చూద్దాంలే!
అభివృద్ధి పథకాలకు నిన్న మొన్నటి వరకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఆ ప్రక్రియ ముగిసినా ఇప్పటికీ అధికారుల్లో అదే నిర్లక్ష్యం కనిపిస్తోంది. దాదాపు 20 రోజులు గడుస్తున్నా.. పాలనను పరుగెత్తించలేని పరిస్థితి నెలకొంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు మొదలు కింది స్థాయి సిబ్బందిలో వేచి చూసే ధోరణి కనిపిస్తోంది. ప్రాథమ్యాలు.. పథకాలు.. పనితీరు.. ఆలోచనా ధోరణి.. పాత పథకాలపై స్పందన.. కొత్త పథకాల అమలు.. తదితరాలపై తలెత్తుతున్న ప్రశ్నల నేపథ్యంలో వీరంతా ఆచితూచి అడుగులేస్తున్నారు. రాష్ట్ర విభజన కూడా ఇందుకు కారణమవుతోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన వ్యవసాయ శాఖలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే స్పష్టమైన ప్రణాళికతో సిద్ధం కావాల్సి ఉన్నా ఆ ఊసే కరువైంది.
విత్తన రాయితీ అంశం మాత్రమే కాస్త కొలిక్కి వచ్చింది. రైతులకు రాయితీపై అందజేసే వ్యవసాయ యంత్ర పరికరాలు.. ఇతర పథకాలపైనా ఎలాంటి నిర్ణయం వెలువడని పరిస్థితి. ఉద్యాన శాఖలో కూరగాయల విత్తనాలు అందజేసేందుకు సిద్ధమైనా మిగిలిన అంశాలపై నిర్ణయం వెలువడాల్సి ఉంది. పంట రుణాల విషయంలోనూ స్పష్టత కొరవడింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల్లో సంక్షేమ పథకాలపై కార్యాచరణ ప్రణాళిక అటకెక్కింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో బ్యాంకు లింకేజీ.. రాజీవ్ యువ కిరణాలు.. స్త్రీనిధి.. బాల బడులు.. బీమా పథకాల లక్ష్యం నిర్దేశించకపోవడం గందరగోళానికి తావిస్తోంది. అన్ని శాఖల్లోనూ అధికారులు చేతులెత్తేసి కొత్త సర్కారు నిర్ణయంపైనే భారమేయడం గమనార్హం.
గ్రామాల్లో కొత్తగా చేపట్టాల్సిన పనుల విషయంలోనూ అధికారులు ముందడుగు వేయలేకపోతున్నారు. ఆయా ప్రాంతాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఏమంటారు? ప్రతిపక్ష శాసనసభ్యుడు ఉన్నచోట అధికార పార్టీ ఇన్‌చార్జి అభిప్రాయం తెలుసుకుని మసలుకునే ఆలోచన అధికారుల్లో వ్యక్తమవుతోంది. ఈలోగా బదిలీలు చోటు చేసుకునే అవకాశం ఉండటంతో.. కొన్నాళ్లు ఆగితే కొత్తగా వచ్చే అధికారి చూసుకుంటారనే భావన కనిపిస్తోంది. పంచాయతీరాజ్.. గ్రామీణ నీటి సరఫరా విభాగం.. పురపాలక సంఘాల్లోనూ ఎక్కడ పనులు అక్కడ నిలిచిపోయాయి. ఉపాధి హామీ పథకం అమలులో చోటుచేసుకునే మార్పులపైనా చర్చ కొనసాగుతోంది. ప్రధాని నరేంద్రమోడీ స్పందన నేపథ్యంలో ఉపాధిలో మార్పులు చేర్పులు చోటు చేసుకోవచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి.