చేతులెత్తేసిన మార్క్‌ఫెడ్
గజ్వేల్: వర్షాభావ పరిస్థితుల కారణంగా తీవ్రంగా నష్టపోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న మొక్కజొన్న రైతులు... చేతికందిన కొద్దిపాటి దిగుబడులను కూడా అమ్ముకోలేని దయనీయ పరిస్థితి నెలకొంది. రెండు మూడు రోజుల్లో కొనుగోళ్లు గడువు ముగియనున్నదనీ, ఇప్పటికే చాలావరకు కేంద్రాలు ఎత్తేసినట్లు మార్క్‌ఫెడ్ ప్రకటించినా...ఇంకా ఆయా యార్డుల్లోకి మక్కలు వెల్లువలా వస్తున్నాయి.
మరోవైపు కొనుగోలు చేసిన మక్కల బస్తాలు రెండు మూడు రోజులుగా తరలింపునకు నోచుకోకపోవడంతో కొత్తగా వస్తున్న మక్కల కొనుగోళ్లకు అడ్డంకిగా మారాయి. ఈ సమయంలో కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయాలన్న మార్క్‌ఫెడ్ నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇపుడిపుడే నూర్పిళ్లు జరుగుతున్నందున మరో 15 రోజుల పాటు కొనుగోళ్లు చేపట్టాలని లేకపోతే తాము తీవ్రంగా నష్టపోక తప్పదని చెబుతున్నారు.
జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో 2.67 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. పత్తి తర్వాత ఇది ప్రధాన పంటగా ఆవిర్భవించింది. ఈసారి రైతులు మొక్కజొన్నపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. కానీ తీవ్ర వర్షాభావంతో ఈ పంటకు అపార నష్టం వాటిల్లింది. పరిస్థితులు అనుకూలిస్తే ఎకరాకు 30 క్వింటాళ్లకుపైగా దిగుబడి వచ్చేది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఎకరాకు రమారమి 8-10 క్వింటాళ్ల చొప్పను దిగుబడి లెక్కేసుకున్నా...జిల్లావ్యాప్తంగా రైతులవద్ద సుమారు 25 లక్షల క్వింటాళ్లకుపైగా మొక్కజొన్న ఉత్పత్తులు వచ్చే అవకాశముంది. ప్రభుత్వం కొనుగోళ్ల సీజన్ ఆరంభంలో జిల్లాలో 62కిపైగా కొనుగోలు కేంద్రాలను తెరిచింది.
ఈ కేంద్రాల్లో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు ఏ- గ్రేడ్‌కు రూ.1,310, బీ-గ్రేడ్‌కు రూ.1,230, సీ-గ్రేడ్‌కు రూ.1,180 చెల్లిస్తున్నారు. ప్రైవేట్ వ్యాపారులు క్వింటాలుకు రూ.1,000కి మించి ధర చెల్లించడంలేదు. పైగా క్వింటాలుకు 2 కిలోలను తరుగు పేరిట కోత విధిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు తమ ఉత్పత్తులను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే తరలిస్తున్నారు. తుపాన్ల కారణంగా గతంతో పోలిస్తే నూర్పిళ్లు ఆలస్యంగా జరిగాయి. అందువల్ల మక్కలు ఇప్పుడిప్పుడే మార్కెట్‌లోకి రావడం ఊపందుకుంది. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐకేపీ కేంద్రాల ద్వారా కేవలం 4 లక్షల క్వింటాళ్లు మాత్రమే అధికారులు కొనుగోలు చేయగలిగారు.
ఈ లెక్కన చూస్తే కొనుగోలు కేంద్రాల ద్వారా ఖరీదు చేసిన మక్కలు పండిన ఉత్పత్తుల్లో 25 శాతం కూడా మించలేదు. చాలా కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత, రవాణా పరమైన ఇబ్బందులతో కొనుగోళ్లు వేగంగా సాగడంలేదు. గజ్వేల్ మార్కెట్ యార్డులోని కేంద్రంలో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఈ యార్డులో కొనుగోలు చేసి తరలించకుండా 800 క్వింటాళ్ల బస్తాలు పేరుకుపోయి ఉండగా, మరో 800 క్వింటాళ్లకుపైగా మక్కలు కొనుగోళ్ల కోసం సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు గజ్వేల్ నియోజకవర్గంలో మొక్కజొన్న నూర్పిళ్లు చాలా ఆలస్యంగా సాగుతున్నాయి. నేటికీ వేలాది ఎకరాల్లో జూళ్లు కంకులు తీయకుండా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయడానికి రంగం సిద్ధం చేయడం దారుణమని రైతులు ఆందోళన చెందుతున్నారు.
కొనుగోళ్లు చేయలేం
Published Mon, Dec 15 2014 11:05 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement