యాంత్రీకరణతో సాగుకు మేలు | Mechanization of cultivation, good | Sakshi
Sakshi News home page

యాంత్రీకరణతో సాగుకు మేలు

Published Sat, Dec 21 2013 2:06 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Mechanization of cultivation, good

=ఖరీఫ్ దిగుబడులు తగ్గుదలపై విశ్లేషించిన శాస్త్రవేత్తలు
 =రానున్న రబీపై దిశానిర్దేశం

 
అనకాపల్లి,న్యూస్‌లైన్: జిల్లాలో వ్యవసాయ రంగంపై ప్రతికూల పరిస్థితులు కారణంగా కూలీల కొరత ఏర్పడుతోందని దీనిని అధిగమించేందుకు యాంత్రీకరణ సరైన ప్రత్యామ్నాయమని ఏడీఆర్ కె. వీరభద్రరావు తెలిపారు. స్థానిక వ్యవసాయ పరిశోధన స్థానం జూబ్లీ హాల్లో శుక్రవారం విస్తరణ పర్యవేక్షకురాలు డాక్టర్ పి. జమున ఆధ్వర్యంలో జరిగిన శిక్షణ, సందర్శన సమావేశంలో ఆయన మాట్లాడారు.

పంచదార మిల్లులతో ఒప్పందం లేని చెరకు నుంచి బెల్లం తయారీ విషయంలో ఎదురవుతున్న అవరోధాలు తొలగించేందుకు చెరకు అధికారులు చొరవ చూపాలని కోరారు. జేడీఏ శ్రీనివాసులు మాట్లాడుతూ తాజాగా తుపాన్ల తాకిడి వల్ల విస్తరణ విభాగం యాంత్రీకరణపై ఇటీవల ప్రత్యేక దృష్టి సారించలేకపోయిందన్నారు. భూచేతన, జీరో టిల్లేజ్ మొక్కజొన్నపై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించి రైతుల్లో అవగాహన కలిగిస్తామన్నారు. అంతకుముందు విస్తరణ, పరిశోధన విభాగం శాస్త్రవేత్తలు, అధికారులు ఖరీఫ్‌లో వరిపంట దిగుబడులపై విశ్లేషించారు.

జూన్, జూలై నెలల్లో వర్షాభావ పరిస్థితులతో నాట్లు ఆలస్యమయ్యాయని తేల్చారు. అనంతరం భారీ వర్షాలతో ఖరీఫ్ దిగుబడులు 10 నుంచి 30 శాతం వరకు తగ్గిపోయాయని అంచనా వేశారు. ఖరీఫ్‌వరికోతలు ఆలస్యంతో రబీగా చేపట్టే అపరాలు, వేరుశెనగ, మొక్కజొన్న పంటలు ఆలస్యమయ్యాయని నిర్ధారించారు. రెండో పంటగా వరిలో చలిని తట్టుకునే స్పల్పకాలిక రకాలుంటే మంచిదని శాస్త్రవేత్తలు సూచించారు. ఎంటీయూ 1010కి బదులు ఎన్‌సీఆర్ 3449, జేజీఎల్ 1798, ఎర్రమల్లెలు కొన్ని చోట్ల వేశారని వ్యవసాయాధికారులు తెలిపారు.

ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త సి.వి. రామారావు మాట్లాడుతూ ఎంటీయూ 1121, ఎంటీయూ 1010కి బదులుగా మినీకిట్స్ ఇచ్చారని తెలిపారు. చోడి పంటలో బెంగుళూరు నుంచి తెచ్చిన జీపీయూ-48 రకం భారతీయ రకం కన్నా ఆశాజనకంగా ఉందని తెలిపారు. టీఎన్‌వీ సమన్వయకర్త డాక్టర్ పి. జమున మాట్లాడుతూ శ్రీ చైతన్య రకం కూడా అధిక దిగుబడిని ఇస్తుందని పేర్కొన్నారు. సుగర్‌కేన్ అసిస్టెంట్ కమిషనర్ సీతారామారావు మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో చెరకులో రికవరీ శాతం బాగా పడిపోయిందని పేర్కొన్నారు.

చక్కెర కర్మాగారాల పరిధిలో 70 శాతం పైబడి విశ్వామిత్ర రకాన్ని సాగు చేస్తున్నారని, ఈ రకం ఆశాజనకంగా ఉన్నప్పటికీ కొరడా తెగులుకు లోనవుతోందన్నారు. ఉద్యానవనశాఖాధికారి జి. రాధిక మాట్లాడుతూ మామిడిలో తేనెమంచు పురుగు, జీడిమామిడిలో టి. దోమ ఎక్కువుగా ఉందన్నారు. ఫిబ్రవరి వరకు ఆగకుండా డిసెంబర్ నుంచే సస్యరక్షణ చేపట్టాలన్నారు. అంతకుముందు జీరో టిల్లేజ్ విధానంలో విత్తడం, లాభాలు, చెరకులో ఒంటికన్ను ముచ్చులతో నారు పెంపకం, కార్శితోటల యాజమాన్యం వివరించే ప్లెక్సీలను శాస్త్రవేత్తలు, అధికారులు పరిశీరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement