కాటేసిన కరెంట్
విద్యుదాఘాతంతో మెకానిక్ మృతి
కొలిమిగుండ్ల: వ్యవసాయ బోర్లను మరమ్మతు చేసే ఓ మెకానిక్ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఈ ఘటన పెద్దవెంతుర్ల సమీపంలో శనివారం చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా వరదాయిపల్లెకు చెందిన మెకానిక్ బెస్త రమేష్(22) జీవనోపాధి నిమిత్తం పదేళ్ల క్రితం పేరుఽసోమల చేరుకున్నాడు. ఇటీవల సొంతంగా వ్యవసాయ బోర్లలో మోటర్లు, పైపులు వెలికి తీసేందుకు ట్రాక్టర్‌తో తయారు చేసిన మోటర్ క్రేన్ తెచ్చుకుని చుట్టు పక్కల గ్రామాల్లో పనిచేసేవాడు. శనివారం పెద్దవెంతుర్లకు చెందిన రైతు శివయ్య పొలంలో కొత్త పైపులు క్రేన్ సాయంతో వేస్తుండగా పైనున్న విద్యుత్ తీగలకు ప్రమాదవశాత్తు పైపు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పొలం యజమానితోపాటు సాయంగా ఉన్న మరో ఇద్దరు రైతులు ప్రాణాప్రాయం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. విషయం తెలుసుకున్న ఏఎస్‌ఐ ఉస్మాన్‌ఘని అక్కడికి చేరుకొని ప్రమాద వివరాలు సేకరించారు.