Seed subsidy
-
కేసీఆర్ పాలనలో వ్యవసాయ విధ్వంసం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణను విత్తన భాండాగారంగా చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని, కానీ రాష్ట్రాన్ని కల్తీ సీడ్‌బౌల్‌గా కల్వకుంట్ల కుటుంబం మార్చిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పాలనలో వ్యవసాయ విధ్వంసం జరిగిందని విమ ర్శించారు. కల్తీ విధానాలపై ఉక్కుపాదం మోపుతా మని అసెంబ్లీలో, బయట సీఎం కేసీఆర్ పేర్కొన్న ప్పటికీ ఏ సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన ‘రైతుగోస.. బీజేపీ భరోసా’ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ హయాంలో వ్యవసాయం దండుగలా మారింది.. ‘వ్యవసాయ ఒక పండుగ అన్నారు కానీ కేసీఆర్ పాలనలో వ్యవసాయం దండుగ అనే పరిస్థితి ఏర్పడింది. ఇన్పుట్ సబ్సిడీ, విత్తన సబ్సిడీ, పంటల బీమా పథకం అమలు చేయడం లేదు. గత తొమ్మిదేళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం పంటల బీమా పథకం అమలు చేయని కారణంగా లక్షలాది మంది రైతులు నష్టపోతున్నారు. ఇక వరి పంట వద్దని ప్రభుత్వమే చెబుతోంది. మరోవైపు వ్యవసాయ రుణాలు రావడం లేదు. కేసీఆర్ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లుగా వ్యవసాయ రుణాల మీద పావలా వడ్డీ ఇవ్వడం లేదు. రైతుబంధు అన్నింటికీ పరిష్కారంలా వ్యవహరిస్తోంది. అందరికంటే ఎక్కువగా కౌలు రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆత్మహత్యల్లో 75 శాతం కౌలు రైతులవే ఉన్నాయి. ఐదేళ్లుగా రైతు రుణమాఫీ వాయిదా వేసి ఎన్నికలకు ముందు ప్రకటించారు. అయినా మెజార్టీ రైతులకు మాఫీ జరగలేదు. నాలుగున్నరేళ్లుగా వడ్డీలు, చక్రవడ్డీలు పెరిగిపోయి రూ.లక్ష అప్పు ఇప్పుడు రూ.2 లక్షలకు చేరింది. ధరణి పోర్టల్‌తో 20 లక్షల మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు..’ అని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి వస్తే అన్ని రకాలుగా సమస్యలను పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని అనేక ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ అవినీతినే మిగిల్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ, సోనియా కుటుంబం కోసం బీఆర్ఎస్, కల్వకుంట్ల కుటుంబం పనిచేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో మార్పు రావాలన్నా, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలన్నా బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. -
‘వ్యవసాయం’పై బకాయిల బండ!
సాక్షి, అమరావతి : చంద్రబాబు సర్కారు గత ఐదేళ్లుగా అనుసరించిన లోపభూయిష్ట విధానాలవల్ల వివిధ శాఖలు నిధుల కొరతతో అల్లాడుతున్నాయి. ఇందులో వ్యవసాయ శాఖ కూడా ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. జూన్ ఒకటో తేదీతో ఖరీఫ్ సీజన్ ఆరంభమైంది. ఖరీఫ్ పంటల సాగుకు వీలుగా వ్యవసాయ శాఖ రైతులకు సబ్సిడీతో విత్తనాలు సరఫరా చేయాలి. ఇలా వ్యవసాయ శాఖ రైతులకు సబ్సిడీ విత్తనాలు అందించాలంటే ఏపీ సీడ్స్, ఆయిల్‌ఫెడ్ లాంటి సంస్థలు విత్తనాలను వ్యవసాయ శాఖకు ఇవ్వాలి. అయితే, దురదృష్టవశాత్తు్త ఈ విత్తన సరఫరా సంస్థలకు ప్రస్తుతం అప్పు కూడా పుట్టని దుస్థితిలో ఉన్నాయి. ఇదంతా గత ఐదేళ్లుగా బాబు సర్కారు సాధించిన ఘనకార్య ఫలితమేనని అధికారులు విమర్శిస్తున్నారు. జూన్ మొదటి వారంలో రుతు పవనాలు రాగానే రైతులు పొలాలను దుక్కి దున్ని సాగు చేస్తారు. వేరుశనగ, కంది, పిల్లి పెసర, జీలుగ తదితర విత్తనాలను ప్రభుత్వం సబ్సిడీతో రైతులకు సరఫరా చేయాలి. వ్యవసాయ శాఖకు విత్తనాలు ఇచ్చేందుకు విత్తన సరఫరా సంస్థల వద్ద నిధులు లేవు. వ్యవసాయ శాఖ ఇప్పటికే ఆయా సంస్థలకు బకాయి ఉంది. కీలకమైన ఖరీఫ్ సీజన్లో భారీగా విత్తనాలు సరఫరా చేయాల్సిన వ్యవసాయ శాఖ నిధుల లేమితో అల్లాడుతోంది. ఎటూ అధికారంలోకి రాలేమని తెలిసే కొత్తగా అధికారంలోకి వచ్చే ప్రభుత్వం ఇబ్బంది ఎదుర్కోవాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు సర్కారు వ్యవసాయ శాఖకు నిధులు విదల్చకుండా కమీషన్లు వచ్చే సాగునీటి పారుదల ప్రాజెక్టులు, ఇతర కాంట్రాక్టర్లకు నిధులు మళ్లించారు. దీంతో వ్యవసాయ శాఖ నిధుల కొరతతో విత్తనాల సేకరణకు కూడా తీవ్ర అవస్థలు ఎదుర్కొంటోంది. విత్తన సబ్సిడీకి, సరఫరా సంస్థలకు ఉన్న బకాయిలు రూ.370 కోట్లు 2015–16 నుంచి 2018–19 వరకూ రూ.249 కోట్ల విత్తన సబ్సిడీ బకాయిలు విడుదల చేయకుండా ప్రభుత్వం పెండింగులో పెట్టింది. మరో రూ.120.91 కోట్లు బఫర్ సీడ్ స్టాకింగ్ ఆపరేషన్ లాసెస్ కింద విత్తన సరఫరా సంస్థలకు చెల్లించాల్సి ఉంది. సబ్సిడీ విత్తనాల సరఫరాకు సంబంధించి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ.369.91 కోట్లు పైమాటే. రైతులకూ రూ.145 కోట్లు జొన్న, మొక్కజొన్న ఉత్పత్తులను ప్రభుత్వానికి విక్రయించిన 1.57 లక్షల మందికి పైగా రైతులకు ప్రభుత్వం రూ.145.78 కోట్లు చెల్లించాల్సి ఉంది. కరువు కాలంలో అష్టకష్టాలు పడి పండించిన ఉత్పత్తులను సర్కారుకు అమ్మిన పాపానికి వారు డబ్బు కోసం గుంటూరు, కృష్ణా, ప్రకాశం, కర్నూలు తదితర జిల్లాల రైతులు వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా ప్రదక్షిణలు చేస్తున్నారు. వ్యవసాయోత్పత్తుల ధరలు దారుణంగా పడిపోయినప్పుడు కనీస మద్దతు ధరకు రైతుల నుంచి వాటిని కొనుగోలు చేసి మార్కెట్ ధరకు విక్రయించాల్సిన బాధ్యత సర్కారుపై ఉంది. ఇందులో భాగంగానే గత ఆర్థిక సంవత్సరం మొక్కజొన్న, జొన్న రైతుల నుంచి ఉత్పత్తులు సేకరించి వారికి డబ్బు చెల్లించలేదని, రైతులకు సమాధానం చెప్పుకోలేకపోతున్నామని వ్యవసాయ శాఖ అధికారులు వాపోతున్నారు. అంతేకాదు..పౌర సరఫరాల శాఖ రైతుల నుంచి ధాన్యం సేకరించింది. గత ఖరీఫ్‌లో ధాన్యం విక్రయించిన వారికి ఇవ్వాల్సిన సొమ్మును ఇప్పటికీ చెల్లించలేదు. ఈ సొమ్మును కూడా సాగునీటి ప్రాజెక్టుల బిల్లుల చెల్లింపు, ఎన్నికల ముందు ఓట్ల తాయిలాలకు బాబు సర్కారు మళ్లించింది. బిందు, తుంపర సేద్యం, వ్యవసాయ పనిముట్లకు సంబంధించిన సబ్సిడీ బిల్లులు కూడా వేలకోట్లు పెండింగులోనే ఉన్నాయి. ట్రాక్టర్ల కొనుగోలు, పొలాల్లో షెడ్ల నిర్మాణం, చిన్న చిన్న నీటి చెరువుల ఏర్పాటు తదితరాల కోసం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లులను కూడా పెండింగులో పెట్టింది. దీనివల్ల కొత్తగా ఈ యూనిట్లు ఎవరికీ మంజూరు కావడంలేదు. అలాగే, రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక కింద రూ.103.89 కోట్ల నిధులు, భూ, నీటి సంరక్షణ కింద రూ.1.73 కోట్లు, వర్షాధార ప్రాంతాల అభివృద్ధి పథకం కింద రూ.20.02 కోట్లు, ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన బిల్లులు సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో 2016–2019 మార్చి వరకూ పెండింగులో ఉన్నాయి. రూ.2,882.75 కోట్ల పెట్టుబడి రాయితీ ఎగవేత గత ఖరీఫ్‌లో పంట నష్టపోయిన 15.97 లక్షల మంది రైతులకు రూ.1,832 కోట్లు పెట్టుబడి రాయితీని బాబు సర్కారు చెల్లించకుండా ఎగవేసింది. 2014–15 నుంచి ఉన్న బకాయిలను కలిపితే రైతులకు చెల్లించాల్సిన పెట్టుబడి రాయితీ గత ఖరీఫ్ నాటికి రూ. 2102.75 కోట్లు. అలాగే, గత ఏడాది రబీ సీజన్లో ప్రకటించిన 257 కరువు మండలాల్లోని బాధిత రైతులకు చెల్లించాల్సిన మొత్తం రూ.780 కోట్లు ఉంటుందని అంచనా. వెరసి గత ఏడాది రబీ సీజన్ ముగిసే వరకూ బాబు సర్కారు రైతులకు ఇవ్వాల్సిన రూ.2,882.75 కోట్లలో నయాపైసా కూడా విదల్చలేదు. -
విత్తన సబ్సిడీకి రూ.224 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖరీఫ్ కోసం అందించే విత్తన సబ్సిడీ కోసం రూ.224 కోట్లు ఖర్చు కానుంది. ఈ మేరకు వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. మొత్తం 3.3 లక్షల క్వింటాళ్ల విత్తనాలను కంపెనీలు సరఫరా చేస్తాయి. వాటిలో సోయా బీన్ విత్తనాలు 2 లక్షల క్వింటాళ్లు, జీలుగ విత్తనాలు లక్ష క్వింటాళ్లు, మిగిలిన వాటిలో జనపనార, పిల్లిపెసర విత్తనాలున్నాయి. సోయాబీన్ క్వింటా విక్రయ ధర రూ.5,800గా ఖరారు చేశారు. దానికి 37 శాతం ప్రకారం రూ.2,146 సబ్సిడీ అందనుంది. ఇక జీలుగ విత్తనాల విక్రయ ధర క్వింటాలుకు రూ.7,100 కాగా, 65% సబ్సిడీ కింద రూ.4,615 నిర్ధారించారు. జనపనార విక్రయ ధర క్వింటాలుకు రూ.8 వేలు. దానికి 65 శాతం సబ్సిడీ ప్రకటించారు. ఇక పిల్లిపెసర విక్రయ ధర క్వింటాలుకు రూ.13,500. రైతులకు 65% సబ్సిడీతో రూ.4,725కి విక్రయిస్తారు. సబ్సిడీ ఇచ్చేందుకు సోయాబీన్‌కు రూ.116 కోట్లు, జీలుగ విత్తనాలకు రూ.71 కోట్లు, జనపనారకు రూ.24 కోట్లు, పిల్లిపెసరకు రూ.13.50 కోట్లు కేటాయించారు. -
రైతు ‘పెట్టుబడి’కి 9,700 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రానున్న బడ్జెట్లో రైతు పెట్టుబడి పథకానికి రూ.9,700 కోట్లు కేటాయించాలని వ్యవసాయ శాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు ఆర్థిక శాఖకు విజ్ఞప్తి చేసింది. వచ్చే ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి ఈ మొత్తం అవసరమని తెలిపింది. ఈసారి వ్యవసాయశాఖకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు వ్యవసాయ శాఖ బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. పెట్టుబడి పథకం నిధులతో కలిపి ప్రగతి పద్దు కింద మొత్తం రూ. 12,800 కోట్లు వ్యవసాయ బడ్జెట్‌గా ఉండే అవకాశముందని ఆ శాఖ వర్గాలు పేర్కొంటున్నా యి. ఈ సారి వ్యవసాయ యాంత్రీకరణకు రూ.500 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు. 2017–18 బడ్జెట్లో యాంత్రీకరణకు రూ.336 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ సారి అదనంగా రూ.164 కోట్ల మేరకు కోరుతున్నారు. ఇక వడ్డీలేని రుణాలకు ప్రస్తుత బడ్జెట్లో రూ.340 కోట్లు కేటాయిస్తే, వచ్చే బడ్జెట్లో రూ. 500 కోట్లు ప్రతిపాదించారు. విత్తన సబ్సిడీకి గత బడ్జెట్లో రూ.138 కోట్లు కేటాయిస్తే, రానున్న బడ్జెట్లో రూ.400 కోట్లు ప్రతిపాదించారు. ఖరీఫ్ పెట్టుబడి సాయం 6,480 కోట్లు రాష్ట్రంలో దాదాపు 1.62 కోట్ల ఎకరాల సాగు భూమి ఉన్నట్టు ప్రభుత్వం నిర్ధారణకు వచ్చిందని.. దాని ప్రకారం 1.62 కోట్ల ఎకరాలకు లెక్కవేసి వచ్చే ఖరీఫ్‌కు రూ.6,480 కోట్లు, మరో రూ.3,220 కోట్లు రబీ సీజన్‌కు ఇవ్వాలని కోరుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆ భూములకు ‘పెట్టుబడి’ అందదు! పెట్టుబడి పథకంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సాగుకు యోగ్యంకాని భూములుంటే వాటిని పెట్టుబడి పథకం నుంచి మినహాయించాలని సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. సాగుకు యోగ్యం కాని భూమి మొత్తంగా రెండు శాతం ఉండొచ్చని, ప్రస్తుతం ఆ భూమిని గుర్తించాల్సి ఉందని చెబుతున్నారు. -
ఆలు పంటకు విత్తన సబ్సిడీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆలుగడ్డ పండించే రైతులకు ఎకరానికి రూ. 5 వేల విత్తన సబ్సిడీ ఇస్తామని రాష్ట్ర వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఆలుగడ్డ ఆధునిక సాగు పద్ధతులపై ఉద్యానశాఖ నిర్వహిస్తోన్న రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి, ఉద్యానశాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ వర్క్‌షాప్‌లో రైతులనుద్దేశించి పోచారం మాట్లాడారు. రాష్ట్రంలో 5 వేల హెక్టార్లలో ఆలు సాగు జరుగుతుందని.. లక్ష మెట్రిక్ టన్నుల ఆలుగడ్డల ఉత్పత్తి జరుగుతుందన్నారు. కానీ రాష్ట్రానికి 7.30 లక్షల మెట్రిక్ టన్నుల ఆలు అవసరముందన్నారు. దీంతో వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని అన్నారు. అందుకోసం తెలంగాణ ప్రజలు ఏడాదికి రూ. 600 కోట్లు దిగుమతి కోసం ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో 36,500 హెక్టార్లలో ఆలును సాగు చేస్తేనే రాష్ట్ర అవసరాలు తీరుతాయన్నారు. ఇప్పుడున్న విస్తీర్ణాన్ని వచ్చే ఏడాది నాటికి రెండింతలు చేయడమే లక్ష్యమన్నారు. విస్తీర్ణం పెంచేందుకు 14 ఆలుగడ్డ పంట కాలనీలను సిద్ధం చేశామన్నారు. రాష్ట్ర అవసరాల్లో 15 శాతమే కూరగాయలను పండించుకోగలుగుతున్నామని... 85% ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. ఈ పరిస్థితి మారాలన్నారు. అందుకోసం ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహకం ఇస్తుందన్నారు. ఉల్లి సబ్సిడీని 75 శాతం పెంచడంతో 25 వేల ఎకరాలకు దాని విస్తీర్ణం పెరిగిందన్నారు. కోల్డ్‌స్టోరేజీలను ఉద్యానశాఖ ద్వారా ప్రభుత్వమే నిర్మిస్తుందన్నారు. వాటిని ఉపయోగించుకునే రైతుల నుంచి కనీస రుసుం వసూలు చేస్తామన్నారు. జహీరాబాద్‌లో నిర్మించబోయే కోల్డ్‌స్టోరేజీ కోసం ప్రతిపాదనలు పంపాలని కోరారు. కోల్డ్ స్టోరేజీలకు 35% సబ్సిడీ కోల్డ్ స్టోరేజీ నిర్మించుకునే రైతులకు 35% సబ్సిడీ ఇస్తామని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి తెలిపారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ ఆలుగడ్డ పండించడానికి అనువైన వాతావరణం ఉందన్నారు. సూక్ష్మసేద్యం ద్వారా ఆలు పండిస్తే ఉత్పాదకత పెరుగుతుందన్నారు. ఆలు వేసే రైతులంతా ఒక సొసైటీగా ఏర్పడాలన్నారు. కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఎం.ప్రతాప్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో త్వరలో ఆలుగడ్డ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. పండ్ల పరిశోధన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలన్న యోచన ఉందన్నారు. ఈ వర్క్‌షాప్‌లో రైతులకు శిక్షణ ఇచ్చేందుకు సిమ్లా ఆలు పరిశోధన కేంద్రం నుంచి శాస్త్రవేత్తలు వచ్చారు. -
చూద్దాంలే!
అభివృద్ధి పథకాలకు నిన్న మొన్నటి వరకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఆ ప్రక్రియ ముగిసినా ఇప్పటికీ అధికారుల్లో అదే నిర్లక్ష్యం కనిపిస్తోంది. దాదాపు 20 రోజులు గడుస్తున్నా.. పాలనను పరుగెత్తించలేని పరిస్థితి నెలకొంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు మొదలు కింది స్థాయి సిబ్బందిలో వేచి చూసే ధోరణి కనిపిస్తోంది. ప్రాథమ్యాలు.. పథకాలు.. పనితీరు.. ఆలోచనా ధోరణి.. పాత పథకాలపై స్పందన.. కొత్త పథకాల అమలు.. తదితరాలపై తలెత్తుతున్న ప్రశ్నల నేపథ్యంలో వీరంతా ఆచితూచి అడుగులేస్తున్నారు. రాష్ట్ర విభజన కూడా ఇందుకు కారణమవుతోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన వ్యవసాయ శాఖలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే స్పష్టమైన ప్రణాళికతో సిద్ధం కావాల్సి ఉన్నా ఆ ఊసే కరువైంది. విత్తన రాయితీ అంశం మాత్రమే కాస్త కొలిక్కి వచ్చింది. రైతులకు రాయితీపై అందజేసే వ్యవసాయ యంత్ర పరికరాలు.. ఇతర పథకాలపైనా ఎలాంటి నిర్ణయం వెలువడని పరిస్థితి. ఉద్యాన శాఖలో కూరగాయల విత్తనాలు అందజేసేందుకు సిద్ధమైనా మిగిలిన అంశాలపై నిర్ణయం వెలువడాల్సి ఉంది. పంట రుణాల విషయంలోనూ స్పష్టత కొరవడింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల్లో సంక్షేమ పథకాలపై కార్యాచరణ ప్రణాళిక అటకెక్కింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో బ్యాంకు లింకేజీ.. రాజీవ్ యువ కిరణాలు.. స్త్రీనిధి.. బాల బడులు.. బీమా పథకాల లక్ష్యం నిర్దేశించకపోవడం గందరగోళానికి తావిస్తోంది. అన్ని శాఖల్లోనూ అధికారులు చేతులెత్తేసి కొత్త సర్కారు నిర్ణయంపైనే భారమేయడం గమనార్హం. గ్రామాల్లో కొత్తగా చేపట్టాల్సిన పనుల విషయంలోనూ అధికారులు ముందడుగు వేయలేకపోతున్నారు. ఆయా ప్రాంతాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఏమంటారు? ప్రతిపక్ష శాసనసభ్యుడు ఉన్నచోట అధికార పార్టీ ఇన్చార్జి అభిప్రాయం తెలుసుకుని మసలుకునే ఆలోచన అధికారుల్లో వ్యక్తమవుతోంది. ఈలోగా బదిలీలు చోటు చేసుకునే అవకాశం ఉండటంతో.. కొన్నాళ్లు ఆగితే కొత్తగా వచ్చే అధికారి చూసుకుంటారనే భావన కనిపిస్తోంది. పంచాయతీరాజ్.. గ్రామీణ నీటి సరఫరా విభాగం.. పురపాలక సంఘాల్లోనూ ఎక్కడ పనులు అక్కడ నిలిచిపోయాయి. ఉపాధి హామీ పథకం అమలులో చోటుచేసుకునే మార్పులపైనా చర్చ కొనసాగుతోంది. ప్రధాని నరేంద్రమోడీ స్పందన నేపథ్యంలో ఉపాధిలో మార్పులు చేర్పులు చోటు చేసుకోవచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి.