Mineral water plants
-
శుద్ధ అబద్ధం: మినరల్ కాదు జనరల్ వాటరే
ఫ్లోరైడ్.. ఉప్పు నీటినుంచి ఉపశమనం కోసం ప్రజలు శుద్ధనీటి వైపు మళ్లారు. స్థానిక సంస్థల ద్వారా సరఫరా అయ్యే నీటిని రోజువారీ అవసరాలకు వినియోగిస్తున్నారు. తాగడానికి అత్యధిక శాతం మంది శుద్ధ్ధనీటిపైనే ఆధారపడుతున్నారు. ఫిల్టర్ చేసిన నీరు రుచికరంగా అనిపిస్తుండటంతో ఎక్కువ మంది వాటినే తాగుతున్నారు. ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంతాల వరకే ఉన్న ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ (శుద్ధ జలం) ప్లాంట్లు గ్రామాలకూ విస్తరించాయి. మినరల్ వాటర్ అని పైకి చెప్పినా జనరల్ వాటర్‌నే పైపైన ఫిల్టర్ చేసి ప్రజలకు విక్రయిస్తున్నారు. ఐఎస్ఐ ప్రమాణాలకు తిలోదకాలిస్తున్నారు. అధికారులు కూడా తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లా అంతటా ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ సంస్కృతి విస్తరించింది. ఇల్లు, దుకాణాలు, హోటళ్లు, టీ కేఫ్‌లు, కార్యాలయాలు ఇలా ఒకటేమిటి ఎక్కడ చూసినా ప్యూరిఫైడ్ క్యాన్ వాటర్ దర్శనమిస్తున్నాయి. ఈ క్యాన్లోనివి మినరల్ నీళ్లు అని, స్వచ్ఛమైనవని సేవిస్తున్నారు. అయితే ఇవి అంత శుద్ధమైనవి కాదని అధికారుల తనిఖీల్లో ఎన్నోసార్లు రుజువైంది. ఉమ్మడి జిల్లాలో 44 లక్షల మందికి పైగా జనాభా ఉంటే రోజూ 25 లక్షల మంది ప్యూరిఫైడ్ నీటినే వాడుతున్నట్టు అంచనా. జిల్లాలో వెయ్యికి పైగా వాటర్ ప్లాంట్లు ఉంటే.. అందులో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ఐఎస్ఐ గుర్తింపు పొందినవి మూడు మాత్రమే. మిగిలినవన్నీ ప్రమాణాలు పాటించకుండానే కొనసాగుతున్నాయి. ప్లాంట్లపై పర్యవేక్షణ లేదు రూ.కోట్లల్లో వ్యాపారం నిర్వహిస్తున్న ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లపై పర్యవేక్షణ ఎవరు చేస్తున్నారు? ఈ నీటిని ఎవరైనా నమూనాలను సేకరించి నిర్ధారించి అనుమతులు ఇస్తున్నారా? ఈ నీళ్లను శుద్ధి చేస్తున్నారా లేదా? ఇవి సురక్షిత నీరేనా? అని చూసేవారు లేరు. కొన్నిసార్లు నీళ్ల క్యాన్లలో ప్రమాదకర బ్యాక్టీరియా ఉన్నట్టు ఫిర్యాదులు కూడా అందాయి. ఇలా ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ల పేరిట జరుగుతున్న దోపిడీ అంతా ఇంతా కాదు. పలు సందర్భాల్లో డయేరియా కేసులు నమోదవుతూ ఉండటంతో ఈ నీళ్లపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాటర్‌ప్లాంట్ నుంచి గృహాలకు చేరే 20 లీటర్ల వాటర్ క్యాన్‌ను 90 సార్లకంటే ఎక్కువగా వాడకూడదు. కానీ ఇక్కడ మూడేళ్లు దాటినా అవే క్యాన్లను వినియోగిస్తూనే ఉన్నారు. నీటి శుద్ధి ఇలా జరగాలి.. ఆర్ఓ ప్లాంట్ ద్వారా నీటిని శుద్ధి చేస్తారు. ఆర్ఓ అంటే రివర్స్ ఓస్మోసిస్. బోరు నుంచి వచ్చే నీటిలో మోతాదుకు మించి మినరల్స్ ఉంటాయి. ఎక్కువ మోతాదులో ఉంటే హాని కలిగిస్తాయి. వీటిలో మెగ్నీíÙయం, రకరకాల సల్ఫేట్స్, బోరాన్, బేరియం, మాంగనీస్ వంటివి ఉంటాయి. ఎక్కువ మోతాదులో మినరల్స్ కలిగి ఉన్న నీటినే భారజలం అంటాం. టీడీఎస్ (టోటల్ డిస్పెన్స్డ్ సాలిడ్స్) అనికూడా అంటాం. వీటిని ఆర్ఓ ప్లాంట్లు వడపోత నిర్వహించి భారజలాన్ని సాధారణ జలంగా మార్చాలి. వంద లీటర్లను ఆర్ఓ ద్వారా ఫిల్టర్ చేస్తే మనకు పది నుంచి 15 లీటర్లు మాత్రమే తాగునీరు వస్తుంది. ఇందులో మూడు దశల్లో వడపోత జరగాలి. ఆర్‌ఓలో ప్రీ ఫిల్టరైజేషన్ సాలిడ్ వాటర్ మొదటి దశ, ఉప్పుశాతాన్ని తగ్గించడం రెండోదశ. ఇక మూడోదశలో బ్యాక్టీరియాను తగ్గించే వడపోత ఉంటుంది. ఈ మూడు దశల్లో ఏది సరిగా జరగకపోయినా ఉపయోగం ఉండదు. నాణ్యమైన తాగునీరు కావాలంటే ఈ ఆర్ఓ ప్లాంట్లలో వాడే ఫిల్టర్లను తరచూ మారుస్తూ ఉండాలి. అయితే వీటిని ఎక్కడా పాటించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మూడు ప్లాంట్లకే ఐఎస్ఐ మార్క్ జిల్లాలోని మూడు వాటర్ ఫిల్టర్ ప్లాంట్లకు మాత్రమే ఐఎస్ఐ అనుమతి ఉంది. మిగతావన్నీ ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ పేరుతో నడుస్తున్నవే. ఈ ప్లాంట్లపై ఫిర్యాదులొస్తే తనిఖీలు నిర్వహిస్తున్నాం. ప్యాకేజీ డ్రింకింగ్ వాటర్ కంపెనీలు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే అధికారం మాకుంది. కానీ ఇలా 20 లీటర్ల క్యాన్లతో లూజ్ వాటర్ సరఫరా చేసే వాటిపై స్థానిక సంస్థలు చర్యలు తీసుకోవాలి. అయినా మేం తరచూ ఈ ప్లాంట్ల నమూనాలపై నిఘా పెట్టాం. ఎక్కడైనా ఫిర్యాదులొస్తే వెంటనే చర్యలు తీసుకుంటున్నాం. –దేవరాజు, ఫుడ్‌సేఫ్టీ అధికారి నిబంధనలు పాటించరు ఐఎస్ఐ నాణ్యతా ప్రమాణాల ధ్రువీకరణ, కాలుష్య నియంత్రణమండలి సరి్టఫికెట్ తదితర వాటితో వస్తే రాయితీలు ఇస్తాం. కానీ ఈ ప్రమాణాలు పాటించరు కాబట్టి మా దగ్గరకు రారు. ప్లాంటు ఏర్పాటుకే కాదు, నాణ్యత పాటిస్తే విద్యుత్ రాయితీ కూడా ఇస్తాం. ఈ నిబంధనలు పాటించే ప్లాంట్లు లేవనే చెప్పాలి –నాగరాజారావు, జనరల్ మేనేజర్, పరిశ్రమల శాఖ వ్యాధులు సంక్రమిస్తాయి శుద్ధి చేయని నీటిని తాగడం వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి. ప్రధానంగా చిన్నారులు, గర్భిణులు ఎక్కువగా ఇబ్బందులు పడతారు. డయేరియా, టైఫాయిడ్, కలరా, హెపటైటిస్ ఏ, డిసెంట్రీ (చీము రక్తంతో విరేచనాలు), కొన్నిసార్లు ప్రాణాపాయం కూడా ఉంటుంది. అందువల్ల నీటి శుద్ధి గురించి అందరూ తెలుసుకోవాలి. టోటల్ డిసాల్వ్ సాలిడ్స్(టీడీఎస్) 100 నుంచి 300 శాతం లోపు ఉండాలి. ఇది తక్కువైనా, ఎక్కువైనా ఇబ్బందే. అలాంటి నీటిని వాడుకోవడం హానికరం. – డాక్టర్ రజిత, క్యాజువాలిటీ మెడికల్ అధికారి, అనంతపురం -
వాటర్ ప్లాంట్లపై విస్తృతంగా దాడులు
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో మినరల్ వాటర్ పేరిట అడ్డగోలుగా నడుస్తున్న ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లపై దాడుల పరంపర కొనసాగుతోంది. అనధికార వాటర్ ప్లాంట్లపై ‘సాక్షి’లో ప్రచురితమైన ‘మాయాజలం’ కథనంపై స్పందించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుసగా నాలుగో రోజు కూడా తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో 17 వాటర్ ప్లాంట్లలో తనిఖీలు చేశారు. ఆయా ప్లాంట్లలో నిబంధనలకు విరుద్ధంగా ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిళ్లు, వాటర్ ప్యాకెట్లు తయారుచేస్తున్నట్టు గుర్తించారు. పూర్తి స్థాయి అనుమతులు లేకుండా అవి నడుస్తున్నాయని తేల్చారు. ప్లాంట్లలో నిల్వ ఉన్న స్టాకును సీజ్ చేశారు. ఈ ప్లాంట్ల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు నివేదిస్తున్నట్టు జాయింట్ ఫుడ్ కంట్రోలర్ స్వరూప్ ‘సాక్షి’కి చెప్పారు. రాష్ట్రంలో అనధికారికంగా నడుస్తున్న వాటర్ ప్లాంట్లపై దాడులు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. -
‘మినరల్’ మోసం!
కొత్తగూడెంటౌన్: నీటిలో ఫ్లోరైడ్.. పరిశ్రమల వ్యర్థాలతో కాలుష్యం.. ఇలా ఏ నీరు తాగితే ఏమవుతుందోననే భయం.. దీంతో అంతా మినరల్ వాటర్ ప్లాంట్ల వైపు పరుగులు తీస్తున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న వ్యాపారులు కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అయినా పట్టించుకునే అధికారులు కరువయ్యారు. కొన్ని చోట్ల బోరు, కూళాయి నీటినే శుద్ధి చేసి మినరల్ వాటర్ పేరుతో విక్రయిస్తుండడంగమనార్హం. ఆ నీటిని తాగిన ప్రజలు వారికి తెలియకుండానే అనారోగ్యం పాలవుతున్నారు. జిల్లాలో సుమారు 300 పైగా మినరల్ వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. అయితే వీటిలో ఐఎస్ఐ అనుమతి ఉన్నవి చాలా తక్కువ. మినరల్ వాటర్ ప్లాంట్ నెలకొల్పాలంటే... మినరల్ వాటర్ ప్లాంట్ నెలకొల్పాలంటే ఏడాదికి కనీసం రూ.5 నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చవుతుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) నిబంధనలు పాటించడంతోపాటు ఐఎస్ఐ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి. ప్లాంట్‌లో ఫార్మాసిస్టులు, ఇతర వర్కర్లు ఉండాలి. వారికి ప్లాంట్ యజమానులే ఆరోగ్య పరీక్షలు చేయించాలి. నీటిలో మినరల్స్ ఎంత శాతం ఉన్నాయో ఫార్మాసిస్ట్ నిర్ధారణ చేయాలి. నీటిలో లవణాలు, ఖనిజాలు సరైన మోతాదులో ఉంటేనే విక్రయించాలి. అయితే జిల్లాలోని అనేక ప్లాంట్లలో ఫార్మాసిస్టులు లేరు. ప్లాంట్లలో పనిచేసే సిబ్బందికి ఆరునెలలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించాలి. వీరిలో ఎవరికైనా అంటువ్యాధులు ఉంటే నీరు పంపిణీ చేసే సమయంలో అవి ఇతరులకు వచ్చే అవకాశం ఉంది. అందుకే తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించడంతోపాటు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పోటాపోటీ వ్యాపారం... మినరల్ వాటర్‌కు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో గల్లీకి ఒక ప్లాంట్ ఏర్పాటు చేసి పోటాపోటీగా వ్యాపారాలు చేస్తున్నారు. ఇక నీటి సరఫరాలోనూ దోపిడీ కనిపిస్తోంది. ప్లాంట్‌కు వెళ్లి తీసుకుంటే 20 లీటర్ల క్యాన్‌కు రూ.5 వసూలు చేస్తున్నారు. అదే 20 లీటర్ల క్యాన్‌ను డోర్ డెలివరీ చేయాలంటే రూ.15 చెల్లించాలి. ఇక ఫస్ట్ ఫ్లోర్, సెకెండ్ ఫ్లోర్ అంటూ ఉంటే ఒక్కో ఫ్లోర్‌కు ఒక్కో ధర నిర్ణయిస్తూ... మొత్తంగా రూ.5 నుంచి రూ.25 వరకు తీసుకుంటున్నారు. ప్రస్తుతం వేసవికాలం కావడంతో కూల్ వాటర్ క్యాన్లకు కూడా గిరాకీ ఎక్కువగానే ఉంటోంది. ఒక్కో క్యాన్ రూ.45 వరకు విక్రయిస్తున్నారు. అయితే దీనికి నిర్ణీతమైన ధరలు లేకపోవడంతో ఒక్కో ప్లాంట్ వారు ఒక్కోరకంగా వసూలు చేస్తున్నారు. ఫిల్టర్లు మార్చకుండానే.. మినరల్ వాటర్ ప్లాంట్లలో ప్రతి 10 వేల లీటర్ల నీటికి ఒకసారి ఫిల్టర్లు మార్చాల్సి ఉంటుంది. అయితే నిర్వాహకులు నెలల తరబడి వీటిని మార్చకుండానే నీరు సరఫరా చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో బోరు నీరే నేరుగా వినియోగదారులకు సరఫరా అవుతోంది. ఫిల్టర్లు మార్చకపోవడంతో బ్యాక్టీరియా పెరగడం, నాచు వంటివి పేరుకుపోయి ఆ నీరు తాగిన వారు అనారోగ్యం పాలవుతున్నారు. ఈ ప్లాంట్లను పర్యవేక్షించాల్సిన ఫుడ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికారుల పర్యవేక్షణ ఉండాలి మినరల్ వాటర్ ప్లాంట్ల పేరుతో దోపిడీ కొనసాగుతోంది. మినరల్ వాటర్ కాకుండా కేవలం శుద్ధి చేసిన నీటిని విక్రయిస్తున్నారు. రూ.5 కు 20 లీటర్ల క్యాన్ ఇవ్వాల్సి ఉండగా రూ.15 నుంచి 30 వరకు వసూలు చేస్తున్నారు. కూల్ వాటర్ టిన్స్కు రూ.40 పైగా ఉంది. వాటర్ ప్లాంట్లు నాణ్యతా ప్రమాణాలు పాటించేలా అధికారుల పర్యవేక్షణ ఉండాలి.– వల్లాల భరత్, కొత్తగూడెం -
‘శుద్ధ’ అబద్ధం
దాతలు ముందుకు రాక నీరు గారిన ఎన్టీఆర్ సుజల పథకం పక్కనే ఉన్న కర్ణాటక పల్లెల్లో మినరల్ వాటర్ ప్లాంట్లు బి.కొత్తకోట: ఎన్నికల్లో గెలిస్తే స్వచ్ఛమైన నీరందిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ప్రకటించారు. ఇది ప్రభుత్వం అమలు చేసే పథకమనుకుంటే పొరపాటే. స్థానిక పంచాయతీలు నీరు, విద్యుత్, షెడ్డు, పైప్‌లైన్ వేసి సిద్ధం చేస్తే దాతలు యంత్రాలు ఏర్పాటుచేస్తే మినరల్ వాటర్ అందిస్తారు. ప్రత్యేకంగా ప్రభుత్వం నిధులు కేటాయించదు. 12,619 పల్లెలున్న జిల్లాలో కేవలం 111 పల్లెల్లో దాతల సహకారంతో సుజల స్రవంతి ప్లాంట్లు ఏర్పాటుచేశారు. అయితే పర్యవేక్షణ లేక వాటిలో చాలా నిరుపయోగంగా ఉన్నాయి. దాతలు ముందుకు రాకపోవడంతో శుద్ధ జలం తాగే భాగ్యం జిల్లా ప్రజలకు ఇప్పట్లో లేదని స్పష్టమవుతోంది. అయితే పక్కనే ఉన్న కర్ణాటకకు చెందిన పల్లెల్లో మినరల్ వాటర్ తాగుతుంటే.. ‘మేమేం పాపం చేశాం’ అంటూ సరిహద్దులో ఉన్న జిల్లాకు చెందిన జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో పల్లె పల్లెకూ మినరల్ వాటర్ పొరుగునే ఉన్న కర్ణాటకలోని గ్రామీణులు ఫ్లోరైడ్ నీటినుంచి విముక్తి లభించింది. 2014–15లో తొలుత 107 నియోజకవర్గాల్లోని 1,000 పల్లెల్లో ఆ ప్రభుత్వం మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేపట్టి విస్తరించుకుంటూ వెళ్తోంది. ప్లాంట్లను ఏర్పాటుతో వదిలేయక వాటి నిర్వహణ కోసం ప్రణాళికలు అమలు చేస్తోంది. 50 కుటుంబాలున్న పల్లెలోనూ మినరల్ వాటర్ ప్లాంట్ కనిపిస్తోంది. గ్రామంలోని కుటుంబాల సంఖ్యను బట్టి ప్లాంటు స్థాయి పెంచుతోంది. కేవలం రూ.2తో శుద్ధిచేసిన 20లీటర్ల జలం గ్రామీణులకు అందిస్తోంది. నీటి పరీక్షలకు అధికార బృందం కర్ణాటకలోని వాటర్ ప్లాంట్ల నుంచి ప్రజలకు అందిస్తున్న నీటి విషయంలో నిత్యం పరీక్షలు, పరిశీలనల కోసం ప్రభుత్వం అధికారిక కమిటీని ఏర్పాటుచేసింది. జిల్లా పంచాయతీ అధికారి, గ్రామీణ తాగునీరు, శుద్ధనీరు విభాగం, ప్రభుత్వం నియమించిన ఒకరు, ఇంజినీరింగ్ శాఖ నుంచి ఒకరు, కెమికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ఫ్రొఫెసర్ ఒకరు, వాతావరణ కాలుష్యం, నియంత్రణ మండలికి చెందిన ఒకరు, ల్యాబొరేటరీ కెమిస్ట్, గణాంకశాఖ, భూగర్భగనుల శాఖలకు చెందిన అధికారులు మినరల్ వాటర్ ప్లాంట్లను తనిఖీలు నిర్వహించి పరీక్షలు నిర్వహించి ధ్రువీకరణ జారీ చేస్తారు. దీనికోసం ప్లాంటు నిర్వహణదారులు ఒక్కో పరీక్షకు రూ.500 చెల్లించాలి. వీటి నిర్వహణను ప్రయివేటు అప్పగించినా అధికారుల పర్యవేక్షణలో సాగుతున్నాయి.