అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) డెరైక్టర్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయభేరి మోగించారు. టీడీపీ మద్దతుదారులు ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ అడ్రస్ పూర్తిగా గల్లంతైంది. వివరాలు.. డీసీఎంఎస్‌లో కేటగిరీ-ఏ కింద ఆరు డెరైక్టర్ స్థానాలున్నాయి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు లేక రెండు స్థానాలు ఖాళీ పడ్డాయి. మిగిలిన నాలుగు స్థానాలకు శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో గట్టి పోలీస్ బందోబస్తు మధ్య పోలింగ్ నిర్వహించారు.
ఇందులో మూడు ఓపెన్ కేటగిరీ (ఓసీ)స్థానాలకు ఏడుగురు అభ్యర్థులు బరిలోకి దిగారు. వీరి ముగ్గురు వైఎస్సార్‌సీపీ తరఫున, నలుగురు టీడీపీ మద్దతుతో పోటీ చేశారు. ఒక బీసీ డెరైక్టర్ స్థానానికి ఇరు పార్టీల తరఫున ఒక్కొక్కరు చొప్పున పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో 112 మంది ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) అధ్యక్షులకు ఓటు హక్కు కల్పించారు. ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం రెండు వరకు పోలింగ్ జరిగింది. 112 మందిలో 109 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూటూరు సొసైటీ అధ్యక్షుడు జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు ఓటింగ్‌కు హాజరు కాలేదు.
ప్రతి ఒక్కరూ రెండు బ్యాలెట్లపై స్వస్తిక్ మార్కుతో ఓటేసే పద్ధతి పెట్టారు. ఓసీ డెరైక్టర్ల బ్యాలెట్ పత్రంలో ముగ్గురికి, బీసీ డెరైక్టర్ బ్యాలెట్ పత్రంలో ఒకరికి ఓటు వేయాల్సి ఉండగా... ఐదుగురు అధ్యక్షులు ఓసీ బ్యాలెట్ పత్రంలో ముగ్గురి కన్నా ఎక్కువ మందికి ఓటు వేశారు. దీంతో వాటిని చెల్లని ఓట్లుగా పరిగణించారు. మధ్యాహ్నం 2 గంటలకు పోలింగ్ ముగిసింది. మూడు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టారు. బీసీ డెరైక్టర్ స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు బోయ మల్లికార్జున 19 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు 64 ఓట్లు లభించగా, టీడీపీ మద్దతుదారుడు బీగం శంకరనాయుడుకు 45 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఓసీ డెరైక్టర్ స్థానాల నుంచి టి.జగదీశ్వర్‌రెడ్డి (68 ఓట్లు), జీవీ రమణారెడ్డి (66), పి.జయరామిరెడ్డి (63) విజయం సాధించారు.
టీడీపీ మద్దతుదారులు జి.రాజగోపాలరెడ్డికి 40 ఓట్లు, జి.సురేష్‌కు 39, పి.బాలకృష్ణకు 31 ఓట్లు మాత్రమే వచ్చాయి. మరో అభ్యర్థి ఎన్.రంగనాథ్‌రెడ్డికి ఒక ఓటు మాత్రమే పడడం గమనార్హం. డెరైక్టర్లుగా గెలిచిన వారికి ఎన్నికల అధికారి ఈ.అరుణకుమారి, డీఎల్‌సీఓ కుమార్‌రాజా, సుధీంద్ర తదితరులు డిక్లరేషన్ పత్రాలు అందజేశారు. రాయదుర్గం అసెంబ్లీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కౌంటింగ్ హాలుకు చేరుకుని గెలిచిన వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను అభినందించారు. కాగా, పోలింగ్ సందర్భంగా వైఎస్సార్‌సీపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్దకు చేరుకున్నారు.
అనంతపురం ఎంపీ అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థులు మాలగుండ్ల శంకరనారాయణ, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, నాయకులు తోపుదుర్తి ఆత్మారామిరెడ్డి, తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ అభ్యర్థి లింగాల శివశంకర్‌రెడ్డి, వైస్ చైర్మన్ అభ్యర్థి అనందరంగారెడ్డి, ఆకులేడు రామచంద్రారెడ్డి తదితరులు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు పోలింగ్ కేంద్రం వద్దే ఉన్నారు. ఉరవకొండ టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ పది నిమిషాలు ఉండి వెళ్లిపోయారు.
కాగా, కేటగిరి-బి కింద ఉన్న నాలుగు స్థానాల్లో మూడింటిలో వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారులు, మరో స్థానంలో ఏ పార్టీ మద్దతులేని వ్యక్తి ఇదివరకే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అభ్యర్థులు లేక మిగిలిపోయిన రెండు డెరైక్టర్ స్థానాలను కోఆప్షన్ పద్దతిలో ఎంపిక చేస్తారు. దీంతో మొత్తం 10 డెరైక్టర్ స్థానాల్లో ఇప్పటికే ఏడింటిని కైవసం చేసుకున్న వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారులు ఆదివారం నిర్వహించే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో విజయకేతనం ఎగుర వేయడం లాంఛనమే. డీసీసీబీ చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నిక కూడా ఆదివారమే జరగనుంది.
వైఎస్‌ఆర్‌సీపీకే సహకారం
Published Sun, May 11 2014 2:28 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement