తాండూరు, న్యూస్‌లైన్: శనగ రైతులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పండించిన పంట అమ్ముకున్నా చేతికి డబ్బులు అందక అవస్థలు పడుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంధువుల ఇంట్లో శుభకార్యాలకు వెళ్లడానికి చేతిలో చిల్లిగవ్వ లేక నానాపాట్లు పడాల్సిన పరిస్థితి నెలకొందని కొందరు రైతులు వాపోతున్నారు. ఇంటి అవసరాలు తీర్చుకోవడంలో ఇక్కట్లకు గురవుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ మార్క్‌ఫెడ్ ఉదాసీన వైఖరితో రైతులకు సకాలంలో డబ్బులు అందని పరిస్థితి.
ఈ విషయంలో జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) నిర్లక్ష్య ధోరణి రైతులకు డబ్బుల చెల్లింపులో ఆలస్యానికి కారణమవుతోంది. కందుల కొనుగోలు విషయంలోనూ అధికారులు రైతులకు డబ్బుల చెల్లింపులో తీవ్ర జాప్యం చేశారు. అలాగే శనగ రైతులకూ సకాలంలో చెల్లింపులు చేయకపోవడం సంబంధిత అధికారుల తీరు విమర్శలకు దారిస్తోంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో పంట దిగుబడులు విక్రయిస్తే తొందరగా డబ్బులు వస్తాయని నమ్మకం రైతుల్లో సన్నగిల్లుతున్నట్టు స్పష్టమవుతోంది. వివరాలు.. ఈ ఏడాది మార్చి 3న మార్క్‌ఫెడ్ డీసీఎంఎస్ ద్వారా రైతుల నుంచి శనగల సేకరణకు పట్టణంలోని పౌర సరఫరాల గోదాం (ఎడ్లబజార్)లో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
ఏప్రిల్ 25 వరకు వివిధ గ్రామాలకు చెందిన రైతుల నుంచి అధికారులు శనగలను సేకరించారు. శనగలు సేకరించిన వారం పది రోజులకే రైతులకు డబ్బులు చెల్లిస్తామన్నారు. కానీ ఈ విషయంలో మార్క్‌ఫెడ్ జాప్యం చేయడంతో రైతులకు డబ్బులందక ఇబ్బందులు పడుతున్నారు. వివిధ గ్రామాలకు చెందిన 121 మంది రైతుల నుంచి క్వింటాలుకు రూ.3,100 చొప్పున రూ.1,20,51,250 విలువ చేసే 3,887.50 క్వింటాళ్ల శనగలను రైతుల నుంచి డీసీఎంఎస్ అధికారులు సేకరించారు. ఇందులో ఇప్పటి వరకు మార్క్‌ఫెడ్ రూ.54లక్షలు మాత్రమే విడుదల చేసింది. ఈ డబ్బులు 43 మంది రైతులకు చెల్లింపులు చేశారు.
ఇంకా వివిధ గ్రామాలకు చెందిన 78మంది రైతులకు రూ.66,51,250 చెల్లించాల్సి ఉంది. డబ్బుల కోసం ఆయా గ్రామాల రైతులు డీసీఎంఎస్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మార్క్‌ఫెడ్ నుంచి రాగానే చెల్లిస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో వివిధ గ్రామాల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు చొరవ చూపి డబ్బులు త్వరగా అందేలా చూడాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు. రైతుల నుంచి సేకరించిన శనగలను కొనుగోలు కేంద్రం నుంచి హైదరాబాద్ నాంపల్లిలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ (సీడబ్ల్యూసీ)కి తరలిస్తున్నారు.
త్వరలోనే చెల్లిస్తాం: షరీఫ్, డీసీఎంఎస్ మేనేజర్
మార్క్‌ఫెడ్ నుంచి డబ్బులు రావాల్సి ఉంది. డబ్బులు వచ్చిన వెంటనే రైతులకు చెల్లింపులు చేస్తాం. విషయాన్ని మార్క్‌ఫెడ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. ఇప్పటికి రూ.54లక్షల వరకు రైతులకు చెల్లించాం. మిగిలిన రైతులకూ త్వరగా డబ్బులు చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నాం.
శనగల పైసలు ఇంకెప్పుడిస్తరు?
Published Mon, May 5 2014 12:15 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement