సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ‘అడవుల్లో ఉండాల్సిన కోతులు ఊళ్ల మీదికి వచ్చినయి. మొక్కలు నాటి అడవులను పెంచితే కోతులు ఊళ్ల నుంచి అడవులకు పోతయ్. వానలు కూడా వాపస్ వస్తయ్’ – మూడేళ్ల కిందట హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పిన మాటలివీ! అప్పట్నుంచి ప్రతి ఏటా హరితహారంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నా పరిస్థితి ఏమాత్రం మారడం లేదు. కోతులు, అడవి జంతువులు ఎప్పట్లాగే ఊళ్లపైకి దండెత్తి పంటలన్నీ నాశనం చేస్తున్నాయి.
కోతులకు ఆహారంగా ఉపయోగపడే పండ్ల చెట్లను అడవుల్లో పెంచేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. హరితహారం కింద కేవలం అడవుల్లోనే 100 కోట్ల మొక్కలను పెంచాలన్న ప్రతిపాదన ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. దీంతో కోతులు అడవి బాట పట్టిన దాఖలాలు రాష్ట్రంలో ఎక్కడా కనిపించడం లేదు. ఒక్క కోతులే కాదు.. అడవి పందులు, నెమళ్లు, జింకలు, దుప్పులు కూడా ఆహారం కోసం ఊళ్లలోకి వస్తున్నాయి. ఎకరాల కొద్దీ వరి, మొక్కజొన్న, పత్తి, సోయా వంటి పంటలతోపాటు పండ్ల తోటలను నాశనం చేస్తున్నాయి.
నామమాత్రంగా పరిహారం..
అడవి పందుల కారణంగా వరికి నష్టం జరిగితే ఎకరాకు రూ.6వేలు, మొక్కజొన్నకు రూ.4వేలు పరిహారం ఇస్తున్నారు. మిగతా పంటలకు ఆ పంటను బట్టి పరిహారాన్ని నిర్ణయిస్తారు. ఈ పరిహారం పొందాలన్నా సవాలక్ష నిబంధనలు ఉండడంతో అనేక ప్రాంతాల్లో రైతులు దరఖాస్తు చేసుకోవడం లేదు. కోతులు, చిలుకలు, నెమళ్లు కూడా పంటలకు నష్టం చేస్తున్నా పరిహారం పొందే పరిస్థితి లేదు.
ఏటా వేల ఎకరాల్లో నష్టం..
రాష్ట్రంలో అడవి అంటే గుర్తుకొచ్చేది మొదట ఆదిలాబాదే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కవ్వాల్ అభయారణ్యంతోపాటు 44 శాతం అటవీ ప్రాంతం ఉంది. రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం తర్వాత అత్యధిక అటవీప్రాంతం ఉన్న జిల్లా ఇదే. కానీ అడవుల్లో ఉండాల్సిన జంతుజాలం ఊళ్లపైకి దండెత్తుతోంది. అడవి పందులు, కోతులు, దుప్పులు, నెమళ్ల కారణంగా ఆదిలాబాద్ జిల్లాలో రైతులు ఏటా వేల ఎకరాల్లో పంటలు నష్టపోతున్నారు. అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న జన్నారం, దండేపల్లి, వేమనపల్లి, కోటపల్లి, చెన్నూరు, ఇచ్చోడ, కడెం, చించోలి, కెరమెరి తదితర మండలాల పరిధిలో ఈ నష్టం ఎక్కువగా ఉంది. అనధికారిక లెక్కల ప్రకారం గత మూడేళ్లుగా ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఏటా 7 వేల ఎకరాల పంట అటవీ జంతువుల పాలైనట్లు తెలుస్తోంది.
జంతువుల దాడితో పంట కోల్పోయినందుకు ఒక్క లక్సెట్టిపేట అటవీ రేంజ్ పరిధిలోనే 2016–17లో రైతులు రూ.13 లక్షలు నష్టపరిహారం పొందారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల పరిధిలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. అడవి పందులు, కోతుల కారణంగా ఒక్కో జిల్లాలో ఏటా కనీసం 2 వేల ఎకరాల వరకు పంట నష్టపోతున్నట్లు అంచనా. 48 శాతం అటవీ ప్రాంతం ఉన్న ఖమ్మం జిల్లాలో మాత్రం అటవీ జంతువుల బెడద పెద్దగా లేదు.
అడవి పందులొస్తే సర్వనాశనమే
ఇరవై వరకు గుంపుగా వచ్చే అడవి పందులు చేనులోనో, పొలంలోనో పడితే అది సర్వనాశనం అయ్యేదాకా వదలవు. అర్ధరాత్రి దాడికి దిగి మొదళ్లతో సహా పెకిలించి వేసి పంటను నాశనం చేస్తాయి. కాపలా ఉన్న రైతుపై దాడికి సైతం వెనుకాడవు. గతంలో పందులను భయపెట్టేందుకు బాణసంచా పేల్చడం, డప్పులతో చప్పుళ్లు చేయడం వంటి ట్రిక్స్ ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు వాటికి బెదరడం లేదు. ఇక కోతులు ఉదయం, పగటి పూట మొక్కజొన్న, పండ్లు, కూరగాయల తోటలను సర్వనాశనం చేస్తున్నాయి.
రామచిలుకలు, నెమళ్ల వల్ల కూడా బాసర, ఆసిఫాబాద్‌లోని మొవాద్, నిర్మల్ జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో పంటలకు నష్టం జరుగుతోంది. అడవి పందుల నుంచి పంటను రక్షించుకునేందుకు పొలాల చుట్టూ విద్యుత్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇది పలుచోట్ల రైతుల ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుంటే జంతువులు ఆ దరిదాపులకు రావు. కానీ ఈ విషయమై అటవీశాఖ గానీ, రెవెన్యూ సిబ్బంది గానీ దృష్టి పెట్టడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment