సాక్షి, అమరావతి : చంద్రబాబు సర్కారు గత ఐదేళ్లుగా అనుసరించిన లోపభూయిష్ట విధానాలవల్ల వివిధ శాఖలు నిధుల కొరతతో అల్లాడుతున్నాయి. ఇందులో వ్యవసాయ శాఖ కూడా ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. జూన్ ఒకటో తేదీతో ఖరీఫ్ సీజన్ ఆరంభమైంది. ఖరీఫ్ పంటల సాగుకు వీలుగా వ్యవసాయ శాఖ రైతులకు సబ్సిడీతో విత్తనాలు సరఫరా చేయాలి. ఇలా వ్యవసాయ శాఖ రైతులకు సబ్సిడీ విత్తనాలు అందించాలంటే ఏపీ సీడ్స్, ఆయిల్‌ఫెడ్ లాంటి సంస్థలు విత్తనాలను వ్యవసాయ శాఖకు ఇవ్వాలి.
అయితే, దురదృష్టవశాత్తు్త ఈ విత్తన సరఫరా సంస్థలకు ప్రస్తుతం అప్పు కూడా పుట్టని దుస్థితిలో ఉన్నాయి. ఇదంతా గత ఐదేళ్లుగా బాబు సర్కారు సాధించిన ఘనకార్య ఫలితమేనని అధికారులు విమర్శిస్తున్నారు. జూన్ మొదటి వారంలో రుతు పవనాలు రాగానే రైతులు పొలాలను దుక్కి దున్ని సాగు చేస్తారు. వేరుశనగ, కంది, పిల్లి పెసర, జీలుగ తదితర విత్తనాలను ప్రభుత్వం సబ్సిడీతో రైతులకు సరఫరా చేయాలి. వ్యవసాయ శాఖకు విత్తనాలు ఇచ్చేందుకు విత్తన సరఫరా సంస్థల వద్ద నిధులు లేవు. వ్యవసాయ శాఖ ఇప్పటికే ఆయా సంస్థలకు బకాయి ఉంది.
కీలకమైన ఖరీఫ్ సీజన్‌లో భారీగా విత్తనాలు సరఫరా చేయాల్సిన వ్యవసాయ శాఖ నిధుల లేమితో అల్లాడుతోంది. ఎటూ అధికారంలోకి రాలేమని తెలిసే కొత్తగా అధికారంలోకి వచ్చే ప్రభుత్వం ఇబ్బంది ఎదుర్కోవాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు సర్కారు వ్యవసాయ శాఖకు నిధులు విదల్చకుండా కమీషన్లు వచ్చే సాగునీటి పారుదల ప్రాజెక్టులు, ఇతర కాంట్రాక్టర్లకు నిధులు మళ్లించారు. దీంతో వ్యవసాయ శాఖ నిధుల కొరతతో విత్తనాల సేకరణకు కూడా తీవ్ర అవస్థలు ఎదుర్కొంటోంది.
విత్తన సబ్సిడీకి, సరఫరా సంస్థలకు ఉన్న బకాయిలు
రూ.370 కోట్లు 2015–16 నుంచి 2018–19 వరకూ రూ.249 కోట్ల విత్తన సబ్సిడీ బకాయిలు విడుదల చేయకుండా ప్రభుత్వం పెండింగులో పెట్టింది. మరో రూ.120.91 కోట్లు బఫర్ సీడ్ స్టాకింగ్ ఆపరేషన్ లాసెస్ కింద విత్తన సరఫరా సంస్థలకు చెల్లించాల్సి ఉంది. సబ్సిడీ విత్తనాల సరఫరాకు సంబంధించి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ.369.91 కోట్లు పైమాటే.
రైతులకూ రూ.145 కోట్లు
జొన్న, మొక్కజొన్న ఉత్పత్తులను ప్రభుత్వానికి విక్రయించిన 1.57 లక్షల మందికి పైగా రైతులకు ప్రభుత్వం రూ.145.78 కోట్లు చెల్లించాల్సి ఉంది. కరువు కాలంలో అష్టకష్టాలు పడి పండించిన ఉత్పత్తులను సర్కారుకు అమ్మిన పాపానికి వారు డబ్బు కోసం గుంటూరు, కృష్ణా, ప్రకాశం, కర్నూలు తదితర జిల్లాల రైతులు వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా ప్రదక్షిణలు చేస్తున్నారు. వ్యవసాయోత్పత్తుల ధరలు దారుణంగా పడిపోయినప్పుడు కనీస మద్దతు ధరకు రైతుల నుంచి వాటిని కొనుగోలు చేసి మార్కెట్ ధరకు విక్రయించాల్సిన బాధ్యత సర్కారుపై ఉంది.
ఇందులో భాగంగానే గత ఆర్థిక సంవత్సరం మొక్కజొన్న, జొన్న రైతుల నుంచి ఉత్పత్తులు సేకరించి వారికి డబ్బు చెల్లించలేదని, రైతులకు సమాధానం చెప్పుకోలేకపోతున్నామని వ్యవసాయ శాఖ అధికారులు వాపోతున్నారు. అంతేకాదు..పౌర సరఫరాల శాఖ రైతుల నుంచి ధాన్యం సేకరించింది. గత ఖరీఫ్‌లో ధాన్యం విక్రయించిన వారికి ఇవ్వాల్సిన సొమ్మును ఇప్పటికీ చెల్లించలేదు. ఈ సొమ్మును కూడా సాగునీటి ప్రాజెక్టుల బిల్లుల చెల్లింపు, ఎన్నికల ముందు ఓట్ల తాయిలాలకు బాబు సర్కారు మళ్లించింది. బిందు, తుంపర సేద్యం, వ్యవసాయ పనిముట్లకు సంబంధించిన సబ్సిడీ బిల్లులు కూడా వేలకోట్లు పెండింగులోనే ఉన్నాయి.
ట్రాక్టర్ల కొనుగోలు, పొలాల్లో షెడ్ల నిర్మాణం, చిన్న చిన్న నీటి చెరువుల ఏర్పాటు తదితరాల కోసం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లులను కూడా పెండింగులో పెట్టింది. దీనివల్ల కొత్తగా ఈ యూనిట్లు ఎవరికీ మంజూరు కావడంలేదు. అలాగే, రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక కింద రూ.103.89 కోట్ల నిధులు, భూ, నీటి సంరక్షణ కింద రూ.1.73 కోట్లు, వర్షాధార ప్రాంతాల అభివృద్ధి పథకం కింద రూ.20.02 కోట్లు, ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన బిల్లులు సీఎఫ్‌ఎంఎస్ పోర్టల్‌లో 2016–2019 మార్చి వరకూ పెండింగులో ఉన్నాయి.
రూ.2,882.75 కోట్ల పెట్టుబడి రాయితీ ఎగవేత
గత ఖరీఫ్‌లో పంట నష్టపోయిన 15.97 లక్షల మంది రైతులకు రూ.1,832 కోట్లు పెట్టుబడి రాయితీని బాబు సర్కారు చెల్లించకుండా ఎగవేసింది. 2014–15 నుంచి ఉన్న బకాయిలను కలిపితే రైతులకు చెల్లించాల్సిన పెట్టుబడి రాయితీ గత ఖరీఫ్ నాటికి రూ. 2102.75 కోట్లు. అలాగే, గత ఏడాది రబీ సీజన్‌లో ప్రకటించిన 257 కరువు మండలాల్లోని బాధిత రైతులకు చెల్లించాల్సిన మొత్తం రూ.780 కోట్లు ఉంటుందని అంచనా. వెరసి గత ఏడాది రబీ సీజన్ ముగిసే వరకూ బాబు సర్కారు రైతులకు ఇవ్వాల్సిన రూ.2,882.75 కోట్లలో నయాపైసా కూడా విదల్చలేదు.
Comments
Please login to add a commentAdd a comment