
రౌడీ ఎమ్మెల్యే అనే ట్యాగ్ లైను వేసుకోవడానికి తెగ ఇష్టపడే దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు ఇప్పుడు గడ్డు కాలం వచ్చింది.. 'ఆయనొద్దు.. ఇంకెవరైనా ఫర్లేదు' అంటూ తెలుగు తమ్ముళ్లు అక్కడక్కడా ఫ్లెక్సీలు కట్టడం తెలుగుదేశాన్ని.. చంద్రబాబును కలవరపరుస్తోంది. నోటి దురుసుకు చేయి జోరుకు మారు పేరుగా నిలిచిన చింతమనేని గతంలో టీడీపీ హయాంలో ఉన్నపుడు మహా ఉజ్వలంగా వెలిగిపోయారు. తన దెందులూరు నియోజకవర్గానికి ఆయనే ముఖ్యమంత్రి, రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్, గనులు.. ఇలా అన్ని శాఖలకూ ఆయనే అధిపతి. అడ్డొస్తే అడ్డంగా నరికేసినంత పని చేసేవారు.
ఆ దూకుడులో భాగంగానే ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్న ఎమ్మార్వో వనజాక్షిని ఈడ్చి కొట్టి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఆ తరువాత అనుమతులు లేకుండా అడవీ భూముల్లో రోడ్లు వేస్తుండగా అడ్డుకున్న ఫారెస్ట్ సిబ్బందిని కొట్టారు.. అంతేకాకుండా అధికారంలో ఉన్నపుడు నోటి దురుసును అడ్డూ అదుపూ లేకుండా పోయేది. 'ఏంటీ పవన్ కళ్యాణ్ మద్దతుతో కదా మీరు గెలిచారు' అని అడిగితే.. 'హహ.. పవన్.. ఒక సన్నాసి.. సొంత అన్నను పాలకొల్లులో గెలిపించలేనివాడు మా చంద్రబాబును గెలిపిస్తాడా..? ఊరుకోండయ్యా..' అని సెటైర్లు వేశారు. 'ఒరేయ్ మీరు ఎస్సీలు..! మీకెందుకురా రాజకీయాలు..? మేము రాజకీయాలు చేస్తాం' అని ఓపెన్ సభలో చెప్పడం కూడా ఆయనకే చెల్లింది.
ఆ తరువాత ప్రభుత్వంతో పాటు అతనూ ఓడిపోయినా కూడా.. అయన జోరు తగ్గకపోయేసరికి పోలీస్ కేసుల్లో పడ్డారు. మళ్ళీ బయటకు వచ్చాక అదే దూకుడు చూపడం మొదలైంది. మొన్నటికి మొన్న తన వ్యవసాయ భూముల్లో మేకలు మేస్తున్నాయని కొందరు మేకలకాపరులమీద దాడి చేయడమే కాకుండా రెండు మేకలు సైతం తన కార్లో ఎత్తుకెళ్ళి తనకు ఎదురే లేదని మరోమారు చాటిచెప్పారు. అది కాస్తా వివాదంగా.. యాదవులు సంఘటితమై గళం ఎత్తేసరికి ఆయన కాస్త వెనక్కితగ్గారు. ఇదిలా ఉండగా ఆయనకు మళ్ళీ దెందులూరు టికెట్ ఇస్తారని వార్తలు వస్తున్నా నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా పోస్టర్లు, ఫ్లెక్సీలు మొదలయ్యాయి.
'ప్రజా వ్యతిరేకి.. రౌడీ అయిన చింతమనేని మాత్రం వద్దు.. ఇంకెవరైనా ఫర్లేదు' అంటూ అయన వ్యతిరేకులు, కొందరు టీడీపీ నాయకులూ ఫ్లెక్సీలు పెట్టారు. ఇది కాస్తా చింతమనేని ప్రభాకర్కు ఇబ్బందికరంగా మారింది. తనను ఓడించిన వైఎస్సార్సీపీ నాయకుడు అబ్బయ్య చౌదరి మీద ప్రతీకారం తీర్చుకుంటానని భావించి.. ఎన్నికలకోసం వెయిట్ చేస్తున్న చింతమనేని ప్రభాకర్కు ఇప్పుడు ఇలా వ్యతిరేకపవనాలు వీయడం ఇబ్బందికరంగా మారింది. మరి చంద్రబాబు ఆయనను మారుస్తారో.. కొత్తవాళ్లను తీసుకొస్తారో.. లేదా 'రౌడీలకు టిక్కెట్లు ఇవ్వకపోతే ఎలా ? వాళ్ళే కదా అసలైన నాయకులూ' అని భావించి మళ్ళీ ఆయనకే టికెట్ ఇస్తారో చూడాలి.
-- సిమ్మాదిరప్పన్న
ఇవి చదవండి: చంద్రబాబు.. లోకేశ్‌కు మేము పేరు పెట్టలేమా?: మంత్రి బుగ్గన ఫైర్
Comments
Please login to add a commentAdd a comment