సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణను విత్తన భాండాగారంగా చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని, కానీ రాష్ట్రాన్ని కల్తీ సీడ్‌బౌల్‌గా కల్వకుంట్ల కుటుంబం మార్చిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పాలనలో వ్యవసాయ విధ్వంసం జరిగిందని విమ ర్శించారు. కల్తీ విధానాలపై ఉక్కుపాదం మోపుతా మని అసెంబ్లీలో, బయట సీఎం కేసీఆర్ పేర్కొన్న ప్పటికీ ఏ సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన ‘రైతుగోస.. బీజేపీ భరోసా’ సభలో ఆయన మాట్లాడారు.
కేసీఆర్ హయాంలో వ్యవసాయం దండుగలా మారింది..
‘వ్యవసాయ ఒక పండుగ అన్నారు కానీ కేసీఆర్ పాలనలో వ్యవసాయం దండుగ అనే పరిస్థితి ఏర్పడింది. ఇన్‌పుట్ సబ్సిడీ, విత్తన సబ్సిడీ, పంటల బీమా పథకం అమలు చేయడం లేదు. గత తొమ్మిదేళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం పంటల బీమా పథకం అమలు చేయని కారణంగా లక్షలాది మంది రైతులు నష్టపోతున్నారు. ఇక వరి పంట వద్దని ప్రభుత్వమే చెబుతోంది. మరోవైపు వ్యవసాయ రుణాలు రావడం లేదు.
కేసీఆర్ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లుగా వ్యవసాయ రుణాల మీద పావలా వడ్డీ ఇవ్వడం లేదు. రైతుబంధు అన్నింటికీ పరిష్కారంలా వ్యవహరిస్తోంది. అందరికంటే ఎక్కువగా కౌలు రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆత్మహత్యల్లో 75 శాతం కౌలు రైతులవే ఉన్నాయి. ఐదేళ్లుగా రైతు రుణమాఫీ వాయిదా వేసి ఎన్నికలకు ముందు ప్రకటించారు. అయినా మెజార్టీ రైతులకు మాఫీ జరగలేదు. నాలుగున్నరేళ్లుగా వడ్డీలు, చక్రవడ్డీలు పెరిగిపోయి రూ.లక్ష అప్పు ఇప్పుడు రూ.2 లక్షలకు చేరింది.
ధరణి పోర్టల్‌తో 20 లక్షల మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు..’ అని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి వస్తే అన్ని రకాలుగా సమస్యలను పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని అనేక ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ అవినీతినే మిగిల్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ, సోనియా కుటుంబం కోసం బీఆర్‌ఎస్, కల్వకుంట్ల కుటుంబం పనిచేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో మార్పు రావాలన్నా, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలన్నా బీజేపీతోనే సాధ్యమని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment