‘నీరు’గార్చారు | NTR Sujala Scheme Delayed in East Godavari | Sakshi
Sakshi News home page

‘నీరు’గార్చారు

Published Wed, Jan 23 2019 8:10 AM | Last Updated on Wed, Jan 23 2019 8:10 AM

NTR Sujala Scheme Delayed in East Godavari - Sakshi

అంగరలో మూతపడిన చంద్రబాబు ప్రారంభించిన ప్లాంటు

సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఎన్టీఆర్‌ సుజల పథకం అమలుకు చంద్రబాబు సంతకం చేశారు. 2014 అక్టోబరు 4నకపిలేశ్వరపురం మండలం అంగర నుంచి తొలి విడత జన్మభూమి ప్రారంభించిన అనంతరం, మొట్టమొదటి ఎన్టీఆర్‌ సుజల ప్లాంటును ఈ గ్రామంలోనే ప్రారంభించారు. ఇంకేముంది గ్రామ గ్రామానా ఈ ప్లాంట్లు ఏర్పాటై ప్రతి ఇంటికీ రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్‌ వాటర్‌ అందుతుందని అందరూ ఆశించారు. అయితే దీనికి భిన్నంగా పథకం అమలు మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. స్వయాన చంద్రబాబు ప్రారంభించిన తొలి ప్లాంటే నిర్వహణ లేమితో మూతపడిపోగా మిగిలినచోట్ల ఈ పథకం నీరుగారిపోయింది. రక్షిత నీటి హామీని గాలికొదిలేసిన సర్కారు రివర్స్‌ ఓస్మోసిస్‌ (ఆర్‌ఓ) ప్లాంట్ల ఏర్పాటు కోసం విచ్చలవిడిగా అనుమతులిస్తోంది. వీటి ద్వారా జిల్లాలో రోజుకు సుమారు రూ.1.10 కోట్ల మేర నీటి వ్యాపారం జరుగుతోంది.

తూర్పుగోదావరి , మండపేట: జిల్లాలోని 1,069 పంచాయతీలకుగాను దాదాపు 265 పంచాయతీల్లో మాత్రమే దాతల సహకారంతో ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకాలను ఏర్పాటుచేసి చేతులు దులుపుకుంది చంద్రబాబు సర్కారు. మరో రెండు నెలల్లో  సర్కారు పదవీకాలం ముగుస్తుండగా మిగిలినచోట్ల వీటి ఏర్పాటు ప్రతిపాదనల దశలోనే కొట్టుమిట్టాడుతోంది. తాగునీటి సమస్య అధికంగా ఉన్న సముద్ర తీరప్రాంత గ్రామాల్లో ప్లాంట్లు ఏర్పాటు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. 20 లీటర్ల నీటికి రెండు రూపాయలు తీసుకోవాల్సి ఉండగా, అధికశాతం రూ. ఐదు నుంచి రూ. 10 వరకూ తీసుకుంటున్నారు. కపిలేశ్వరపురం మండలం అంగరలో సీఎం చంద్రబాబు ప్రారంభించిన సుజల ప్లాంటు నిర్వహణ భారంతో మూతపడి ఆరు నెలలు కావస్తోంది. ప్రారంభించిన కొన్నాళ్లకే ఈ ప్లాంటు మూతపడగాపార్టీకి చెడ్డపేరు వస్తుందని కొంతకాలంపాటు స్థానిక అధికార పార్టీ నేతలు చందాలు వేసుకుని నిర్వహించారు. ఆరు నెలల క్రితం మూతపడగా మళ్లీ ఎవరూ ముందుకు రాలేదని గ్రామస్తులు అంటున్నారు. నిర్వహణ భారంతోపాటు మరమ్మతులు వస్తే చేయించే వారు లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ప్లాంట్లు ఇప్పటికే మూతపడ్డాయి. మరికొన్ని మూసివేత దిశగా పయనిస్తున్నాయి. కరప మండలం పెద్దాపురప్పాడు, తుని మండలం వి. కొత్తూరు, కోటనందూరు మండలం కొట్టాం, కేఏ మల్లవరం, రంగంపేట మండలం ఈలకొలను, తదితర గ్రామాల్లో ఇప్పటికే ‘ఎన్‌టీఆర్‌ సుజల’ కేంద్రాలు మూతపడ్డాయి.

పుట్టగొడుగుల్లా ప్రైవేటు ప్లాంటులు...
ప్రైవేటు ఆర్‌ఓ ప్లాంట్లు జిల్లాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఐఎస్‌ఐ రివర్స్‌ అస్మోసిస్‌ (ఆర్‌ఓ) ప్లాంటు పెట్టాలంటే దాదాపు రూ.30 లక్షలు వరకూ వ్యయమవుతుంది. స్థానిక సంస్థల్లో అనుమతులు పొంది ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటికి ఐఎస్‌ఐ సర్టిఫికెట్‌ ఉన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. సాధారణ ప్లాంట్లు జిల్లాలో సుమారు 1,410 వరకూ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 20 లీటర్ల క్యాన్‌ రూ.5 నుంచి రూ.10 వరకూ విక్రయిస్తుండగా, పట్టణ ప్రాంతాల్లో రెట్టింపు ధర వసూలు చేస్తున్నారు. ఇళ్లకు చేరవేస్తే రవాణ చార్జీలు అదనం. ఈ మేరకు జిల్లాలో రోజుకు సుమారు రూ. 1.10 కోట్లు నీటి వ్యాపారం జరుగుతోంది. ప్లాంట్లలో కేవలం ఆర్‌ఓ టెక్నాలజీ ద్వారా నీటిలోని మలినాలను మాత్రమే శుద్ధి చేస్తున్నారు. నిల్వ చేసిన నీటిలో వైరస్‌ చేరకుండా వినియోగించే ఓజేనేషన్‌ సిస్టమ్, బ్యాక్టీరియాను శుద్ధిచేసే యూవీ సిస్టమ్‌లు అధికశాతం ప్లాంట్లలో ఉండటం లేదని నిపుణులు అంటున్నారు. కొన్నిచోట్ల కుళాయి నీటిని ప్యాకింగ్‌ చేసి మినరల్‌ వాటర్‌గా అమ్మకాలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బోర్లు, బావుల్లోని నీటిని తాగలేక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ప్లాంట్లను జనం ఆశ్రయించి జేబులను గుల్ల చేసుకుంటున్నారు. ఈ నీటిలో నాణ్యత ఎంతన్నది పరీక్షించే నా«థుడు లేక ఆనారోగ్య సమస్యలతో అవస్థలు పడుతున్నారు.

మరమ్మతు రావడంతోనిలిచిపోయింది
అంగరలోని ఎన్టీఆర్‌ సుజల  ప్లాంట్‌లో యంత్రానికి మరమ్మతు రావడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. పంచాయతీ నిధులతో మరమ్మతు చేపట్టేందుకు ప్రతిపాదనలు చేశాం. పంచాయతీ అధికారుల సంయుక్త కృషితో  త్వరితగతిన నీటి సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నాం.– రామకృష్ణారెడ్డి, జేఈ, ఆర్‌డబ్ల్యూఎస్,కపిలేశ్వరపురం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement