సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పొగాకు రైతుల్ని ఆదుకునేందుకు గత ఏడాది రంగంలోకి దిగిన మార్క్‌ఫెడ్.. పొగాకును విదేశాలకు ఎగుమతి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మార్క్‌ఫెడ్ వద్ద సుమారు రూ.103 కోట్ల విలువైన 9.43 మిలియన్ కిలోల పొగాకు ఉంది. దీన్లో ఉన్నది ఉన్నట్లుగా అమ్ముడయ్యేదిపోను మిగిలినదాన్ని ప్రాసెస్, ప్యాకింగ్ చేసి రీడ్రైడ్ థ్రెషడ్ లేమినా (ఆర్‌టీఎల్) రూపంలో విదేశాలకు ఎగుమతి చేయనుంది. ప్రాసెస్ చేసేందుకు టెండర్లు ఖరారు చేశారు. నమూనాగా ప్యాక్ చేసిన శాంపిళ్లను పొగాకు వ్యాపారులు, ఎగుమతిదారులు, విదేశీ కస్టమర్లకు పంపించారు. వాటి నాణ్యత బాగానే ఉందని పరీక్షల్లో తేలిందని అధికారులు చెబుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన అధిక వర్షాలకు తోడు కరోనా ప్రభావంతో గతేడాది మార్కెట్‌లో పొగాకు రేటు పతనమైంది. దీంతో ఏ ఒక్క రైతు నష్టపోకూడదన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పంతో మార్క్‌ఫెడ్ చరిత్రలో తొలిసారి పొగాకు వేలంలో పాల్గొని మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీమ్ కింద పెద్ద ఎత్తున కొనుగోలు చేసింది.
సగటున కిలో రూ.81కి కొనుగోలు
రాష్ట్రంలో సాధారణంగా ఖరీఫ్‌లో 4,360 ఎకరాలు, రబీలో 2,02,345 ఎకరాల్లో పొగాకు సాగవుతుంది. 2019–20 సీజన్‌లో ఖరీఫ్‌లో 6,787 ఎకరాలు, రబీలో 1,92,700 ఎకరాల్లో సాగైంది. ఏటా పొగాకు బోర్డు ద్వారా క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. గతేడాది కరోనా దెబ్బకు అంతర్జాతీయంగా పొగాకు రేట్లు పతనమవడంతో మార్క్‌ఫెడ్ రంగంలోకి దిగింది. గతేడాది 128.65 మిలియన్ కిలోలు మార్కెట్‌కు వచ్చింది. దీంట్లో 12.93 మిలియన్ కిలోలను (1,29,31,590 కిలోలను) మార్కెఫెడ్ కొనుగోలు చేసింది. సగటున కిలో రూ.81 వంతున 29,228 మంది రైతుల నుంచి పొగాకు కొనుగోలు చేసింది. కొనుగోలుకు వెచ్చించిన సొమ్ము, రవాణా ఖర్చులు, బ్యాంకు వడ్డీలు కలిపి మార్క్‌ఫెడ్‌కు రూ.128.65 కోట్ల వ్యయం అయింది. అనంతరం ఈ–వేలం ద్వారా 3.50 మిలియన్ కిలోలను విక్రయించింది. ఇంకా గోదాముల్లో 9.43 మిలియన్ కిలోలు ఉంది. కోవిడ్ కారణంగా వ్యాపారులకు విదేశాల నుంచి ఆర్డర్స్ తగ్గిపోయాయి. కర్ణాటకలో లో గ్రేడ్ రకాల పంట ఎక్కువగా వచ్చింది. ఎగుమతికి రవాణా ఖర్చులు పెరిగిపోవడం, కంటైనర్ల కొరత వంటివి కూడా తోడయ్యాయి. దీంతో మార్క్‌ఫెడ్ వద్ద పొగాకు నిల్వలు పేరుకుపోయాయి. ఈ పొగాకును విక్రయించేందుకు మార్క్‌ఫెడ్ సన్నాహాలు చేస్తోంది.
నేరుగా ఎగుమతికి సన్నాహాలు
దేశీయ వ్యాపారులు ముందుకు రాకపోతే ఇతర దేశాలకు నేరుగా ఎగుమతి చేయాలని భావిస్తున్నాం. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రబీలో క్వాలిటీ పొగాకు పండటం వల్ల మా వద్ద ఉన్న లో గ్రేడ్ పొగాకుకు కాస్త డిమాండ్ ఏర్పడనుంది. కర్ణాటకలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో మా వద్ద పేరుకుపోయిన నిల్వలు అమ్ముడవుతాయన్న ఆశాభావంతో ఉన్నాం. కొంత మామూలుగా, మరికొంత ప్రాసెస్ చేసి ఎగుమతి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకోసం ఎక్స్‌పోర్టు ఏజెంట్లను నియమించేందుకు సన్నాహాలు చేస్తున్నాం.
– పి.ఎస్.ప్రద్యుమ్న, ఎండీ, మార్క్‌ఫెడ్
Comments
Please login to add a commentAdd a comment