సాక్షి, హైదరాబాద్ : కంది రైతుకు కష్టాలు వచ్చిపడ్డాయి. మద్దతు ధరకు కందులు విక్రయించాలని భావిం చినా మార్క్‌ఫెడ్ అధికారుల తీరుతో అదిసాధ్యం కావట్లేదు. మార్క్‌ఫెడ్ అధికారులు కొర్రీలు పెడుతూ రైతులను రాచిరంపాన పెడుతున్నారన్న విమర్శలున్నాయి. దళారులను చేరదీసి వారినుంచి అక్రమం గా కందులు కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రైతులకు సహకరించాలని, కంది రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా మార్క్‌ఫెడ్ అధికారు లు మాత్రం సాకులు చెబుతూ రైతు పండిం చిన కందిని కొనుగోలు చేసేందుకు ముందుకు రావట్లేదు. మరోవైపు అమ్మిన కందులకు డబ్బు లివ్వడంలోనూ మార్క్‌ఫెడ్ విఫలమవుతోంది. నాఫెడ్ నుంచి సొమ్ము రాబట్టలేకపోతోంది.
ఆన్‌లైన్‌లో పేరు లేకుంటే కొనరా?
వ్యవసాయ శాఖ గతేడాది ఎవరెవరు ఏ పంటలు పండించారన్న సమాచారం సేకరించింది. ఐతే ఆ లెక్కలు చాలావరకు కాకిలెక్కలా అన్న అనుమానాలు ప్రస్తుత పరిస్థితిని బట్టి అర్థమవుతోంది. ఆ లెక్కలను ఆన్‌లైన్‌లో ఎక్కించారు. కందులు పం డించిన రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చాక, ఆన్‌లైన్‌లో వారి పేరుతో కంది పం డించారా లేదా పరిశీలిస్తారు. అయితే పోర్టల్‌లో ఆ రైతు వేరే పంట పండిం చారని ఉంటే, వెంటనే ఆ రైతును వెనక్కి పంపుతున్నారు. పోర్టల్‌లో పత్తి పండించినట్లుందని, కంది లేదని, కాబట్టి కందులు కొనుగోలు చేయబోమని చెప్పేస్తున్నారు. దీంతో రైతులు దళారులకు విక్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా సగం మంది రైతుల పేర్లు కంది పండించినట్లుగా లేకపోవడంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు. దీనిపై ఆందోళనలు కొనసాగుతున్నాయి.
అధికారుల జులుం..
మార్కెట్లో దళారులు క్వింటాలుకు రూ.4వేల నుంచి రూ.5 వేల కంటే ఎక్కువకు కొనట్లేరు. అటు మార్క్‌ఫెడ్ తీసుకోక, ఇటు దళారులు తక్కువ ధరకు అడుగుతుండటంతో కంది రైతు కన్నీరు పెడుతున్నాడు. పైగా ‘ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో పో’అని మార్క్‌ఫెడ్ అధికారులు జులూం ప్రదర్శిస్తున్నారని కొందరు రైతులు వాపోతున్నారు. పలువురు రైతులు తమ పట్టాదారు పాస్ పుస్తకాలు చూపించినా, కంది పంటను సాగుచేసినట్లు అధికారుల ద్వారా ధ్రువీకరణ పత్రాలు తెచ్చినా మార్క్‌ఫెడ్ అధికారులు ససేమిరా అంటున్నారు. ఒకవేళ ఆన్‌లైన్ పోర్టల్‌లో సంబంధిత రైతు కంది పండించినట్లు పేరున్నా, అతను పండించినంతా కొనట్లేదు. తమకు కేంద్రం నిర్దేశించిన కోటా ప్రకారమే కొంటున్నామని, అంతా కొనలేమంటూ తేల్చేస్తున్నారు. ఆన్‌లైన్ సమస్యపై పలువురు ఎమ్మెల్యేలు, ఓ మంత్రి స్వయంగా ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదు.
సొమ్ము ఎప్పుడిస్తారో?
రాష్ట్రంలో ఈసారి 2.07 లక్షల మెట్రిక్ టన్నుల కంది దిగుబడి అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో కేంద్రం 47,500 మెట్రిక్ టన్నులు మాత్రమే మద్దతు ధరకు కొంటామని తేల్చిచెప్పింది. ఇంకా 56 వేల మెట్రిక్ టన్నులు కొనాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పలుసార్లు విజ్ఞప్తి చేసింది. కానీ ఇప్పటివరకు కేంద్రం నుంచి అనుమతి రాలేదు. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో కేంద్రం కొనుగోలు చేసేది 47,500 మెట్రిక్ టన్నులు మాత్రమే. మిగిలిన దాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోయినా తాము కొంటామని ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఇంకా అధికారికంగా నిర్ణయం ప్రకటించలేదు. అయితే మార్క్‌ఫెడ్ ఇప్పటివరకు 44,833 మెట్రిక్ టన్నుల కందులు కొనుగోలు చేసింది. వాటి విలువ రూ.260.04 కోట్లు. కానీ ఇప్పటివరకు రైతులకు రూ.29.69 కోట్లు మాత్రమే చెల్లించారు. ఇంకా రూ.230.35 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీంతో రైతులు మార్క్‌ఫెడ్‌కు అమ్ముకున్నా సకాలంలో సొమ్ము రాకపోవడంతో దళారులను ఆశ్రయిస్తున్నారు. దళారులు రైతుల నుంచి రూ.4 వేల నుంచి రూ.5 వేల మధ్య కొనుగోలు చేస్తున్నారు. అదే దళారులు అనేకచోట్ల రైతుల నుంచి కొన్న కందులను మార్క్‌ఫెడ్‌కు మద్దతు ధర కింద రూ.5,800కు విక్రయిస్తున్నారు. దీనికి మార్క్‌ఫెడ్‌లో కొందరు అధికారులు కూడా సహకరిస్తున్నారన్న విమర్శలున్నాయి. అందుకోసం కమీషన్ల రూపంలో దళారుల ఉంచి ముడుపులు వస్తున్నాయి. రైతును అడ్డం పెట్టుకొని అటు దళారి, ఇటు కొందరు మార్క్‌ఫెడ్ అధికారులు సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలున్నాయి.
తిప్పి పంపేశారు: బాజా నాగేశ్వర్‌రావు, సింగారెడ్డిపాలెం, నేలకొండపల్లి మండలం, ఖమ్మం జిల్లా
మూడు ఎకరాల్లో పత్తి పంటలో అంతర్ పంటగా కంది వేశాను. దాదాపు 13 క్వింటాళ్ల కంది దిగుబడి వచ్చింది. వీటిని విక్రయించేందుకు 15 రోజుల క్రితం మార్కెట్ యార్డులోని కంది కొనుగోలు కేంద్రానికి వెళ్లాను. ఆన్‌లైన్‌లో నా పేరు లేదని, తిప్పి పంపారు. ఒకవేళ ఆన్‌లైన్‌లో పేరు నమోదైనా రెండున్నర క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో ఏమీ చేయలేక దళారులకు విక్రయించాలని నిర్ణయించుకున్నాను.
కొనుగోళ్లు నిలిపివేశారు: బెండే లక్ష్మణ్, వడ్డాడి గ్రామం, తాంసి మండలం, ఆదిలాబాద్ జిల్లా
4 ఎకరాల్లో పత్తి, కంది పంట సాగుచేశాను. కంది పంట 10 క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. తాంసి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కోనుగోలు కేంద్రంలో విక్రయిద్దామనుకుంటే రెండు రోజులే కోనుగోలు చేసి నిలిపేశారు. మళ్లీ ఎప్పుడు కోనుగోలు కేంద్రాలను తెరుస్తారో చెప్పట్లేదు. దళారులకు అమ్ముకుందామంటే తక్కువ ధరకు అడుగుతున్నారు.
జాబితాలో పేరు లేదని కొనట్లేదు: ఎం.రాంరెడ్డి, రైతు, మల్లారెడ్డిగూడ, చేవెళ్ల మండలం, రంగారెడ్డి జిల్లా
ఈ ఏడాది 5 ఎకరాల్లో కంది పంట సాగు చేశాను. కందులు అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రానికి వస్తే ఆన్‌లైన్ జాబితాలో కంది సాగు చేసినట్లు పేరు లేదని అధికారులు చెప్పారు. నీ కందులు ఇక్కడ కొనలేమని అంటున్నారు. నేను కంది సాగు చేస్తే నాపేరు లేకపోవడమేంటి? ఎవరు రాశారని అడిగితే వ్యవసాధికారులు ఇచ్చిన జాబితా మా దగ్గర ఉందంటున్నారు. ఇందులో పేర్లు ఉంటేనే కొనాలని మాకు అదేశాలు ఉన్నాయని చెబుతున్నారు.
రైతును ఇబ్బంది పెడితే ఎలా?: కె.క్రిష్ణారెడ్డి, రైతు, చేవెళ్ల గ్రామం, రంగారెడ్డి జిల్లా
10 ఎకరాల్లో కంది పంట సాగు చేశాను. దాదాపు 20 క్వింటాళ్లకు పైగానే దిగుబడి వచ్చింది. కానీ నా పేరు జాబితాలో లేదని కొనలేమని చెబుతున్నారు. నేను వేసిన కంది పంట పొలం చూపిస్తాను.. వచ్చి చూసుకోవాలని చెప్పాను. కంది పంట వేయకపోతే అభ్యంతరం చెప్పాలి కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులను ఇబ్బంది పెడితే ఎలా? రైతుల పేర్లు లేకపోతే ఈ కొనుగోలు కేంద్రం ఎందుకు పెట్టారు.. తీసేయండి. అధికారులకు నాయకులకు రైతుల ఇబ్బందులు కనిపించటం లేదా?
ఆన్‌లైన్ సమస్య వాస్తవమే: చంద్రశేఖర్, మార్క్‌ఫెడ్ ప్రొక్యూర్‌మెంట్ అధికారి, హైదరాబాద్
ఆన్‌లైన్‌లో రైతుల పేర్లు లేకపోవడంతో సమస్య ఉంది. దీన్ని ఎలా పరిష్కరించాలన్న విషయంపై ప్రభుత్వానికి విన్నవించాం. మరోవైపు రైతుల నుంచి రూ.260 కోట్ల విలువైన కందులను కొనుగోలు చేశాం. వారికి ఇప్పటివరకు రూ.29.69 కోట్లు మాత్రమే ఇచ్చాం. ఇంకా నాఫెడ్ నుంచి రావాల్సి ఉంది. కేంద్రం పరిమితి విధించడంతో ఇప్పటికే దాదాపు 10 జిల్లాల్లో వారి కోటా పూర్తయింది. మిగిలినది కొనాలంటే కేంద్రం నుంచి అనుమతి రావాలి. అందుకోసం మరో 56 వేల మెట్రిక్ టన్నులు కొనాలని ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది.
కంది.. రంధి!
Published Fri, Feb 21 2020 2:52 AM | Last Updated on Fri, Feb 21 2020 4:49 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment