'యాంత్రీకరణతో వ్యవసాయం లాభసాటి'
సాక్షి, హైదరాబాద్: అత్యాధునిక యంత్ర పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చుకునేందుకు వీలుందని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారధి పేర్కొన్నారు. ర్యాడికల్, రూరల్ ఎల్లో అనే ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం హైటెక్స్‌లో అంతర్జాతీయ అగ్రిహార్టి టెక్ ప్రదర్శనను ఆయన ప్రారంభించారు.
ఆయిల్‌ఫెడ్ ఎండీ మురళి, విత్తన ధ్రువీకరణ సంస్థ ఎండీ కేశవులుతో కలసి స్టాళ్లను పరిశీలించారు. ఈ ప్రదర్శనలో వివిధ దేశాలకు చెందిన అగ్రిహార్టి కంపెనీల స్టాళ్లతోపాటు రాష్ట్రానికి చెందిన ఆయిల్‌ఫెడ్, విత్తన ధ్రువీకరణ సంస్థ, వ్యవసాయ వర్సిటీ, ఉద్యానశాఖ స్టాళ్లు కూడా పాలుపంచుకుంటున్నాయని పార్థసారధి వివరించారు. పట్టణ ఉద్యానవనాన్ని ప్రభుత్వం రూ. 6 వేల యూనిట్ ఖర్చుతో ప్రోత్సహిస్తుందని, ఉత్సాహవంతులు ముందుకొస్తే 50% సబ్సిడీ ఇస్తామన్నారు. ఈ ప్రదర్శన 24 వరకు కొనసాగనుంది.