సాక్షి, తాడేపల్లి: ఏపీలో సోషల్ మీడియా యాక్టివిస్టులపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందన్నారు వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్. అక్రమ కేసులు పెట్టి పోలీసు స్టేషన్‌లో చిత్ర హింసలు పెడుతోంది. అసలు మనం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నామా? లేదా? అని ప్రశ్నించారు.
అక్రమ కేసులపై వైఎస్సార్‌సీపీ నేత మార్గాని భరత్ మీడియాతో మాట్లాడుతూ.. దళిత యువకుడిపై అక్రమ కేసు బనాయించి హింసించారు. వర్షాలతో రాజమండ్రి రోడ్లు మునిగిపోతే ప్రశ్నించకూడదా?. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రోద్బలంతోనే హింసించారు. ఏపీలో దళితులకు రక్షణ లేకుండా పోయింది. బాజీలాల్ అనే సీఐ దళిత యువకుడిని దారుణంగా కొట్టారు. దుస్తులు ఊడతీయించి మహిళా కానిస్టేబుల్ ఎదుట కూర్చోపెట్టారు. పరువు పోయిందని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తాం.
అక్రమ కేసులపై బాధితుడు పులి సాగర్ మాట్లాడుతూ.. వర్షానికి కాలనీలో నీళ్లు నిలిచిపోతే సోషల్ మీడియాలో పోస్టు పెట్టాను. అనంతరం, పోలీసులు స్టేషన్‌కు పిలిచి పచ్చి బూతులు తిట్టారు. చంపేస్తామని బెదిరించి పోలీసు స్టేషన్‌లో బట్టలూడదీశారు. పీక కోసి రైలుపట్టాలపై పడేస్తానని ప్రకాష్‌నగర్ సీఐ బెదిరించారు. గోదావరిలో పడేస్తామని సీఐ దూషించారు. కానిస్టేబుల్‌తో దుస్తులు ఊడతీయించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు దుస్తుల్లేకుండా లాకప్‌లో కూర్చోపెట్టారు. మహిళా పోలీసుల ఎదుట నా పరువు తీశారు. విద్యావంతుడినైనా నన్ను ఇంత చిత్రహింసలకు గురి చేయటం ఎందుకు?. నాకు ఈ రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్చ లేదా? అని ప్రశ్నించారు.
మరోవైపు.. వైఎస్సార్‌సీపీ నేత టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ.. దళితులు అంటే చంద్రబాబుకు మొదటి నుంచి చులకన భావమే. చంద్రబాబు దళిత వ్యతిరేకి. సమస్యలపై సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే తప్పేంటి?. సాగర్‌ను బండబూతులు తిట్టి, బట్టలు విప్పిన సీఐపై చర్యలు తీసుకోవాలి. పోలీసులు ఇంత దారుణంగా ప్రవర్తించాల్సిన అవసరం ఏముంది?. కూటమి పాలనలో కులం పేరుతో దూషణలు, దళిత వ్యతిరేక భావనలు ఉన్నాయి. కూటమి సర్కార్ పూర్తిగా లిమిట్స్ దాటిపోయింది. బాధితుడు సాగర్‌కు జరిగిన అన్యాయంపై పోరాడుతామని చెప్పారు. రైలు కింద అతని తలకాయ పెడతానని బెదిరించారు. తాడు కట్టి గోదావరిలో వేస్తామనటం ఏంటి?. సీఐ బాజీలాల్‌ని వెంటనే సస్పెండ్ చేయాలి. దళితులంతా ఏకతాటిపైకి వచ్చి ఈ విషయంపై స్పందించాలి. పెద్ద ఎత్తు ఉద్యమం చేస్తాం. దళిత అధికారులపై కూడా కక్ష కట్టి వేధిస్తున్నారు. టీడీపీ నేతల కళ్లల్లో ఆనందం చూడటం కోసమే పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఎదురుగా కనిపిస్తున్న తప్పులను ప్రశ్నిస్తే కూడా కేసులు పెడతారా?. దళితుల గొంతు మీద కాలు పెట్టి తొక్కుతున్నారు. దళిత అధికారులు, దళిత మహిళలపై దారుణాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో దళితులకు బతికే అవకాశం లేకుండా చేస్తున్నారు. పులి సాగర్ విషయంలో న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం అని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment