తాండూరు: మార్కెట్ యార్డులో వ్యాపారులకు మక్కలు అమ్మితే నష్టపోతామనే ఉద్దేశంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయిస్తే ఇక్కడ కూడా వంచనకు గురైతే ఇక రైతులకెవరు దిక్కు. డీసీఎంఎస్ అధికారులు కొనుగోలు చేసిన మక్కలను మార్క్‌ఫెడ్ తిరస్కరిస్తోంది. కొనుగోలు చేసిన పంటలో నాణ్యతా ప్రమాణాలు సరిగా లేవనే కారణంతో సీడబ్ల్యూసీకి వెళ్లిన దిగుబడులను తిరస్కరిస్తున్నారు.
బాణాపూర్, ఎల్మకన్నె, సంకిరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన రైతులు రాజు, డాక్యానాయక్, పాండురంగారెడ్డి, అమృతారెడ్డిల నుంచి ఈ నెల 8, 10, 14 తేదీల్లో 228.50 క్వింటాళ్ల మొక్కజొన్నలను కొనుగోలు చేసి సీడబ్ల్యూసీ తాండూరు కేంద్రం నుంచి అధికారులు లారీలో తరలించారు. ఆయా రైతులకు చెందిన మక్కలు నాణ్యతగా లేవని అక్కడి అధికారులు తిరస్కరించారు. దీంతో కొంత చిక్కు వచ్చింది. కొనుగోలు చేసి రసీదులు ఇచ్చిన తర్వాత నాణ్యతగా లేవని నిర్ధారించడంతో రైతులను ఆందోళనకు గురి చేసింది.
ఈ ప్రభావంతో తాండూరులోని కొనుగోలు కేంద్రంలో మొక్కజొన్నల తూకాలు నిలిచిపోవడంతో కొనుగోళ్లకు బ్రేక్ పడింది. తాము కొనుగోలు చేసి గోదాంకు తరలిస్తే అక్కడికి వెళ్లిన తర్వాత నాణ్యతగా లేవని తిరస్కరిస్తే రైతులకు మేం ఏం సమాధానం చెప్పాలని స్థానిక డీసీఎంఎస్ సిబ్బంది చెబుతున్నారు. దీంతో సోమవారం వివిధ గ్రామాలకు చెందిన సుమారు 200 బస్తాల మక్కలు కొనుగోలు కేంద్రానికి వచ్చాయి. వీటిని కొనుగోలు చేసిన పంపించిన తర్వాత తిరస్కరిస్తున్నందున తూకాలు చేయలేమని డీసీఎంఎస్ గోదాం సిబ్బంది చెబుతున్నారు. సంబంధిత అధికారులు వచ్చి నాణ్యతా ప్రమాణాలు సరిగా ఉన్నాయని చెబితేనే తూకాలు వేస్తామని డీసీఎంఎస్ గోదాం ఇన్‌చార్జి ఎల్లయ్య స్పష్టం చేశారు.
రూ.12.57 లక్షల విలువైన మక్కల సేకరణ
అక్టోబర్ 15న తాండూరులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఆరంభమైంది. అదే నెల 28 నుంచి కొనుగోళ్లు మొదలయ్యాయి. ఈ నెల 15 వరకు 26 మంది రైతుల నుంచి ఏ, బీ, సీ గ్రేడ్‌లకు చెందిన రూ.12.57లక్షల విలువ చేసే దాదాపు 997.50 క్వింటాళ్ల మొక్కజొన్నలను రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఇందులో ఇప్పటి వరకు సుమారు రూ.3 లక్షల వరకు రైతులకు చెల్లించారు. మిగతా డబ్బులు చెల్లించాల్సి ఉంది.
‘గ్రేడింగ్’ దగా!
Published Mon, Nov 17 2014 11:59 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM