Potato crop
-
ఆలు వైపు.. రైతుల ముందస్తు చూపు
ఆలుగడ్డ పంట ముందస్తు సాగుకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పంట సాగుకు నవంబర్ మొదటి వారం అనుకూలంగా ఉంటుంది. అయినా వారు అప్పటి వరకు వేచి చూడకుండా పంటను సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. గత ఏడాది నవంబర్‌లో పంట వేసుకున్న రైతులకు మార్కెట్లో గిట్టుబాటు ధర రాక నష్టపోయారు. సెప్టెంబర్, అక్టోబర్‌లో ఆలుగడ్డ పంట వేసుకున్న వారికి మార్కెట్లో మంచి ధర పలికి కాసుల వర్షం కురిసింది. దీంతో ఈ సారి ముందస్తు సాగువైపే మొగ్గుచూపుతున్నారు. – జహీరాబాద్ స్వల్పకాలిక పంట కావడం, నీటి తడులు అంతగా అవసరం ఉండక పోవడం వల్ల ముందస్తు సాగు వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. 80–90 రోజుల మధ్య కాలంలో పంట చేతికి అందివస్తుంది. మడుల విధానంలో పంటను తీసే సమయంలో 20 రోజుల ముందే నీటి తడులను ఆపేస్తారు. పంట వేసిన సమయంలో మొదటి తడి ఇచ్చాక 20 రోజుల వరకు నీటి తడులు అవసరం ఉండదు. గత ఏడాది కంటే ఈ ఏడాది రెండువేల ఎకరాల్లో సాగు పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. గత ఏడాది జిల్లాలో సుమారు 6 వేల ఎకరాల్లో పంట సాగయింది. ప్రతిఏటా 90 శాతం మేర జహీరాబాద్ నియోజకవర్గంలోనే పంట సాగవుతోంది. సాగుకు అనువైన నేలలు ఉండడం వల్లే రైతులు ఆలుగడ్డ పంట వైపు మొగ్గు చూపుతున్నారు. నియోజకవర్గంలోని కోహీర్‌తో పాటు జహీరాబాద్, మొగుడంపల్లి, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో రైతులు ఆలు పంట సాగు చేశారు. నీరు పుష్కలంగా ఉండటం వల్లే.. ఈ ఏడాది అధికంగా వర్షాలు పడడం వల్ల వ్యవసాయ బావులు, బోర్లలో నీరు పుష్కలంగా ఉంది. గతంలో నీరు లేక పాడుబడిన బావులు కూడా తిరిగి వినియోగంలోకి వచ్చాయి. దీంతో ఆలుగడ్డ పంట సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. గత ఏడాది కంటే సాగు పెరిగే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. గత ఏడాది మంచి గిట్టుబాటు ధర గత ఏడాది ఆలుగడ్డ పంటను సాగు చేసుకున్న రైతులకు మంచి గిట్టుబాటు ధర లభించింది. ఈ ఏడాది కూడా అదే ఆశతో పంట సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. గత ఏడాది ఎకరం పంట సాగుపై పెట్టుబడులు పోను రూ.50 నుంచి రూ.70వేలు లాభం వచ్చిందని రైతులు పేర్కొంటున్నారు. జోరుగా విత్తన కొనుగోళ్లు.. రైతులు వ్యాపారుల వద్ద నుంచి ఆలుగడ్డ విత్తనం కొనుగోలు చేసుకుంటున్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా నుంచి పలువురు వ్యాపారులు ఈ విత్తనాలను తీసుకొచ్చి స్థానికంగా విక్రయిస్తున్నారు. క్వింటాలు విత్తనం ధర రూ.2 వేలు నుంచి రూ.2,600 కు అమ్ముతున్నారు. రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో వ్యాపారులపైనే ఆధారపడాల్సి వస్తోంది. ప్రభుత్వం స్థానికంగా కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేసినట్లయితే విత్తనం అందుబాటులో ఉండే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. పది ఎకరాల్లో సాగు వారం రోజుల్లో ఆలుగడ్డ పంట సాగు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నా. వర్షాలు తగ్గిపోవడంతో దుక్కులు దున్నే పనులను ఆరంభించా. సుమారు 10 ఎకరాల్లో సాగుచేస్తున్నా. మార్కెట్లో మంచి ధర లభించే అవకాశం ఉంది. అందుకే ముందస్తు వైపు ఆసక్తి చూపుతున్నా. ప్రస్తుతం వాతావరణం ముందస్తు సాగుకు అనుకూలంగా ఉంది. –ఎన్.అంజిరెడ్డి, రైతు, పైడిగుమ్మల్ దుక్కులు సిద్ధం చేసుకుంటున్న.. ఆలుగడ్డ పంట సాగుకు దుక్కి దున్నే పనులు ప్రారంభించా. ప్రస్తుతం వర్షాలు ఆగిపోవడంతో రైతులంతా ఈ సాగు కోసం ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సుమారు మూడు ఎకరాల్లో పంటను వేసుకునేందుకు నిర్ణయం తీసుకున్నాను. –కె.స్వరూప్‌రెడ్డి, రైతు, కోహీర్ -
ఆలు పంటకు విత్తన సబ్సిడీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆలుగడ్డ పండించే రైతులకు ఎకరానికి రూ. 5 వేల విత్తన సబ్సిడీ ఇస్తామని రాష్ట్ర వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఆలుగడ్డ ఆధునిక సాగు పద్ధతులపై ఉద్యానశాఖ నిర్వహిస్తోన్న రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి, ఉద్యానశాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ వర్క్‌షాప్‌లో రైతులనుద్దేశించి పోచారం మాట్లాడారు. రాష్ట్రంలో 5 వేల హెక్టార్లలో ఆలు సాగు జరుగుతుందని.. లక్ష మెట్రిక్ టన్నుల ఆలుగడ్డల ఉత్పత్తి జరుగుతుందన్నారు. కానీ రాష్ట్రానికి 7.30 లక్షల మెట్రిక్ టన్నుల ఆలు అవసరముందన్నారు. దీంతో వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని అన్నారు. అందుకోసం తెలంగాణ ప్రజలు ఏడాదికి రూ. 600 కోట్లు దిగుమతి కోసం ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో 36,500 హెక్టార్లలో ఆలును సాగు చేస్తేనే రాష్ట్ర అవసరాలు తీరుతాయన్నారు. ఇప్పుడున్న విస్తీర్ణాన్ని వచ్చే ఏడాది నాటికి రెండింతలు చేయడమే లక్ష్యమన్నారు. విస్తీర్ణం పెంచేందుకు 14 ఆలుగడ్డ పంట కాలనీలను సిద్ధం చేశామన్నారు. రాష్ట్ర అవసరాల్లో 15 శాతమే కూరగాయలను పండించుకోగలుగుతున్నామని... 85% ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. ఈ పరిస్థితి మారాలన్నారు. అందుకోసం ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహకం ఇస్తుందన్నారు. ఉల్లి సబ్సిడీని 75 శాతం పెంచడంతో 25 వేల ఎకరాలకు దాని విస్తీర్ణం పెరిగిందన్నారు. కోల్డ్‌స్టోరేజీలను ఉద్యానశాఖ ద్వారా ప్రభుత్వమే నిర్మిస్తుందన్నారు. వాటిని ఉపయోగించుకునే రైతుల నుంచి కనీస రుసుం వసూలు చేస్తామన్నారు. జహీరాబాద్‌లో నిర్మించబోయే కోల్డ్‌స్టోరేజీ కోసం ప్రతిపాదనలు పంపాలని కోరారు. కోల్డ్ స్టోరేజీలకు 35% సబ్సిడీ కోల్డ్ స్టోరేజీ నిర్మించుకునే రైతులకు 35% సబ్సిడీ ఇస్తామని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి తెలిపారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ ఆలుగడ్డ పండించడానికి అనువైన వాతావరణం ఉందన్నారు. సూక్ష్మసేద్యం ద్వారా ఆలు పండిస్తే ఉత్పాదకత పెరుగుతుందన్నారు. ఆలు వేసే రైతులంతా ఒక సొసైటీగా ఏర్పడాలన్నారు. కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఎం.ప్రతాప్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో త్వరలో ఆలుగడ్డ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. పండ్ల పరిశోధన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలన్న యోచన ఉందన్నారు. ఈ వర్క్‌షాప్‌లో రైతులకు శిక్షణ ఇచ్చేందుకు సిమ్లా ఆలు పరిశోధన కేంద్రం నుంచి శాస్త్రవేత్తలు వచ్చారు. -
ఆలు.. ఢమాల్
జహీరాబాద్: మూడు నెలలు...కనుకు లేకుండా తడులుపెట్టారు. ఆలుగడ్డ పంటను కంటికిరెప్పలా కాపాడుకున్నారు. దిగుబడి..రాబడి అంటూ లెక్కలేస్తూ గడిపారు. అయితే వారి అంచనాలన్నీ తలకిందులయ్యాయి. పంటలు సాగు చేసే సమయంలో క్వింటాల్ రూ.4 వేలు పలికిన ఆలుగడ్డ..పంట చేతికొచ్చే సమయానికి అమాంతం పడిపోయి రూ.1300కు చేరుకోవడంతో రైతన్నలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కనీసం పెట్టుబడులైనా వస్తే అదే పదివేలనుకుంటున్నారు. 10 వేల ఎకరాల్లో సాగు జహీరాబాద్ నియోజకవర్గంలోని రైతులు ప్రతి ఏటా సంప్రదాయపంటగా ఆలుగడ్డను సాగుచేసుకుంటూ వస్తున్నారు. ఒక్క జహీరాబాద్ నియోజకవర్గంలోనే సుమారు 10 వేల ఎకరాల్లో ఆలుగడ్డ సాగవుతోంది. మార్కెట్లో ఆలుగడ్డకు మంచి డిమాండ్ ఉండడంతో ప్రతి సంవత్సరం ఆలుసాగు చేసిన రైతులకు మంచే జరిగేది. ఈ సారి కూడా పంట సాగుచేసే సమయంలో క్వింటాల్ రూ.4 వేలు పలికిన ఆలుగడ్డ...ప్రస్తుతం రూ.1,300లకు పడిపోయింది. గత పక్షం రోజుల నుంచి హైదరాబాద్ మార్కెట్లో క్రమంగా ధర పడిపోతూ వస్తుండడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఎకరానికి రూ.40 వేలకు పైగా వ్యయం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నుంచి నవంబర్ మాసం వరకు రైతులు ఆలుగడ్డ పంటను సాగు చే స్తారు. ఆలు విత్తనాన్ని రైతులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా ప్రాంతం నుంచి క్వింటాలుకు రూ.4 వేలు ధర చెల్లించి తెచ్చుకుంటారు. అక్కడకు వెళ్లలేని రైతులు మాత్రం దళారుల వద్ద కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత పంట సాగుకు కనీసంగా ఎకరాకు రూ.30 వేలు వ్యయం చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ఇక పంటను మార్కెట్ తరలించే సమయంలోనూ రూ.10 వేలు ఖర్చవుతోందని వారు వెళ్లడించారు. ఇవన్నీ పోను దాదాపు 90 రోజుల పాటు తమ కుటుంబమంతా పొద్దెరగకుండా పనిచేయాల్సి వస్తోందంటున్నారు. ఇంతచేసినా దిగుబడి ఎకరాకు 30 క్వింటాళ్లు దాటడం లేదంటున్నారు. ప్రస్తుతం ఆలుకు లభిస్తున్న ధరతో పోలిస్తే పెట్టుబడులు కూడా వచ్చేట్టు లేవని రైతులు నిట్టూరుస్తున్నారు. ఒక వేళ వాతావరణం అనుకూలించక పోయినా, నాణ్యమైన విత్తన దొరక్కపోయినా దిగుబడి సగానికి సగం తగ్గుతుందని, అప్పుడు అప్పులో మునిగిపోతున్నామంటున్నారు. నెల తేడాలో రేటులో భారీ మార్పు ఆలుపంట ఇపుడు చేతిలోకి వచ్చి మార్కెట్లో ఇబ్బడిముబ్బడిగా వస్తుండడంతో ధర తగ్గిపోయింది. ప్రస్తుత నెల లేదా నెలన్నరలో రైతులంతా ఆలుగడ్డను విక్రయించేస్తారు. ఆ తర్వాత ఆలు ధర అమాంతం పెరిగిపోతుంది. రైతుల వద్ద ఆలు కొనుగోలు చేసిన కొందరు వ్యాపారులు పంటను కోల్ట్‌స్టోరేజ్‌లో ఉంచి రేటు పెరగగానే అమ్ముకుంటారు. దీంతో వారి భారీగా లాభాలు వస్తున్నాయి. పంటలు పండించిన రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు. ఒకవేళ రైతులు పంటలను నిల్వచేసుకుందాంమంటే కోల్ట్‌స్టోరేజ్ సౌకర్యం లేని కారణంగా ఒక్కరోజు ఆలస్యమైనా గడ్డ రంగుమారి తీవ్ర నష్టం జరుగుతుంది. అందువల్లే ఆ రోజు ఎంత పలికితే అంత తీసుకుని రైతులు ఆలుగడ్డను విక్రయించేస్తున్నారు. నిల్వచేసుకునే సౌకర్యం కల్పించాలి తాము ఆరుగాలం కష్టపడి పండించిన ఆలుగడ్డ పంటకు మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేనప్పుడు నిల్వ చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్‌లను నిర్మించాలని రైతులు కోరుతున్నారు. శీతల గిడ్డంగులు అందుబాటులో ఉంటే పంట ఉత్పత్తును నిల్వచేసుకుని, ధరలు పెరగగానే విక్రయించుకునేందుకు వీలుంటుందని వారంటున్నారు. నియోజకవర్గంలోని జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో అలుగడ్డ పంటను రైతులు అధికంగా సాగు చేస్తున్నారు. జిల్లాలోనే జహీరాబాద్ ప్రాంతంలో ఆలుగడ్డ పంట సాగు అధిక విస్తీర్ణంలో ఉంటుంది. అయినప్పటికీ ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్‌ల నిర్మాణం కోసం తగిన శ్రద్ధ తీసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. రైతుల అవస్థలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వమే ముందుకు వచ్చి కోల్డ్ స్టోరేజ్‌లను నిర్మించాలని రైతులు కోరుతున్నారు.