ఎర్రబారుతున్న మొక్కజొన్న
- పొలాల్లో నిలిచిన వర్షపునీరే కారణం
- క్రమేపీ చనిపోతున్న మొక్కలు
- నీటిని బయటకు తోడితేనే రక్షణ
నందిగామ ప్రాంతంలో సాగుచేస్తున్న మొక్కజొన్న పైరు ఎర్రబారుతోంది. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పొలాల్లో నీరు నిలుస్తోంది. దీని వల్ల మొక్కలు ఎర్రబారుతున్నాయి. పొలంలో ఎక్కువ రోజులు నీరు నిల్వకుండా చర్యలు తీసుకుంటేనే పైరును కాపాడుకోవచ్చని మండల వ్యవసాయాధికారి నిషాద్‌అహ్మద్ సూచించారు.
ఈ ఏడాది నెలకొన్న వర్షాభావ పరిస్థితుల్లో నందిగామ ప్రాంత రైతులు మొక్కజొన్న సాగు చేపట్టారు. సాధారణంగా మెరక పొలాల్లో ఎక్కువ శాతం మంది రైతులు ఆరుతడి పంటగా ఈ పంట సాగుచేస్తుంటారు. ఖరీఫ్‌లో వరిపై ఆశలు వదులుకున్న ఇతర రైతులు కూడా మొక్కజొన్నపైనే మొగ్గుచూపారు. అయితే ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలు ఈ పంటకు చేటుచేస్తున్నాయి. ఎక్కువ రోజులు పొలంలో నీరునిల్వ ఉండటం వలన నేల అవసరానికి మించి ఎక్కువగా గుల్లబారుతోంది. దీని కారణంగా మొక్కజొన్న మొక్కలు ఎర్రబారి క్రమేపీ వడలిపోతున్నాయి.
ప్రస్తుతం నందిగామ ప్రాంతంలో 30, 45, 60 రోజుల వయసులో మొక్కజొన్న చేలు ఉన్నాయి. మొక్కజొన్న పంట విత్తనం ఎదపెట్టిన రోజు నుంచి 100 నుంచి 110 రోజుల్లో చేతికొస్తుంది. ఎకరాకు ఖర్చు రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు అవుతుంది. ఎకరాకు భూమిలోని సారాన్ని బట్టి 30 నుంచి 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. మొక్కజొన్న ధర క్వింటా రూ.900 నుంచి 1200 వరకు పలుకుతోంది.
తక్కువ పెట్టుబడితో మెట్ట పొలాల్లో ఆరుతడి పంటగా మొక్కజొన్న సాగు చేసుకోవడం వలన అధిక లాభాలు వస్తాయని పలువురు రైతులు చెబుతున్నారు. పంట మొత్తం మీద మూడు నీటి తడులు పెట్టినా సరిపోతుంది. దీంతో ఈ ఏడాది నందిగామ ప్రాంతంలో ఖరీఫ్‌లో మొక్కజొన్న సాగు మరింత అధికంగా చేస్తున్నారు. అయితే అధిక వర్షాల వల్ల దిగుబడులు తగ్గుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
- నందిగామ రూరల్
చేటుచేస్తున్న వర్షాలు
నందిగామ ప్రాంతంలో ఇటీవల వర్షాలు అధికంగా కురుస్తున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం సెప్టెంబర్‌లో కురవాల్సిన సరాసరి వర్షపాతం166 మిల్లీమీటర్లు. అయితే బుధవారం నాటికి 221.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరుస వర్షాల వలన మొక్కజొన్న పొలాల్లోని సాళ్లలో నీరు నిలిచి ఉంటుంది. దీని కారణంగా మొక్కలు ఎర్రబరాటంతో పాటు వడలిపోయి చనిపోతాయని వ్యవసాయ శాఖాధిరులు చెబుతున్నారు.
నీటిని బయటకు పంపించాలి
మొక్కజొన్న పొలాల్లో నిలిచిన సాళ్లలోని నీటిని పూర్తిగా పొలంలో నుంచి బయటకు పంపించివేయాలి. ఆ తరువాత ఎకరాకు 30 కిలోల చొప్పున యూరియా వెదజల్లుకోవాలి. నీరు ఎక్కువుగా నిల్వ ఉండి భూమి మరింత గుల్లబారి తేమగా ఉన్న పొలాల్లో యూరియాతో పాటు సూక్ష్మపోషకాలైన జింకు సల్ఫేట్ పొడిని ఎకరాకు 200 గ్రాములు తీసుకొని దానిని 200లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. దీని వల్ల మొక్కలు ఎర్రబారి వడలిపోకుండా రిక్షించుకోవచ్చు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే నన్ను సంప్రదించొచ్చు.
- నిషాద్ అహ్మద్, నందిగామ మండల వ్యవసాయ అధికారి
88866 13375