యూరియా.. ఇదేందయా? | Mark Fed cheating farmers | Sakshi
Sakshi News home page

యూరియా.. ఇదేందయా?

Published Mon, Aug 6 2018 1:41 AM | Last Updated on Mon, Aug 6 2018 1:41 AM

Mark Fed cheating farmers  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  వ్యాపారులు మోసం చేస్తే ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది.. కానీ సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థే రైతులను మాయ చేస్తే..?  ఎవరికి చెప్పుకోవాలి?  రైతుల పక్షాన నిలవాల్సిన మార్క్‌ఫెడ్‌ పక్కా వ్యాపార సంస్థగా మారింది. ఒకవైపు వర్షాల్లేక రైతులు గగ్గోలు పెడుతుంటే.. మరోవైపు గడ్డ కట్టిన యూరియాను సరఫరా చేసి మరో బండ మోపుతోంది! మూడు నాలుగేళ్ల కిందట కంపెనీల నుంచి కొనుగోలు చేసిన యూరియా గడ్డ కట్టడంతోపాటు దానిలో ఉన్న శక్తి కూడా తగ్గిపోయింది.

దీంతో ఉపయోగం లేదని తెలిసినా మార్క్‌ఫెడ్‌ అధికారులు ఒత్తిడి చేసి మరీ రైతులకు అంటగడుతున్నారు. ఈ యూరియా తమ కొద్దంటూ అన్నదాతలు గగ్గోలు పెడుతున్నా వినే నాథుడే కరువయ్యాడు.  ఈ యూరియా కొన్నా అది పనిచేయక రెండుసార్లు చల్లాల్సి వస్తోంది. దీంతో ఖర్చు తడిసి మోపెడు అవుతోంది. గడ్డ కట్టిన యూరియాను కంపెనీలకు వెనక్కి ఇచ్చి కొత్తగా తీసుకోకుండా రైతులకు మార్క్‌ఫెడ్‌ అన్యాయం చేస్తోం దన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిల్వల వెనుక భారీ స్కాం?
ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 66.36 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఖరీఫ్‌ పంటల కోసం రాష్ట్రానికి దాదాపు 8 లక్షల టన్నుల యూరియా అవసరం. అందులో 2 లక్షల టన్నుల యూరియాను మార్క్‌ఫెడ్‌ బఫర్‌స్టాకుగా సిద్ధంగా ఉంచుకోవాలి. ఆ పాత నిల్వలను బయటకు పంపిస్తూ మళ్లీ అంతే మోతాదులో కొత్త సరుకును బఫర్‌ స్టాకుగా ఉంచాలి. ప్రస్తుతం మార్క్‌ఫెడ్‌ వద్ద 1.27 లక్షల టన్నుల యూరియా ఉండగా, అందులో 30,394 టన్నుల యూరియా గడ్డ కట్టినదే కావడం గమనార్హం.

కొన్నాళ్లుగా బఫర్‌ స్టాకును కదిలించకుండా చాలావరకు కొత్త సరుకును రైల్వే రేక్‌ పాయింట్ల నుంచి నేరుగా ఎరువుల డీలర్లకు పంపిస్తున్నారు. దీంతో మార్క్‌ఫెడ్‌ వద్ద  మూడు నాలుగేళ్లుగా 2 లక్షల టన్నులకుపైగా యూరియా గడ్డ కట్టుకుపోయింది. రేక్‌ పాయింట్ల నుంచే యూరియాను మార్కెట్‌కు పంపిస్తున్నారు. దీంతో లోడింగ్, అన్‌లోడింగ్, నిర్వహణ వంటి ఖర్చులన్నీ మిగులుతున్నాయి.

ఆయా ఖర్చులన్నీ కాగి తాల్లో కనిపిస్తున్నాయే కానీ ఎక్కడా వాస్తవ ఖర్చులేదు. మార్క్‌ఫెడ్‌ అధికారులు కోట్ల రూపాయలు కాజేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. జిల్లాల నుంచి పైస్థాయి వరకు ఇదే పరిస్థితి. యూరియా నిల్వల నిర్వహణలో భారీ కుంభకోణం దాగి ఉండటంపై విమర్శలు వస్తున్నాయి. కక్కుర్తి వల్లే బఫర్‌ స్టాక్‌ యూరియా నిల్వలు కాస్తా గడ్డకట్టుకు పోయాయి.

తక్కువ ధర అంటూ...  
రెండు మూడేళ్ల క్రితం బఫర్‌ స్టాక్‌కు అదనపు నిల్వలు తీసుకున్నామని, కానీ కాలం కలిసి రాకపోవడంతో నిల్వలు పేరుకుపోయాయని మార్క్‌ఫెడ్‌ అధికారు లు చెబుతున్నారు. పాతవి వదిలించుకోకపోవ డం, కొత్త సరుకు నిల్వ చేయకపోవడం వల్లే  వ్యవహారం గందరగోళంగా మారింది. బఫర్‌స్టాక్‌ను అధికంగా ఉంచడంలోనూ మాయ జరిగిందన్న విమర్శలున్నాయి. మిగిలిన గడ్డకట్టిన యూరియాను తక్కువ ధర అంటూ అంటగడుతున్నారు. యూరియా నాణ్యమైనదే అయితే తక్కువ ధరకు ఎందుకు అంటగడుతున్నారు? పాత దానికి కొత్త దానికి తేడా లేకపోతే ధర తగ్గించాల్సిన అవసరమేంటన్న దానికి సమా ధానం లేదు.

45 కిలోల యూరియా ధర రూ.252 కాగా గడ్డ కట్టిన 50 కిలోల బస్తా యూరియా ధర రూ.264 ఉంది. గడ్డ కట్టింది కాబట్టే తక్కువకు ఇస్తున్నామని అధికారులు అంటున్నా, యూరియా ఆరు నెలలు దాటితే  నాణ్యత తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గడ్డ కట్టిన యూరియా పనిచేయడం లేదని అటు రైతులు, ఎరువుల డీలర్లు మార్క్‌ఫెడ్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. కానీ తీసుకోవాల్సిందేనంటూ మార్క్‌ఫెడ్‌ వర్గాలు ఒత్తిడి చేస్తున్నాయి. కొందరు డీలర్లు అయితే కమీషన్లు ముట్టజెప్పుకొని కొత్త యూరియాను దక్కించుకుంటున్నారు. లేకుంటే వారికి గడ్డ కట్టిన యూరియానే ఇస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement