తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం టీడీపీలో వర్గపోరు భగ్గుమంటోంది. ఇన్‌చార్జ్‌గా ఉన్న నేతను తప్పించి మరొకరిని నియమించడంతో విభేదాలు తారాస్థాయికి చేరాయి. పై చేయి సాధించేందుకు రెండు వర్గాలు హోరా హోరీ తలపడుతున్నాయి. ఏ వర్గమూ బెట్టు వీడకపోవడంతో.. అంతంత మాత్రంగా ఉన్న కేడర్ రెండు వర్గాల మధ్య నలిగిపోతోంది.
రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని గోపాలపురం తెలుగుదేశం పార్టీలో వర్గ పోరు కాక రేపుతోంది. నియోజకవర్గ పార్టీ ఇన్ ఛార్జ్ ని మార్చినప్పటి నుండి ఇక్కడ అసమ్మతి సెగలు రగులుతున్నాయి. గోపాలపురం ఇన్చార్జి గా ఉన్న మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పనితీరుపై విశ్వాసం కోల్పోయిన చంద్రబాబు ఆయన స్థానంలో మద్దిపాటి వెంకటరాజును నియమించారు. దీంతో గోపాలపురంలో ముప్పిడి, మద్దిపాటి వర్గాల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. కొత్త ఇంచార్జ్ మద్దిపాటి వెంకటరాజు తమను పట్టించుకోవడంలేదని, తనకు కావాల్సిన వారికే పదవులు ఇచ్చుకుంటున్నారని ముప్పిడి వర్గం మండిపడుతోంది.
ఇన్ చార్జ్ గా మద్దిపాటిని తప్పించి మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావునే మళ్ళీ కొనసాగించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమం రోజే దేవరపల్లిలో రెండు వర్గాలు కొట్టుకున్నాయి. తాజాగా ద్వారకా తిరుమల మండలంలో కూడా మద్దిపాటికి వ్యతిరేకంగా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. మద్దిపాటి వెంకట్రాజు తీరుపై నియోజకవర్గ టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. కొంత మంది బడా నాయకుల్ని వెంట బెట్టుకుని మద్దిపాటి రాజకీయం చేస్తున్నాడని, గ్రామాల్లో యువకులకు పెత్తనమిచ్చి, నాయకులను అసమర్థులుగా తయారుచేశాడని, కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడని సీనియర్లు మండిపడుతున్నారు.
మంగళగిరి కార్యాలయంలో 200 మంది నాయకులు, కార్యకర్తలు మద్దిపాటి నాయకత్వాన్ని వ్యతిరేకించినా అర్ధరాత్రి 12 గంటలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అతడినే ఇన్చార్జిగా ప్రకటించడం దారుణమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తామంతా పార్టీ కోసం కష్టపడుతున్నామని, డబ్బు తగలేసుకుని పార్టీని నిలబెట్టుకుంటున్నా విలువలేకుండా చూస్తున్నారంటూ వాపోతున్నారు. రాజమండ్రి మహానాడు పూర్తయినందున త్వరలోనే నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఇన్చార్జి విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని నాయకులు నిర్ణయించారు.
పార్టీ కోసం శ్రమిస్తున్నవారిని పట్టించుకోవడంలేదని, ఇన్‌చార్జ్ నియామకం విషయంలో అందరికీ అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని పార్టీ పరిస్తితిని అధిష్టానానికి తెలియచేద్దామని, తమ కష్టాన్ని పరిగణలోకి తీసుకోకపోతే అప్పుడే తగిన నిర్ణయం తీసుకుందామని మద్దిపాటి వెంకటరాజును వ్యతిరేకిస్తున్న వర్గం నిర్ణయించుకుంది. చంద్రబాబు నిర్ణయం తమకు అనుకూలంగా లేకపోతే తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని గోపాలపురం తెలుగుతమ్ముళ్ళు తెగేసి చెబుతున్నారు.
చదవండి: అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు భేటీపై మంత్రి పెద్దిరెడ్డి రియాక్షన్
Comments
Please login to add a commentAdd a comment