జిల్లాలోని రైతులకు ఈ ఏడాది రూ.1,500 కోట్ల పంట రుణాలు అందనున్నాయి. బ్యాంకర్లు ఈ మేరకు 2019–20 వ్యవసాయ రుణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఏటా జూన్ మాసంలో లీడ్ బ్యాంకు వ్యవసాయ రుణ ప్రణాళికను రూపొందిస్తుంది. ఇందుకు అనుగుణంగా ఆయా బ్యాంకులు రైతులకు ఖరీఫ్, రబీ రుణాలు పంపిణీ చేస్తాయి. లీడ్ బ్యాంకు అధికారుల సమాచారం మేరకు.. ఈ ఏడాది ఖరీఫ్, రబీలో రుణాల పంపిణీ కోసం లీడ్ బ్యాంకు రూ.1,500 కోట్లతో రుణ ప్రణాళిక రెడీ చేసినట్లు తెలిసింది. కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖానమ్ అధ్యక్షతన 21న జిల్లా బ్యాంకర్ల సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో వ్యవసాయ రుణ ప్రణాళికను బ్యాంకర్లు ఆమోదించనున్నారు. బ్యాంకర్ల సమావేశం నిర్వహణ కోసం లీడ్ బ్యాంకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓవైపు వ్యవసాయ రుణ ప్రణాళిక ప్రతులను రెడీ చేస్తూనే మరోవైపు సమావేశానికి రాష్ట్రస్థాయి, జిల్లాలోని బ్యాంకు అధికారులు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.
సాక్షి, వికారాబాద్: వ్యవసాయ రుణ ప్రణాళికను అనుసరించి రైతులకు రూ.1,500 కోట్ల మేర పంట రుణాలు అందజేయనున్నారు. ఖరీఫ్‌లో రూ.900 కోట్ల రుణాలు ఇచ్చేలా బ్యాంకర్లు ప్లాన్ సిద్ధం చేశారు. ఖరీఫ్‌లో 1.12 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్న రైతులకు రూ.900 కోట్ల పంటరుణాలను బ్యాంకర్లు అందజేయనున్నారు. జిల్లాలో మొత్తం 14 బ్యాంకులు ఉండగా ఖరీఫ్‌లో అత్యధికంగా ఎస్‌బీఐ రైతులకు రూ.350 కోట్లకుపైగా రుణాలు అందజేయనుంది. ఆంధ్ర బ్యాంకు రూ.190 కోట్లు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు రూ.98 కోట్లు, గ్రామీణ వికాస్ బ్యాంకు రూ.21 కోట్లు, హెచ్‌డీసీసీబీ బ్యాంకు రూ.60 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రూ.52 కోట్లు, కెనరా బ్యాంకు రూ.44 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.31 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు రూ.19 కోట్ల రుణాలను రైతులకు అందజేయనున్నాయి. గత ఏడాది రబీలో రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది ఖరీఫ్‌లో రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాలని శుక్రవారం జరిగే బ్యాంకర్ల సమావేశంలో వ్యవసాయశాఖ బ్యాంకర్లను కోరనుంది.
ఇదిలా ఉంటే ఈ ఏడాది రబీలో సైతం బ్యాంకర్లు రూ.600 కోట్ల రుణాలను పంపిణీ చేసేందుకు ప్రణాళికను రూపొందించారు. రబీలో సైతం ఎస్‌బీఐ బ్యాంకు అత్యధికంగా రూ.240 కోట్ల మేర రుణాలు ఇవ్వనుంది. అలాగే ఆంధ్రా బ్యాంకు రూ.120 కోట్లు, బరోడా బ్యాంకు రూ.20 కోట్లు, కెనరా బ్యాంకు రూ.29 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ రూ.35 కోట్లు, హెచ్‌డీసీసీబీ బ్యాంకు రూ.40 కోట్లు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు రూ.65 కోట్లు రుణాలు ఇవ్వనున్నాయి. మిగతా మొత్తాన్ని ఇతర బ్యాంకులు రైతులకు రబీలో రుణంగా అందజేయనున్నాయి. ఇదిలా ఉంటే ప్రతిఏటా వ్యవసాయరుణ ప్రణాళికకు అనుగుణంగా రైతులకు రుణాలు అందజేయటం తో బ్యాంకులు విఫలం అవుతున్నాయి. నిర్దేశిత లక్ష్యంలో కేవలం 50 శాతం మేర మాత్రం రైతులకు రుణాలు అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఈ ఏడాది వందశాతం రైతులకు రుణాలు ఇచ్చేలా బ్యాంకర్లపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధ అవుతోంది. అయితే బ్యాంకర్లు ఏమేరకు ఖరీఫ్, రబీలో రుణాలు ఇస్తారో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment