబంధిత అధికారులపై చర్య తీసుకునే అవకాశం ఉంది. రాజకీయ ఒత్తిళ్లే కారణం...! జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ది పనులు రాజకీయ నేతల కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. అత్యధిక మంది కాంట్రాక్టర్లు ద్వితీయ స్థాయి రాజకీయ నాయకులే ఉన్నారు. ఇటీవల చేపట్టిన తనిఖీల్లో నాణ్యత పాటించని వారిలో అత్యధిక మంది రాజకీయ నేతల అనుచరులే ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో చేపట్టే పనుల నాణ్యతపై ప్రశ్నించేందుకు పీఆర్ ఇంజనీరింగ్ అధికారులు సాహసించడం లేదు. ఫలితంగా లక్షలు వెచ్చించి చేపట్టిన పలు రకాల రోడ్లు కొద్దిరోజులకే మరమ్మతులకు గురవుతున్నాయి. క్వాలిటీ కంట్రోల్ అధికారులపై రాజకీయ ఒత్తిడులు వస్తున్నందుకే వారు సరైన తనిఖీలు చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. తనిఖీల్లో రాజీ లేదు : నవీన్‌కుమార్, క్వాలిటీ కంట్రోల్ డీఈ క్వాలిటీ కంట్రోల్ విభాగం అప్రమత్తంగా పని చేస్తోంది. తనిఖీల విషయంలో రాజీ పడేది లేదు. మాకు నిర్ధేశించిన లక్ష్యాలు పూర్తి స్ధాయిలో చేపడుతున్నాం. నాణ్యత లోపాలు ఉన్నట్లు తేలితే వెంటనే సంబంధిత అధికారులకు రిపోర్టు అందజేసి చర్యలు తీసుకోవాలని నివేదికలు పంపుతున్నాం. -
అప్పుడే విరుగుతున్న పట్టాలు
మోర్తాడ్, న్యూస్‌లైన్: నిజామాబాద్-పెద్దపల్లి రైల్వేలైన్ నిర్మాణంలో కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలను పాటించకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా రైలు ట్రయల్ రన్ కూడా జరుగక ముందే పట్టాలు విరిగిపోతున్నాయి. రైల్వేలైన్‌కు వినియోగిస్తున్న ఇనుములో నాణ్యత లేకపోవడంతో పట్టాల మధ్య పగుళ్లు చోటు చేసుకుం టున్నాయి. రైలు పట్టాల మధ్య పగుళ్లు ఏర్పడితే భవిష్యత్తులో రైలు ప్రయాణం భద్రమేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ లైన్ పనులు మోర్తాడ్ ప్రాంతంలో కొనసాగుతున్నాయి. వీటిని పర్యవేక్షించాల్సిన అధికారులు కాం ట్రాక్టర్లకే వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బద్దంవాడ వ్యవసా య క్షేత్రాల పరిసరాలలో రైల్వే లైన్ పనులు పూర్తి అయ్యాయి. స్టేషన్ పరిసరాలలో చిన్న చిన్న పనులు పూర్తి కావాల్సి ఉన్నందున రైలు ఇంజిన్ ట్రయల్ రన్‌ను వాయిదా వేశా రు. షెడ్యూల్ ప్రకారం గడచిన జూన్ నుంచి జగిత్యాల్, మోర్తాడ్ మధ్య ప్యాసింజర్ రైలును నడుపాల్సి ఉంది. పనులు వేగంగా సాగక పోవడంతో అది సాధ్యం కాలేదు. రైల్వే లైన్ పట్టాలకు వినియోగిస్తున్న ఇనుము విషయంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పట్టాలు విరి గిపోతున్నాయి. దీంతో రైలు ప్రమాదాలు సంభవిం చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు ఆందోళన చెందుతున్నారు. రైలు ఇంకా పట్టాలు ఎక్కక ముందే పరిస్థితి ఇలా ఉంటే, రైలు వచ్చిన తరువాత పరిస్థితి ఎలా ఉంటుందోనని వారు సంశయిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైల్వే లైన్ నిర్మాణం విషయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
గడువు దాటొద్దు...
=నాణ్యత ప్రమాణాలు పాటించాలి =అధికారులు సమన్వయంతో పనులు పర్యవేక్షించాలి =భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చూడాలి =మంత్రులు బలరాం, వెంకటరెడ్డి =మహాజాతర ఏర్పాట్లపై మేడారంలో అమాత్యుల సమీక్ష =వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన మేడారం (గోవిందరావుపేట), న్యూస్‌లైన్ : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు సంబంధించిన పనులను నిర్ణీత గడువులోపు పూర్తిచేయూలని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయ మంత్రి పోరిక బలరాంనాయక్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలు పాటించేలా నిరంతరంగా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. మేడారంలోని టీటీడీ కల్యాణ మండపంలో శనివారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వారితోపాటు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఎంపీ గుండు సుధారాణి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, కలెక్టర్ కిషన్ హాజరయ్యూరు. ఈ సందర్భంగా అధికారులు తమ తమ పరిధిలో జరుగుతున్న పనుల గురించి వారికి వివరించారు. ఈ సందర్భంగా నాయక్, వెంకటరెడ్డి మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కోటి మంది భక్తులు వస్తారన్న అంచనాలకు తగ్గట్లుగా ప్రజాప్రతినిధుల ఒత్తిడితో ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. వాటిని సద్వినియోగం చేసుకుని భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. వచ్చే ఏడాది జనవరి 24వ తేదీన మేడారంలో మళ్లీ సమీక్ష సమావేశం నిర్వహిస్తామని, అప్పటివరకు పనులన్నీ పూర్తి చేయాలని పేర్కొన్నారు. అటవీ, ఎక్సైజ్ అధికారులపై ఆగ్రహం సామాన్యులు ఇల్లు కట్టుకుంటుంటే అడ్డుకోవాలని ఏ జీఓలో ఉంది... అంటూ మంత్రులు బలరాం నాయక్, వెంకటరెడ్డి అటవీ, ఎక్సైజ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక మాఫియాకు కొమ్ము కాస్తు.. సామాన్యులను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అలాంటి వారు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకోవాలని మండిపడ్డారు. కాల్వపల్లి- నార్లాపూర్ రోడ్డు పనులు నిర్వహిస్తున్న వాహనాలను అటవీ అధికారులు అడ్డుకోవడంతోపాటు వాటి తాళాలను స్వాధీనం చేసుకున్నట్లు మంత్రుల దృష్టికి రాగా... వారు ఇలా ధ్వజమెత్తారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు తీసుకువచ్చే ట్రాక్టర్లను కూడా ఆపొద్దని పోలీస్ అధికారులకు సూచించారు. అనంతరం గుడుంబా నివారణకు తీసుకుంటున్న చర్యలను ఎక్సైజ్ శాఖ అధికారులు వివరించారు. రాజమండ్రి, భద్రాచలం ప్రాంతాల నుంచి వచ్చే నల్లబెల్లాన్ని నియంత్రించకుండా స్థానికులపై దాడులు చేయడమేంటని వారిని మంత్రులు ప్రశ్నించారు. తన పార్లమెంట్ పరిధిలో 30 వేల మంది సారా తాగి చనిపోయినట్లు తమ వద్ద సమాచారం ఉందని బలరాం నాయక్ తెలిపారు. అక్రమంగా బెల్లం, ఇతర వస్తువులను తీసుకువస్తున్న వాహనాలు, అమ్మకందారులపై చర్యలు తీసుకోవాలని... దీని ద్వారా గుడుంబా తయారీ, అమ్మకాలు వాటంతట అవే తగ్గిపోతాయన్నారు. రెడ్డిగూడెంలో మద్యం నిల్వకు ప్రత్యేక గోడౌన్ ప్రతి సారి ట్రాఫిక్ రద్దీతో డిమాండ్‌కు అనుగుణంగా మద్యం బాటిళ్లను తీసుకురాలేక పోతున్నారని, ఈ మేరకు తగు చర్యలు చేపడుతున్నట్లు మంత్రులకు ఎక్సైజ్ అధికారులు వివరించారు. అధిక మొత్తంలో మద్యాన్ని దుకాణదారులకు అందించేలా రెడ్డిగూడెంలో ప్రత్యేక గోడౌన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సుంకం చెల్లించని, కల్తీ మద్యాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. ఈ మేరకు 10 చెక్‌పోస్టులు, ఏడు పెట్రోలింగ్ వాహనాలను వినియోగించనున్నట్లు వెల్లడించారు. బస్టాండ్ వద్ద కనీస పనులకు నిధులివ్వండి బస్టాండ్ ప్రాంగణంలో ప్రతి సారి వెట్‌మిక్స్ వేయడం ద్వారా మట్టి లేవకుండా ఉండేదని... ప్రస్తుతం కొత్తగా ఏర్పాటు చేస్తున్న బస్టాండు వద్ద లెవలింగ్, రోలింగ్ మాత్రమే నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ బస్టాండ్ చుట్టూ రోడ్లు లేకపోవడంతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని వారు... మంత్రులు, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు బస్టాండ్ ప్రాంగణంలో కనీస పనులకు నిధులు కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ డ్రైవర్లు మద్యం సేవించి బస్సులు నడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆల్కహాల్ బ్రీతింగ్ అనలైజర్లను అన్ని పెట్రోలింగ్ వాహనాల్లో ఏర్పాటు చేసి.... డ్రైవర్లను పరీక్షించాలన్నారు. దీనివల్ల భక్తులకు బస్సు ప్రయాణంపై నమ్మకం కలుగుతుందన్నారు. సమావేశంలో ఏజేసీ, ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ సంజీవయ్య, డీఎంహెచ్ఓ సాంబశివరావు, అధికారులు పాల్గొన్నారు. అధిక నిధులిచ్చిన ఘనత మాదే : రాంరెడ్డి ఆదివాసీల జాతరకు అత్యధిక నిధులిచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని జిల్లా ఇన్చార్జ్ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మేడారం మహా జాతర సందర్భంగా రూ.100 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయనతోపాటు ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట్రమణారెడ్డి, రాష్ట్రమంత్రి బస్వరాజు సారయ్య, వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణిలు ప్రారంభించారు. అనంతరం ములుగు ఎమ్మెల్యే సీతక్క అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాంరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. ప్రస్తుత జాతరకు కోటి మంది భక్తులు వస్తారనే అంచనాలకనుగుణంగా ప్రభుత్వం నిధుల మం జూరు చేసేలా ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేశారన్నారు. ప్రతిసారి పనుల హడావుడితో పనుల్లో నాణ్యత లోపాలు తలెత్తాయని.. ఇప్పటికైనా అలాంటి సంప్రదాయూనికి చెక్ పెట్టేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జాతర సమయంలో మేడారం చుట్టుపక్కల గ్రామాల్లో వెయ్యి ఎకరాల్లో పంట వేయకుండా ఉండాల్సిన పరిస్థితి ఉంటుందని, వీరిలో పట్టాలు లేని రైతులకు కనీసం ఇన్పుట్ సబ్సిడీ అందించాలని ఎమ్మెల్యే సీతక్క కోరగా... మంత్రులు సానుకూలంగా స్పందించారు. రైతులకు ఏదో ఒక రూపంలో పరిహారం అందే లా చూస్తామన్నారు. స్థానికంగా ఆదివాసి మ్యూజియం ఏర్పాటుకు రూ.3 కోట్లు, చిలకలగుట్ట చుట్టూ ఫెన్సింగ్‌కు రూ.కోటి విడుదల చేస్తామని చెప్పారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా చూసేందుకు ప్రజాప్రతినిధులు మూడు రోజుల జాతర వద్దే ఉండాలని మంత్రి రాంరెడ్డి సూచించారు. ఎంపీ రాజయ్య మాట్లాడుతూ వనదేవతలను దర్శించుకునేందుకు వచ్చిన నాయకులు కొందరు సమ్మక్క-సారలమ్మ తల్లుల ముందు ఓ మాట, మనసులో మరో మాట అనుకుంటారని... అయితే వారి మనసులోని మాట తల్లులకు తెలుసన్నారు. వారి మనసులో ఉండే కుతంత్రాలను మార్చాలని తాము తల్లులను కోరుకుంటున్నామని పేర్కొన్నారు. పనుల ప్రారంభోత్సవంలో కలెక్టర్ కిషన్, రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాసు, జెడ్పీ సీఈఓ ఆంజనేయులు, ఏజేసీ, ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ సంజీవయ్య, మేడారం ట్రస్ట్‌బోర్డు చైర్మన్ నాలి కన్నయ్య, డీఎంహెచ్ఓ సాంబశివరావు, పరకాల మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి పాల్గొన్నారు. -
ఆహారంలో నాణ్యతకు తిలోదకాలు !
మంచిర్యాల టౌన్, న్యూస్‌లైన్ : జిల్లా వ్యాప్తంగా హోటళ్లలో ఆహార నాణ్యతాప్రమాణాలకు యజమానులు తిలోదకాలిస్తున్నారు. ఆహార నియంత్రణ అధికారుల పర్యవేక్షణ లోపం, మొక్కుబడి తనిఖీలతో ప్రజలు ఆస్పత్రి పాలు కావాల్సి వస్తోంది. జిల్లాలో 5వేల వరకు ఆహార పదార్థాలు అందించే హోటళ్లు, మిఠాయి దుకాణాలు, రెస్టారెంట్లు, చాట్ కేంద్రాలు, బేకరీలు ఉన్నాయి. వీటన్నింటినీ తనిఖీ చేయాలంటే ఐదుగురు ఆహార నియంత్రణ అధికారులు ఉండాలి. కానీ ప్రస్తుతం జిల్లాలో జిల్లా అధికారితోపాటు ఇద్దరు ఆహార నియంత్రణ అధికారులు, ఇద్దరు అటెండర్లు ఉన్నారు. సిబ్బంది కొరతను ఇటీవల కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఇప్పట్లో సమస్య తీరేలా కనిపించడం లేదు. జిల్లా కార్యాలయంలో క్లర్క్, జూనియర్, సీనియర్ అసిస్టెంట్ల ఊసే లేదు. ఇక శాంపిళ్ల సేకరణ, కేసుల నమోదు ఏ మేరకు పకడ్బందీగా ఉంటాయో చెప్పనవసరం లేదు. 2012లో 50 కేసులు నమోదు కాగా, 2013లో ఇప్పటివరకు 20 కేసులు నమోదయ్యాయి. నోటీసులు జారీ చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. హెచ్చరికలతో సరి.. హోటళ్లు, బేకరీలు ఇతర వాటిపై ఆహార నియంత్రణ అధికారులు తనిఖీలు చేస్తున్నా సంబంధిత యాజమాన్యాల తీరులో మార్పు రావడం లేదు. అపరిశుభ్రత వాతావరణంలో తయారు చేసి ఎలాంటి నాణ్యతాప్రమాణాలు లేని ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్నారు. తనిఖీల్లో భయంకరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చినా పూర్తి స్థాయిలో ఆయా ఆహార సంస్థలపై కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. హెచ్చరికలు చేస్తూ సరిపెడుతున్నారు. సేకరించిన ఆహార నమూనాలను ల్యాబ్‌లకు పంపించగా.. శుచిగా లేవని, ప్రజలకు వడ్డించడానికి పనికిరావని నివేదిక వచ్చినా చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమైనట్లు తెలుస్తోంది. చిన్న పాటి ఆహార విక్రయ వ్యాపారం చేసుకునే వారు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆహార పరిరక్షణ, ప్రమాణాల చట్టం-2006 ప్రకారం అధికారుల వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవీ ప్రమాణాలు.. ఆహార పదార్థాలను సరఫరా చేసే సంస్థలో నాణ్యత, పరిశుభ్రత పాటించేందుకు కొన్ని ప్రమాణాలు పాటించాలని ఆహార నియంత్రణ చట్టం చెబుతోంది. వంట కోసం ఉపయోగించే నూనెను ఒకసారి కంటే ఎక్కవ వాడరాదు. వండిన ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోను ఫ్రిజ్‌లో నిల్వ చేయరాదు. తాగునీటికి తప్పనిసరిగా ఫిల్టర్ నీరు, మినరల్ వాటర్ కానీ వాడాలి. కుళ్లిన పదార్థాలను ఏ పరిస్థితుల్లోనూ వినియోగదారుడికి సరఫరా చేయరాదు. కోడి మాంసం, మేక మాంసం ఒకే చోట పెట్టరాదు. పదార్థాలను సరైన వాతావరణంలో పెట్టాలి. వంట గదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మురుగునీటి వ్యవస్థ చుట్టుపక్కల ఉండరాదు. నిర్వాహకులు నిబంధనలు పాటిస్తున్నారా లేదా చూడడానికి ఆహార నియంత్రణ అధికారులు సహాయ వైద్య అధికారులతో తనిఖీలు చేయాల్సి ఉంటుంది. వాస్తవాలను పరిశీలిస్తే ఇలాంటి నిబంధనలు పాటించే హోటళ్లు తక్కువ సంఖ్యలో ఉన్నాయి. రోజూ పదార్థాలను రిఫ్రిజిరేటర్లలో నిల్వ ఉంచి యథేచ్ఛగా వడ్డిస్తున్నా అడిగే నాథుడూ లేడు.. పట్టించుకునే వారే లేరు. -
నూతన కోర్టు నిర్మాణం త్వరలో ప్రారంభం
పరకాల, న్యూస్‌లైన్ : పరకాల జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నూతన భవన నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేయనున్నారు. పాత భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో ప్రస్తుతం తాత్కాలికంగా ప్రైవేట్ భవనంలో నిర్వహిస్తున్నారు. కొత్త భవనం నిర్మాణానికి రూ.2.70కోట్ల నిధులు మంజూరు కావడంతో టెండర్లను ఖరారు చేసి కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారు. కోర్టు నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన తేదీని ఖరారు చేయడం కోసం జిల్లా జడ్జి డి.లీలావతి, ఫస్ట్ అడిషనల్ సెషన్స్ జడ్జి(ఏడీజే) నర్సింహులు గురువారం పట్టణానికి వచ్చారు. పాత కోర్టు వద్దకు చేరుకుని అక్కడి స్థలాన్ని పరిశీలించారు. 1990లో నిర్మించిన పాత భవనం కనీసం పదేళ్లు కూడా పనికిరాకుండా పోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భవనం పెచ్చులు ఊడిపోతుండడం, వర్షపు నీరు పైకప్పు నుంచి కిందపడుతుండడం చూసి విస్మయం చెందారు. నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ దుస్థితికి కారణమని అభిప్రాయపడ్డారు. ఆర్అండ్బీ అధికారులు, ఇంజినీర్ దగ్గరుండి పనులు చేయించాలని కోరారు. మరో అడిషనల్ కోర్టు మంజూరు.. పరకాలకు మరో అడిషనల్ కోర్టు మంజూరైంది. ప్రస్తుతం ఉన్న కోర్టులో 4వేల వరకు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కేసుల సత్వర పరిష్కారానికి హైకోర్టు మున్సిఫ్ కోర్టులను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా పరకాలకు మరో కోర్టు మంజూరు కావడంలో కోర్టును ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై చర్చించారు. మౌలిక వసతుల కల్పన, భవన నిర్మాణం లేదా అద్దె భవనాల ఏర్పాటు విషయాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా జడ్జి, ఏడీజే వెంట పరకాల జూనియర్ కోర్టు జడ్జి ఖలీల్, పరకాల డీఏస్పీ సంజీవరావు, సీఐ వెంకటేశ్వర్లు, ఏస్సై షాదుల్లా బాబా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజిరెడ్డి, మెరుగు శ్రీనివాస్, గండ్ర నరేష్‌రెడ్డి, గంగరబోయిన రాజేం దర్, కూకట్లు శ్రీనివాస్, పలువురు న్యాయవాదులు ఉన్నారు.