తెలుగుదేశం పార్టీకి ఇదేం ఖర్మో?. ఇదేం ఖర్మరా బాబూ అంటూ చంద్రబాబు నిర్వహిస్తున్న సభలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. పార్టీ అధినేతకే దిక్కు లేనపుడు నియోజకవర్గ స్థాయి నేతల పరిస్థితి ఎలా ఉంటుంది?. అనేక చోట్ల మాజీ మంత్రుల సభలకు జనం రావడంలేదని చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. జనం లేని సభల గురించి దృష్టి మరల్చడానికి పచ్చ పార్టీ నాయకులు వేస్తున్న ఎత్తులు ఏంటి?..
రాష్ట్ర ప్రజల్ని ఆకర్షించడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ని పాట్లు పడుతున్నా.. వారిని ఎవరూ పట్టించుకోవడంలేదు. సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహిస్తున్న సభలకే జనం లేక దిగులు చెందుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏమీ లేక ప్రజల్ని రెచ్చగొడదామనే ఉద్దేశంతో ఇదేం ఖర్మరా బాబూ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్నారు. స్థానిక నాయకులు ఎంత ప్రయత్నించినా ఏ సభా సక్సెస్ కావడంలేదు. చంద్రబాబు సభలకే దిక్కులేకపోతే.. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా అదే తరహా సభలు నిర్వహిస్తూ ఖాళీ కుర్చీలకు ఉపన్యాసాలిస్తున్నారు. జనం లేరని చీప్ ట్రిక్స్‌కు పాల్పడుతున్నారు అయ్యన్న.
అయ్యన్న ఎప్పుడు.. ఎలా మాట్లాడుతారో ఆయనకే తెలియదు. సభల్లో మహిళలు ఉన్నారన్న ఇంగితం కూడా లేకుండా బహిరంగంగా బూతులు మాట్లాడతారు. అసందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌పై నోటికొచ్చినట్లు మాట్లాడతారు. దీంతో అయ్యన్న సభలంటే ప్రజలకే కాదు.. టీడీపీ కార్యకర్తలకు కూడా విసుగు పడుతోంది. అయ్యన్న తీరుతో నర్సీపట్నం నియోజకవర్గంలో ఆయన నిర్వహించే ఇదేం ఖర్మ రా బాబు కార్యక్రమానికి స్పందన లేకుండా పోయింది. అయ్యన్న ప్రసంగించే సమయంలో కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. తన సభలకు జనాలు రాకపోవడంతో వైయస్సార్సీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడ్డారంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా.. చంద్రబాబు మాదిరిగానే అయ్యన్నపాత్రుడు కూడా వ్యవహరిస్తున్నారు.
నాతవరం మండలంలో జరిగిన సభ అట్టర్ ప్లాప్ అయ్యింది. ప్రజలే కాదు టీడీపీ కార్యకర్తలు కూడా ఈ సభను పట్టించుకోలేదు. వేదిక మీద తెలుగుదేశం పార్టీ నాయకులు తప్ప వేదిక కింద ఎవరూ లేరు. దీంతో టీడీపీ సభ వేదిక పైకి ఎవరో రాయి విసిరారంటూ నానా హంగామా సృష్టించారు. దమ్ము, ధైర్యం ఉంటే చూసుకుందాం రండి అంటూ సవాల్ చేశారు. వాస్తవానికి అయ్యన్న సభ వేదికపై ఎవరూ రాళ్లు విసరలేదు. ఒకవేళ ఎవరైనా రాయి విసిరితే టీడీపీ కార్యకర్తలు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు?. విసిరిన రాళ్ళను ఎందుకు చూపించలేదు?. పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు?. రాళ్ళు విసిరినవారిని ఎందుకు పట్టుకోలేదు?. నిజంగా రాళ్ళు విసిరి ఉంటే ఎల్లో మీడియా ఊరుకుంటుందా?. రాళ్ళు విసిరితే సభ వేదికపై టీడీపీ నేతలు తాపీగా జీడిపప్పు తింటూ కూర్చుంటారా?. ఈ ప్రశ్నలకు టీడీపీ నేతల నుంచి సమాధానం లేదు.
టీడీపీ నేతల సభలకు జనాలు రాకపోవడం వల్లనే ఇటువంటి నీతిమాలిన రాజకీయాలకు దిగుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రస్థాయిలో చంద్రబాబు ఇటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తుంటే.. నియోజకవర్గాల్లో అయ్యన్న లాంటి నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా టీడీపీ నేతలు ఇటువంటి సిగ్గుమాలిన రాజకీయాలకు స్వస్తి పలకాలని సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ‘పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాల్సింది మోదీ కాదు’
Comments
Please login to add a commentAdd a comment