సోయా డబ్బుల కోసం ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ ఎదుట ధర్నా చేస్తున రైతులు(ఫైల్)
రైతుకు పంట వేసినప్పటి నుంచి చేతికి వచ్చే వరకు తిప్పలే. కష్టపడి పండించిన పంటను అమ్మి డబ్బుల కోసం ఎదురుచూడా ల్సిన పరిస్థితి. అప్పులు చేసి రబీలో సాగుచేసిన సోయా, శనగ పం టను కొనుగోలు కేంద్రాలు విక్ర యించారు. నెలలు గడుస్తున్నప్పటికీ నేటికి డబ్బులు రాక అవస్థలు పడుతున్నారు. ఖరీఫ్‌కు రైతులు సన్నద్ధమ వుతున్న తరుణంలో డబ్బులు రాక అవస్థలు పడాల్సిన దుస్థితి.
జైనథ్: ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తున్నప్పటికీ కూడా గత ఖరీఫ్‌లో మార్కెట్‌లో అమ్మిన సోయా, రబీలో అమ్మిన శనగల విత్తనాల డబ్బులు ఇంకా విడుదల కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కొక్కరికి లక్షలో సొమ్ము రావాల్సి ఉండగా, నెలలు గడుస్తున్న ఇంకా బ్యాంకు ఖాతాలో జమ కాకపోవడంతో పెట్టుబడి కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. గత సంవత్సరం తీసుకున్న అప్పు పూర్తిగా కట్టలేక, కొత్త అప్పు దొరకక సతమతమతున్నారు. ఇటీవలే సోయా డబ్బుల కోసం ఆదిలాబాద్ పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదుట రైతులు ధర్నాకు దిగారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో డబ్బుల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఆరు నెలలైన అందని సోయా డబ్బులు..
ఈ సంవత్సరం జనవరి 20వరకు సోయా కొనుగోలు చేస్తున్నట్లు హాకా అధికారులు ప్రకటించారు. అయితే మధ్యలో 8వ తేదీన కొనుగోళ్లు నిలిపివేస్తున్న ఆదేశాలు జారీ చేశారు. దీంతో మార్కెట్ కమిటీల్లో కొనుగోళ్లు చేసిన రైతుల వివరాలు ఆన్‌లైన్ చేయడం వీలుకాలేదు. రైతుల పేర్లు సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ భూమి వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు, లాట్ వివరాలు పూర్తిగా ఆన్‌లైన్ కాలేదు. అయితే ఈ సమస్య జైనథ్, ఆదిలాబాద్ మార్కెట్‌లో తలెత్తింది. హాకా ఉన్నత స్థాయి అధికారులు, మండలాల్లో కొనుగోలు చేపట్టిన అధికారుల నడుమ సమన్వయ లోపం, మార్కెట్‌లో కొన్న గింజలకు సంబంధించి ఏ రోజుకారోజు ఆన్‌లైన్ చేసేందుకు అవకాశం లేకపోవడంతో రెండు మండలాల్లో 93 మంది రైతులకు సంబంధించిన రూ.50లక్షల డబ్బులు నిలిచిపోయాయి. వీరి వివరాలు ఆన్‌లైన్ కాకపోవడంతో అసలు డబ్బులు వస్తాయా? వస్తే ఎప్పుడు వస్తాయి? అనేది తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో బాధిత రైతులు లబోదిబోమంటున్నారు. తమ సమస్య పరిష్కరించాలని అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా.. ధర్నాలు చేస్తున్నా.. ఆరు నెలలుగా సమస్య అపరిష్కృతంగానే ఉండటంతో జిల్లా వ్యాప్తంగా 93మంది రైతుల 50లక్షల రూపాయలు పెండింగ్‌లోనే ఉన్నాయి.
ఆగిన రూ.70కోట్ల సోయా డబ్బులు..
ఈ సంవత్సరం మార్చి 13 నుంచి ఎప్రిల్ 8వరకు జిల్లా వ్యాప్తంగా మార్క్‌ఫెడ్ జిల్లా వ్యాప్తంగా శనగలు కొనుగొలు చేసింది. మార్చి 13 నుంచి 20 వరకు కొనుగోలు చేసిన రైతుల డబ్బులు వారి ఖాతాల్లో జమ అయ్యాయి. కాకపోతే మార్చి 21 నుంచి ఏప్రిల్ 8 వరకు శనగలు అమ్మిన రైతుల డబ్బులు ఇంకా వారి ఖాతాల్లో జమ కాలేదు. అధికారులు మాత్రం ప్రభుత్వం నుంచే నిధులు విడుదలకాలేదని చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 8వేలకుపైగా రైతులకు రూ.70కోట్ల డబ్బులు ఇంకా విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తుండటంతో రైతులు పెట్టుబడి కోసం డబ్బుల లేక అప్పులు చేస్తున్నారు.
సోయా, శనగ డబ్బులు ఇవ్వాలి
జనవరిలో అమ్మిన సోయా, మార్చిలో అమ్మిన శనగ రెండింటి డబ్బులు రావాల్సి ఉంది. క్వింటాల్‌కు రూ.3399 చొప్పున 20క్వింటాళ్ల సోయలు, క్వింటాల్‌కు రూ.4620 చొప్పున 60క్వింటాళ్ల శనగలు విక్రయించాను. ఒక్క రూపాయి కూడా రాలేదు. - చిందం మోహన్, రైతు, జైనథ్
పది రోజుల్లో వస్తాయి..
జిల్లా వ్యాప్తంగా 8వేలకు పైగా శనగ రైతులకు రూ.70 కోట్ల డబ్బులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి నిధులు ఇంకా విడుదల కాలేదు. శనగ రైతుల డబ్బులు పది రోజుల్లో వస్తాయి. ఉన్నత అధికారులకు సమస్యను విన్నవించాం. ఈ సీజన్ ప్రారంభంలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. - పుల్లయ్య, డీఎం, మార్క్‌ఫెడ్
Comments
Please login to add a commentAdd a comment