కొత్తగూడెంటౌన్: నీటిలో ఫ్లోరైడ్.. పరిశ్రమల వ్యర్థాలతో కాలుష్యం.. ఇలా ఏ నీరు తాగితే ఏమవుతుందోననే భయం.. దీంతో అంతా మినరల్ వాటర్ ప్లాంట్ల వైపు పరుగులు తీస్తున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న వ్యాపారులు కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అయినా పట్టించుకునే అధికారులు కరువయ్యారు. కొన్ని చోట్ల బోరు, కూళాయి నీటినే శుద్ధి చేసి మినరల్ వాటర్ పేరుతో విక్రయిస్తుండడంగమనార్హం. ఆ నీటిని తాగిన ప్రజలు వారికి తెలియకుండానే అనారోగ్యం పాలవుతున్నారు. జిల్లాలో సుమారు 300 పైగా మినరల్ వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. అయితే వీటిలో ఐఎస్‌ఐ అనుమతి ఉన్నవి చాలా తక్కువ.
మినరల్ వాటర్ ప్లాంట్ నెలకొల్పాలంటే...
మినరల్ వాటర్ ప్లాంట్ నెలకొల్పాలంటే ఏడాదికి కనీసం రూ.5 నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చవుతుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) నిబంధనలు పాటించడంతోపాటు ఐఎస్‌ఐ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి. ప్లాంట్‌లో ఫార్మాసిస్టులు, ఇతర వర్కర్లు ఉండాలి. వారికి ప్లాంట్ యజమానులే ఆరోగ్య పరీక్షలు చేయించాలి. నీటిలో మినరల్స్ ఎంత శాతం ఉన్నాయో ఫార్మాసిస్ట్ నిర్ధారణ చేయాలి. నీటిలో లవణాలు, ఖనిజాలు సరైన మోతాదులో ఉంటేనే విక్రయించాలి. అయితే జిల్లాలోని అనేక ప్లాంట్లలో ఫార్మాసిస్టులు లేరు. ప్లాంట్లలో పనిచేసే సిబ్బందికి ఆరునెలలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించాలి. వీరిలో ఎవరికైనా అంటువ్యాధులు ఉంటే నీరు పంపిణీ చేసే సమయంలో అవి ఇతరులకు వచ్చే అవకాశం ఉంది. అందుకే తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించడంతోపాటు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
పోటాపోటీ వ్యాపారం...
మినరల్ వాటర్‌కు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో గల్లీకి ఒక ప్లాంట్ ఏర్పాటు చేసి పోటాపోటీగా వ్యాపారాలు చేస్తున్నారు. ఇక నీటి సరఫరాలోనూ దోపిడీ కనిపిస్తోంది. ప్లాంట్‌కు వెళ్లి తీసుకుంటే 20 లీటర్ల క్యాన్‌కు రూ.5 వసూలు చేస్తున్నారు. అదే 20 లీటర్ల క్యాన్‌ను డోర్ డెలివరీ చేయాలంటే రూ.15 చెల్లించాలి. ఇక ఫస్ట్ ఫ్లోర్, సెకెండ్ ఫ్లోర్ అంటూ ఉంటే ఒక్కో ఫ్లోర్‌కు ఒక్కో ధర నిర్ణయిస్తూ... మొత్తంగా రూ.5 నుంచి రూ.25 వరకు తీసుకుంటున్నారు. ప్రస్తుతం వేసవికాలం కావడంతో కూల్ వాటర్ క్యాన్‌లకు కూడా గిరాకీ ఎక్కువగానే ఉంటోంది. ఒక్కో క్యాన్ రూ.45 వరకు విక్రయిస్తున్నారు. అయితే దీనికి నిర్ణీతమైన ధరలు లేకపోవడంతో ఒక్కో ప్లాంట్ వారు ఒక్కోరకంగా వసూలు చేస్తున్నారు.
ఫిల్టర్లు మార్చకుండానే..
మినరల్ వాటర్ ప్లాంట్‌లలో ప్రతి 10 వేల లీటర్ల నీటికి ఒకసారి ఫిల్టర్లు మార్చాల్సి ఉంటుంది. అయితే నిర్వాహకులు నెలల తరబడి వీటిని మార్చకుండానే నీరు సరఫరా చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో బోరు నీరే నేరుగా వినియోగదారులకు సరఫరా అవుతోంది. ఫిల్టర్లు మార్చకపోవడంతో బ్యాక్టీరియా పెరగడం, నాచు వంటివి పేరుకుపోయి ఆ నీరు తాగిన వారు అనారోగ్యం పాలవుతున్నారు. ఈ ప్లాంట్లను పర్యవేక్షించాల్సిన ఫుడ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో ఎవరూ పట్టించుకోవడం లేదు.
అధికారుల పర్యవేక్షణ ఉండాలి
మినరల్ వాటర్ ప్లాంట్ల పేరుతో దోపిడీ కొనసాగుతోంది. మినరల్ వాటర్ కాకుండా కేవలం శుద్ధి చేసిన నీటిని విక్రయిస్తున్నారు. రూ.5 కు 20 లీటర్ల క్యాన్ ఇవ్వాల్సి ఉండగా రూ.15 నుంచి 30 వరకు వసూలు చేస్తున్నారు. కూల్ వాటర్ టిన్స్‌కు రూ.40 పైగా ఉంది. వాటర్ ప్లాంట్లు నాణ్యతా ప్రమాణాలు పాటించేలా అధికారుల పర్యవేక్షణ ఉండాలి.– వల్లాల భరత్, కొత్తగూడెం
Comments
Please login to add a commentAdd a comment