
యశవంతపుర: హనీట్రాప్ దందాలు ఆగడం లేదు. తాజాగా కర్నాటకలో మరొకటి వెలుగులోకి వచ్చింది. ఇచ్చిన అప్పు చెల్లించమని అడిగినందుకు వృద్ధుడిని ట్రాప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో దావణగెరె పట్టణం సరస్వతీ నగరకు చెందిన యశోధ (32)ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
వివరాల ప్రకారం.. నగరంలోని శివకుమారస్వామి లేఔట్‌కు చెందిన చిదానందప్పకు సరస్వతి నగరకు చెందిన యశోధతో పరిచయం ఏర్పడింది. పరిచయం ఇద్దరి మధ్య స్నేహంగా మారింది. చిదానందప్పను తరచూ కాఫీకి ఇంటికి పిలిచేది. ఈ క్రమంలో అతని వద్ద నుంచి ఆమె రూ. 86 వేలు అప్పుగా తీసుకుంది. రోజులు గడచినా అప్పు చెల్లించకపోవడంతో చిదానంద డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
జ్యూస్‌లో మత్తు మందు ఇచ్చి...
ఒక రోజు వాకింగ్ ముగించుకొని ఇంటికి వెళ్తున్న చిదానందప్పను యశోధ ఇంటిలోకి పిలిచి జ్యూస్ ఇచ్చింది. అది తాగిన కొద్దిసేపటికే అతను స్పృ హ తప్పాడు. ఆ తరువాత కొన్ని గంటల తరువాత లేచి చూస్తే అతని ఒంటి మీద దుస్తులు లేవు. ఆందోళన చెందిన చిదానందప్ప బట్టలు వేసుకొని ఇంటికి వెళ్లిపోయాడు. రెండు రోజుల తరువాత యశోధ ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసింది.
అతను లేదని చెప్పడంతో తన వద్ద అశ్లీల వీడియో ఉందని, రూ. 15 లక్షలు ఇవ్వాలని, లేదంటే ఆ వీడియోను కుటుంబ సభ్యులకు పంపిస్తానని బెదిరించింది. ఆందోళన చెందిన చిదానందప్ప తన స్నేహితుల వద్ద గోడును వెళ్లబోసుకున్నాడు. అంతలోనే చిదానంద నగ్నంగా ఉన్న ఫొటోను వాట్సాప్‌లో పంపింది. ఈ విషయం ఆయన కొడుకు దృష్టికి రావడటంతో ఆయన దావణగెరె కేటీజే నగర పోలీసులకు ఫిర్యాదు చేయటంతో యశోధను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment