‘శుద్ధ’ అబద్ధం
దాతలు ముందుకు రాక నీరు గారిన ఎన్‌టీఆర్ సుజల పథకం
పక్కనే ఉన్న కర్ణాటక పల్లెల్లో మినరల్ వాటర్ ప్లాంట్లు
బి.కొత్తకోట: ఎన్నికల్లో గెలిస్తే స్వచ్ఛమైన నీరందిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ప్రకటించారు. ఇది ప్రభుత్వం అమలు చేసే పథకమనుకుంటే పొరపాటే. స్థానిక పంచాయతీలు నీరు, విద్యుత్, షెడ్డు, పైప్‌లైన్ వేసి సిద్ధం చేస్తే దాతలు యంత్రాలు ఏర్పాటుచేస్తే మినరల్ వాటర్ అందిస్తారు. ప్రత్యేకంగా ప్రభుత్వం నిధులు కేటాయించదు. 12,619 పల్లెలున్న జిల్లాలో కేవలం 111 పల్లెల్లో దాతల సహకారంతో సుజల స్రవంతి ప్లాంట్లు ఏర్పాటుచేశారు. అయితే పర్యవేక్షణ లేక వాటిలో చాలా నిరుపయోగంగా ఉన్నాయి. దాతలు ముందుకు రాకపోవడంతో శుద్ధ జలం తాగే భాగ్యం జిల్లా ప్రజలకు ఇప్పట్లో లేదని స్పష్టమవుతోంది. అయితే పక్కనే ఉన్న కర్ణాటకకు చెందిన పల్లెల్లో మినరల్ వాటర్ తాగుతుంటే.. ‘మేమేం పాపం చేశాం’ అంటూ సరిహద్దులో ఉన్న జిల్లాకు చెందిన జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కర్ణాటకలో పల్లె పల్లెకూ మినరల్ వాటర్
పొరుగునే ఉన్న కర్ణాటకలోని గ్రామీణులు ఫ్లోరైడ్ నీటినుంచి విముక్తి లభించింది. 2014–15లో తొలుత 107 నియోజకవర్గాల్లోని 1,000 పల్లెల్లో ఆ ప్రభుత్వం మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేపట్టి విస్తరించుకుంటూ వెళ్తోంది. ప్లాంట్లను ఏర్పాటుతో వదిలేయక వాటి నిర్వహణ కోసం ప్రణాళికలు అమలు చేస్తోంది. 50 కుటుంబాలున్న పల్లెలోనూ మినరల్ వాటర్ ప్లాంట్ కనిపిస్తోంది. గ్రామంలోని కుటుంబాల సంఖ్యను బట్టి ప్లాంటు స్థాయి పెంచుతోంది. కేవలం రూ.2తో శుద్ధిచేసిన 20లీటర్ల జలం గ్రామీణులకు అందిస్తోంది.
నీటి పరీక్షలకు అధికార బృందం
కర్ణాటకలోని వాటర్ ప్లాంట్ల నుంచి ప్రజలకు అందిస్తున్న నీటి విషయంలో నిత్యం పరీక్షలు, పరిశీలనల కోసం ప్రభుత్వం అధికారిక కమిటీని ఏర్పాటుచేసింది. జిల్లా పంచాయతీ అధికారి, గ్రామీణ తాగునీరు, శుద్ధనీరు విభాగం, ప్రభుత్వం నియమించిన ఒకరు, ఇంజినీరింగ్ శాఖ నుంచి ఒకరు, కెమికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ఫ్రొఫెసర్ ఒకరు, వాతావరణ కాలుష్యం, నియంత్రణ మండలికి చెందిన ఒకరు, ల్యాబొరేటరీ కెమిస్ట్, గణాంకశాఖ, భూగర్భగనుల శాఖలకు చెందిన అధికారులు మినరల్ వాటర్ ప్లాంట్లను తనిఖీలు నిర్వహించి పరీక్షలు నిర్వహించి ధ్రువీకరణ జారీ చేస్తారు. దీనికోసం ప్లాంటు నిర్వహణదారులు ఒక్కో పరీక్షకు రూ.500 చెల్లించాలి. వీటి నిర్వహణను ప్రయివేటు అప్పగించినా అధికారుల పర్యవేక్షణలో సాగుతున్నాయి.