Mark fed
-
రిటైల్ రంగంలోకి మార్క్ ఫెడ్
సాక్షి, అమరావతి: ఏపీ సహకార మార్కెటింగ్ సమాఖ్య (మార్క్ ఫెడ్) రిటైల్ వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది. రైతుల నుంచి సేకరించే వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేసి అందుబాటు ధరల్లో నాణ్యమైన నిత్యావసర సరుకుల్ని తెలుగు ప్రజల ముంగిటకు తీసుకెళ్తోంది. తొలి విడతగా బియ్యం, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, మినప్పప్పు, పసుపు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఎండు మిర్చి, కారం వంటి 12 రకాల నిత్యావసర సరుకులను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందుకోసం మార్క్‌ఫెడ్ అండర్ టేకింగ్ ఫర్ పీపుల్ (మార్కప్) పేరిట నెలకొల్పిన కంపెనీ లోగోను బుధవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, మార్క్ ఫెడ్ చైర్మన్ నాగిరెడ్డి, మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మధుసూదనరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం మార్కప్ ఉత్పత్తులను విడుదల చేశారు. రైతుల సంక్షేమం కోసమే మార్కప్: కన్నబాబు ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన మేరకు రైతుల నుంచి సేకరిస్తున్న ఆహార ఉత్పత్తుల అమ్మకంలో నష్టాలను అధిగమించే లక్ష్యంతోనే మార్క్‌ఫెడ్ రిటైల్ రంగంలోకి అడుగుపెట్టిందన్నారు. రైతుల నుంచి సేకరించే ఉత్పత్తులతో పాటు మార్కెట్లో డిమాండ్ ఉన్న ఇతర నిత్యావసర సరుకులను కూడా విక్రయించడం వల్ల అదనపు లబ్ధి చేకూరుతుందన్నారు. హెరిటేజ్, రిలయన్స్ వంటి సంస్థలు లాభార్జనే ధ్యేయంగా పనిచేస్తాయని, మార్కప్ మాత్రం రైతులు, వినియోగదారుల క్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని చెప్పారు. వీటిని ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు (పీఏసీఎస్), డీసీఎంఎస్, ఎంప్లాయీస్ కో–ఆపరేటివ్ స్టోర్స్, రైతు బజార్లు, డ్వాక్రా బజార్లు, ఎఫ్‌పీవోల ద్వారా మార్కెట్లోకి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. మార్క్‌ఫెడ్ చైర్మన్ నాగిరెడ్డి మాట్లాడుతూ.. ధరల స్థిరీకరణ ద్వారా గడచిన మూడేళ్లలో కనీస మద్దతు ధర దక్కని వ్యవసాయ ఉత్పత్తులను పెద్దఎత్తున కొనుగోలు చేసి రైతులకు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. ఇలా సేకరిస్తున్న ఉత్పత్తులను ప్రాసెస్ చేసి మార్కెట్లోకి తీసుకెళ్లడం ద్వారా వారికి మరింత లబ్ధి చేకూర్చేందుకు మార్క్ ఫెడ్ రిటైల్ రంగంలోకి అడుగుపెట్టిందన్నారు. మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మధుసూదనరెడ్డి మాట్లాడుతూ.. ఏపీ ఆయిల్ ఫెడ్ ద్వారా మార్కెట్లోకి వస్తున్న విజయ బ్రాండ్ వంట నూనెలకు తెలుగు రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉందన్నారు. అదే తరహాలో మార్కప్ కూడా మార్కెట్లో ప్రధాన భూమిక పోషించనుందని చెప్పారు. మార్క్ ఫెడ్ ఎండీ పీఎస్ ప్రద్యుమ్న మాట్లాడుతూ.. పంజాబ్, కేరళ, గుజరాత్ రాష్ట్రాల తరహాలోనే ఏపీలో కూడా రిటైల్ మార్కెటింగ్ రంగంలోకి మార్క్‌ఫెడ్ అడుగు పెడుతోందన్నారు. నాణ్యతకు పెద్దపీట వేస్తూ ప్రీమియం, పాపులర్, ఎకానమీ రేంజ్‌లలో మార్క్ ఫెడ్ బ్రాండింగ్‌తో మార్కెట్లోకి వెళ్తున్నామన్నారు. వ్యాపార లావాదేవీలన్నీ అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా యాప్‌ను డిజైన్ చేశామన్నారు. మార్చి 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 34 వేల రిటైల్ షాపుల్లో మార్కప్ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని వివరించారు. ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, వ్యవసాయ, ఉద్యాన, çసహకార శాఖ కమిషనర్లు హెచ్.అరుణ్‌కుమార్, ఎస్ఎస్ శ్రీధర్, ఎ.బాబు, సెర్ప్ సీఈవో ఎండీ ఇంతియాజ్ పాల్గొన్నారు. -
విదేశాలకు 'ఆంధ్రా పొగాకు'
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పొగాకు రైతుల్ని ఆదుకునేందుకు గత ఏడాది రంగంలోకి దిగిన మార్క్‌ఫెడ్.. పొగాకును విదేశాలకు ఎగుమతి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మార్క్‌ఫెడ్ వద్ద సుమారు రూ.103 కోట్ల విలువైన 9.43 మిలియన్ కిలోల పొగాకు ఉంది. దీన్లో ఉన్నది ఉన్నట్లుగా అమ్ముడయ్యేదిపోను మిగిలినదాన్ని ప్రాసెస్, ప్యాకింగ్ చేసి రీడ్రైడ్ థ్రెషడ్ లేమినా (ఆర్టీఎల్) రూపంలో విదేశాలకు ఎగుమతి చేయనుంది. ప్రాసెస్ చేసేందుకు టెండర్లు ఖరారు చేశారు. నమూనాగా ప్యాక్ చేసిన శాంపిళ్లను పొగాకు వ్యాపారులు, ఎగుమతిదారులు, విదేశీ కస్టమర్లకు పంపించారు. వాటి నాణ్యత బాగానే ఉందని పరీక్షల్లో తేలిందని అధికారులు చెబుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన అధిక వర్షాలకు తోడు కరోనా ప్రభావంతో గతేడాది మార్కెట్లో పొగాకు రేటు పతనమైంది. దీంతో ఏ ఒక్క రైతు నష్టపోకూడదన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పంతో మార్క్‌ఫెడ్ చరిత్రలో తొలిసారి పొగాకు వేలంలో పాల్గొని మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద పెద్ద ఎత్తున కొనుగోలు చేసింది. సగటున కిలో రూ.81కి కొనుగోలు రాష్ట్రంలో సాధారణంగా ఖరీఫ్‌లో 4,360 ఎకరాలు, రబీలో 2,02,345 ఎకరాల్లో పొగాకు సాగవుతుంది. 2019–20 సీజన్లో ఖరీఫ్‌లో 6,787 ఎకరాలు, రబీలో 1,92,700 ఎకరాల్లో సాగైంది. ఏటా పొగాకు బోర్డు ద్వారా క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. గతేడాది కరోనా దెబ్బకు అంతర్జాతీయంగా పొగాకు రేట్లు పతనమవడంతో మార్క్‌ఫెడ్ రంగంలోకి దిగింది. గతేడాది 128.65 మిలియన్ కిలోలు మార్కెట్‌కు వచ్చింది. దీంట్లో 12.93 మిలియన్ కిలోలను (1,29,31,590 కిలోలను) మార్కెఫెడ్ కొనుగోలు చేసింది. సగటున కిలో రూ.81 వంతున 29,228 మంది రైతుల నుంచి పొగాకు కొనుగోలు చేసింది. కొనుగోలుకు వెచ్చించిన సొమ్ము, రవాణా ఖర్చులు, బ్యాంకు వడ్డీలు కలిపి మార్క్‌ఫెడ్‌కు రూ.128.65 కోట్ల వ్యయం అయింది. అనంతరం ఈ–వేలం ద్వారా 3.50 మిలియన్ కిలోలను విక్రయించింది. ఇంకా గోదాముల్లో 9.43 మిలియన్ కిలోలు ఉంది. కోవిడ్ కారణంగా వ్యాపారులకు విదేశాల నుంచి ఆర్డర్స్ తగ్గిపోయాయి. కర్ణాటకలో లో గ్రేడ్ రకాల పంట ఎక్కువగా వచ్చింది. ఎగుమతికి రవాణా ఖర్చులు పెరిగిపోవడం, కంటైనర్ల కొరత వంటివి కూడా తోడయ్యాయి. దీంతో మార్క్‌ఫెడ్ వద్ద పొగాకు నిల్వలు పేరుకుపోయాయి. ఈ పొగాకును విక్రయించేందుకు మార్క్‌ఫెడ్ సన్నాహాలు చేస్తోంది. నేరుగా ఎగుమతికి సన్నాహాలు దేశీయ వ్యాపారులు ముందుకు రాకపోతే ఇతర దేశాలకు నేరుగా ఎగుమతి చేయాలని భావిస్తున్నాం. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రబీలో క్వాలిటీ పొగాకు పండటం వల్ల మా వద్ద ఉన్న లో గ్రేడ్ పొగాకుకు కాస్త డిమాండ్ ఏర్పడనుంది. కర్ణాటకలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో మా వద్ద పేరుకుపోయిన నిల్వలు అమ్ముడవుతాయన్న ఆశాభావంతో ఉన్నాం. కొంత మామూలుగా, మరికొంత ప్రాసెస్ చేసి ఎగుమతి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకోసం ఎక్స్‌పోర్టు ఏజెంట్లను నియమించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. – పి.ఎస్.ప్రద్యుమ్న, ఎండీ, మార్క్‌ఫెడ్ -
కంది రైతుల.. రంధి!
సాక్షి, హైదరాబాద్ : కంది రైతుకు కష్టాలు వచ్చిపడ్డాయి. మద్దతు ధరకు కందులు విక్రయించాలని భావిం చినా మార్క్‌ఫెడ్ అధికారుల తీరుతో అదిసాధ్యం కావట్లేదు. మార్క్‌ఫెడ్ అధికారులు కొర్రీలు పెడుతూ రైతులను రాచిరంపాన పెడుతున్నారన్న విమర్శలున్నాయి. దళారులను చేరదీసి వారినుంచి అక్రమం గా కందులు కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రైతులకు సహకరించాలని, కంది రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా మార్క్‌ఫెడ్ అధికారు లు మాత్రం సాకులు చెబుతూ రైతు పండిం చిన కందిని కొనుగోలు చేసేందుకు ముందుకు రావట్లేదు. మరోవైపు అమ్మిన కందులకు డబ్బు లివ్వడంలోనూ మార్క్‌ఫెడ్ విఫలమవుతోంది. నాఫెడ్ నుంచి సొమ్ము రాబట్టలేకపోతోంది. ఆన్లైన్లో పేరు లేకుంటే కొనరా? వ్యవసాయ శాఖ గతేడాది ఎవరెవరు ఏ పంటలు పండించారన్న సమాచారం సేకరించింది. ఐతే ఆ లెక్కలు చాలావరకు కాకిలెక్కలా అన్న అనుమానాలు ప్రస్తుత పరిస్థితిని బట్టి అర్థమవుతోంది. ఆ లెక్కలను ఆన్లైన్లో ఎక్కించారు. కందులు పం డించిన రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చాక, ఆన్లైన్లో వారి పేరుతో కంది పం డించారా లేదా పరిశీలిస్తారు. అయితే పోర్టల్‌లో ఆ రైతు వేరే పంట పండిం చారని ఉంటే, వెంటనే ఆ రైతును వెనక్కి పంపుతున్నారు. పోర్టల్‌లో పత్తి పండించినట్లుందని, కంది లేదని, కాబట్టి కందులు కొనుగోలు చేయబోమని చెప్పేస్తున్నారు. దీంతో రైతులు దళారులకు విక్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా సగం మంది రైతుల పేర్లు కంది పండించినట్లుగా లేకపోవడంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు. దీనిపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. అధికారుల జులుం.. మార్కెట్లో దళారులు క్వింటాలుకు రూ.4వేల నుంచి రూ.5 వేల కంటే ఎక్కువకు కొనట్లేరు. అటు మార్క్‌ఫెడ్ తీసుకోక, ఇటు దళారులు తక్కువ ధరకు అడుగుతుండటంతో కంది రైతు కన్నీరు పెడుతున్నాడు. పైగా ‘ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో పో’అని మార్క్‌ఫెడ్ అధికారులు జులూం ప్రదర్శిస్తున్నారని కొందరు రైతులు వాపోతున్నారు. పలువురు రైతులు తమ పట్టాదారు పాస్ పుస్తకాలు చూపించినా, కంది పంటను సాగుచేసినట్లు అధికారుల ద్వారా ధ్రువీకరణ పత్రాలు తెచ్చినా మార్క్‌ఫెడ్ అధికారులు ససేమిరా అంటున్నారు. ఒకవేళ ఆన్లైన్ పోర్టల్‌లో సంబంధిత రైతు కంది పండించినట్లు పేరున్నా, అతను పండించినంతా కొనట్లేదు. తమకు కేంద్రం నిర్దేశించిన కోటా ప్రకారమే కొంటున్నామని, అంతా కొనలేమంటూ తేల్చేస్తున్నారు. ఆన్లైన్ సమస్యపై పలువురు ఎమ్మెల్యేలు, ఓ మంత్రి స్వయంగా ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదు. సొమ్ము ఎప్పుడిస్తారో? రాష్ట్రంలో ఈసారి 2.07 లక్షల మెట్రిక్ టన్నుల కంది దిగుబడి అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో కేంద్రం 47,500 మెట్రిక్ టన్నులు మాత్రమే మద్దతు ధరకు కొంటామని తేల్చిచెప్పింది. ఇంకా 56 వేల మెట్రిక్ టన్నులు కొనాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పలుసార్లు విజ్ఞప్తి చేసింది. కానీ ఇప్పటివరకు కేంద్రం నుంచి అనుమతి రాలేదు. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో కేంద్రం కొనుగోలు చేసేది 47,500 మెట్రిక్ టన్నులు మాత్రమే. మిగిలిన దాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోయినా తాము కొంటామని ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఇంకా అధికారికంగా నిర్ణయం ప్రకటించలేదు. అయితే మార్క్‌ఫెడ్ ఇప్పటివరకు 44,833 మెట్రిక్ టన్నుల కందులు కొనుగోలు చేసింది. వాటి విలువ రూ.260.04 కోట్లు. కానీ ఇప్పటివరకు రైతులకు రూ.29.69 కోట్లు మాత్రమే చెల్లించారు. ఇంకా రూ.230.35 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీంతో రైతులు మార్క్‌ఫెడ్‌కు అమ్ముకున్నా సకాలంలో సొమ్ము రాకపోవడంతో దళారులను ఆశ్రయిస్తున్నారు. దళారులు రైతుల నుంచి రూ.4 వేల నుంచి రూ.5 వేల మధ్య కొనుగోలు చేస్తున్నారు. అదే దళారులు అనేకచోట్ల రైతుల నుంచి కొన్న కందులను మార్క్‌ఫెడ్‌కు మద్దతు ధర కింద రూ.5,800కు విక్రయిస్తున్నారు. దీనికి మార్క్‌ఫెడ్‌లో కొందరు అధికారులు కూడా సహకరిస్తున్నారన్న విమర్శలున్నాయి. అందుకోసం కమీషన్ల రూపంలో దళారుల ఉంచి ముడుపులు వస్తున్నాయి. రైతును అడ్డం పెట్టుకొని అటు దళారి, ఇటు కొందరు మార్క్‌ఫెడ్ అధికారులు సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలున్నాయి. తిప్పి పంపేశారు: బాజా నాగేశ్వర్రావు, సింగారెడ్డిపాలెం, నేలకొండపల్లి మండలం, ఖమ్మం జిల్లా మూడు ఎకరాల్లో పత్తి పంటలో అంతర్ పంటగా కంది వేశాను. దాదాపు 13 క్వింటాళ్ల కంది దిగుబడి వచ్చింది. వీటిని విక్రయించేందుకు 15 రోజుల క్రితం మార్కెట్ యార్డులోని కంది కొనుగోలు కేంద్రానికి వెళ్లాను. ఆన్లైన్లో నా పేరు లేదని, తిప్పి పంపారు. ఒకవేళ ఆన్లైన్లో పేరు నమోదైనా రెండున్నర క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో ఏమీ చేయలేక దళారులకు విక్రయించాలని నిర్ణయించుకున్నాను. కొనుగోళ్లు నిలిపివేశారు: బెండే లక్ష్మణ్, వడ్డాడి గ్రామం, తాంసి మండలం, ఆదిలాబాద్ జిల్లా 4 ఎకరాల్లో పత్తి, కంది పంట సాగుచేశాను. కంది పంట 10 క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. తాంసి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కోనుగోలు కేంద్రంలో విక్రయిద్దామనుకుంటే రెండు రోజులే కోనుగోలు చేసి నిలిపేశారు. మళ్లీ ఎప్పుడు కోనుగోలు కేంద్రాలను తెరుస్తారో చెప్పట్లేదు. దళారులకు అమ్ముకుందామంటే తక్కువ ధరకు అడుగుతున్నారు. జాబితాలో పేరు లేదని కొనట్లేదు: ఎం.రాంరెడ్డి, రైతు, మల్లారెడ్డిగూడ, చేవెళ్ల మండలం, రంగారెడ్డి జిల్లా ఈ ఏడాది 5 ఎకరాల్లో కంది పంట సాగు చేశాను. కందులు అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రానికి వస్తే ఆన్లైన్ జాబితాలో కంది సాగు చేసినట్లు పేరు లేదని అధికారులు చెప్పారు. నీ కందులు ఇక్కడ కొనలేమని అంటున్నారు. నేను కంది సాగు చేస్తే నాపేరు లేకపోవడమేంటి? ఎవరు రాశారని అడిగితే వ్యవసాధికారులు ఇచ్చిన జాబితా మా దగ్గర ఉందంటున్నారు. ఇందులో పేర్లు ఉంటేనే కొనాలని మాకు అదేశాలు ఉన్నాయని చెబుతున్నారు. రైతును ఇబ్బంది పెడితే ఎలా?: కె.క్రిష్ణారెడ్డి, రైతు, చేవెళ్ల గ్రామం, రంగారెడ్డి జిల్లా 10 ఎకరాల్లో కంది పంట సాగు చేశాను. దాదాపు 20 క్వింటాళ్లకు పైగానే దిగుబడి వచ్చింది. కానీ నా పేరు జాబితాలో లేదని కొనలేమని చెబుతున్నారు. నేను వేసిన కంది పంట పొలం చూపిస్తాను.. వచ్చి చూసుకోవాలని చెప్పాను. కంది పంట వేయకపోతే అభ్యంతరం చెప్పాలి కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులను ఇబ్బంది పెడితే ఎలా? రైతుల పేర్లు లేకపోతే ఈ కొనుగోలు కేంద్రం ఎందుకు పెట్టారు.. తీసేయండి. అధికారులకు నాయకులకు రైతుల ఇబ్బందులు కనిపించటం లేదా? ఆన్లైన్ సమస్య వాస్తవమే: చంద్రశేఖర్, మార్క్‌ఫెడ్ ప్రొక్యూర్మెంట్ అధికారి, హైదరాబాద్ ఆన్లైన్లో రైతుల పేర్లు లేకపోవడంతో సమస్య ఉంది. దీన్ని ఎలా పరిష్కరించాలన్న విషయంపై ప్రభుత్వానికి విన్నవించాం. మరోవైపు రైతుల నుంచి రూ.260 కోట్ల విలువైన కందులను కొనుగోలు చేశాం. వారికి ఇప్పటివరకు రూ.29.69 కోట్లు మాత్రమే ఇచ్చాం. ఇంకా నాఫెడ్ నుంచి రావాల్సి ఉంది. కేంద్రం పరిమితి విధించడంతో ఇప్పటికే దాదాపు 10 జిల్లాల్లో వారి కోటా పూర్తయింది. మిగిలినది కొనాలంటే కేంద్రం నుంచి అనుమతి రావాలి. అందుకోసం మరో 56 వేల మెట్రిక్ టన్నులు కొనాలని ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. -
యూరియా.. ఇదేందయా?
సాక్షి, హైదరాబాద్: వ్యాపారులు మోసం చేస్తే ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది.. కానీ సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థే రైతులను మాయ చేస్తే..? ఎవరికి చెప్పుకోవాలి? రైతుల పక్షాన నిలవాల్సిన మార్క్‌ఫెడ్ పక్కా వ్యాపార సంస్థగా మారింది. ఒకవైపు వర్షాల్లేక రైతులు గగ్గోలు పెడుతుంటే.. మరోవైపు గడ్డ కట్టిన యూరియాను సరఫరా చేసి మరో బండ మోపుతోంది! మూడు నాలుగేళ్ల కిందట కంపెనీల నుంచి కొనుగోలు చేసిన యూరియా గడ్డ కట్టడంతోపాటు దానిలో ఉన్న శక్తి కూడా తగ్గిపోయింది. దీంతో ఉపయోగం లేదని తెలిసినా మార్క్‌ఫెడ్ అధికారులు ఒత్తిడి చేసి మరీ రైతులకు అంటగడుతున్నారు. ఈ యూరియా తమ కొద్దంటూ అన్నదాతలు గగ్గోలు పెడుతున్నా వినే నాథుడే కరువయ్యాడు. ఈ యూరియా కొన్నా అది పనిచేయక రెండుసార్లు చల్లాల్సి వస్తోంది. దీంతో ఖర్చు తడిసి మోపెడు అవుతోంది. గడ్డ కట్టిన యూరియాను కంపెనీలకు వెనక్కి ఇచ్చి కొత్తగా తీసుకోకుండా రైతులకు మార్క్‌ఫెడ్ అన్యాయం చేస్తోం దన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిల్వల వెనుక భారీ స్కాం? ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 66.36 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఖరీఫ్ పంటల కోసం రాష్ట్రానికి దాదాపు 8 లక్షల టన్నుల యూరియా అవసరం. అందులో 2 లక్షల టన్నుల యూరియాను మార్క్‌ఫెడ్ బఫర్స్టాకుగా సిద్ధంగా ఉంచుకోవాలి. ఆ పాత నిల్వలను బయటకు పంపిస్తూ మళ్లీ అంతే మోతాదులో కొత్త సరుకును బఫర్ స్టాకుగా ఉంచాలి. ప్రస్తుతం మార్క్‌ఫెడ్ వద్ద 1.27 లక్షల టన్నుల యూరియా ఉండగా, అందులో 30,394 టన్నుల యూరియా గడ్డ కట్టినదే కావడం గమనార్హం. కొన్నాళ్లుగా బఫర్ స్టాకును కదిలించకుండా చాలావరకు కొత్త సరుకును రైల్వే రేక్ పాయింట్ల నుంచి నేరుగా ఎరువుల డీలర్లకు పంపిస్తున్నారు. దీంతో మార్క్‌ఫెడ్ వద్ద మూడు నాలుగేళ్లుగా 2 లక్షల టన్నులకుపైగా యూరియా గడ్డ కట్టుకుపోయింది. రేక్ పాయింట్ల నుంచే యూరియాను మార్కెట్‌కు పంపిస్తున్నారు. దీంతో లోడింగ్, అన్లోడింగ్, నిర్వహణ వంటి ఖర్చులన్నీ మిగులుతున్నాయి. ఆయా ఖర్చులన్నీ కాగి తాల్లో కనిపిస్తున్నాయే కానీ ఎక్కడా వాస్తవ ఖర్చులేదు. మార్క్‌ఫెడ్ అధికారులు కోట్ల రూపాయలు కాజేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. జిల్లాల నుంచి పైస్థాయి వరకు ఇదే పరిస్థితి. యూరియా నిల్వల నిర్వహణలో భారీ కుంభకోణం దాగి ఉండటంపై విమర్శలు వస్తున్నాయి. కక్కుర్తి వల్లే బఫర్ స్టాక్ యూరియా నిల్వలు కాస్తా గడ్డకట్టుకు పోయాయి. తక్కువ ధర అంటూ... రెండు మూడేళ్ల క్రితం బఫర్ స్టాక్‌కు అదనపు నిల్వలు తీసుకున్నామని, కానీ కాలం కలిసి రాకపోవడంతో నిల్వలు పేరుకుపోయాయని మార్క్‌ఫెడ్ అధికారు లు చెబుతున్నారు. పాతవి వదిలించుకోకపోవ డం, కొత్త సరుకు నిల్వ చేయకపోవడం వల్లే వ్యవహారం గందరగోళంగా మారింది. బఫర్‌స్టాక్‌ను అధికంగా ఉంచడంలోనూ మాయ జరిగిందన్న విమర్శలున్నాయి. మిగిలిన గడ్డకట్టిన యూరియాను తక్కువ ధర అంటూ అంటగడుతున్నారు. యూరియా నాణ్యమైనదే అయితే తక్కువ ధరకు ఎందుకు అంటగడుతున్నారు? పాత దానికి కొత్త దానికి తేడా లేకపోతే ధర తగ్గించాల్సిన అవసరమేంటన్న దానికి సమా ధానం లేదు. 45 కిలోల యూరియా ధర రూ.252 కాగా గడ్డ కట్టిన 50 కిలోల బస్తా యూరియా ధర రూ.264 ఉంది. గడ్డ కట్టింది కాబట్టే తక్కువకు ఇస్తున్నామని అధికారులు అంటున్నా, యూరియా ఆరు నెలలు దాటితే నాణ్యత తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గడ్డ కట్టిన యూరియా పనిచేయడం లేదని అటు రైతులు, ఎరువుల డీలర్లు మార్క్‌ఫెడ్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. కానీ తీసుకోవాల్సిందేనంటూ మార్క్‌ఫెడ్ వర్గాలు ఒత్తిడి చేస్తున్నాయి. కొందరు డీలర్లు అయితే కమీషన్లు ముట్టజెప్పుకొని కొత్త యూరియాను దక్కించుకుంటున్నారు. లేకుంటే వారికి గడ్డ కట్టిన యూరియానే ఇస్తున్నారు. -
నేటి నుంచి కంది కొనుగోళ్లు బంద్
సాక్షి, హైదరాబాద్: కంది కొనుగోలు కేంద్రాలను బుధవారం నుంచి మూసేయాలని మార్క్‌ఫెడ్ నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీచేసింది. పూర్తిస్థాయిలో కందుల కొనుగోలు ప్రక్రియ ముగియలేదు. అనేక చోట్ల కందులను రైతులు మార్కెట్‌కు తీసుకొస్తూనే ఉన్నారు. ఈ సమయంలో కొనుగోలు కేంద్రాలను మూసివేయడంపై విమర్శలు వస్తున్నా యి. మార్క్‌ఫెడ్ ఏర్పాటుచేసిన 93 కొనుగోలు కేంద్రాల్లో 40 కేంద్రాలను ఇటీవల మూసేశారు. మిగిలిన 53 కేంద్రాలను ఇప్పుడు మూసివేయ నున్నారు. హాకా ఆధ్వర్యంలో ప్రారంభమైన 48 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికే 44 కేంద్రాలను మూసేశారు. మరో నాలుగు కేంద్రాలను కూడా మూసివేసేందుకు హాకా నిర్ణయించింది. రాష్ట్రంలో 2.95 లక్షల మెట్రిక్ టన్నుల కందులు ఉత్పత్తి అవుతాయని అంచనా. మార్క్‌ఫెడ్ ద్వారా 1.08 లక్షల మెట్రిక్ టన్నులు, హాకా ద్వారా 1.18 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. కేంద్రం మద్దతు ధర కింద 75,300 మెట్రిక్ టన్నులే కొనుగోలు చేస్తామని చెప్పడంతో, మిగిలిన కందులను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాల్సిన స్థితి ఏర్పడింది. ఇది సర్కారుకు తలకు మించిన భారం కావడంతో మూసివేయాలని నిర్ణయించింది. -
అధికారుల దయ కరువు..వద్దన్నా పాత ఎరువు
♦ అన్నదాతలు మొత్తుకుంటున్నా తీరుమారని మార్క్‌ఫెడ్ ♦ ఒత్తిడి చేసి మరీ ప్రాథమిక సహకార సంఘాలకు అప్పగింత ♦ కొత్త స్టాక్ వస్తున్నా గడ్డకట్టిన యూరియానే దిక్కు సాక్షి, హైదరాబాద్ : వద్దని మొత్తుకుంటున్నా వ్యవసాయ శాఖ గడ్డకట్టిన పాత ఎరువులనే రైతులకు అంటగడుతోంది. దీంతో గత్యంతరం లేక వాటినే కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. గడ్డకట్టి ఏళ్లుగా నిల్వఉన్న యూరియా, డీఏపీలతో నష్టం లేదని చెబుతూ రైతులకు ఇష్టం లేకపోయినా కొనేలా చేస్తుంది. ఒత్తిడిచేసి మరీ ప్రాథమిక సహకార సంఘాల (ప్యాక్స్)కు, ఆగ్రోస్ రైతుసేవా కేంద్రాలకు, మార్క్‌ఫెడ్ లైసెన్సున్న ప్రైవేటు దుకాణాలకు ఈ ఎరువులనే సరఫరా చేస్తుంది. దీంతో ఆ సంస్థలు రైతులకు పాత స్టాకునే విక్రయిస్తున్నాయి. అనేక జిల్లాల్లో ఆయా సంస్థలు తమకు గడ్డకట్టిన ఎరువులు వద్దని, రైతులు కొనుగోలు చేయడానికి ముందుకు రావడంలేదని నెత్తీ నోరూ బాదుకుంటున్నా మార్క్‌ఫెడ్ మాత్రం వెనక్కు తగ్గడంలేదు. రైళ్లల్లో కొత్త స్టాక్ వచ్చిపడుతున్నా పాతవాటిని వదిలించుకున్నాకే కొత్త స్టాకు ఎరువులను విక్రయిస్తామని చెబుతోంది. పాత స్టాక్ విక్రయించాకే కొత్త స్టాక్: కె.రాములు, జీఎం, మార్క్‌ఫెడ్ పాత స్టాక్ విక్రయించాకే కొత్త స్టాక్ విక్రయిం చాలని నిర్ణయించిన మాట వాస్తవమేనని మార్క్‌ఫెడ్ జనరల్ మేనేజర్ కె.రాములు ‘సాక్షి’కి వివరించారు. పాత స్టాక్‌ను ఎరువుల కంపెనీలకు అమ్మినా తిరిగి దాన్నే కొత్త బస్తా ల్లో రైతులకు అందజేసే ప్రమాదం లేకపోలేద న్నారు. గడ్డలు కట్టిన ఎరువుల వల్ల పంటకు నష్టం ఏమీలేదని ఆయన స్పష్టంచేశారు. కంపెనీలకు విక్రయిద్దామనుకున్నారు కానీ... మార్క్‌ఫెడ్‌లో మూడేళ్ల నుంచి ఇప్పటివరకు 2.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, డీఏపీ నిల్వలు గోదాముల్లో గుట్టలుగా పేరుకుపోయాయి. అందులో యూరియా 2 లక్షల టన్నులు, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు 50 వేల టన్నులు న్నాయి. వాటి విలువ ఏకంగా రూ. 260 కోట్లు ఉండటం గమనార్హం. వీటిని రైతులకు అంటగట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని ఇటీవల ‘సాక్షి’ కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. దీంతో పాత నిల్వలను ఎరువుల కంపెనీలకు ఎంతోకొంతకు అమ్మేసి కొత్త స్టాకు కొనుగోలు చేద్దామని అనుకున్నారు. అయితే, దీనివల్ల పెద్దఎత్తున నష్టం వస్తుందని భావించిన మార్క్‌ఫెడ్ తిరిగి రైతులకే తక్కువ ధరకు అంటగట్టాలని నిర్ణయించింది. యూరియా బస్తా ధరను రూ.30 తగ్గించారు. కానీ అనేక ప్యాక్స్, ఆగ్రో రైతు సేవాకేంద్రాలు ఈ పాత స్టాకును వ్యతిరేకిస్తున్నాయి. గత్యంతరం లేక రైతులు ప్రైవేటు డీలర్ల వద్ద కొంటున్నారు. ప్రస్తుతం మార్క్‌ఫెడ్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి కొత్త స్టాక్ ఎరువుల నిల్వలు వస్తున్నా పాత స్టాక్ వదిలించుకున్నాకే కొత్త స్టాకు అమ్మాలని నిర్ణయించడంపై రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. -
కొనుగోళ్లు చేయలేం
చేతులెత్తేసిన మార్క్‌ఫెడ్ గజ్వేల్: వర్షాభావ పరిస్థితుల కారణంగా తీవ్రంగా నష్టపోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న మొక్కజొన్న రైతులు... చేతికందిన కొద్దిపాటి దిగుబడులను కూడా అమ్ముకోలేని దయనీయ పరిస్థితి నెలకొంది. రెండు మూడు రోజుల్లో కొనుగోళ్లు గడువు ముగియనున్నదనీ, ఇప్పటికే చాలావరకు కేంద్రాలు ఎత్తేసినట్లు మార్క్‌ఫెడ్ ప్రకటించినా...ఇంకా ఆయా యార్డుల్లోకి మక్కలు వెల్లువలా వస్తున్నాయి. మరోవైపు కొనుగోలు చేసిన మక్కల బస్తాలు రెండు మూడు రోజులుగా తరలింపునకు నోచుకోకపోవడంతో కొత్తగా వస్తున్న మక్కల కొనుగోళ్లకు అడ్డంకిగా మారాయి. ఈ సమయంలో కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయాలన్న మార్క్‌ఫెడ్ నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇపుడిపుడే నూర్పిళ్లు జరుగుతున్నందున మరో 15 రోజుల పాటు కొనుగోళ్లు చేపట్టాలని లేకపోతే తాము తీవ్రంగా నష్టపోక తప్పదని చెబుతున్నారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 2.67 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. పత్తి తర్వాత ఇది ప్రధాన పంటగా ఆవిర్భవించింది. ఈసారి రైతులు మొక్కజొన్నపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. కానీ తీవ్ర వర్షాభావంతో ఈ పంటకు అపార నష్టం వాటిల్లింది. పరిస్థితులు అనుకూలిస్తే ఎకరాకు 30 క్వింటాళ్లకుపైగా దిగుబడి వచ్చేది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఎకరాకు రమారమి 8-10 క్వింటాళ్ల చొప్పను దిగుబడి లెక్కేసుకున్నా...జిల్లావ్యాప్తంగా రైతులవద్ద సుమారు 25 లక్షల క్వింటాళ్లకుపైగా మొక్కజొన్న ఉత్పత్తులు వచ్చే అవకాశముంది. ప్రభుత్వం కొనుగోళ్ల సీజన్ ఆరంభంలో జిల్లాలో 62కిపైగా కొనుగోలు కేంద్రాలను తెరిచింది. ఈ కేంద్రాల్లో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు ఏ- గ్రేడ్‌కు రూ.1,310, బీ-గ్రేడ్‌కు రూ.1,230, సీ-గ్రేడ్‌కు రూ.1,180 చెల్లిస్తున్నారు. ప్రైవేట్ వ్యాపారులు క్వింటాలుకు రూ.1,000కి మించి ధర చెల్లించడంలేదు. పైగా క్వింటాలుకు 2 కిలోలను తరుగు పేరిట కోత విధిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు తమ ఉత్పత్తులను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే తరలిస్తున్నారు. తుపాన్ల కారణంగా గతంతో పోలిస్తే నూర్పిళ్లు ఆలస్యంగా జరిగాయి. అందువల్ల మక్కలు ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి రావడం ఊపందుకుంది. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐకేపీ కేంద్రాల ద్వారా కేవలం 4 లక్షల క్వింటాళ్లు మాత్రమే అధికారులు కొనుగోలు చేయగలిగారు. ఈ లెక్కన చూస్తే కొనుగోలు కేంద్రాల ద్వారా ఖరీదు చేసిన మక్కలు పండిన ఉత్పత్తుల్లో 25 శాతం కూడా మించలేదు. చాలా కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత, రవాణా పరమైన ఇబ్బందులతో కొనుగోళ్లు వేగంగా సాగడంలేదు. గజ్వేల్ మార్కెట్ యార్డులోని కేంద్రంలో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఈ యార్డులో కొనుగోలు చేసి తరలించకుండా 800 క్వింటాళ్ల బస్తాలు పేరుకుపోయి ఉండగా, మరో 800 క్వింటాళ్లకుపైగా మక్కలు కొనుగోళ్ల కోసం సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు గజ్వేల్ నియోజకవర్గంలో మొక్కజొన్న నూర్పిళ్లు చాలా ఆలస్యంగా సాగుతున్నాయి. నేటికీ వేలాది ఎకరాల్లో జూళ్లు కంకులు తీయకుండా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయడానికి రంగం సిద్ధం చేయడం దారుణమని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
‘గ్రేడింగ్’ దగా!
తాండూరు: మార్కెట్ యార్డులో వ్యాపారులకు మక్కలు అమ్మితే నష్టపోతామనే ఉద్దేశంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయిస్తే ఇక్కడ కూడా వంచనకు గురైతే ఇక రైతులకెవరు దిక్కు. డీసీఎంఎస్ అధికారులు కొనుగోలు చేసిన మక్కలను మార్క్‌ఫెడ్ తిరస్కరిస్తోంది. కొనుగోలు చేసిన పంటలో నాణ్యతా ప్రమాణాలు సరిగా లేవనే కారణంతో సీడబ్ల్యూసీకి వెళ్లిన దిగుబడులను తిరస్కరిస్తున్నారు. బాణాపూర్, ఎల్మకన్నె, సంకిరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన రైతులు రాజు, డాక్యానాయక్, పాండురంగారెడ్డి, అమృతారెడ్డిల నుంచి ఈ నెల 8, 10, 14 తేదీల్లో 228.50 క్వింటాళ్ల మొక్కజొన్నలను కొనుగోలు చేసి సీడబ్ల్యూసీ తాండూరు కేంద్రం నుంచి అధికారులు లారీలో తరలించారు. ఆయా రైతులకు చెందిన మక్కలు నాణ్యతగా లేవని అక్కడి అధికారులు తిరస్కరించారు. దీంతో కొంత చిక్కు వచ్చింది. కొనుగోలు చేసి రసీదులు ఇచ్చిన తర్వాత నాణ్యతగా లేవని నిర్ధారించడంతో రైతులను ఆందోళనకు గురి చేసింది. ఈ ప్రభావంతో తాండూరులోని కొనుగోలు కేంద్రంలో మొక్కజొన్నల తూకాలు నిలిచిపోవడంతో కొనుగోళ్లకు బ్రేక్ పడింది. తాము కొనుగోలు చేసి గోదాంకు తరలిస్తే అక్కడికి వెళ్లిన తర్వాత నాణ్యతగా లేవని తిరస్కరిస్తే రైతులకు మేం ఏం సమాధానం చెప్పాలని స్థానిక డీసీఎంఎస్ సిబ్బంది చెబుతున్నారు. దీంతో సోమవారం వివిధ గ్రామాలకు చెందిన సుమారు 200 బస్తాల మక్కలు కొనుగోలు కేంద్రానికి వచ్చాయి. వీటిని కొనుగోలు చేసిన పంపించిన తర్వాత తిరస్కరిస్తున్నందున తూకాలు చేయలేమని డీసీఎంఎస్ గోదాం సిబ్బంది చెబుతున్నారు. సంబంధిత అధికారులు వచ్చి నాణ్యతా ప్రమాణాలు సరిగా ఉన్నాయని చెబితేనే తూకాలు వేస్తామని డీసీఎంఎస్ గోదాం ఇన్చార్జి ఎల్లయ్య స్పష్టం చేశారు. రూ.12.57 లక్షల విలువైన మక్కల సేకరణ అక్టోబర్ 15న తాండూరులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఆరంభమైంది. అదే నెల 28 నుంచి కొనుగోళ్లు మొదలయ్యాయి. ఈ నెల 15 వరకు 26 మంది రైతుల నుంచి ఏ, బీ, సీ గ్రేడ్లకు చెందిన రూ.12.57లక్షల విలువ చేసే దాదాపు 997.50 క్వింటాళ్ల మొక్కజొన్నలను రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఇందులో ఇప్పటి వరకు సుమారు రూ.3 లక్షల వరకు రైతులకు చెల్లించారు. మిగతా డబ్బులు చెల్లించాల్సి ఉంది. -
రైతులకు విలీనం ముప్పు
కుకునూరు : ‘అమ్మ పెట్టదు..అడుక్కు తిననివ్వదు’ అన్నట్లుగా మారింది ఆంధ్రాలో విలీనమైన ముంపు మండలాల రైతుల పరిస్థితి. ఆర్డినెన్స్ చట్టరూపం దాల్చడంతో తెలంగాణ నుంచి ఏడు మండలాల్లోని (పీఏసీఎస్) ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు ఎరువులు అందని దుస్థితి ఏర్పడింది. జూలై నెల గడుస్తున్నా ఇప్పటికీ ఎరువులను సరఫరా చేయని జిల్లా మార్క్‌ఫెడ్ విలీనం సాకును చూపుతోంది. దీంతో ఆయా మండలాల రైతులు ఎరువుల కోసం దిక్కులు చూస్తున్నారు. పది సంఘాలకు పోటు జిల్లా పరిధిలో 105 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘా లు ఉండగా, ముంపు మండలాల్లో పది ఉన్నాయి. వాటిలో కుకునూరు, వింజరం సహకార సంఘం పరిధిలో ఉన్న నాలుగు వేలకు మందికి పైగా రైతులకు నేటికీ ఒక్క ఎరువుల బస్తాకూడా అందలేదు. వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న, చెరుకు, ఆయిల్‌పామ్ సాగుకు యూరియా, 20-20, డీఏపీ, పొటాష్ వంటి ఎరువులన్నీ కలిపి సుమారు 3 వేల టన్నులు అవసరం ఉంటుంది. ఇప్పటికే వర్షాలు ఆలస్యంగా కురవడంతో సాగుపై నిరాశగా ఉన్న రైతులు, ఇప్పుడు ఎరువులు కూడా లభించకపోవడంతో మరింత కుంగిపోతున్నారు. ఎరువుల కోసం వ్యయ ప్రయాసాల కోర్చి తెలంగాణలో ఉన్న భద్రాచలం, కొత్తగూడెం, అశ్వారావుపేట, సత్తుపల్లి వంటి ప్రాంతాలకు వెళ్లక తప్పడం లేదు. అక్కడ అధిక ధరలను భరించి ఎరువులను కొనుగోలు చేయాల్సి వస్తోంది. సరఫరా లేదు గతేడాది రైతులకు దాదాపుగా 3 వేల టన్నుల ఎరువులు అవసరంకాగా, జిల్లా మార్క్‌ఫెడ్ కేవలం వెయ్యి టన్నులను మాత్రమే సరఫరా చేసింది. వాటిలో యూరియా పూర్తిగా విక్రయించగా, 20-20, పొటాష్ వంటి ఎరువులు కొద్ది మోతాదులో గిడ్డంగుల్లోనే పడి ఉన్నాయి. బ్యాంకు గ్యారంటీ ఇచ్చాం కదా...ఎరువులను పంపండి అని పీఏసీఎస్ సంఘాల పాలకవర్గం సభ్యులు ప్రాధేయపడినా జిల్లా మార్క్‌ఫెడ్ అధికారులు ససేమిరా అంటున్నారు. మీ మండలాలు ఆంధ్రాలోకి వెళ్లాయి.. ముందుగా నగదును చెల్లించి.. ఎరువులను తీసుకెళ్లండంటూ ఖరాఖండిగా చెబుతున్నారు. కాగా రూ.లక్షల నగదును ముందుగా చెల్లించే స్థోమత ముంపు మండలాల పరపతి సంఘాలకు లేదు. ఈ మండలాలను ఆంధ్రాలో కలపడం వల్ల మార్క్‌ఫెడ్ ఎరువులను సరఫరా చేయడంలేదని, మేము ఏమీ చేయలేమని ఆ సంఘాలు చేతులెత్తేస్తున్నాయి. -
మార్క్‌ఫెడ్.. మోసం!
చిన్నశంకరంపేట, న్యూస్‌లైన్: మార్క్‌ఫెడ్ జారీ చేసిన చెక్కు బౌన్స్ కావడంతో రైతన్న నివ్వెరపోయాడు. సాక్షాత్తు ప్రభుత్వ సంస్థే ఇలా మోసం చేస్తే ఎలా అని వాపోయాడు. వివరాలిలా ఉన్నాయి.. చిన్నశంకరంపేట మండలం కామారం తండాకు చెందిన హలావత్ తుకారాం.. తాను పండించిన 71 క్వింటాళ్ల మక్కలను గత డిసెంబర్లో రామాయంపేట మార్కెట్ కమిటీలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో విక్రయించారు. ఇందుకు సంబంధించిన డబ్బు కోసం రైతు నాలుగు నెలలుగా కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. ఎట్టకేలకు మార్క్‌ఫెడ్ అధికారులు రామాయంపేట ఆంధ్రాబ్యాంక్ శాఖకు చెందిన ఖాతా ద్వారా చెల్లించేలా రైతు తుకారం పేరున మార్చి28న 92,355 రూపాయల చెక్కును అందించారు. రైతు చిన్నశంకరంపేట ఎస్బీఐలోని తన ఖాతాలో చెక్కును జమచేశారు. నెల రోజులుగా వేచి చూసినా మార్క్‌ఫెడ్ ఖాతాలో డబ్బులు చేరకపోవడంతో రామాయంపేట ఆంధ్రాబ్యాంక్ అధికారులు చెక్కును వెనక్కి పంపారు. దీంతో శుక్రవారం ఎస్బీఐ శంకరంపేట అధికారులు చెక్కు బౌన్స్ అయిందని ఇచ్చేశారు. దీంతో రైతుకు ఎటు పాలుపోని పరిస్థితి నెలకొంది. నాలుగు నెలలుగా డబ్బులు చెల్లించకపోగా.. తీరా చెల్లని చెక్కు ఇచ్చారని రైతు తుకారాం వాపోయాడు. తనకు వెంటనే డబ్బులు ఇవ్వకుంటే ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ స్పందించాలి రైతుకు జరిగిన అన్యాయంపై కలెక్టర్ స్పందించాలని రామాయంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పోతరాజ్ రమణ, కామారం మాజీ సర్పంచ్ సుధాకర్‌లు డిమాండ్ చేశారు. మార్క్‌ఫెడ్ సంస్థ ద్వారా అందించిన చెక్కు బౌన్స్‌కు కారణమైన అధికారులపై చర్యలు తీసుకుని రైతుకు న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలపై నమ్మకం సడలకముందే కలెక్టర్ స్పందించాలని కోరారు. -
శనగల పైసలు ఇంకెప్పుడిస్తరు?
తాండూరు, న్యూస్‌లైన్: శనగ రైతులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పండించిన పంట అమ్ముకున్నా చేతికి డబ్బులు అందక అవస్థలు పడుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంధువుల ఇంట్లో శుభకార్యాలకు వెళ్లడానికి చేతిలో చిల్లిగవ్వ లేక నానాపాట్లు పడాల్సిన పరిస్థితి నెలకొందని కొందరు రైతులు వాపోతున్నారు. ఇంటి అవసరాలు తీర్చుకోవడంలో ఇక్కట్లకు గురవుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ మార్క్‌ఫెడ్ ఉదాసీన వైఖరితో రైతులకు సకాలంలో డబ్బులు అందని పరిస్థితి. ఈ విషయంలో జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) నిర్లక్ష్య ధోరణి రైతులకు డబ్బుల చెల్లింపులో ఆలస్యానికి కారణమవుతోంది. కందుల కొనుగోలు విషయంలోనూ అధికారులు రైతులకు డబ్బుల చెల్లింపులో తీవ్ర జాప్యం చేశారు. అలాగే శనగ రైతులకూ సకాలంలో చెల్లింపులు చేయకపోవడం సంబంధిత అధికారుల తీరు విమర్శలకు దారిస్తోంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో పంట దిగుబడులు విక్రయిస్తే తొందరగా డబ్బులు వస్తాయని నమ్మకం రైతుల్లో సన్నగిల్లుతున్నట్టు స్పష్టమవుతోంది. వివరాలు.. ఈ ఏడాది మార్చి 3న మార్క్‌ఫెడ్ డీసీఎంఎస్ ద్వారా రైతుల నుంచి శనగల సేకరణకు పట్టణంలోని పౌర సరఫరాల గోదాం (ఎడ్లబజార్)లో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఏప్రిల్ 25 వరకు వివిధ గ్రామాలకు చెందిన రైతుల నుంచి అధికారులు శనగలను సేకరించారు. శనగలు సేకరించిన వారం పది రోజులకే రైతులకు డబ్బులు చెల్లిస్తామన్నారు. కానీ ఈ విషయంలో మార్క్‌ఫెడ్ జాప్యం చేయడంతో రైతులకు డబ్బులందక ఇబ్బందులు పడుతున్నారు. వివిధ గ్రామాలకు చెందిన 121 మంది రైతుల నుంచి క్వింటాలుకు రూ.3,100 చొప్పున రూ.1,20,51,250 విలువ చేసే 3,887.50 క్వింటాళ్ల శనగలను రైతుల నుంచి డీసీఎంఎస్ అధికారులు సేకరించారు. ఇందులో ఇప్పటి వరకు మార్క్‌ఫెడ్ రూ.54లక్షలు మాత్రమే విడుదల చేసింది. ఈ డబ్బులు 43 మంది రైతులకు చెల్లింపులు చేశారు. ఇంకా వివిధ గ్రామాలకు చెందిన 78మంది రైతులకు రూ.66,51,250 చెల్లించాల్సి ఉంది. డబ్బుల కోసం ఆయా గ్రామాల రైతులు డీసీఎంఎస్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మార్క్‌ఫెడ్ నుంచి రాగానే చెల్లిస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో వివిధ గ్రామాల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు చొరవ చూపి డబ్బులు త్వరగా అందేలా చూడాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు. రైతుల నుంచి సేకరించిన శనగలను కొనుగోలు కేంద్రం నుంచి హైదరాబాద్ నాంపల్లిలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ (సీడబ్ల్యూసీ)కి తరలిస్తున్నారు. త్వరలోనే చెల్లిస్తాం: షరీఫ్, డీసీఎంఎస్ మేనేజర్ మార్క్‌ఫెడ్ నుంచి డబ్బులు రావాల్సి ఉంది. డబ్బులు వచ్చిన వెంటనే రైతులకు చెల్లింపులు చేస్తాం. విషయాన్ని మార్క్‌ఫెడ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. ఇప్పటికి రూ.54లక్షల వరకు రైతులకు చెల్లించాం. మిగిలిన రైతులకూ త్వరగా డబ్బులు చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నాం. -
ఏమిటిది ఏలికా?
బోధన్, న్యూస్‌లైన్ : ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. గిట్టుబాటు ధర లేక దిగాలు పడుతున్నారు. బోధన్, ఎడపల్లి, రెంజల్, నవీపేట మండలాలలో రబీ సీజన్లో రైతులు వేలాది ఎకరాలలో వరి సాగు చేశారు. మొక్కజొన్నను వందల ఎకరాలలో పండించా రు. ఈ పంటల దిగుబడులు చేతికి వస్తున్నా యి. ముంగిటిలో, పంట పొలాలలో నిల్వ చేసి, ఆరబెడుతున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో దళారులు గ్రామాలలో మకాం వేస్తున్నారు. రైతుల నుంచి తక్కువ ధరకే ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం సాధారణ రకం వరి ధాన్యానికి క్వింటాలుకు రూ. 1,345, బీపీటీకి క్వింటాలుకు రూ. 1,500 మద్దతు ధరను ప్రకటించింది. మొక్కజొన్న క్వింటాలుకు రూ .1,310 మద్దతు ధరను ప్రకటించింది. ఖరీఫ్‌లో సహకార సంఘాలు, స్వయం సహాయక మహిళా సంఘాలు, పౌరసరఫరాల శాఖ ద్వారా ధా న్యం కొనుగోలు చేశారు. రబీలో కొనుగోలు కేంద్రాల ఊసు లేక పోవడంతో రైతులు దిక్కుతోచకున్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న దళారులు గ్రామాలలో తిరుగుతూ వరి కొనుగోళ్లు ముమ్మరం చేశారు. సాధారణ రకం వరి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. సాధారణ రకానికి క్వింటాలుకు రూ. 1,210 నుంచి 1,250 లోపే చెల్లిస్తున్నారు. సన్న రకం ధాన్యాన్ని కూడా ఇదే ధరకు కొంటామంటున్నారు. మార్క్‌ఫెడ్ ఎక్కడ? ఇదిలా ఉండగా మొక్కజొన్నను మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర అందిస్తామని అధికారులు గతంలో వెల్లడించారు. కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. సహకార సంఘాల ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు మార్క్‌ఫెడ్ ప్రతిపాదనలు మాత్రం తయారు చేసింది. సార్వత్రిక ఎన్నికల కోడ్‌రావడంతో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవడం లేదని చెబుతున్నారు. ధాన్యం కొనుగోలుకు, ఎన్నికల కోడ్‌కు సంబంధం ఏమిటని రైతులు ఆ వేదన వ్యక్తం చేస్తున్నారు. దళారులు మొక్కజొన్నను క్వింటాలుకు రూ.1,200 నుంచి 1,250 వరకు రైతుల నుంచి కొంటున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ఇంకా జాప్యం జరిగితే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది.