District Cooperative Marketing Society
-
సహకారానికి అరుదైన అవకాశం
ఒంగోలు సబర్బన్: ప్రకాశం జిల్లాకు చెందిన సహకార మార్కెటింగ్ సంఘం (డీసీఎంఎస్) అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకుంది. కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి సన్నిధానం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కు శనగపప్పు, కందిపప్పు సరఫరా ఆర్డర్ సొంతం చేసుకుంది. జిల్లా కేంద్రం ఒంగోలు నుంచి తొలివిడతలో భాగంగా రెండు రకాల పప్పులు కలిపి 50 టన్నులు సరఫరా చేయాలని టీటీడీ చైర్మన్, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రకాశం డిస్టిక్ట్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీకి అనుమతి ఇచ్చినట్లు సొసైటీ చైర్మన్ రావి రామనాథంబాబు పేర్కొన్నారు. సరఫరా చేసేందుకు పప్పు తయారీ కోసం కసరత్తు ప్రారంభించారు. డీసీఎంఎస్ చరిత్రలో ఇలాంటి వ్యాపార నిర్ణయం ఏ పాలక మండలి కూడా తీసుకోలేదు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 డిసెంబర్లో డీసీఎంఎస్ పాలకవర్గాన్ని ఏర్పాటు చేశారు. సొసైటీ చైర్మన్‌గా ఆ పార్టీ పర్చూరు ఇన్చార్జ్ రావి రామనాథంబాబు బాధ్యతలు చేపట్టారు. కొత్త పాలకవర్గం ఏర్పాటైన నాటి నుంచి సొసైటీని అభివృద్ధి పథంలో నడిపించాలన్నదే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. రైతుల నుంచి నేరుగా పంట ఉత్పత్తుల కొనుగోలు.... పంట ఉత్పత్తులను డీసీఎంఎస్ గతంలో ఎన్నడూ లేని విధంగా నేరుగా రైతుల నుంచే కొనుగోలు చేసింది. గత సంవత్సరం ఖరీఫ్, రబీ సీజన్లలో పండించిన ధాన్యం, కందులు, శనగలు కొనుగోలు చేసింది. 7,800 మెట్రిక్ టన్నులు ధాన్యం, 5 వేల మెట్రిక్ టన్నులు శనగలు, 400 మెట్రిక్ టన్నులు కందులు కొనుగోలు చేశారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం దళారీ వ్యవస్థను రూపుమాపి కొనుగోలు చేయటం ద్వారా అటు రైతుకు లాభం చేకూరడంతో పాటు ఇటు కొనుగోలు పర్సెంటేజ్ రూపంలో ప్రభుత్వం నుంచి సొసైటీకి కూడా ఆదాయం సమకూరినట్టయింది. సహకార రంగానికి ఊపిరి పోసిన వైఎస్సార్... డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో సహకార రంగానికి ఊపిరి పోశారు. సహకార వ్యవస్థను బలోపేతం చేయటంలో వైఎస్ కీలక పాత్ర పోసిస్తే ఆ తర్వాత దానిని నిరీ్వర్యం చేయటంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాన భూమిక పోషించారు. సహకార రంగాన్ని ప్రైవేటు పరం చేశారు. ఆయన హయాంలోనే చీరాల, ఇంకొల్లు స్పిన్నింగ్ మిల్లులను పైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేశారు. తన సొంత సంస్థ హెరిటేజ్ డెయిరీ కోసం సహకార రంగంలో ఉన్న డెయిరీలన్నింటినీ నిలువునా నాశనం చేశారు. చిత్తూరు, ఒంగోలు డెయిరీలే అందుకు స్పష్టమైన ఉదాహరణలు. ఒంగోలు డెయిరీ ఇప్పటికీ కోలుకోలేని స్థితిలోకి వెళ్లిపోయింది. ఇక వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరిగి సహకార రంగానికి జీవం పోస్తున్నారు. సహకార రంగం బలోపేతం అయితేనే గ్రామీణ ప్రాంతాలు కళకళలాడతాయన్నది ముఖ్యమంత్రి ఉద్దేశం. అందుకే వచీ్చరాగానే పీడీసీసీ బ్యాంకుకు నూతన పాలక మండలి, సొసైటీలకు పాలక మండళ్లు, పొగాకు ఉత్పత్తిదారుల సమాఖ్యకు, డీసీఎంఎస్‌కు కూడా వెంటనే పాలక మండళ్లు వేసి వాటికి జవసత్వాలు తీసుకొచ్చారు. సొసైటీని లాభాల బాట పట్టించే దిశగా... నష్టాల్లో ఉన్న డీసీఎంఎస్‌ను లాభాల బాట పట్టించటమే లక్ష్యంగా పాలకవర్గం ముందుకు సాగుతోంది. చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టే నాటికి డీసీఎంఎస్ రూ.61 లక్షలు అప్పుల్లో ఉంది. తొలుత రైతులకు మేలు చేసేవిధంగా వ్యాపార కార్యకలాపాలను నిర్వహించి తద్వారా వచ్చే ఆదాయంతో ఉన్న అప్పులు తీర్చటమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ఉన్న అప్పులు తీర్చి వ్యాపార లావాదేవీలను ఎక్కువ చేసి తద్వారా లాభాలు ఆర్జించి సొసైటీని నిలదొక్కుకునేలా చేయటమే ధ్యేయంగా కృషి చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే భక్తుల కోసం అవసరమైన శనగపప్పు, కందిపప్పు సరఫరా చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. సహకార రంగానికి స్వర్ణయుగం... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటయిన నాటి నుంచి సహకార రంగానికి స్వర్ణయుగమనే చెప్పాలి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వం సహకార రంగాన్ని ప్రోత్సహిస్తోంది. టీటీడీకి డీసీఎంఎస్ నుంచి శనగపప్పు, కందిపప్పు సరఫరా చేయాలని ఆదేశాలు రావటమే అందుకు ప్రధాన ఉదాహరణ. టీటీడీకి మంచి నాణ్యమైన శనగపప్పు, కందిపప్పు సరఫరా చేసి జిల్లా పేరు నిలబెడతాం. డీసీఎంఎస్‌కు సింగరాయకొండ, కనిగిరి, కంభం, ఒంగోలుల్లో స్థిరాస్తులు ఉన్నాయి. వాటిని కాపాడుతూనే, ఆ ఆస్తులను కూడా అభివృద్ధి పరుస్తాం. నాబార్డు ద్వారా రైతులకు గోడౌన్ సదుపాయాలు కలి్పంచాలని సంకలి్పంచాం. తద్వారా వ్యాపార కార్యకలాపాలను కూడా విస్తరించేందుకు జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సహకారంతో ముందుకు సాగుతాం. – రావి రామనాథం బాబు, చైర్మన్, డీసీఎంఎస్ -
‘అనంత’ సహకార పీఠాలు వైఎస్సార్సీపీ వశం
అనంతపురం, న్యూస్‌లైన్: అనంతపురం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయభేరి మోగించారు. ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో డీసీసీబీ చైర్మన్‌గా లింగాల శివశంకర్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా ఆనందరంగారెడ్డి.. డీసీఎంఎస్ చైర్మన్‌గా బోయ మల్లికార్జున, వైస్ చైర్మన్‌గా నార్పల జయరామిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరికి అధికారులు డి క్లరేషన్లు అందజేశారు. డీసీసీబీలోని 21 డెరైక్టర్ స్థానాల్లో 14 స్థానాలను, డీసీఎంఎస్ పరిధిలో ఉన్న 10 డెరైక్టర్ స్థానాల్లో ఏడింటిని వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఏకగ్రీవం చేసుకోవడంతో చైర్మన్, వైఎస్ చైర్మన్ల ఎన్నిక ఏకపక్షమైంది. -
వైఎస్ఆర్సీపీకే సహకారం
అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) డెరైక్టర్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయభేరి మోగించారు. టీడీపీ మద్దతుదారులు ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ అడ్రస్ పూర్తిగా గల్లంతైంది. వివరాలు.. డీసీఎంఎస్‌లో కేటగిరీ-ఏ కింద ఆరు డెరైక్టర్ స్థానాలున్నాయి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు లేక రెండు స్థానాలు ఖాళీ పడ్డాయి. మిగిలిన నాలుగు స్థానాలకు శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో గట్టి పోలీస్ బందోబస్తు మధ్య పోలింగ్ నిర్వహించారు. ఇందులో మూడు ఓపెన్ కేటగిరీ (ఓసీ)స్థానాలకు ఏడుగురు అభ్యర్థులు బరిలోకి దిగారు. వీరి ముగ్గురు వైఎస్సార్సీపీ తరఫున, నలుగురు టీడీపీ మద్దతుతో పోటీ చేశారు. ఒక బీసీ డెరైక్టర్ స్థానానికి ఇరు పార్టీల తరఫున ఒక్కొక్కరు చొప్పున పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో 112 మంది ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) అధ్యక్షులకు ఓటు హక్కు కల్పించారు. ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం రెండు వరకు పోలింగ్ జరిగింది. 112 మందిలో 109 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూటూరు సొసైటీ అధ్యక్షుడు జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు ఓటింగ్‌కు హాజరు కాలేదు. ప్రతి ఒక్కరూ రెండు బ్యాలెట్లపై స్వస్తిక్ మార్కుతో ఓటేసే పద్ధతి పెట్టారు. ఓసీ డెరైక్టర్ల బ్యాలెట్ పత్రంలో ముగ్గురికి, బీసీ డెరైక్టర్ బ్యాలెట్ పత్రంలో ఒకరికి ఓటు వేయాల్సి ఉండగా... ఐదుగురు అధ్యక్షులు ఓసీ బ్యాలెట్ పత్రంలో ముగ్గురి కన్నా ఎక్కువ మందికి ఓటు వేశారు. దీంతో వాటిని చెల్లని ఓట్లుగా పరిగణించారు. మధ్యాహ్నం 2 గంటలకు పోలింగ్ ముగిసింది. మూడు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టారు. బీసీ డెరైక్టర్ స్థానం నుంచి వైఎస్సార్సీపీ మద్దతుదారుడు బోయ మల్లికార్జున 19 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు 64 ఓట్లు లభించగా, టీడీపీ మద్దతుదారుడు బీగం శంకరనాయుడుకు 45 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఓసీ డెరైక్టర్ స్థానాల నుంచి టి.జగదీశ్వర్‌రెడ్డి (68 ఓట్లు), జీవీ రమణారెడ్డి (66), పి.జయరామిరెడ్డి (63) విజయం సాధించారు. టీడీపీ మద్దతుదారులు జి.రాజగోపాలరెడ్డికి 40 ఓట్లు, జి.సురేష్‌కు 39, పి.బాలకృష్ణకు 31 ఓట్లు మాత్రమే వచ్చాయి. మరో అభ్యర్థి ఎన్.రంగనాథ్రెడ్డికి ఒక ఓటు మాత్రమే పడడం గమనార్హం. డెరైక్టర్లుగా గెలిచిన వారికి ఎన్నికల అధికారి ఈ.అరుణకుమారి, డీఎల్సీఓ కుమార్‌రాజా, సుధీంద్ర తదితరులు డిక్లరేషన్ పత్రాలు అందజేశారు. రాయదుర్గం అసెంబ్లీ వైఎస్సార్సీపీ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కౌంటింగ్ హాలుకు చేరుకుని గెలిచిన వైఎస్సార్సీపీ మద్దతుదారులను అభినందించారు. కాగా, పోలింగ్ సందర్భంగా వైఎస్సార్సీపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్దకు చేరుకున్నారు. అనంతపురం ఎంపీ అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థులు మాలగుండ్ల శంకరనారాయణ, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, నాయకులు తోపుదుర్తి ఆత్మారామిరెడ్డి, తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ అభ్యర్థి లింగాల శివశంకర్‌రెడ్డి, వైస్ చైర్మన్ అభ్యర్థి అనందరంగారెడ్డి, ఆకులేడు రామచంద్రారెడ్డి తదితరులు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు పోలింగ్ కేంద్రం వద్దే ఉన్నారు. ఉరవకొండ టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ పది నిమిషాలు ఉండి వెళ్లిపోయారు. కాగా, కేటగిరి-బి కింద ఉన్న నాలుగు స్థానాల్లో మూడింటిలో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు, మరో స్థానంలో ఏ పార్టీ మద్దతులేని వ్యక్తి ఇదివరకే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అభ్యర్థులు లేక మిగిలిపోయిన రెండు డెరైక్టర్ స్థానాలను కోఆప్షన్ పద్దతిలో ఎంపిక చేస్తారు. దీంతో మొత్తం 10 డెరైక్టర్ స్థానాల్లో ఇప్పటికే ఏడింటిని కైవసం చేసుకున్న వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు ఆదివారం నిర్వహించే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో విజయకేతనం ఎగుర వేయడం లాంఛనమే. డీసీసీబీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక కూడా ఆదివారమే జరగనుంది. -
శనగల పైసలు ఇంకెప్పుడిస్తరు?
తాండూరు, న్యూస్‌లైన్: శనగ రైతులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పండించిన పంట అమ్ముకున్నా చేతికి డబ్బులు అందక అవస్థలు పడుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంధువుల ఇంట్లో శుభకార్యాలకు వెళ్లడానికి చేతిలో చిల్లిగవ్వ లేక నానాపాట్లు పడాల్సిన పరిస్థితి నెలకొందని కొందరు రైతులు వాపోతున్నారు. ఇంటి అవసరాలు తీర్చుకోవడంలో ఇక్కట్లకు గురవుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ మార్క్‌ఫెడ్ ఉదాసీన వైఖరితో రైతులకు సకాలంలో డబ్బులు అందని పరిస్థితి. ఈ విషయంలో జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) నిర్లక్ష్య ధోరణి రైతులకు డబ్బుల చెల్లింపులో ఆలస్యానికి కారణమవుతోంది. కందుల కొనుగోలు విషయంలోనూ అధికారులు రైతులకు డబ్బుల చెల్లింపులో తీవ్ర జాప్యం చేశారు. అలాగే శనగ రైతులకూ సకాలంలో చెల్లింపులు చేయకపోవడం సంబంధిత అధికారుల తీరు విమర్శలకు దారిస్తోంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో పంట దిగుబడులు విక్రయిస్తే తొందరగా డబ్బులు వస్తాయని నమ్మకం రైతుల్లో సన్నగిల్లుతున్నట్టు స్పష్టమవుతోంది. వివరాలు.. ఈ ఏడాది మార్చి 3న మార్క్‌ఫెడ్ డీసీఎంఎస్ ద్వారా రైతుల నుంచి శనగల సేకరణకు పట్టణంలోని పౌర సరఫరాల గోదాం (ఎడ్లబజార్)లో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఏప్రిల్ 25 వరకు వివిధ గ్రామాలకు చెందిన రైతుల నుంచి అధికారులు శనగలను సేకరించారు. శనగలు సేకరించిన వారం పది రోజులకే రైతులకు డబ్బులు చెల్లిస్తామన్నారు. కానీ ఈ విషయంలో మార్క్‌ఫెడ్ జాప్యం చేయడంతో రైతులకు డబ్బులందక ఇబ్బందులు పడుతున్నారు. వివిధ గ్రామాలకు చెందిన 121 మంది రైతుల నుంచి క్వింటాలుకు రూ.3,100 చొప్పున రూ.1,20,51,250 విలువ చేసే 3,887.50 క్వింటాళ్ల శనగలను రైతుల నుంచి డీసీఎంఎస్ అధికారులు సేకరించారు. ఇందులో ఇప్పటి వరకు మార్క్‌ఫెడ్ రూ.54లక్షలు మాత్రమే విడుదల చేసింది. ఈ డబ్బులు 43 మంది రైతులకు చెల్లింపులు చేశారు. ఇంకా వివిధ గ్రామాలకు చెందిన 78మంది రైతులకు రూ.66,51,250 చెల్లించాల్సి ఉంది. డబ్బుల కోసం ఆయా గ్రామాల రైతులు డీసీఎంఎస్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మార్క్‌ఫెడ్ నుంచి రాగానే చెల్లిస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో వివిధ గ్రామాల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు చొరవ చూపి డబ్బులు త్వరగా అందేలా చూడాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు. రైతుల నుంచి సేకరించిన శనగలను కొనుగోలు కేంద్రం నుంచి హైదరాబాద్ నాంపల్లిలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ (సీడబ్ల్యూసీ)కి తరలిస్తున్నారు. త్వరలోనే చెల్లిస్తాం: షరీఫ్, డీసీఎంఎస్ మేనేజర్ మార్క్‌ఫెడ్ నుంచి డబ్బులు రావాల్సి ఉంది. డబ్బులు వచ్చిన వెంటనే రైతులకు చెల్లింపులు చేస్తాం. విషయాన్ని మార్క్‌ఫెడ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. ఇప్పటికి రూ.54లక్షల వరకు రైతులకు చెల్లించాం. మిగిలిన రైతులకూ త్వరగా డబ్బులు చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నాం.