ఆలు పంటకు విత్తన సబ్సిడీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆలుగడ్డ పండించే రైతులకు ఎకరానికి రూ. 5 వేల విత్తన సబ్సిడీ ఇస్తామని రాష్ట్ర వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఆలుగడ్డ ఆధునిక సాగు పద్ధతులపై ఉద్యానశాఖ నిర్వహిస్తోన్న రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి, ఉద్యానశాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ వర్క్‌షాప్‌లో రైతులనుద్దేశించి పోచారం మాట్లాడారు. రాష్ట్రంలో 5 వేల హెక్టార్లలో ఆలు సాగు జరుగుతుందని.. లక్ష మెట్రిక్ టన్నుల ఆలుగడ్డల ఉత్పత్తి జరుగుతుందన్నారు.
కానీ రాష్ట్రానికి 7.30 లక్షల మెట్రిక్ టన్నుల ఆలు అవసరముందన్నారు. దీంతో వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని అన్నారు. అందుకోసం తెలంగాణ ప్రజలు ఏడాదికి రూ. 600 కోట్లు దిగుమతి కోసం ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో 36,500 హెక్టార్లలో ఆలును సాగు చేస్తేనే రాష్ట్ర అవసరాలు తీరుతాయన్నారు. ఇప్పుడున్న విస్తీర్ణాన్ని వచ్చే ఏడాది నాటికి రెండింతలు చేయడమే లక్ష్యమన్నారు.
విస్తీర్ణం పెంచేందుకు 14 ఆలుగడ్డ పంట కాలనీలను సిద్ధం చేశామన్నారు. రాష్ట్ర అవసరాల్లో 15 శాతమే కూరగాయలను పండించుకోగలుగుతున్నామని... 85% ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. ఈ పరిస్థితి మారాలన్నారు. అందుకోసం ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహకం ఇస్తుందన్నారు. ఉల్లి సబ్సిడీని 75 శాతం పెంచడంతో 25 వేల ఎకరాలకు దాని విస్తీర్ణం పెరిగిందన్నారు.
కోల్డ్‌స్టోరేజీలను ఉద్యానశాఖ ద్వారా ప్రభుత్వమే నిర్మిస్తుందన్నారు. వాటిని ఉపయోగించుకునే రైతుల నుంచి కనీస రుసుం వసూలు చేస్తామన్నారు. జహీరాబాద్‌లో నిర్మించబోయే కోల్డ్‌స్టోరేజీ కోసం ప్రతిపాదనలు పంపాలని కోరారు.
కోల్డ్ స్టోరేజీలకు 35% సబ్సిడీ
కోల్డ్ స్టోరేజీ నిర్మించుకునే రైతులకు 35% సబ్సిడీ ఇస్తామని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి తెలిపారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ ఆలుగడ్డ పండించడానికి అనువైన వాతావరణం ఉందన్నారు. సూక్ష్మసేద్యం ద్వారా ఆలు పండిస్తే ఉత్పాదకత పెరుగుతుందన్నారు. ఆలు వేసే రైతులంతా ఒక సొసైటీగా ఏర్పడాలన్నారు.
కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఎం.ప్రతాప్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో త్వరలో ఆలుగడ్డ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. పండ్ల పరిశోధన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలన్న యోచన ఉందన్నారు. ఈ వర్క్‌షాప్‌లో రైతులకు శిక్షణ ఇచ్చేందుకు సిమ్లా ఆలు పరిశోధన కేంద్రం నుంచి శాస్త్రవేత్తలు వచ్చారు.