అధికారుల దయ కరువు..వద్దన్నా పాత ఎరువు
♦ అన్నదాతలు మొత్తుకుంటున్నా తీరుమారని మార్క్‌ఫెడ్
♦ ఒత్తిడి చేసి మరీ ప్రాథమిక సహకార సంఘాలకు అప్పగింత
♦ కొత్త స్టాక్ వస్తున్నా గడ్డకట్టిన యూరియానే దిక్కు
సాక్షి, హైదరాబాద్ : వద్దని మొత్తుకుంటున్నా వ్యవసాయ శాఖ గడ్డకట్టిన పాత ఎరువులనే రైతులకు అంటగడుతోంది. దీంతో గత్యంతరం లేక వాటినే కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. గడ్డకట్టి ఏళ్లుగా నిల్వఉన్న యూరియా, డీఏపీలతో నష్టం లేదని చెబుతూ రైతులకు ఇష్టం లేకపోయినా కొనేలా చేస్తుంది. ఒత్తిడిచేసి మరీ ప్రాథమిక సహకార సంఘాల (ప్యాక్స్)కు, ఆగ్రోస్ రైతుసేవా కేంద్రాలకు, మార్క్‌ఫెడ్ లైసెన్సున్న ప్రైవేటు దుకాణాలకు ఈ ఎరువులనే సరఫరా చేస్తుంది.
దీంతో ఆ సంస్థలు రైతులకు పాత స్టాకునే విక్రయిస్తున్నాయి. అనేక జిల్లాల్లో ఆయా సంస్థలు తమకు గడ్డకట్టిన ఎరువులు వద్దని, రైతులు కొనుగోలు చేయడానికి ముందుకు రావడంలేదని నెత్తీ నోరూ బాదుకుంటున్నా మార్క్‌ఫెడ్ మాత్రం వెనక్కు తగ్గడంలేదు. రైళ్లల్లో కొత్త స్టాక్ వచ్చిపడుతున్నా పాతవాటిని వదిలించుకున్నాకే కొత్త స్టాకు ఎరువులను విక్రయిస్తామని చెబుతోంది.
పాత స్టాక్ విక్రయించాకే కొత్త స్టాక్: కె.రాములు, జీఎం, మార్క్‌ఫెడ్
పాత స్టాక్ విక్రయించాకే కొత్త స్టాక్ విక్రయిం చాలని నిర్ణయించిన మాట వాస్తవమేనని మార్క్‌ఫెడ్ జనరల్ మేనేజర్ కె.రాములు ‘సాక్షి’కి వివరించారు. పాత స్టాక్‌ను ఎరువుల కంపెనీలకు అమ్మినా తిరిగి దాన్నే కొత్త బస్తా ల్లో రైతులకు అందజేసే ప్రమాదం లేకపోలేద న్నారు. గడ్డలు కట్టిన ఎరువుల వల్ల పంటకు నష్టం ఏమీలేదని ఆయన స్పష్టంచేశారు.
కంపెనీలకు విక్రయిద్దామనుకున్నారు కానీ...
మార్క్‌ఫెడ్‌లో మూడేళ్ల నుంచి ఇప్పటివరకు 2.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, డీఏపీ నిల్వలు గోదాముల్లో గుట్టలుగా పేరుకుపోయాయి. అందులో యూరియా 2 లక్షల టన్నులు, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు 50 వేల టన్నులు న్నాయి. వాటి విలువ ఏకంగా రూ. 260 కోట్లు ఉండటం గమనార్హం. వీటిని రైతులకు అంటగట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని ఇటీవల ‘సాక్షి’ కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. దీంతో పాత నిల్వలను ఎరువుల కంపెనీలకు ఎంతోకొంతకు అమ్మేసి కొత్త స్టాకు కొనుగోలు చేద్దామని అనుకున్నారు.
అయితే, దీనివల్ల పెద్దఎత్తున నష్టం వస్తుందని భావించిన మార్క్‌ఫెడ్ తిరిగి రైతులకే తక్కువ ధరకు అంటగట్టాలని నిర్ణయించింది. యూరియా బస్తా ధరను రూ.30 తగ్గించారు. కానీ అనేక ప్యాక్స్, ఆగ్రో రైతు సేవాకేంద్రాలు ఈ పాత స్టాకును వ్యతిరేకిస్తున్నాయి. గత్యంతరం లేక రైతులు ప్రైవేటు డీలర్ల వద్ద కొంటున్నారు. ప్రస్తుతం మార్క్‌ఫెడ్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి కొత్త స్టాక్ ఎరువుల నిల్వలు వస్తున్నా పాత స్టాక్ వదిలించుకున్నాకే కొత్త స్టాకు అమ్మాలని నిర్ణయించడంపై రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.