సాక్షి, హైదరాబాద్: రానున్న బడ్జెట్‌లో రైతు పెట్టుబడి పథకానికి రూ.9,700 కోట్లు కేటాయించాలని వ్యవసాయ శాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు ఆర్థిక శాఖకు విజ్ఞప్తి చేసింది. వచ్చే ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి ఈ మొత్తం అవసరమని తెలిపింది. ఈసారి వ్యవసాయశాఖకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు వ్యవసాయ శాఖ బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. పెట్టుబడి పథకం నిధులతో కలిపి ప్రగతి పద్దు కింద మొత్తం రూ. 12,800 కోట్లు వ్యవసాయ బడ్జెట్‌గా ఉండే అవకాశముందని ఆ శాఖ వర్గాలు పేర్కొంటున్నా యి.
ఈ సారి వ్యవసాయ యాంత్రీకరణకు రూ.500 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు. 2017–18 బడ్జెట్లో యాంత్రీకరణకు రూ.336 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ సారి అదనంగా రూ.164 కోట్ల మేరకు కోరుతున్నారు. ఇక వడ్డీలేని రుణాలకు ప్రస్తుత బడ్జెట్లో రూ.340 కోట్లు కేటాయిస్తే, వచ్చే బడ్జెట్లో రూ. 500 కోట్లు ప్రతిపాదించారు. విత్తన సబ్సిడీకి గత బడ్జెట్లో రూ.138 కోట్లు కేటాయిస్తే, రానున్న బడ్జెట్లో రూ.400 కోట్లు ప్రతిపాదించారు.
ఖరీఫ్ పెట్టుబడి సాయం 6,480 కోట్లు
రాష్ట్రంలో దాదాపు 1.62 కోట్ల ఎకరాల సాగు భూమి ఉన్నట్టు ప్రభుత్వం నిర్ధారణకు వచ్చిందని.. దాని ప్రకారం 1.62 కోట్ల ఎకరాలకు లెక్కవేసి వచ్చే ఖరీఫ్‌కు రూ.6,480 కోట్లు, మరో రూ.3,220 కోట్లు రబీ సీజన్‌కు ఇవ్వాలని కోరుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఆ భూములకు ‘పెట్టుబడి’ అందదు!
పెట్టుబడి పథకంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సాగుకు యోగ్యంకాని భూములుంటే వాటిని పెట్టుబడి పథకం నుంచి మినహాయించాలని సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. సాగుకు యోగ్యం కాని భూమి మొత్తంగా రెండు శాతం ఉండొచ్చని, ప్రస్తుతం ఆ భూమిని గుర్తించాల్సి ఉందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment