ఒంగోలు: కరోనా బాధితులకు వైద్యం చేస్తూ.. తానూ కరోనా బారినపడి మృత్యువు అంచుకు చేరిన ఓ వైద్యుడిని అప్పటి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చొరవతో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదుకుని ప్రాణం పోశారు. తనకు ప్రాణదానం చేసిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆ వైద్యుడు కృతజ్ఞతలు చెబుతూ మళ్లీ విధులకు సిద్ధమయ్యాడు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తొలిసారిగా కారంచేడులో కరోనా కేసులు వెలుగుచూశాయి.
ఆ సమయంలో కారంచేడు ప్రభుత్వ వైద్యశాల వైద్యుడిగా భాస్కర్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన భార్య డాక్టర్ భాగ్యలక్ష్మి ఒంగోలు రిమ్స్‌లో రేడియాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. తొలినాళ్లలో 2020 ఏప్రిల్ 24న భాస్కర్ కరోనా సోకింది. తొలుత ఆయన గుంటూరు జనరల్ ఆస్పత్రిలో, తర్వాత విజయవాడ ఆయుష్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నా తగ్గకపోవడంతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేర్చారు. అప్పటికే రూ.50 లక్షల దాకా ఖర్చుచేశారు.
సంపాదించిన డబ్బులతో పాటు అప్పు తెచ్చినా వైద్యానికి సరిపోలేదు. అపోలో వైద్యులు అతనికి ఊపిరితిత్తులు మార్పిడి చేయాలని, దాదాపు రూ.1.5 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. ఆ సమయంలోనే రిమ్స్ ఒంగోలు రీజనల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, ఓబుల్‌రెడ్డి, ఒంగోలు క్యాన్సర్ హాస్పిటల్ ఆంకాలజీ వైద్యుడు డాక్టర్ రామకృష్ణారెడ్డి సాయంతో అప్పటి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసి సాయం చేయాలని కోరారు.
వైద్యుడి విషయాన్ని సీఎం వైఎస్ జగన్ దృష్టికి బాలినేని తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సీఎం చికిత్సకు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. ఆ మేరకు ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్యం అందించారు. దీంతో డాక్టర్ భాస్కర్ ఆరోగ్యం కుదుటపడింది. ఇటీవలే కోలుకున్నారు. డాక్టర్ దంపతులు ఆదివారం ఎమ్మెల్యే బాలినేనిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
తనకు పునర్జన్మ ఇచ్చిన సీఎం వైఎస్ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపే అవకాశం కల్పించాలని డాక్టర్ భాస్కర్ కోరారు. సీఎంకు కృతజ్ఞతలు తెలిపాకవిధుల్లో చేరాలనుకుంటున్నట్లు చెప్పారు. దీనికి స్పందించిన బాలినేని.. సీఎంను కలిసే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
సీఎం జగనే ప్రాణం పోశారు..
Published Mon, Nov 21 2022 5:30 AM | Last Updated on Mon, Nov 21 2022 6:00 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment